రాహుల్ గాంధీ

18:12 - October 20, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ప్రధాన రాజకీయపార్టీలు అధికారం కైవసం చేసుకోవటానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణలోని ఆదిలాబాద్,కామారెడ్డిలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. జిల్లాల పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకుని చార్మినార్ వద్ద  జరిగే రాజీవ్సద్భావనా ర్యాలీలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్న నేపధ్యంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు సవాల్ విసిరారు. వీరిద్దరు తనపై హైదరాబాద్  పార్లమెంట్ స్ధానం  నుంచి పోటీ చేయాలని ఓవైసీ కోరారు. హైదరాబాద్ భిన్నజాతుల సంస్కృతికి నిదర్శనం అని, ఇక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయవచ్చని ఒవైసీ పేర్కొన్నారు.  శత్రువులైనా,మిత్రులైనా  హైదరాబాద్‌  అందరికీ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు

 

15:32 - October 20, 2018

ఆదిలాబాద్ : దేశంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానన్న మోదీ మాట ఏమైందనీ..జీఎస్టీ పేరుతో ప్రజలపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించి ప్రజల నడ్డి విరుస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.  ఇంటింటికీ తాగునీరు ఇస్తామనీ..దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామనీ..డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ ఇచ్చిన  హామీలు ఎంతవరకూ నెరవేర్చారని ప్రశ్నించారు. నమ్మించి మోసం చేసిన  మోదీ, కేసీఆర్ ల పాలనకు రాబోయే ఎన్నికల్లో చరమగీతం పాడాలని  జిల్లాలోని భైంసాలో నిర్వహించిన బహింరంగ సభలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.  అధికారంలోకి వస్తే... ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

 

15:14 - October 20, 2018

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో పాత వైభవాన్ని పునరుద్ధరించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పట్టుదలగా వుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బహింరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు జిల్లాలోని భైంసాలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు.

Image result for modiప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాఫెల్ స్కాం ద్వారా తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు కట్టబెట్టారని అన్నారు. జీఎస్టీ పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను మోదీ నడిరోడ్డుపై నిలబెట్టారని విరుచుకుపడ్డారు. 

Image result for anil ambani and adaniయూపీఏ హయాంలో పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేశామన్నారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ...అంబానీలు, అదానీల వంటి 15 మంది కార్పొరేట్లకు ఆయన కాపలాదారుడిగా ఉన్నారని అన్నారు. దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోదీ... దొంగలా మారారని ఎద్దేవా చేశారు.

 

14:48 - October 20, 2018

నిర్మల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్కర్ పేరు నచ్చదని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం అంబేద్కర్ నామస్మరణ చేస్తుంటే.. కేసీఆర్‌కు మాత్రం నచ్చడం లేదన్నారు. అందుకే ఏ పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాజెక్టును సైతం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో రాహుల్ గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయలను టీఆర్ఎస్ దండుకుందని రాహుల్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులను భారీగా పెంచారని మండిపడ్డారు. రీ డిజైన్ పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు.

రైతులకు లాభం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని ప్రధాని మోదీ సూచనలలో కేసీఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని రాహుల్ మండిపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం భూములను లాక్కునే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్, మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలు చెబుతున్నారని రాహుల్ అన్నారు.

12:09 - October 19, 2018

జనగామ  : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది.  సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి కొత్త యువ రక్తంతో కాంగ్రెస్ కు తిరిగి జవసత్వాలు తీసుకువచ్చి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ గాంధీ ఒక నిబంధన పెట్టారు. ఇప్పుడు అదే నేతల ఇంటిలో కుంపట్లు రాజేస్తోంది. 

Image result for rahul gandhiఒక్క కుటుంబంలో ఒక్కరికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు, 70 ఏళ్లు దాటితే టిక్కెట్టు  ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం తీసుకొందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ దఫా జనగామ నుండి మాజీ  పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కేనా అనే చర్చ సాగుతోంది. ఒక్కపొన్నాలకే కాదు మిగిలిన సీరయర్ నేతలకు కూడా అదే డైలమాలో వున్నారు. 
దీంతో నేతలంతా తమ తమ వారసుల్ని పార్టీలో పెట్టేందుకు యత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య  ఇంట్లో  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం పోరు సాగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రమైంది. ఈ  పరిస్థితుల నేపథ్యంలో  పొన్నాల కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఎవరికీ దక్కుతోందనే  చర్చ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉత్కంఠకు తావిస్తోంది.Image result for Ponnala's daughter is Vaishali
పొన్నాల కోడలు వైశాలి క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. దీంతో మహిళా కాంగ్రెస్  వరంగల్ జిల్లా  అధ్యక్షురాలుగా వైశాలి కొనసాగుతున్నారు. పొన్నాలకు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వకపోతే  ఆయన కోడలు వైశాలికి ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. జనగామ నుండి పోటీ చేసేందుకు వైశాలి కూడ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే  తనను కాదని  వైశాలికి టిక్కెట్టు కేటాయించడాన్ని పొన్నాల వ్యతిరేకిస్తున్నారని కూడా  సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

-మైలవరపు నాగమణి 

 

08:24 - October 17, 2018

ఢిల్లీ : సినీరంగం నుంచి మొదలై వివిధరంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మీటూ ఉద్యమం సెగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకింది. మొన్నటికి మొన్న ఎన్డీయేలోని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్  జర్నలిస్టుగా పనిచేసేటప్పుడు మహిళా ఉద్యోగినులను వేధించిన ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. లేటెస్ట్ గా  కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం (ఎన్.ఎస్.యూ.ఐ) జాతీయ అధ్యక్షుడు  ఫైరోజ్ ఖాన్  లైంగిక వేధింపుల కేసులో మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చత్తీస్ ఘడ్ కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త  ఫైరోజ్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని  పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఫైరోజ్ ఖాన్ వల్ల తన ప్రాణాలకు ముప్పు  పొంచి ఉందని  కూడా ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.  ఫైరోజ్ ఖాన్ రాజీనామాను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఫైరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే మహిళ చేసిన ఆరోపణలపై  నిజానిజాలు విచారించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 

21:06 - October 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై సెటైర్లు విసిరారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వస్తే తాను భయపడతానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు తెచ్చిందే తాను అని..గట్స్  లేనివాడ్నయితే ఎన్నికలు తీసుకొస్తానా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అని అన్నీ సర్వేలు తేల్చాయని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఈ క్రమంలో 100 సీట్లు కంటే ఎక్కువగా గెలవటమే తమ యత్నమన్నారు. అంతేకాదు నాలుగైదు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ లీడింగ్ పార్టీ అని పేర్కొన్నారు. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచామని కేసీఆర్ గుర్తు చేశారు. 

14:01 - October 11, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. రాఫెల్ డీల్ పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందజేయాలని సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అనిల్ అంబానీకి ప్రధాని మోదీ రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో రహస్యంగా ఉంచాల్సిన అంశాల్లో విమానం ధర లేనేలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని, అయినా లొంగనివారిపై ఐటీ దాడులు చేయిస్తోందని రాహుల్ విమర్శించారు. 

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ అవినీతిపరుడిగా తయారయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారని, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

మోదీ అవినీతికి పాల్పడ్డారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారికి తగిన మొత్తం చెల్లించకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్ ఆరోపించారు. ఇదొక్కటే కాదు, గతంలో కేంద్రం చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయని రాహుల్ బాంబు పేల్చారు.

10:26 - October 9, 2018

ఢిల్లీ : భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ‘రాఫెల్ యుద్ధ విమానాల’ ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ పై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. వినీత్ దండ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కే ఎం జోసెఫ్ మోండేల బెంచ్ వాదనలు విననుంది. రాఫెల్ ఒప్పందం వివరాలతో పాటుగా, యూపీఏ, ఎన్ డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ ఒప్పందపు విలువలో వున్న వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది తన పిల్ లో కోరారు.
ఇదిలావుండగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎం ఎల్ శర్మ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ కూడా ఈ నెల 10న విచారణకు రానుంది. 36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది శర్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇదేకోవలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి వివరాలను పార్లమెంటుకు సమర్పించాలని కోరుతూ సుప్రీంలో మార్చి నెలలో మరో పిటీషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రొసీజర్ అనుమతి కోరలేదని, ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదో కేంద్రం నుంచి తెలుసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత తెహ్ సీన్ ఎస్ పూనావల్లా కూడా ఓ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.
రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్ ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2007 ఆగస్టులో ప్రతిపాదనలు చేసింది.  
 

 

20:20 - October 7, 2018

రాజకీయ చర్చకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వాటిలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ కాంగ్రెస్ కి చాలా కీలకమైనవి.  ఎందుకంటే ఇక్కడ ఆపార్టీ అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ లలో  ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా  వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా రాజస్తాన్ విషయమే చూస్తే, ఆరునెలల క్రితం జరిగిన బై ఎలక్షన్స్‌లో రెండు ఎంపీ స్థానాలు ఓ ఎమ్మెల్యే సీటులో కాంగ్రెస్పార్టీ ఘన విజయం సాధించింది. మరోవైపు ముఖ్యమంత్రి వసుంధరాజె మళ్లీ  అధికార  పీఠం తనదే అఁటున్నారు. ఇంతకీ ఈ రెండు పార్టీల బలాబలాలు రాజస్ధాన్లో ఎలా ఉన్నాయ్, ఎవరి సత్తా ఎంత అనేది ఒకసారి  చూద్దాం.
200 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న రాజస్ధాన్ లో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో  ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1990 నుంచి  బిజెపి  అధికారం  చేజిక్కుంచుకుంటూ  వస్తోంది.  1998 నుంచి ఇక్కడ ప్రతి 5 ఏళ్లకు ఓసారి  పార్టీ అధికారంలోకి వస్తోంది. 2013లో జరిగిన ఎన్నికలలో 45.50 శాతం ఓట్లతో బిజెపి విజయ దుంధుభి మోగించింది. 160 అసెంబ్లీ సీట్లు గెలిచింది. ఆ తర్వాత 2014 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 55.1శాతం ఓట్లతో మొత్తానికి మొత్తం ఎంపీ సీట్లు అంటే, 25 నియోజకవర్గాలను గెలుచుకుంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. ఐతే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయ్. కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్‌ ముందుండి పోరాటం సాగించారు.ఓటర్లు కూడా ఐదేళ్లకోసారి ఇక్కడ పార్టీలను మార్చేస్తున్నారు, ఇది కూడా  కాంగ్రెస్ కు ఆశాదీపంలా కనిపిస్తోంది. బిజెపిలోని  లుకలుకలు ఆ పార్టీని బలహీనపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళలో బిజెపికి సీనియర్ పొలిటీషియన్ ఘన్ శ్యామ్ తివారీ  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. విద్యాశాఖామంత్రిగా పని చేసిన శ్యామ్ తివారీ పార్టీలో 30ఏళ్లుగా పనిచేశారు.సిఎం వసుంధర రాజెతో విబేధాలతోనే ఆయన పార్టీని వీడినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఈయన కుమారుడు అఖిలేష్ తివారీ సొంతంగా భారత్ వాహిని పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. 200 సీట్లలో అభ్యర్ధులను దింపుతామంటూ ప్రకటించారు. ఘన్ శ్యామ్ తివారీ రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ మెజార్టీ సాధించిన నేతగా రికార్డు ఉంది. అలాంటిది ఈయన పార్టీ మారితే ఖచ్చితంగా వచ్చే బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తారని అంటున్నారు
మరోవైపు కాంగ్రెస్ విషయమే చూస్తే, ఈ మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో ఎక్కడాలేని సానుకూలత ఇక్కడ కన్పిస్తుందని ఆ పార్టీనేతలు చెప్తున్నారు. ప్రస్తుతం  రద్దైన శాసనసభలో కాంగ్రెస్ కి 25 స్థానాలు ఉన్నాయి. 1998 నుంచి అధికారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతుందనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే ధీమా కన్పిస్తుంది వారి మాటల్లో. దీనికి తోడు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం తమకి అడ్వాంటేజ్‌గా మారుతుందని ఆ పార్టీ నేతల అంచనా వేస్తున్నారు. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ మండ్ గఢ్ అసెంబ్లీ సీటు గెలిచింది. అజ్మీర్, అల్వార్ లోక్సభ సీట్లనూ కైవసం చేసుకుంది. ఈ మూడు సీట్లూ బిజెపివే కావడం విశేషంగా చెప్పుకోవాలి. అలానే 6 జెడ్పీటీసీలలో 4 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 21 పంచాయితీ సమితిలలో 12 చోట్ల విజయం సాధించడం కూడా ఆ పార్టీలో ధీమా కలిగిస్తోంది.
అధికారంలో ఉన్న బిజెపికి మైనస్ పాయింట్లుగా  చెప్పుకోవాల్సివస్తే ముందుగా  వసుంధర రాజె సింధియా పేరునే చెప్తున్నారు. ఆమె నిరుద్యోగ సమస్యని పట్టించుకోకపోవడం తమ కొంప ముంచుతుందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఐతే 2013లో 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ,  కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకపోవడం కాస్త రిలీఫ్. ఆ మేరకు ఓట్లలో చీలిక  తమకి సాయపడుతుందని బిజెపి అంచనా వేస్తోంది. అదే కాంగ్రెస్ సిఎం కాండిడేట్‌గా అశోక్ గెహ్లాట్‌ను కనుక రంగంలోకి దింపితే బిజెపి ఆశలు గల్లంతైనట్లే భావించాలంటారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా  తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ నేతని కాంగ్రెస్ ప్రస్తుతం లైమ్ లైట్‌లోకి తీసుకురావడం లేదు. రాహుల్ గాంధీ తన టీమ్‌లోని సచిన్ పైలెట్‌నే ప్రమోట్ చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రాహుల్ గాంధీ