రేవంత్ రెడ్డి

13:45 - January 18, 2018
12:45 - January 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీని గాడిన పెట్టేందుకు పార్టీ సీనియర్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చేలా కనిపించడంలేదు. ఎప్పటికప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు నిర్వహించిన శిక్షణా శిబిరాల్లో వ్యక్తమైన అనుమానాలు టీ టీడీపీ నేతలను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ శ్రేణులను కాపాడుకోవడం తెలుగుదేశం నేతలకు కష్టంగా మారుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్తలకు ఎన్టీఆర్‌ ట్రస్‌ భవన్‌లో మూడు దఫాలుగా నిర్వహించిన శిక్షణా శిబిరాలు వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ నేతలు చేసిన హితబోధను తెలుగుదేశం కార్యకర్తలు పెడచెవిన పెట్టడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం కకావికలమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కువగా అమరావతి నిర్మాణం, ఏపీ అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నారు. 2014లో నెగ్గిన ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లోకి జారుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పార్టీ పటిష్టతపై చంద్రబాబు పెద్దగా దృష్టిపెట్టంలేదున్న వాదనలు ఉన్నాయి. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలంటే నారా, నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దృష్టి పెడితే మినహా, పార్టీ గాడినపడే అవకాశంలేదన్న అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన 15 మంది శాసనభ్యుల్లో 13 మంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆర్‌ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోరన్న అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో నెగ్గిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా కారెక్కడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. ప్రస్తుతం టీ టీడీపీలో ఉన్న నేతల్లో కూడా కొందరు టీఆర్‌ఎస్‌కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడాలనుకుంటున్న నేతలు రాజీనామాచేసి, వారిదారి వారు చూసుకుంటే.. అంకింతభావం ఉన్న నేతలను కూడగట్టుకుని తెలుగుదేశంను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా మారాలన్నది పార్టీ అధినేత చంద్రబాబు ఆశయం. హైదరాబాద్‌ వచ్చినప్పుడో లేక అమరావతి పిలిపించుకునో పార్టీ నేతలకు చంద్రబాబు ఈ మేరకు దిశానిర్దేశం చేస్తున్నా... కార్యాచరణ మాత్రం లక్ష్యానికి అనుగుణంగాలేదని పార్టీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. ఇది పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈపరిస్థితులను పార్టీ నాయకత్వం ఎలా చక్కబెడుతుందో చూడాలి. 

21:07 - January 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత తమదే అంటూ టీఆర్‌ఎస్‌ చెబుతుంటే.. జేబులు నింపుకునేందుకే ప్రైవేటు సంస్థల దగ్గర విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోసారి కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంగించి తప్పుడు అగ్రిమెంట్లు చేయడంతో 23 మంది అధికారులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ విషయంలో బాల్కసుమన్‌ ఇద్దరిపైనే కేసులు అయ్యాయంటున్నారని.. దీన్ని బట్టే టీఆర్‌ఎస్‌ అవినీతి అర్థమవుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన ఆరోపణలు తప్పని తేలితే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పారదర్శకంగా పనిచేస్తే ... సెంట్రల్‌ విజిలెన్స్‌తో గానీ సీబీఐతో గానీ విచారణ జరపాలన్నారు. తన ఆరోపణలు తప్పని తేలితే అబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తానని రేపంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

మరోవైపు 24 గంటల విద్యుత్ పంపిణీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని మీడియా చిట్‌చాట్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను, రైతులను కాల్చుకుతింటే తాము కరెంట్ ఇచ్చి అదుకుంటున్నామని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించే వాళ్లు ఆధారాలుంటే భయటపెట్టాలన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలతో ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని గ్రహించిన టీఆర్‌ఎస్‌.. కిందిస్థాయి నేతలతో సవాళ్లకు ప్రతిసవాళ్లు చేయిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను బయటపెట్టాలన్న విపక్షాల డిమాండ్‌కు మంత్రుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చుతోంది. 

17:11 - January 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో పారిపోతారు..బయట మాత్రం చర్చించాలంటే ఎలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా 24గంటల విద్యుత్ సరఫరాలో అవినీతి దాగి ఉందని..టి.కాంగ్రెస్ నేత రేవంత్..నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై శనివారం మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఇస్తామని ముందుకొస్తోందన్నారు. 24గంటల విద్యుత్ పంపిణీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని..ప్రజలను..రైతులను కాల్చుకు తింటే తాము ఆదుకుంటున్నామన్నారు. అవినీతి జరిగిందని ఆరోపించే వాళ్లు ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు అడిగితే కూడా సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ చట్టంపైనా అసెంబ్లీలో చర్చించవచ్చని, అప్పుడు అందరి అభిప్రాయాలను చెప్పుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:12 - January 12, 2018

హైదరాబాద్ : విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సీవీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు వెనక్కతగ్గిన టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిపై కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి మండిప్డడారు. విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్ల కాంట్రాక్టుల్లో ముఖ్యంత్రి కేసీఆర్‌కు భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపించకపోతే హైదరాబాద్‌ అబిడ్స్‌ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌ మరోసారి సవాల్‌ విసిరారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. దీనిని రేవంత్‌ స్వీకరించడంతో ఆత్మరక్షణలో పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. రేవంత్‌కు విశ్వసనీయతలేదంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ చర్చకు రావాలని మెలిక పెట్టారు. అయినా రేవంత్‌రెడ్డి వెనక్కితగ్గకుండా బహిరంగ చర్చకు సిద్ధమై, తన అనుచరులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని గన్‌ పార్క్‌ వద్దకు వచ్చారు. విద్యుత్‌ ప్రాజెక్టుల టెండర్లలో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బహిరంగ చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోక ముడిచారని రేవంత్‌ మండిపడ్డారు. టెండర్లు పిలువకుండా 30,400 కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఎలా అప్పగించారాలో టీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్న రేవంత్‌రెడ్డి, వీటిని ప్రజల ముందువుంచి, ముఖ్యమంత్రిని ప్రగతి భవన్‌ నుంచి చర్లపల్లి జైలుకు పంపిస్తాని హెచ్చరించారు. 

20:19 - January 12, 2018

మనకు ఏడనన్న అన్యాయం అయితే.. కోర్టుకు వోతం.. ఆడగూడ న్యాయంగాకపోతె..ఫలితాలు రాకముందుకే ఓటమి పాలైంది టీఆర్ఎస్ పార్టీ కరెంటి ముచ్చట్ల..చెర్వుమీద కొంగ అల్గితె.. చెర్వుదెండుతదా.?? కొంగదెండుతదా..? ఆ నాగం జనార్థన్ రెడ్డి గారు గూడ.. బీజేపీ కమలానికి కాటు వెడ్తున్నట్టే ఉన్నడుగదా? ఏయ్ మా కేటీఆర్ను తిడ్తరా మీరు..? కబడ్దార్ కాంగ్రెస్ నేతల్లారా అని టీఆర్ఎస్ పార్టోళ్లు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది...తెలంగాణల గొర్ల పంపిణీ పత్కం తెర్లైంది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా.?మన్సులను వోలిన మన్సులు ఏడ్గురుంటరంటరు.. ఆ ఏడుగుర్ని ఎవ్వడు సూడవొయ్యిండో ఏమో నాకు తెల్వదిగని.. గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

21:05 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ‌లో పవర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. క‌రెంట్‌ అంశం కాంగ్రెస్ -టీఆర్ఎస్‌ల‌ మ‌ధ్య మంట‌లు పుట్టిస్తోంది. విద్యుత్ కొనుగోలులో అవినితీ ఉంద‌న్న కాంగ్రెస్‌ కామెంట్స్‌తో ఇరు పార్టీల‌ మ‌ధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతోంది. బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అంటుంటే.. విశ్వసనీయత లేని వారితో మాటలేంటని టీఆర్‌ఎస్‌ వాదిస్తోంది.

తెలంగాణలో నిరంతర విద్యుత్‌ సరఫరా అంశం కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. విద్యుత్‌ కొనుగోళ్లలో.. ప్లాంట్స్‌ ఏర్పాటులో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీలో చౌక‌గా విద్యుత్ ఇస్తామ‌ని చెప్పినా ప‌ట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్ళు ఎలా చేస్తార‌ని ఆయ‌న ప్రశ్నించారు. విద్యుత్‌ అక్రమాలపై ఎక్కడ బహిరంగ చర్చ నిర్వహించినా వస్తానంటూ సవాల్‌ విసిరారు.

రేవంత్‌ ఆరోప‌ణ‌ల‌పై తొలుత టీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చింది. ప్రభుత్వం రైతుల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తుంటే .. ఓర్వలేని కాంగ్రెస్ త‌మ స‌ర్కారుపై దుష్ప్రచారానికి దిగుతుంద‌ని గులాబీ నేత‌లు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్తవ‌మ‌ని .. దీనిపై బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధమ‌ని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ప్రకటించారు.

విద్యుత్‌ పాలసీలో ప్రభుత్వ అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోలార్ విద్యుత్ టెండ‌ర్ల ద‌గ్గరి నుంచి .. యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్స్‌, బీహెచ్‌ఈఎల్ విద్యుత్ ఒప్పందాల‌న్నింటిలో క‌మీష‌న్ల క‌క్కుర్తి దాగిఉంద‌ని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే .. బ‌హిరంగ చ‌ర్చకు రావాలని.. తాను ప్రభుత్వం అవినితిని నిరుపించ‌లేక పోతే.. త‌న‌ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా అంటూ స‌వాల్ విసిరారు.

కాంగ్రెస్‌ నుంచి అదే స్పీడులో సమాధానాలు వస్తుండటంతో... గులాబీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. సవాల్‌కు వెనకడుగు వేసేది లేదంటూనే.. కొత్తమెలిక పెట్టారు. రేవంత్‌రెడ్డి లాంటి విశ్వసనీయతలేని వ్యక్తితో చర్చించలేమని.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి లాంటి కీలక నేతలు వస్తే తాము చర్చలకు వస్తామని కొత్త రాగం అందుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో పవర్‌ వార్‌ కొనసాగుతోంది. 

17:26 - January 11, 2018

హైదరాబాద్ : 24 గంటల విద్యుత్ అంశంపై టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి..టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యుత్ వెలుగుల వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై చర్చకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. గురువారం ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక అబద్దాల కోరు..నోట్ల కట్టలతో దొంగగా దొరికిపోయాడు..దిగజారుడు రాజకీయాలకు చెందిన వ్యక్తి..పచ్చి అబద్దాలు మాట్లాడిన వ్యక్తి అంటూ అభివర్ణించారు. ఆయనతో చర్చించలేంటీ అని ప్రశ్నించారు. ఆయనతో చర్చించే దానికంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్..సీఎల్పీ నేత జానారెడ్డి వస్తారా ? అని తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తాము బుధవారం చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయాలు చెప్పకుండా రాత్రి ప్రెస్ నోట్ ను రేవంత్ విడుదల చేశాడని, అనుభవం లేని వారితో ఎందుకు చర్చిస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి థర్మల్ విషయంలో ఇద్దరిపై మాత్రమే కేసు నమోదైందని తెలిపారు. 

17:42 - January 10, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన 24 గంటల విద్యుత్‌ వెలుగుల వెనకాల చీకటి కోణం దాగుందన్నారు కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌రెడ్డి. కమీషన్ల కోసమే కేసీఆర్‌ విద్యుత్‌ అడ్డంపెట్టుకొని వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రారంభించాలనుకున్న పవర్‌ ప్రాజెక్టుల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నిర్మాణం, అందుకోసం తీసుకువస్తున్న అప్పులు, దీని వెనకాల ఉన్న అవినీతి భాగోతం అనే అంశాలపై రేవంత్‌ రెడ్డి వివరించారు. 

07:36 - January 10, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌పై .. కాంగ్రెస్‌ మళ్లీ ధ్వజమెత్తింది. ప్రభుత్వం కరెంట్‌ ద్వారా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందని.. విమర్శలు గుప్పించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై శ్వేతపత్రంపై విడుదల చేయాలని సవాల్‌ విసిరింది.
నిరంతర విద్యుత్ సరఫరా వెనుక అవినీతి : రేవంత్ రెడ్డి 
కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కేసీఆర్‌ అమల్లోకి తీసుకొచ్చిన 24 గంటల విద్యుత్‌పై గురి పెట్టింది. నిరంతర విద్యుత్ సరఫరా వెనుక భారీ అవినీతి దాగుందని విమర్శించింది. దివాళా తీసిన విద్యుత్‌ కంపెనీలతో ఎక్కువ రేట్లకు విద్యుత్‌ను కొనుగోళ్లు చేస్తూ వేల కోట్లు స్వాహా చేశారని.. రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్‌లను నిర్వీర్యం చేస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన సన్నిహితులను సీఎండీలుగా నియమించుకుని.. అడ్డగోలు ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా.. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ముసుగులో... జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తామని హస్తం నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామంటున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - రేవంత్ రెడ్డి