రైతులు

09:18 - December 14, 2017

ఖమ్మం : రఘునాథపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. వేపకుంట మాజీ సర్పంచ్, రైతు భుక్యా రామ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రామ మూడెకరాలతో పాటు మరో కొన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మిర్చి..పత్తి పంటలు వేశాడు. కానీ ఆ పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రామా తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. మొత్తం రూ. 8 లక్షలు అప్పులు కట్టాల్సి ఉండడంతో మనోవేదనకు గురయ్యాడు. గిట్టుబాటు ధర రాకపోవడం..అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో పురుగుల మందు సేవించి బలవన్మారణానికి పాల్పడ్డాడు. ఇతని కుటుంబాన్ని ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

18:36 - December 11, 2017
22:06 - December 7, 2017

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలంలో నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీకి అడ్డంకులు తొలగడం లేదు. ఫార్మాసిటీ కోసం  నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. రైతులంతా తమ భూములు ఇవ్వబోమని... తమ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు వద్దంటూ ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలకు పాల్పడిన వారిని ముందుగా శిక్షించాలని స్థానికులు పట్టుబట్టారు. ఒకే ప్రాంతంలోని రైతులకు పరిహారం ఇచ్చే విషయంలోనూ తేడాలు చూపుతున్నారని మండిపడ్డారు. కాలుష్యం లేని కంపెనీలను ఏర్పాటు చేస్తామని తమను మభ్యపెట్టి... చివరికి ప్రాణాలు తీసే ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌, ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో మధుకర్‌రెడ్డి వారించినా ప్రజలు వినిపించుకోలేదు.  భూములు కోల్పోయిన రైతుల కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తామని. అనర్హులకు నెలకు 2500 పెన్షన్‌ ఇస్తామని చెప్పినా అంగీకరించలేదు. ప్రజల ఆందోళనతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రజాభిప్రాయసేకరణ అర్దాంతరంగా ముగిసింది.

 

09:39 - December 7, 2017

విజయవాడ : పోలవరం నిర్మాణ ప్రాజెక్టు స్థలానికి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవలే పోలవరం నిర్మాణంపై కేంద్రం లేఖ రాయడం..దానిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలవరం నిర్మాణ ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమౌతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడ నుండి ప్రత్యేక బస్సుల్లో వైసీపీ ప్రతినిధి బృందం బయలుదేరనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న అంశాలను ప్రజలకు తెలియచేస్తామని, అంతేగాకుండా నిర్మాణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని పార్థసారధి డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:30 - December 7, 2017

ఆదిలాబాద్ : మరోసారి పత్తి రైతులు నిలువునా మోసపోయారు. పంట బాగా వస్తుందని నమ్మబలికితే.. కింగ్ రకం పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. పంట ఏపుగానే పెరిగింది... కానీ పూత, కాత మాత్రం రాలేదు. దీంతో.. ఆందోళన చెందిన రైతులు కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే... పంట వస్తుందని ఉచిత సలహాలు ఇచ్చారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడతో రైతన్నలు పత్తి పంటను ఎక్కువగా సాగు చేశారు. తమ కంపెనీ విత్తనాలు ఉపయోగిస్తే పంట బాగా పండుతుందని ఓ కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో... జైనథ్‌ మండలం మేడిగూడ(సి) రైతులు కింగ్‌ రకం పత్తి విత్తనాలు ఉపయోగించారు. పంటలు ఏపుగానే పెరిగినా... పూత, కాత లేకపోవడంతో.. అవి నకిలీ విత్తనాలమోనని రైతులు ఆందోళన చెందారు. ఈ వ్యవహారంపై కంపెనీ ప్రతినిధులను కలిశారు. అయితే.. వాతవరణంలో మార్పుల వల్లే... ఇలా జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

కంపెనీ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాల విత్తనాలు ఉపయోగించిన రైతులకు దిగుబడి వస్తుండగా... తమ పరిస్థితి ఇలా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు కట్టబెట్టి తమను మోసం చేశారని వాపోతున్నారు. న్యాయం చేస్తామని...హామీ ఇచ్చిన కంపెనీ పట్టించుకోకపోవడంతో... రైతులంతా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు తెలిపారు. కింగ్‌ విత్తనాలు ఉపయోగించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి మోసపూరిత కంపెనీల నుండి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. 

09:22 - December 6, 2017

కర్నూలు : ఉల్లిపాయలకు కర్నూలు పెట్టింది పేరు. గత కొంతకాలంగా నష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఉల్లి రైతులు ప్రస్తుతం కొంత కొలుకొంటున్నారు. మంచి ధర వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్వింటాలుకు రూ. 1500 ఉంటే ఇప్పుడు రూ. 2500-రూ. 3000 ధర పలుకొతోంది. ఈ సందర్భంగా ఉల్లి రైతులతో టెన్ టివి మాట్లాడింది. క్వింటాలుకు రూ. 2500 ధర స్థిరంగా ఉంటే గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. ఉల్లి పంటకు మంచి ధరలు వస్తున్నాయని, నాణ్యమైన పంటలకు ధర ఇంకా ఎక్కువ వస్తోందని తెలిపారు. ధరలు ఇదే విధంగా ఉండేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

06:31 - December 6, 2017

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ నాలుగో దశ టైం లైన్లను విధిగా పాటించాలన్నారు మంత్రి హరీష్‌రావు. ఈనెలాఖరుకు ప్రతిపాదనలు రూపొందించి.. జనవరిలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నాలుగో దశలో 5,703 చెరువుల పునరుద్దరణ చేపట్టనున్నామని.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. వివిధ కారణాలతో తిరస్కరించిన పనులను మరోసారి పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మిషన్‌ కాకతీయ నాలుగో దశ పనులను జనవరి మొదటివారంలోనే ప్రారంభించాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఈ దశలో 5,703 చెరువులను పునరుద్దరించనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. మిషన్‌ కాకతీయలో ప్రజల భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాలని సూచించారు. మిషన్‌ కాకతీయ పనులలో ఆయకట్టు స్థిరీకరణ,.. అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఈఈలు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ఈ దశలో చేపట్టనున్న చెరువుల జాబితా ముందుగానే అందిస్తున్న నేపథ్యంలో... పూడిక మట్టిని రైతులు వాడుకునే విధంగా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు హరీష్‌రావు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,500 సాయిల్‌ లాబ్‌ టెస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు ఇంకా పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించలన్నారు. మిషన్‌ కాకతీయలో కొందరు చేసే తప్పులకు మొత్తం కార్యక్రమం అబాసుపాలవుతోందని.. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక మిషన్‌ కాకతీయ పనులను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతినిధులను భాగస్వాములను చేయాలని హరీష్‌రావు సూచించారు. ఇకపై 10 రోజులకోసారి పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. 

17:26 - December 4, 2017

కరీంనగర్/జగిత్యాల : రైతులు ఆందోళన నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద 36వ కిలోమీటరు నుండి 45 కిలోమీటర్ల వరకు 9 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాల్వలకు మరమ్మతుల పేరుతో...తమ పొలాల్లోకి నీరు రాకుండా అడ్డుకుంటారని దీంతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 7 గ్రామాల రైతులు ఎస్సారెస్పీ కాలువపై ఉన్న గేట్ల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. అనంతరం మెట్‌పల్లికి ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌కు తమ గోడును విన్నవించుకున్నారు. దీంతో పనులను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

 

18:40 - December 2, 2017
15:29 - November 30, 2017

శ్రీకాకుళం : మార్కెట్లో అమ్ముతోంది కిలో 40 రూపాయలు, రైతులకు ఇస్తోంది ఒక్కరూపాయి. శ్రమకోర్చి పంటలు పండించిన రైతులకు అప్పులు మిగులుతుండగా.. శ్రమ ఫలితం మాత్రం దళారుల జేబుల్లోకి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కాలీఫ్లవర్‌, క్యాబేజీరైతులు దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పేరు చెబితేనే అందరికీ కూరగాయల వ్యవసాయం గుర్తుకు వస్తుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా.. ఒరిస్సా వరకూ ఇక్కడి కూరగాయలకు మంచి డిమాండు ఉంది. జిల్లాలోని పాలకొండ, సీతంపేట, వీరఘట్టంతోపాటు కూరగాయల పంటలకు అనుకూలంగా ఉండే ఏజెన్సి ప్రాంతంలో గిరిజనరైతులు కూరగాయల పంటలనే సాగుచేస్తున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండే శ్రీకాకుళంజిల్లా గిరిజన రైతులను దళారులు దారుణంగా మోసగిస్తున్నారు. వీరఘట్టం మండలంలో ప్రతిఏడాది వందలాది ఎకరాల్లో కాలిఫ్లవర్ పంటను వేస్తారు. అధిక ధరకు విత్తనాలు కొని.. విపత్తులకు ఎదురొడ్డి మరీ పంటలు వేసిన కర్షకులకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నలభై రూపాయల పైన కాలిఫ్లవర్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో పువ్వు చొప్పున అయినా పాతిక రూపాయలు పైనే పలుకుతోంది. కాని అవి పండిస్తున్న రైతులకు మాత్రం పువ్వుకు కేవలం రూపాయో.. రెండు రూపాయలో మాత్రమే అందుతున్నాయి. పొలం నుంచి మార్కెట్‌కు వెళ్ళే సమయం లోనే ఈ మార్కెట్ మాయాజాలం అంతా జరుగుతోంది.

పంటను నిల్వచేసుకోడానికి, మార్కెటింగ్‌కు సరైన సౌకర్యాలు లేకుండా పోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ కష్టాన్ని తక్కువ ధరకే దళారులకు అప్పజెప్పుతున్నారు గిరిజన రైతులు. స్థానికంగా కూరగాయలకు స్టోరేజి సదుపాయం కల్పించడంతో పాటు, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని గడచిన కొన్నేళ్లుగా గిరిజనులు కోరుతున్నారు. అయితే వారి వేదన పాలకులు పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఈ దందాను పట్టించుకునేవారు లేకపోవడంతో దళారులు ఆడింది ఆట పాడిందే పాటగా మారింది. ఇప్పటికైనా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు స్పందించి,దళారుల చేతిలో మోసపోతున్న గిరిజన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - రైతులు