రాజీనామా

18:20 - March 16, 2018

పంజాబ్ : పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో మాత్రం కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అకాలిదళ్‌ నేత విక్రమ్ మజీఠియాకు క్షమాపణ కోరినందుకు మాన్‌తో పాటు పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో డ్రగ్స్‌ మాఫియా అంశాన్ని ప్రస్తావించిన ఆప్‌...ఇందుకు అకాలిదళ్‌ బాధ్యత వహించాలని టార్గెట్‌ చేసింది. డ్రగ్స్‌ వ్యాపారంతో సంబంధముందని కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై విక్రమ్ మజీఠియా పరువునష్టం దావా కేసు వేశారు. దీంతో దిగివచ్చిన కేజ్రీవాల్ మజీఠియాపై చేసిన ఆరోపణలపై ఆధారాలు లేవంటూ  క్షమాపణ చెప్పారు. కేసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  కేజ్రీవాల్‌పై జైట్లీ, గడ్కరి తదితరులు కూడా పరువునష్టం దావా వేశారు. కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం వృథా అవుతున్నందున వీటిని ముగింపు పలికేందుకు క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్‌ నిర్ణయించినట్లు సమాచారం. డ్రగ్స్‌, అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని మాన్‌ స్పష్టం చేశారు. 

 

15:47 - March 11, 2018

నెల్లూరు : ఎంపీల రాజీనామా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో వైసీపీ అధినేత జగన్‌ నాటకాలు ఆడుతున్నారని మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. ఎంపీ రాజీనామా, అవిశ్వాసంతో రాష్ట్రానికి ఒరిగేదీమీ లేదన్నారు. అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో జగన్‌ చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్‌ కేంద్రంతో లాలూచీ పడుతున్నారని మండిపడ్డారు. 

 

18:47 - March 9, 2018

చిత్తూరు : కాణిపాకం వినాయక స్వామి అలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సత్యప్రమాణం చేశారు. తాను మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయని.. కావున మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే కాణిపాకం ఆలయంలో సత్యప్రమాణం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నానని అందుకే రాజీనామా అనంతరం సత్యప్రమాణ చేశానని ఆయన తెలిపారు. నా శాఖలో జరుగుతున్న అవినీతిని అడ్డుకున్నాని కామినేని పేర్కొన్నారు. కాగా కాణిపాకంలో గణపతి దేవుడు సత్యప్రమాణాలకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీల మధ్య నెలకొన్న అస్థిరత మూలంగా ఏపీ కేబినెట్ లోని తన మంత్రి పదవికి కామినేని రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. 

21:47 - March 8, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు వైదొలిగారు. ఉదయం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఇరువురు నేతలు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. నాలుగేళ్ల కాలంలో ఇద్దరూ సమర్థంగా పనిచేశారని వారిని చంద్రబాబు అభినందించారు. అసెంబ్లీలోనూ కామినేని, మాణిక్యాలరావు తమ రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు.

ఏపీలో శరవేగంగా మారిన రాజకీయాలు :
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నామని టీడీపీ ప్రకటించడంతో.. ఇటు ఏపీ కేబినెట్‌లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు తమ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం కార్యాలయంలో చంద్రబాబును కలిసి రాజీనామా లేఖలను అందించారు. అంతకుముందు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో కూర్చుని ఉండగా టీడీపీ మంత్రులు వారిని కలిశారు. పదవుల నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉందా? అని ప్రశ్నించగా... రాజకీయాల్లో ప్రవేశంతో పాటు నిష్క్రమణ కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామినేని చెప్పారు.

రాజీనామా అంశాన్ని ప్రస్తావించిన కామినేని
అనంతరం శాసనసభలో రాజీనామా అంశాన్ని కామినేని ప్రస్తావించారు. మంత్రిగా మూడున్నరేళ్ల పదవీకాలం తనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీఎం చంద్రబాబు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారని.. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించగలిగానన్నారు. తన జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మూడున్నరేళ్లలో తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. రాజకీయ కారణాలతో కొందరు తనపై బురద జల్లేందుకు ప్రయత్నించారని.. అవన్నీ నేను పట్టించుకోనని కామినేని చెప్పారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా : మానిక్యాల రావు
మంత్రి పదవికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేయాల్సి వస్తోందని పైడికొండల మాణిక్యాలరావు అసెంబ్లీలో అన్నారు. మూడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన శాఖలో ఏనాడూ జోక్యం చేసుకోలేదన్నారు. తాడేపల్లిగూడెంలో తన గెలుపునకు టీడీపీ శ్రేణులు ఎంతో కృషి చేశాయన్నారు. ఏపీ అభివృద్ధి చెందుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్ధత, కేంద్రం సహకారం వల్లే సాధ్యమైందని మాణిక్యాలరావు అన్నారు.

నాలుగేళ్ల పాటు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు : చంద్రబాబు
మంత్రి పదవులకు రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు నాలుగేళ్ల పాటు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రం విభజించిన దానికంటే విభజించిన తీరే ఆంధ్రులను తీవ్రంగా బాధించిందన్నారు. విభజన జరిగిన సమయంలో పెట్టిన బిల్లులోని అంశాలు, తర్వాత రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన తర్వాతే బీజేపీతో పొత్తు పెట్టుకుమని.. ఇప్పుడేమో నిబంధనలు అడ్డొస్తున్నాయని చెబుతున్నారన్నారు. జాతీయ పార్టీగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ప్రజలకు జాతీయపార్టీలపై నమ్మకం పోతుందని చంద్రబాబు అన్నారు.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు: 
మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక యుగంలో అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా మహిళలు ముందుకెళ్తున్నారన్నారు. టీడీపీ మొదటి నుండి మహిళలకు అనేక విధాలుగా సహకరిస్తూ వస్తోందని అన్నారు.

21:41 - March 8, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసన అంటూ.. టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి సాయంత్రం ప్రధానిని కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు.

కేంద్ర పభుత్వ వైఖరికి నిరసనగా మంత్రుల రాజీనామా:
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర పభుత్వ వైఖరికి నిరసన తెలుపుతూ.. టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి పదవులకు రాజీనామా చేశారు. ఉదయమే ఇద్దరు మంత్రులూ రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినా.. ప్రధాని మోదీ.. రాజస్థాన్‌ పర్యటనలో ఉండడంతో.. ప్రక్రియ ఆలస్యమైంది. ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటన ముగించుకుని సాయంత్రం రాగానే.. ఇద్దరు మంత్రులూ ఆయన్ను కలిసి రాజీనామా లేఖలు అందచేశారు.

ప్రధాని మోదీకి రాజీనామాలు :
రాజీనామాలు సమర్పించడానికి ముందు.. సుజనాచౌదరి ఇంటికి వెళ్లిన అశోక్‌గజపతిరాజు... ఆయనతో కలిసి కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఇద్దరూ కూడా ప్రభుత్వం సమకూర్చిన వాహనాలను పక్కనపెట్టి, ప్రైవేటు కార్లలో ప్రధాని నివాసానికి వెళ్లారు. మోదీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత రాజీనామా లేఖలు అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతోపాటు రాజీనామాలకు దారితీసిన కారణాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో అశోక్‌గజపతి, సుజన ప్రధానికి వివరించారు.

ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న తర్వాత ఫోన్‌ చేసి చంద్రబాబుతో మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మోదీ, చంద్రబాబులిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. కేంద్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు టీడీపీ మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు వివరించినట్లు ప్రచారం జరుగుతోంది.  

19:06 - March 8, 2018

ఢిల్లీ : సమస్యల పరిష్కారం కోసం మా శాయశక్తులా ప్రయత్నించామని అయినా ఫలితం లేకపోయిందని టీడీపీ మంత్రి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తెలిపారు. ఒక జాతీయ పార్టీ ద్రోహం చేస్తే, మరో జాతీయ పార్టీ మోసం చేసిందని పేర్కొన్నారు. జాతీయ రాష్ట్ర ప్రయోజనాల మేరకు తమ నాయకుడు ఆదేశాల మేరకు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశామన్నారు. ప్రధాని మోదీకి రాజీనామాలు సమర్పించిన అనంతరం టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ నాయకుడు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని తెలిపారు. మరికొద్ది సేపట్లో తమ రాజీనామాలను ఆమోదం పొందుతాయన్నారు. విభజన చట్టాలలోని అంశాలను అమలు చేయాలని ప్రధానికి కోరామన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కేబినెట్ లో తమకు మంత్రులుగా అవకాశమిచ్చినందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏపీకి అండగా వుంటామని ప్రధాని తెలిపారని తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినా ఎన్డీయేలో కొనసాగుతున్నామన్నారు. ఏపీలో ఎటువంటి సమస్యలున్నాయనేది ప్రధానికి తెలుసని ఆ సమస్యలను పరిష్కరించాలని..ఏది ఏమైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

18:26 - March 8, 2018

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం నుంచి తమ ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ ఉదయం నుంచి రాజీనామా పత్రాలతో ప్రధానిని కలిసేందుకు వేచిచూసిన కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజుకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్‌ లభించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. దాంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులను, తాము రాజీనామాలు చేసేందుకు దారితీసిన పరిస్థితులను వివరించారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి వర్గం నుండి టీడీపీ విడిపోవాల్సిన అంశాలపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో దాదాపు 10 నిమిషాల పాటు సంభాషించారు. దానికి సంబంధించిన అన్ని అంశాలను చంద్రబాబు మోదీకి వివరించారు. కాగా ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కేంద్రం అలంభిస్తున్న తీరుపై అసంతృప్తితో వున్న టీడీపీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర సహాయ సహకారాలు సరైన తీరులో లేనందున తీవ్ర అంసతృప్తితో వుంది. దీనిపై తరచు కేంద్రంతో తమ గోడు విన్నవించుకుంటున్నా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం వ్యవహరిస్తున్న నిర్లక్ష వైఖరిని సుదీర్ఘకాలం పాటు భరించిన చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు బీజేపీతో తన పొత్తును తెగతెంపులు చేసుకుంది. 

17:24 - March 8, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ శత్రువు కాదు మిత్రువు అన్నారు మంత్రి మాణిక్యాలరావు. ఏపీ అభివృద్ధి చెందుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్ధత, కేంద్రం సహకారం వల్లే సాధ్యమైందన్నారు. కేంద్రాన్ని రాష్ట్ర ప్రజలు త్వరలోనే అర్థం చేసుకుంటారన్నారు. కేంద్రం నుండి నిధులు తెచ్చే విషయంలోనే కాదు ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు మాణిక్యాలరావు. 

17:20 - March 8, 2018

అమరావతి : మూడున్నరేళ్లు మంత్రి పదవిలో చంద్రబాబు కూడా చాలా సపోర్ట్‌ చేశారన్నారు మంత్రి పదవి చాలా సంతృప్తినిచ్చిందన్నారు కామినేని శ్రీనివాస్‌. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాన కారణమని... కామినేని. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడడలేదని... కొంతమంది కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని కారణాలతో మంత్రి పదవికి రాజీనామా చేశామని... దానిని సీఎం అంగీకరించాలని కోరారు కామినేని. కాగా ఏపీ మంత్రివర్గం నుంచి బీజేపీ మంత్రులు వైదొలిగారు. బీజేపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు సీఎం చంద్రబాబును కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. 

16:44 - March 8, 2018

ఢిల్లీ : ఎట్టకేలకూ కమలంతో టీడీపీ అన్ని విధాల తెగతెంపులు తీసుకునేందుకు సిద్ధపడుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీ రాక్ష విభజన హామీల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుకు తీవ్రంగా భంగపడింది. దీంతో కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా లేఖలను సిద్ధపరుచుకున్నారు. ప్రధాని మోదీని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. కాగా ప్రధాని రాజస్థాన్ పర్యటనలో వున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ చేరుకున్న మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే నేరుగా రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. కాని పక్షంలో కేబినెట్ సెక్రటరీని కలిసి రాజీనామాలు ఇచ్చే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఏపీ కేబినెట్ లో మంత్రులుగా వున్న కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజీనామా