రాజధాని

20:08 - September 21, 2017

గుంటూరు : చంద్రబాబు, జక్కన్న.. ఇప్పుడీ కాంబినేషనే హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనుకుంటున్న రాజధానిలో భాగం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎందరో ప్రముఖ ఆర్కిటెక్‌లను కాదని చంద్రబాబు, రాజమౌళిని ఎంచుకోవడంలో ఉన్న అంతరార్ధమేంటి? కేవలం గ్రాఫిక్‌ డిజైన్స్‌తో తీసిన సినిమాలకు, వాస్తవ కట్టడాలకు చాలా తేడా ఉంటుంది. అయితే చంద్రబాబు ఎందుకు రాజమౌళిని ఎంచుకున్నట్టు? ఇప్పుడిలాంటి ప్రశ్నలే సామాన్య ప్రజానికంతో పాటు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమరావతిని ఆంధ్రుల అద్భుత కలల రాజధానిగా, ప్రపంచం మెచ్చే సుందరనగరంగా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు కోరిక. అందుకోసమే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలోని అన్ని టెక్నాలజీలను వాడుకోవాలని భావిస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కీలకంగా ఉండేవి అసెంబ్లీ, హై కోర్ట్‌, సచివాలయం భవనాలే కాబట్టి ఈ నిర్మాణాల విషయంలో నో కాంప్రమైజ్‌ అంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు.

పది నెలల నుండి నార్మన్‌ సంస్థలు
మాకీ సంస్థలు ఇచ్చిన డిజైన్స్‌ నచ్చలేదని, నార్మన్‌ పోస్టర్‌ సంస్థలను ఎంపిక చేశారు. పది నెలల నుండి నార్మన్‌ సంస్థలు ఎన్ని డిజైన్‌లు సిద్ధం చేసినా, ఎన్ని మార్పులు చేసినా చంద్రబాబుని సంతృప్తి పరచడంలేదు. అప్పుడే చంద్రబాబు మదిలో బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని, కుంతల రాజ్యాలను సృష్టించిన రాజమౌళి గుర్తుకువచ్చాడు. అంతే వెంటనే రాజమౌళిని పిలిపించి, ఆయన సూచనలు, సలహాలతో హైకోర్ట్‌, అసెంబ్లీ భవనాలను రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు రాజమౌళితో సమావేశం అవడం, తర్వాత చంద్రబాబుతో భేటీ అవడం వరుసగా జరిగిపోయాయి. బాహుబలి సినిమాలో రాజమౌళి చెప్పకుండా, రాజమౌళి విజన్‌ చూపించకుండా గ్రాఫిక్‌ డిజైనర్‌ గాని, ఆర్ట్‌ డైరెక్టర్‌ గాని అలాంటి కోటలు, రాజ్యాలు సృష్టించలేడు. ఈ సినిమాలో మనం చూసిన అద్భుత దృష్యాలకు అసలు రూపకర్త రాజమౌళినే. ఈ అంశమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజమౌళి సేవలు ఉపయోగించుకోవాలనే ఆలోచన పుట్టింది. రాజమౌళి నిర్మించిన కోటలు, రాజ్యాలు చూసి కాకుండా వాటి వెనక ఆయనకున్న విజన్‌, పరిశోధన వంటి అంశాలు ఆయనను రాజధాని నిర్మాణానికి సలహా అడిగాలన్న ఆలోచన చంద్రబాబుకి కలిగేలా చేశాయి.

అమరావతి సంస్కృతి, సంప్రదాయాలు
వందల సంవత్సరాల క్రితం రాజ్యాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించిన రాజమౌళి... అమరావతిలోని భవనాల విషయంలో తెలుగు సంప్రదాయ ముద్ర వేస్తారనే నమ్మకంతో చంద్రబాబు ఆయనను సంప్రదించారు. డిజైన్‌లో అమరావతి సంస్కృతి, సంప్రదాయాలు మిళితం చేయాలన్నదే చంద్రబాబు కోరిక. అదే విషయాన్ని రాజమౌళికి స్పష్టం చేశారు. మొదట్లో హైకోర్టును కోహినూర్‌ డైమండ్ ఆకారంలో నిర్మించాలనుకున్నప్పటికీ, అసెంబ్లీ కొహినూర్‌ ఆకారంలో ఉంటే అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు నిర్ణయించారు. కోహినూర్‌ డైమండ్‌ ఆకారంలోనే అసెంబ్లీని సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోహినూర్‌ ఆకారంలో అసెంబ్లీ భవన నిర్మాణ డిజైన్‌ను నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు రెండు నెలల పాటు శ్రమించి చంద్రబాబుకు చూపించారు. అద్భుతంగా ఉందని ఇలాంటి డిజైన్‌ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పిన చెంద్రబాబు దానిని ఖరారు చేస్తామని ప్రకటించారు. కాని రాత్రికి రాత్రే సీన్‌ మారిపోయింది. అప్పటివరకు అసెంబ్లీ డిజైన్‌ అద్భుతంగా ఉందన్న చంద్రబాబు మరుసటి రోజు కోహినూర్‌ ఆకారం అంటే అచ్చెం అలానే దించమని కాదని, దాని స్ఫూర్తిని మాత్రమే తీసుకోమన్నానని చెప్పారు.

కోహినూర్‌ ఆకారంలోని డిజైన్‌ను తిరస్కరించడం
అయితే కోహినూర్‌ ఆకారంలోని డిజైన్‌ను తిరస్కరించడంలో కొత్త కోణం దాగి ఉందనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబుకు మొదటి నుండి వాస్తు, సిద్ధాంతాలపై నమ్మకం ఎక్కువ. అందులో భాగంగానే కోహినూర్‌ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యాలు సర్వనాశనం అవుతాయని, రాజులు అధికారాలు కోల్పోతారని చంద్రబాబు ఆస్థాన సిద్ధాంతులు కొంత ఆలస్యంగా చెప్పడంతో రాత్రికిరాత్రి చంద్రబాబు ఈ డిజైన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు. డిజైన్‌ బాగున్నప్పటికీ సంస్కృతీ, సంప్రదాయం డిజైన్‌లో కనబడడంలేదనే మెలిక పెట్టారని ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించడంలో ప్రచారం నిజమనే భావన కల్గిస్తుంది. అమరావతి డిజైన్స్‌లోకి ఇప్పుడు రాజమౌళి రావడంతో రాజధాని రూపకల్పన ఆగిన చోట నుండి తిరిగి ప్రారంభమవుతుందా లేక మొదటికి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కలగలిపి ఆకృతులను ఖరారు చేస్తారా లేక రాజమౌళి స్టైల్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సిద్ధం చేయిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎంచుకున్న కోహినూర్‌ కథ ముగిసిందా లేదా అనేది కూడా కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది. 

21:49 - September 20, 2017

గుంటూరు : బాహుబలి డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి.. అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడుసార్లు సమావేశమై.. అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై చర్చించారు. లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధి బృందం రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు... బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళికి చూపించారు. లోపలి ఆకృతులపై సంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు, బాహ్య డిజైన్లు తాను అనుకున్నట్టుగా లేవని రాజమౌళి దృష్టికి తెచ్చారు. అమరావతి చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా బాహ్య డిజైన్లు ఉండాలాన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందకు సహకారం అందించాలని చంద్రబాబు కోరగా, రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రాజమౌళి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజమౌళి వెంట సీఆర్‌డీఏ కమిషన్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇతర అధికారులు ఉన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించారు. శాసనసభ అద్భుతంగా ఉందని, అసెంబ్లీ హాలు డిజైన్‌ చాలా బాగుందని ప్రశంసించారు. కృష్ణానది అభిముఖంగా అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ నది పరీవాహక ప్రాంతాన్ని కూడా రాజమౌళి పరిశీలించారు. 

15:10 - September 20, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి రెండోసారి భేటీ ముగిసింది. సాయంత్ర మళ్లీ విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో మరోసారి వీరు భేటీ కానున్నారు. రాజమౌళి ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన ఐకానిక్ భవనాలు నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:31 - September 20, 2017

విజయవాడ : 'ఏమీ అవలేదు...ఏమీ జరగలేదు' అని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. విజయవాడలోని ఉండవల్లికి చేరుకున్న అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వచ్చిన ఆయన్ను మీడియా ప్రశ్నించింది. భేటీకి సంబంధించిన వివరాలపై స్పందించలేదు. తనకు ఇక్కడకు రావడానికి ఆలస్యం అయ్యిందని..మాట్లాడే అవకాశం దొరకలేదని..మధ్యాహ్నం కలిసిన అనంతరం వివరాలను మీడియాకు చెబుతానని పేర్కొన్నారు.

అమరావతి రాజధాని, ఏపీ హైకోర్టుకు సంబంధించిన డిజైన్ల విషయంలో రాజమౌళి సలహాలు..సూచనలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు రాజమౌళితో భేటీ అయ్యి చర్చించారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ అయ్యారు. రాజమౌళిని లండన్ కు కూడ పంపాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. 

09:12 - September 20, 2017

విజయవాడ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఉండవల్లికి చేరుకున్నారు. కాసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. అమరావతి డిజైన్లపై ఆయన సలహాలు..సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న అనంతరం నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి ఆయన చేరుకున్నారు.

హైకోర్టుకు సంబంధించిన డిజైన్స్ లను నార్మన్ పోస్టర్స్ చూస్తున్న సంగతి తెలిసిందే. 8 నెలలుగా దీనిపై వర్కవుట్ చేస్తున్నారు. ఈ డిజైన్లను సీఎం బాబు ఖరారు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఎలివేషన్ తదితర డిజైన్ లపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళిని సంప్రదించి సలహాలు..సూచనలు తీసుకోవాలని మంత్రి నారాయణ..సీఆర్డీఏ అధికారులకు బాబు సూచించారు. దీనితో వారందరూ రాజమౌళితో ఇటీవలే భేటీ జరిపారు. అనంతరం రాజమౌళి స్వయంగా విజయవాడకు వెళ్లి బాబుతో చర్చలు జరిపారు. రాజమౌళిని లండన్ పంపాలని ఏపీ సర్కార్ పంపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గ్రాఫిక్స్..డిజైన్స్ చేసే వారు రాజధాని డిజైన్లను ఎలా ఖరారు చేస్తారని విమర్శలు వస్తున్నాయి.

21:18 - September 18, 2017

హైదరాబాద్ : అమరావతి డిజైన్లపై సీఎం చంద్రబాబు సూచన మేరకు సినీ దర్శకుడు రాజమౌళిని మంత్రి నారాయణ, కమిషనర్‌ శ్రీధర్‌ బృందం కలిసింది. ఇప్పటి వరకు నార్మన్‌ ఫోస్టర్‌ బృందం ఇచ్చిన డిజైన్లను, వాటి ఉద్దేశాలను రాజమౌళికి వివరించారు. రాజధాని నిర్మాణంలో మన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాజమౌళిని మంత్రి నారాయణ కోరారు.  

08:08 - September 15, 2017

గుంటూరు : అమరావతిలో నిర్మించతలపెట్టిన ముఖ్య భవనాలకు డిజైన్లను రూపొందిస్తోన్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం భేటీ అయ్యారు. వారు ప్రదర్శించిన డిజైన్ల తుది రూపును.. సహచర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి మరోసారి పరిశీలించారు. ఈ డిజైన్లపై సీఎం చంద్రబాబు.. సంతృప్తిని వ్యక్తం చేయలేదు. డిజైన్లపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని.. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులకు తెలిపిన సీఎం.. మరికొంత సమయం తీసుకొని అత్యుత్తమమైన డిజైన్లను రూపొందించాలని సూచించారు. నార్మన్‌ సంస్థ ప్రతినిధులు.. ప్రస్తుతం అందించిన డిజైన్లలో కొన్ని అంశాలు బాగున్నా.. బాహ్యరూపం ఆకర్షణీయంగా రాలేదని చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిజైన్ల రూపకల్పనకు మరికొంత సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులకు సూచించారు.

డైరెక్టర్‌ ఎస్ఎస్‌రాజమౌళితో సంప్రదింపులు
ప్రపంచంలోనే తొలి పది అత్యుత్తమ నిర్మాణాలను స్పూర్తిగా తీసుకొని వాటిని తలదన్నేలా అమరావతి డిజైన్లను రూపొందించాలన్నారు. సీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్చర్లు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్చర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ బృందానికి సహకరించాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. అమరావతి భవనాల డిజైన్లకు సంబంధించి, తెలుగు మెగా డైరెక్టర్‌ ఎస్ఎస్‌రాజమౌళితో సంప్రదింపులు జరపాలని సిఆర్డీఏ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. అవసరమైతే.. రాజమౌళిని లండన్‌కు పంపి.. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్‌ 25న లండన్‌ వెళ్లనున్న చంద్రబాబు.. అక్కడే నార్మన్‌ ప్రతినిధుల సరికొత్త ఆకృతులను పరిశీలిస్తానని చెప్పారు. మెరుగైన డిజైన్లను వచ్చే నెలాఖరుకల్లా ఆమోదిస్తామని చంద్రబాబు చెప్పారు. 

21:49 - September 13, 2017

గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు.. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా... ప్రపంచానికి తలమానికంగా ఉండాలని సీఎం నార్మన్‌ ప్రతినిధులకు సూచించారు.. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉండాలో... అంతర్గత భవంతి నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.. 

 

08:45 - August 20, 2017

గుంటూరు : ఏపీ పాలన హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చి ఏడాది అవుతోంది. తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించారు. విజయవాడ, గుంటూరుల్లో విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అమరావతికి తరలివచ్చినా వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వీరందరికి ఫ్లాట్ల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది.

కోట్లాది రూపాయలు ఖర్చు
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల బసకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. శాశ్వత నిర్మాణాలు చేపడితే ఈ ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈ దిశగా ముందడుగు వేసింది. ఫ్లాట్ల నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి, సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. జీ ప్లస్‌ 12 పద్ధతిలో వీటి నిర్మాణం చేపడతారు. హోదాను బట్టి ఫ్లాట్లు కేటాయిస్తారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 16 వరకు బిడ్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 30న విజయదశమి నాడు నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన పాలనా నగరంలోనే వీటిని నిర్మిస్తారు.

12 టవర్లలో ఫ్లాట్లు నిర్మిణం
పరిపాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రజా ప్రతినిధులకు ఒక్కో ఫ్లాటు 3,550 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా 12 టవర్లలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఇందు కోసం 386 కోట్లు వ్యయం చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఒక్కో ఫ్లాటు 3,550 అడుగుల విస్తీర్ణం ఉండేలా ఆరు టవర్లు నిర్మిస్తారు. ఇందు కోసం 167 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులకు ఒక్కో అంతస్థులో రెండే ఫ్లాట్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. టైప్‌ వన్‌ గెజిటెడ్‌ అధికారులకు 1800 అడుగులు, టైప్‌ టూ గెజిటెడ్‌ అధికారులకు 1500 చదరపు అడుగులు, ఉద్యోగులకు 1200 చదరపు అడుగుల విస్తీర్ణయంలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఈ మూడు కేటగిరీలకు ఒక్కో టవర్‌లో ఆరు అంతస్థులు ఉండే విధంగా 27 టవర్లు కడతారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో టవర్‌లో ఎనిమిది అంతస్థులు ఉండే విధంగా ఆరు టవర్లు నిర్మిస్తారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఫ్లాట్ల నిర్మాణం కోసం టెంటర్లు పిలవడంతో వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి
మరోవైపు అమరావతిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి కూడా సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. ఏడు ఎకరాల్లో ఎనిమిది హోటళ్లు నిర్మిస్తారు. ఫైవ్‌ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటళ్లు రెండేసి వంతున, నాలుగు త్రీ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు బిడ్లు స్వీకరిస్తారు. కొత్త నిర్మాణాలతో రాజధాని అమరావతికి ఒక స్వరూపం తీసుకురాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

08:48 - August 19, 2017

విజయవాడ : అమరావతి నిర్మాణానికి అటవీభూముల మళ్లింపునకు సంబంధించి స్పష్టత వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 12వేల 444 హెక్టార్ల అటవీ భూమిని రాజధాని అవసరాల కోసం వినియోగించుకోడానికి కేంద్ర అటవీ సలహా సమితీ సమ్మతిని తెలియజేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వంలో హర్షం వ్యక్తం అవుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం అవుతోందని చంద్రబాబు ప్రభుత్వం అంటోంది. అటవీ భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్ర అటవీ విభాగానికి విన్నవించారు. అయితే భారీగా అటవీ సంపద నాశనం అవుంతుందని , పర్యావరణానికి హాని కలుగుతుందన్న కోణంలో కేంద్రం నుంచి మొదట ఆమోదం లభించలేదు.

ఇప్పటికే 34వేల ఎకరాలు
ఇప్పటికే రాజధాని నిర్మాణం పేరుతో 34వేల ఎకరాలు తీసుకోవడం, సుప్రీంకోర్టులో కేసులు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ అభ్యంతరాలు ఉండటంతో కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే మేనెలలో ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అటవీశాఖ .. దీనిపై అధ్యయనానికి ఓ నిపుణుల కమిటీని నియమించింది. దీన్లో భాగంగా జూన్‌నెలలో కేంద్రకమిటీ సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటించింది. కేంద్ర అటవీశాఖకు నివేదిక అందించింది. నివేదికను పరిశీలించిన అటవీసలహా సమితి ఎట్టకేలకు అటవీభూములను ఏపీ ప్రభుత్వానికి అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అటవీభూములను వినియోగించుకోవడానికి అనుమతించడంపై పర్యావరణ వేత్తలు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులతో వర్షాలకు ముఖం వాచిన రాష్ట్రంలో వేల హెక్టార్లలో అడవి నాశనం అయితే .. పర్యావరణానికి మరింత చేటు కలుగుతుందంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనాలోచితంగా పర్యావరణానికి పెనుముప్పు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

పర్యావణ సమతుల్యం దెబ్బతింటుంది
ఇప్పటికే రాజధాని భూముల్లో లాభపడిన టీడీపీ నేతలు..ఇపుడు అటవీభూములపై కన్నేశారని వైసీపీ, వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. అటవీ భూములను డెవలప్‌ చేసి పారిశ్రామిక వేత్తలకు ఇస్తామంటున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అనుమతి ఇచ్చిన 12,444 హెక్టార్లలో రాజధాని పరిధిలోని తాడేపల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెం పరిధిలో 1,835.32 హెక్టార్ల అటవీ భూములున్నాయి. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూమి మళ్లింపునకూ కేంద్రం అటవీ సలహాదారుల సమితి ఆమోదముద్ర వేసింది.అభివృద్ధిపేరుతో విలువైన అటవీసంపదను నాశనం చేస్తే.. పర్యావణ సమతుల్యం దెబ్బతిని భవిష్యత్తులో మరింత కష్టాలు ఎదురవుతాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజధాని