వాతావరణ శాఖ

21:20 - May 21, 2017

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాడ్పులు కూడా జనం ప్రాణాలు తీస్తున్నాయి. ప్రతిరోజు రెండు రాష్ట్రాల్లో పలువురు వృద్ధులు వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. బెంబేలెత్తిస్తున్న ఎండలతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

పిట్టల్లా రాలుతున్న జనం....

తెలగు రాష్ట్రాలపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. తీవ్రమైన ఎండతో పాటు, వడగాల్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు సూర్యుడి ప్రతాపానికి బలైపోతున్నారు.

నిప్పుల కుంపటిని తలపిస్తున్న మేనెల...

నిప్పుల కుంపటిని తలపిస్తున్న మేనెల ఎండలు జనం ప్రాణాలను హరిస్తున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో వృద్ధులు వడదెబ్బ తగిలి చనిపోతున్నారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలో వడదెబ్బకు 36 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క గుంటూరు జిల్లాలోనే 13 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా గుంటూరుజిల్లా చీరాలలో రిక్షాకార్మికుడు విగత జీవుడైనాడు.

ఏపీలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు

అటు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని అమరావతి సమీప ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు మండిపోతున్నాయి. గన్నవరంలో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. విజయవాడలో 41.6, తుని 41.5 డిగ్రీలు, అమరావతి, తిరువూరు, కావలిలో 41 డిగ్రీలు నమోదు కాగా.. నందిగామ 40.8 డిగ్రీలు, మైలవరం 40 డిగ్రీలు, వెలగపూడిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి. అటు రాజమహేంద్రవరంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు జనాన్ని వణికిస్తుండగా .. ఒంగోలులో 43 డిగ్రీలు, ఏలూరులో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణ నిప్పులు కక్కుతున్న ఎండలు ...

ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు క్కుతున్నాయి. పగలు ఎండలు , రాత్రి పొద్దుపోయేదాకా వడగాడ్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆదివారం రోజు నల్లగొండ పట్టణంలో భానుడు సెగలు పుట్టించాడు. 46.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో జనం విలవిల్లాడుతున్నారు.

తెలంగాణలో వేసవి ప్రారంభం నుంచి ఇప్పటి వకు 171 మంది మృతి

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వేడిసెగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 171 మంది వడదెబ్బకు గురై మృతి చెందారని విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున.. హన్మకొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 44, ఖమ్మంలో 43, హైదరాబాద్‌లో 42, హకీంపేటలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రెండు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి

మరోవైపు వడగాడ్పులు పెరగడంతో రెండు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. వైద్య , ఆరోగ్యశాఖ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో ఆరోగ్యకేంద్రాల్లో .. వడదెబ్బ నివారణకు మందులు, ఉపశమన ఔషదాలు ఏవీ అందుబాటులో ఉంచడంలేదు. కనీసం ఓ ఆర్‌ఎస్‌ ప్యాకేట్లను కూడా అందించడంలేదని ప్రజలు వాపోతున్నారు. వడదెబ్బ తిన్న వారికి చికిత్స అందించే కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపించాయి. ఎండత్రీవతతో పాటు మరో మూడు రోజుల పాటు వడగాలుల ఉధృతి కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల్లో వైద్యా ఆరోగ్యశాఖలు సూచిస్తున్నాయి.

17:41 - May 21, 2017

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడురోజుల పాటు వడగాలులు వీస్తాయని, ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు చెమటలు కక్కిస్తుండటంతో జనం ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పదిరోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ నల్లగొండలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు రామగుండంలో 45.8 డిగ్రీలు, ఖమ్మంలో 45.7, భద్రాచలం 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళ నిప్పుల వర్షం కురుస్తుండటంతో... రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరో మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయం ఎండలో ఉండవద్దని సూచించారు.

16:34 - May 19, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు భారీగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా తిరువూరులో అత్యధికంగా 47.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక తెలంగాణలోని మంచిర్యాలలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లోనూ ఎండలు ఇదేవిధంగా మండుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు భారీగా ఉండడంతో ప్రజలెవరూ మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

11:37 - April 25, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వడగాల్పులు ప్రారంభమయ్యాయి. సూర్యడి నుంచి వస్తున్న బ్లూరేస్‌ నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. అల్ట్రావైలెట్‌ రేస్‌ శరీరంపై పడితే ప్రమాదమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్ర 5 గంటల వరకు బయట తిరగవద్దని సూచిస్తున్నారు.

14:53 - November 3, 2016

విశాఖ : బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం, వాయవ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌ తీరంవైపు వెళ్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశాలపై ఎక్కువగా ఉండవచ్చని, తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. సముద్రంలోకి చేపల వేట నిమిత్తం ఎవరూ వెళ్లరాదని హెచ్చరించింది.

09:44 - October 26, 2016
10:56 - June 9, 2016

కేరళ : దేశం ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఆనవాయితీగా కేరళ తీరాన్ని తాకాయి.. కొద్దిరోజుల క్రితం వరకు మందగతిన సాగిన రుతుపవనాలు ఇప్పుడు కేరళలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తమై విస్తారంగా వర్షాలు కురిపించనున్నాయి.

24 గంటల్లోగా కేరళకు రుతుపవనాలు ..
దేశంలో ఇక వానలే వానలు...! కరువు తీరా వర్షాలు కురిపించేందుకు రుతుపవనాలు వచ్చేశాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అక్కడ భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. మాన్‌సూన్‌ రాకతో దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రకు ...
తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాలకు అటుపిమ్మట మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్రలోకీ రుతుపవనాలు వ్యాపించే అవకాశముంది. మొత్తంగా మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి...
మరోవైపు మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు.. అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడులోనూ గత 48 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి.

సాధారణం కన్నా అధికంగా వర్షాలు-వాతావరణశాఖ
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి దేశ వ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురుస్తాయి. ఆ శాఖ లెక్కల ప్రకారం 106 శాతం, స్కైమెట్‌ అనే ప్రైవేట్‌ సంస్థ అంచనా ప్రకారం 109 శాతందాకా వర్షాలు కురుస్తాయి. మొత్తంగా ఈసారి రుతుపవనాలు దేశంలో కరువును పారదోలడం ఖాయమనే అభిప్రాయం రైతులోకంలో ఆనందాన్ని కలిగిస్తోంది.

15:36 - May 20, 2016

విజయనగరం : రోను తుపాను ప్రభావంతో విజయనగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.గత మూడు రోజుల నుండి భారీ వర్షాలతో అతలాకుతం అయితమయ్యింది. నాలుగు రోజుల క్రితం వరకూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షాలకు ఉపశమనం పొందారు. కాగా రోను తుపానుతో భారీ నుండి అతిభారీ వర్షాలు పడతాయనీ..గంటకు 110 నుండి 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. 2014లో వచ్చిన హుదూద్ తుఫాను ప్రభావం నుండి ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇప్పుడు ఈ రోను తుపాను కారణంగా ఎటువంటి ప్రమాదాలు ఏర్పడతాయోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

08:03 - May 19, 2016

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్రా తీరానికి సమాంతరంగా,.. మచిలీపట్నానికి అత్యంత సమీపంగా పయనిస్తోంది. దీంతో ఏపీలోని తీరప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుండడంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

దిశను మార్చిన వాయుగుండం...

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి దిశను మార్చుకోవడంతో ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఒడిశా, పశ్చిమబంగ వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయి. భారత భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం జూన్ తొలినాటికే శ్రీలంక మీదుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో అనుకున్న సమయాని కంటే ముందే భారత్‌లో రుతుపవనాలు విస్తరించనున్నాయి.

తీరప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ...

తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండడంతో తీరప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టుల్లో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంట గంటకు 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న సమాచారంతో జిల్లాలన్నీ అప్రమత్తమయ్యాయి. తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షాలు ...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగం, చేజర్ల, ఎఎస్‌పేట, అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నెల్లూరు పట్టణంలోని రోడ్లన్ని జలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో నగరంలోని పిండిమిల్లు సెంటర్‌లో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. గాలి ఉధృతికి ఇంటిపైకప్పులు, ఎగిరిపోయాయి. వాయుగుండం ప్రభావంతో జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో...

వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతి పరిసరాల్లో కుండపోత వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ప్రధాన ఆలయంలో కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వెంటనే స్పందించిన ఆలయ అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నీటిని తోడి బయటకు పంపుతున్నారు. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఒంగోలులో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం...

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే చీరాల, కనిగిరి, పర్చూరు, ఒంగోలులో వర్షం కురుస్తుండడంతో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నెంబర్లను ప్రకటించారు. కలెక్టరేట్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077కాగా...పోలీస్‌ కార్యాలయం టోల్‌ఫ్రీ నెంబర్‌ 9440627389, 08592231220 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. చీరాల ఓడరేవులో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. వాయుగుండం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. శిబిరాలలో తాగునీరు, నిత్యావసర సరుకులు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. తీర ప్రాంతగ్రామాల వీఆర్వోలు, వీఆర్‌ఏలు గ్రామాల్లోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో బందరు పోర్టులో 3వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అటు వాయుగుండం ప్రభావంతో గుంటూరు జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్‌లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, రాజమండ్రి, కోరుకొండలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ లోనూ చెదురు మదురు వర్షాలు...

ఇటు తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు చెదురుముదురు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పిడుగుపడడంతో ప్రధాన గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి. 

19:54 - May 18, 2016

విశాఖపట్నం : నైరుతి బంగాఖాతంలో ఏర్పాడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తన దిశను మార్చుకుంది. నెల్లూరుకు 130 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం..దిశను మార్చుకొని ఒడిశా, పశ్చిమ బంగ వైపు పయనిస్తోంది. ఉత్తర దిశగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం ఒడిశా వైపు పయనిస్తోంది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. దీంతో మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు శ్రీలంక మీదుగా పయనిస్తూ కేరళ తీరనాన్ని తాకనున్నాయి. వాయుగుండం క్రియాశీలకంగా మారడంతో..ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడి అనుకున్న సమయానికే అంటే జూన్‌ తొలినాటికే రుతుపవనాలు కేరళ తీరన్ని తాకనున్నాయి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - వాతావరణ శాఖ