రోగులు

09:51 - August 16, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విషజ్వరాల బారినపడి అవస్థలు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో ప్రైవేటు , ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులకు గురవతున్నారు. క్యూలైన్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో..జ్వర పీడితులు అసహనం చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం
అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. హైదరాబాద్‌లో సీజనల్‌ జ్వరాలు ప్రబలడంతో.. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు క్యూకడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని రోగాల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏకొద్దిపాటి జలుబు, దగ్గు అనిపించినా చిన్న పిల్లల్ని వైద్యులకు చూపించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వర్షాలు జోరుగా పడుతుండటంతో దోమలు విజృభిస్తున్నాయి. జనం రోగాలభారిన పడి విలవిల్లాడుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి..పారిశుద్ధ్యకార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దోమల నివారణకు పాగింగ్‌ చర్యలు విస్తృతంగా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.  

06:55 - August 12, 2017

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లా బైంసా మండల కేంద్రంలో అర్ధరాత్రి ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్నా... ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో నిద్రపోతున్న నర్సులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది... కుటుంబ సభ్యులపై చిందులు వేస్తూ ఏవో ఇంజక్షన్లు చేశారు. తర్వాత నొప్పులు తగ్గాయి... ఉదయం ఆపరేషన్‌ చేయగా... మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో మరో శిశువు మృతి చెందాడు. ప్రసవం కోసం గత మంగళవారం జ్యోతి అనే గర్బిణీ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. సిజేరియన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే... అనస్తషీయ రాలేదని ఆపరేషన్‌ను వాయిదా వేశారు. శుక్రవారం రోజున నొప్పులతో మళ్లీ ఆస్పత్రికి రావడంతో... వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో... ఆ తల్లి మృత శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నవోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే... వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో... యువతి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు... యువతి మృతికి కారణమైన డాక్టర్లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు కాపాడుతారని ఎంతో నమ్మకంగా రోగులు ఆస్పత్రికి వస్తే... వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

15:40 - July 28, 2017

విజయవాడ : రెండు రోజుల పాటు అమెరికా హ్వార్డర్ యూనివర్సిటీ బృందం ఏపీలో పర్యటించనుంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఎలా వస్తోంది..దశాబ్దాలుగా ఉన్న ఈ వ్యాధిని ఎలా అరికట్టాలి..ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడిన రోగులకు ఎలాంటి సహాయం అందించాలి..ఎలాంటి అవగాహన కల్పించాలనే దానిపై యూనివర్సిటీ బృందం అధ్యయనం చేయనుంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని 13 మండలాల్లో వైద్యులు బృందం పర్యటించనుంది.

సమస్యను తీసుకెళ్లిన పవన్..
శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ బాధితుల సమస్యను హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ కు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించిన పవన్ అక్కడి మేధావులకు తెలియచేశారు. అంతేగాకుండా మెడికల్‌ స్కూల్‌ వైద్యులతో మాట్లాడారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కోవాలని సూచించారు.

రెండు రోజుల పాటు పర్యటన..
స్కూల్‌ రీజినల్‌ విభాగం ముఖ్య వైద్యుడు జోసెఫ్‌ బెన్వంత్రీ నేతృత్వంలో ఒక బృందం ఈనెల 29న జోసెఫ్‌ బృందం ఉద్దానంలో పర్యటిస్తుంది. అనంతరం 30వ తేదీన విశాఖపట్నంలో హార్వర్డ్‌ వైద్యులతో పవన్‌ సమావేశం కానున్నారు. పవన్‌, వైద్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. 

17:52 - May 4, 2017

కామారెడ్డి : జిల్లాలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అనేక సమస్యలకు నిలయంగా మారింది. తగినంతమంది వైద్యులు లేరు.. సదుపాయాలు లేవు. దీంతో పేదలకు మెరుగైన సేవలు అందడం లేదు. హాస్పటల్‌కి నిత్యం 400 వందల ఓపీ... పది నుంచి 20 వరకు ఇన్‌పేషంట్లు వస్తుంటారు. కానీ ఇక్కడ తొమ్మిది మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.. గైనకాలజిస్ట్‌ ఒకరే ఉండడంతో ఆస్పత్రిలో ప్రసవాల నిర్వహణకు ఇబ్బందిగా మారింది. అలాగే పిల్లల వైద్యులు నలుగురు మాత్రమే ఉన్నారు. మూడు వార్డులకు ఒకే స్టాఫ్‌ నర్స్‌ పనిచేస్తున్నారు. ఉన్నవారిపైనే అదనపు పనిభారం పడడంతో డ్యూటీలు చేయడానికి భయపడుతున్నారు.

ఆందోళనలో రోగులు...

ఆస్పత్రిలో సరిగా సేవలందకపోవడంతో... రోగులు ఆందోళనకు దిగుతున్నారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఒకే రోజు జరిగిన 16 ప్రసవాలలో... పుట్టిన ఇద్దరు మగబిడ్డలు చనిపోయారు. దీంతో వారు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అయితే వైద్యుల కొరత కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు సిబ్బందిని, వైద్యులను నియమించాలని కోరుతూ గత కొన్ని రోజుల నుంచి ఉదయం గంట సేపు వైద్యులు విధులు బహిష్కరించి..ఆందోళన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రోగుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా సిబ్బంది కొరతను తీర్చాలని వైద్యులు, ప్రజలు కోరుతున్నారు.

18:38 - February 4, 2017

జగిత్యాల : ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ఆపదలో ఆస్పత్రికి వచ్చిన వారిని వైద్యులు చిన్నచూపు చూస్తున్నారు. రక్షించండి మహాప్రభూ అని వేడుకుంటుంటే.. ప్రాణాలు హరించివేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది.
రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం
ఇదిగో చూశారా. రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేస్తున్నాడు. వైద్యులు లేక సెక్యూరిటీ గార్డ్‌ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేస్తున్నాడునుకుంటే పొరపాటు. ఇదిగో పక్కనే డాక్టరమ్మ ఉంది. ఈమె తీరు చూస్తేంటే.. సీనియర్‌ డాక్టర్‌ వైద్యం చేస్తుంటే జూనియర్‌ డాక్టర్‌ పరిశీలిస్తున్నట్లుగా ఉంది.
జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఘటన
ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువస్తే సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేశాడు. పక్కనే డాక్టర్‌ ఉన్నా కూడా కనీసం ఆమె రోగిని తాకకపోవడం విడ్డూరం.
డాక్టర్‌, ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్‌
గతంలో కూడా సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆకస్మిక తనిఖీలు చేసి.. ఒక డాక్టర్‌తో పాటు.. ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రాలేదు. ఎలాంటి అర్హతలు లేని సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేయడంతో.. రోగికి ఏదైనా ఎవరు బాధ్యత వహిస్తారు పలువురు ప్రశ్నిస్తున్నారు.
గర్బిణికి వైద్యం చేసిన నర్సు
రెండు రోజుల క్రితమే గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లికి చెందిన గర్భిణికి నర్సు వైద్యం చేయడంతో.. పాప మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికీ వైద్యుల తీరులో మాత్రం ఇంకా మార్పు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  
ప్రజల ప్రాణాలంటే చులకన
ప్రజలందరికీ ఆరోగ్యం అందిస్తాం.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకునే విధంగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వం ఒక పక్క చెబుతుండగా.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యులు కనీసం ట్రీట్‌మెంట్‌ చేయించకుండా.. సెక్యూరిటీ గార్డ్‌ చేత వైద్యం చేయిస్తున్నారంటే.. ప్రజల ప్రాణాలంటే వారికి ఎంత చులకనో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

 

15:38 - January 29, 2017
15:36 - January 29, 2017

హైదరాబాద్ : ఆధునియ యుగంలో ప్రతొక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల దేశంలో బీపీ, షుగర్ రోగులు అధికమౌతున్నారని ప్రముఖ వైద్యులు గోపాలం శివనారాయణ పేర్కొన్నారు. జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పేషేంట్ల కోసం అంబేద్కర్ కాలేజీలో ఏర్పాటు చేసిన రెగ్యులర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆధునిక జీవన శైలి..ఒత్తిడి వల్లే బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయన్నారు. షుగర్ వ్యాధి వచ్చిన వారికి తక్కువ ఖర్చుతో పరీక్షలు చేయడం..మందులు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో నగరంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

12:03 - January 3, 2017

శ్రీకాకుళం : ఎన్నో ఏళ్లుగా నానుకుని ఉన్న ఓ సమస్యను పరిష్కరించేందుకు జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' నడుం బిగించారు. తమ సమస్య ఇప్పటికైనా తీరుతుందా అని కిడ్నీ రోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత రెండు దశాబ్ధాలుగా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధితో ఎంతో మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో రోగులతో 'పవన్' నేరుగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రోగులు తమ సమస్యలు తెలుసుకున్నారు. అంతకంటే ముందు 'పవన్' మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నా సరియైన విధంగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై ఎవరూ స్పందించలేరని, ఎన్నో వేల రూపాయలు ఖర్చు అవుతాయని రోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నామని కన్నీళ్లతో తెలిపారు. కూలి చేసుకుని బతికేవాళ్లమని ఒకరు పేర్కొనగా కిడ్నీ వ్యాధితో అమ్మా..నాన్నలు చనిపోయారు..అనాథలు అయిపోయాయని ఓ చిన్నారి పేర్కొన్నారు.

11:21 - January 3, 2017

శ్రీకాకుళం : ఉద్దాన్నం కిడ్నీ బాధితులను పట్టించుకోవాలని వైద్యుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో కిడ్నీ రోగులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రోగులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వైద్యుడు కృష్ణమూర్తి మాట్లాడారు. అక్కడ నెలకొన్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. సోంపేటలో 1992లో ప్రాక్టీస్ చేయడం జరుగుతోందని, 1995లో ఒక ఫిజీషీయన్ తో మాట్లాడి రక్తహీనతో బాధ పడుతున్నారని తెలుసుకోవడం జరిగిందన్నారు. ఏ కారణంతో వ్యాధి వస్తుందో తెలియడం లేదని, ఇక్కడి యువకులకు వివాహాలు జరగడం లేదన్నారు. రాజకీయ నేతలు, ప్రభుత్వం సరియైన విధంగా స్పందించ లేదన్నారు. కిడ్నీ వ్యాధితో ఎంతో మంది చనిపోయారని చాలా బాధగా ఉందన్నారు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని, సరియైనటువంటి మందులు ఇవ్వడం..రోగులకు సరియైన అవగాహన కల్పిస్తే బాగుండేదన్నారు. ఏఎన్ఎం, ఆర్ఎంపీలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఎక్కువ నీరు సేవించాలని సూచించారు. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో సమగ్రమైనటువంటి రీసెర్చ్ టీం పెట్టాలని, స్థానికంగా క్లినీక్ టెస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిపుణులైన వైద్యుల సలహాలతో ట్రీట్ మెంట్ ప్రారంభించాలని సూచించారు. డయాలీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకోవడం కరెక్టు కాదన్నారు. చనిపోయిన కుటుంబీకులను ఆదుకోవాలని, సరియైన విధంగా స్పందించాలని సూచించారు. ఆర్థిక వనరులు ఉంటే ఏదైనా సాధ్యమని, ఈ సందర్భంగా తాను ఒక నివేదిక పవన్ కు అందచేస్తున్నట్లు పేర్కొన్నారు.

10:40 - January 3, 2017

శ్రీకాకుళం : సిక్కోలుకు సినీనటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' చేరుకున్నారు. కాసేపట్లో ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో కిడ్నీ రోగులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే పలు ఏర్పాట్లు జరిగిపోయాయి. 'పవన్' పై రోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి కిడ్నీ రోగులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎంతో మంది మృతి చెందిన కుటుంబీకులను ఆదుకోవాలని కిడ్నీ రోగులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా కిడ్నీ రోగులు ఎంతో మంది మృతి చెందారని, వీరికి ప్రభుత్వం సహాయం అందచేయాలని కోరుతున్నారు. 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 30 కి పైగా గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు సంబంధిత నిపుణులు వెల్లడించారు. ఈ కిడ్నీ వ్యాధుల వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రోగులు