రైల్వేస్టేషన్లు

21:28 - January 11, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. పన్నెండో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో.. ఏపీకి చెందిన వారు.. చిన్నా పెద్ద సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

మహానగరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణీకుల కష్టాలు అన్నిఇన్నీ కావు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ట్రైన్లు లేక పోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దొరికిన రైళ్లు, బస్సులలో సీట్లు దోరకక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు జూబ్లి బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్ధితి ఉండటంతో మరిన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేయాలని డిమాండ్ చేసారు.

పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ఆంధ్రాప్రజలు...

హైదరాబాద్ మహానగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం వారివారి ప్రాంతాలకు తరలివెళతారు. వీరితో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళతారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులు నడపడంలో ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు రైల్వే శాఖ కూడా అదనపు రైళ్లను వేయకపోవడంతో సంక్రాంతి రద్దీ మరింతగా పెరిగింది.

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్....

సందేట్లో సడేమియాల్లా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు బస్సు ఛార్జీలు మూడింతలుగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీని అరికట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఆర్టీసీ , రైల్వే శాఖలు స్పందించి రద్దీకి తగ్గటుగా అదనపు బస్సులను, రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

07:09 - September 11, 2015

విజయవాడ : నగరంలోని బెగ్గింగ్‌ ముఠాలపై చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు మెరుపుదాడి చేశారు. సినిమా హాళ్లు, బస్టాండ్లు, ట్రాఫిక్‌ కూడళ్లలో భిక్షాటన చేస్తున్న పలువురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. పసి పిల్లలను పావులుగా ఉపయోగించుకుని భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులను విచారిస్తున్నారు. మరోపక్క ఈ పిల్లలందరూ వారి సొంత పిల్లలా ? లేక ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చారా అనే అంశాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అమ్మ ఒడిలో పాలుతాగుతూ హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు. కానీ.. నగరంలో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల దాడిలో పట్టుబడ్డారు.

బెగ్గింగ్‌ ముఠాపై దృష్టి సారించిన అధికారులు .......

విజయవాడ నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న బెగ్గింగ్‌ ముఠాపై దృష్టి సారించిన అధికారులు ఒక్కసారిగా అనేకప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న పలువురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని గాంధీనగర్‌ చైల్డ్‌హోంకు తరలించారు. ఇక ఈ పిల్లలంతా తమ పిల్లలే అని తల్లులు అక్కడకు చేరుకున్నారు. సినిమా హాళ్లు వద్ద కూర్చుంటే అకారణంగా తమ పిల్లలను తీసుకువచ్చారని చిన్నారులు తల్లులు ఆరోపిస్తున్నారు.

సినిమాహాళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ట్రాఫిక్‌ కూడళ్లలో భిక్షాటన.....

నగరంలోని సినిమాహాళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ట్రాఫిక్‌ కూడళ్లలో పిల్లలతో భిక్షాటన నిత్యకృత్యంగా మారిందని చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో 25 మంది పిల్లలను అదుపులోకి తీసుకున్నామంటున్నారు. ఇక ఈ పిల్లలంతా వీరి సొంత సంతానమా ? లేక ఎక్కడి నుంచైనా తీసుకువచ్చారా ? అనే అంశాలన్నీ విచారణలో తేలుతాయని వారంటున్నారు. వారి పిల్లలని ఏవైనా ఆధారాలుంటే విడిచిపెడతామని.. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకు పెరిగిపోతున్న ఈ తరహా బెగ్గింగ్‌పై ఇప్పటికైనా దృష్టి సారించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు నిజంగా వారి సొంత పిల్లలా ? లేక ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చారా ? అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.

Don't Miss

Subscribe to RSS - రైల్వేస్టేషన్లు