విచారణ

08:36 - April 27, 2017

శ్రీకాకుళం : పలాస కాశీబుగ్గ మున్సిపల్‌ కమిషనర్‌ జగన్మోహన్‌ రావుపై దాడి జరిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పురపాలక సంఘం చైర్మన్‌ పూర్ణ చంద్ర మరో ఇద్దరు కౌన్సిలర్లు కలిసి కొట్టారని జగన్మోహన్ రావు ఆరోపించారు. వాళ్ల అవినీతికి తాను సహకరించకపోవడం వల్లే దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

21:31 - April 24, 2017

ఢిల్లీ : పార్టీ సింబల్‌ రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు వరుసగా మూడోరోజు కూడా ప్రశ్నిస్తున్నారు. చాణక్యపురి ఇంటర్‌ స్టేట్‌ సెల్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. పార్టీ సింబల్‌ కోసం దినకరన్‌ మధ్యవర్తి సుఖేష్‌ చంద్రశేఖర్‌ ద్వారా ఈసీ అధికారికి 50 కోట్లు లంచం ఇచ్చేందుకు డీల్‌ కుదుర్చుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఆయనను విచారణ జరుపుతున్నారు. ఇవాళ దినకరన్‌-సుఖేష్‌ను ముఖా ముఖిగా ప్రశ్నించే అవకాశం ఉంది. రెండు రోజుల విచారణలో దినకరన్‌ నుంచి పోలీసులు పలు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో దినకరన్‌ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్‌ చంద్రశేఖరన్‌ను ఇదివరకే ఢిల్లీ పోలీసులు ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి కోటి 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

12:14 - April 24, 2017

హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్నే ఆపుతారా? అంటూ, టోల్ గేటు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్ లో తన అనుచరులకు విషయం చెప్పి, వారిని పిలిపించి ఆపై దాడికి దిగారు. టోల్ గేటులోని కంప్యూటర్లను నాశనం చేసిన ఆయన అనుచరులు, ప్లాజాలోని అద్దాలను ధ్వంసం చేశారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై టోల్ గేటు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

08:53 - April 23, 2017

ఢిల్లీ : ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ జరిపారు. లంచం వ్యవహారం, మధ్యవర్తి సుకేశ్‌తో సంబంధాలు తదితర అంశాలపై దినకరన్‌ను పోలీసులు ప్రశ్నించారు.
క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు దినకరన్ హాజరు 
ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు హాజరయ్యారు. చాణక్యపురి ఇంటర్‌ స్టేట్‌ సెల్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండాకుల గుర్తు కోసం దినకరన్‌ మధ్యవర్తి సుఖేష్‌ చంద్రశేఖర్‌ ద్వారా ఈసీకి 50 కోట్లు లంచం ఇచ్చేందుకు  డీల్‌ కుదుర్చుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై  పోలీసులు ఆయనను ప్రశ్నించారు. దినకరన్‌ మధ్యవర్తితో కలిసి ఈసీ అధికారులను కలిశారా...లేదా అన్నదానిపై ఆరా తీసినట్లు అధికారవర్గాల సమాచారం. క్రైం బ్రాంచ్‌ పోలీసుల విచారణలో భాగంగా దినకరన్‌ తరపు లాయర్లకు అనుమతించలేదు. విచారణ సందర్భంగా దినకర్‌ ఫోన్‌ కాల్స్‌ను, వాట్సప్‌ మెసేజీలు, ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా అధికారులు పరిశీలించారు.
బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు సమన్లు 
ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు సమన్లు జారీ చేశారు. దినకరన్‌ దేశం విడిచి వెళ్లకుండా ముందస్తుగానే లుకౌట్‌ నోటీసు పంపారు. ఈ కేసులో దినకరన్‌ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్‌ చంద్రశేఖరన్‌ను ఇదివరకే ఢిల్లీ పోలీసులు ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి కోటి 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తనకు ఎన్నికల కమిషన్‌తో మంచి సంబంధాలున్నాయని, అన్నాడిఎంకే శశికళ వర్గానికి రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానని సుకేశ్‌- దినకరన్‌ను నమ్మించాడు. ఈ వ్యవహారం వెనక దినకరన్‌ ఉన్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. 

 

17:06 - April 22, 2017

ఢిల్లీ: అన్నాడీఎంకే నేత దినకరన్‌ ను.. ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. రెండాకుల గుర్తు కేటాయింపు కోసం.. ఈసీకి లంచం ఇచ్చినట్లుగా దినకరన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈసీకి లంచం ఇచ్చిన చంద్రశేఖర్‌తో దినకరన్‌కున్న సంబంధాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

09:32 - April 20, 2017

గుంటూరు : గోదావరి పుష్కరాల తొక్కిసలాట కేసు ద‌ర్యాప్తు ముగింపు ద‌శ‌కు చేరింది. ఈ ఘటనకు బాధ్యులెవ‌రన్న దానిపై 19 నెల‌లుగా సుదీర్ఘ విచార‌ణ సాగింది. విచారణలో భాగంగా.. వివిధ వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించారు. జ‌స్టిస్ సోమ‌యాజులు నేతృత్వంలోని క‌మిష‌న్ పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, బాధితుల వాద‌నలు విన్నది. ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కేసు చివరి దశకు చేరింది. ఈ కేసు విచారణ కోసం నియమించిన.. జ‌స్టిస్ సోమ‌యాజులు కమిషన్‌ పలు మార్లు రాజ‌మండ్రిలో పర్యటించింది. 19 నెలలుగా సుదీర్ఘ విచారణ జరిపి..ప‌లువురి వాద‌న‌లు రికార్డ్ చేసింది. ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆధారాలు సేక‌రించింది.

ఆధారాల్లో అనేక దోషాలు....
కమిషన్‌ సేకరించిన ఆధారాల్లో అనేక దోషాలున్నాయ‌ని...ఈ కేసులో బాధితుల తరపు లాయరు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ త‌న తప్పును కప్పిపుచ్చుకోవ‌డానికి ప్రయత్నిస్తోందని విప‌క్ష నేతలు విరుచుకుపడుతున్నారు. కేసులో సాక్ష్యాధారాల‌ను మాయం చేశారని ఆరోపిస్తున్న సీపీఎం నేత‌లు...విషయాన్ని క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ కెమెరా ఫుటేజ్ లేద‌ని చెప్పడం విడ్డూరంగా ఉంద‌ంటున్నారు.

నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో
అటు బాధితులు కూడా నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో న్యాయం జరగలేదని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ కుటుంబాల‌ను ఆదుకోవాలని కోరుతున్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. 2015 గోదావరి పుష్కరాల్లో తొక్కిస‌లాట‌లో 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుష్కర స్నానం చేసిన స‌మ‌యంలో..భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం..గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లో నిలుచుకున్న భ‌క్తులు ఒక్కసారిగా దూసుకురావ‌డం వల్లే తొక్కిస‌లాట జరిగిందని పలువురు ఆరోపించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ వాద‌న‌ను తోసిపుచ్చింది. పుష్కర ఘాట్లలో భ‌క్తుల కోసం స‌క‌ల ఏర్పాట్లు చేశామ‌ని...స‌మ‌న్వయలోపంతోనే తొక్కిసలాట జ‌రిగింద‌ని చెబుతోంది. ఏదీఏమైనా నిజాల నిగ్గు తేల్చేందుకు నియమించిన జస్టిస్‌ సోమయాజులు కమీషన్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

21:46 - April 13, 2017

ఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈవిఎంల టాంపరింగ్‌పై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వెసులుబాటు ఉందని, ఉత్తరప్రదేశ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మే 8 లోపు సమాధానం చెప్పాలని ఈసీని ఆదేశించింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు పేపర్ బ్యాలెట్ వాడేలా ఆదేశించాలని, ఒకవేళ ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే...బిల్లింగ్ తరహాలో ఓటర్ ఓటు వేసిన అనంతరం రసీదు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని మాయావతి పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

17:34 - April 6, 2017

వరంగల్‌ : జిల్లాలోని భట్టుపల్లి శివారు ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దుండగులు సజీవ దహనం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

19:33 - April 5, 2017

హైదరాబాద్: క‌శ్మీర్‌లో కొంతమంది యువకులు అతిగా ప్రవర్తించారు. క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ క్లబ్‌ టీమ్‌ ఆటగాళ్లు పాకిస్థాన్‌ జెర్సీలు వేసుకోవడమే కాకుండా.. ఆ దేశ జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. శ్రీనగర్‌కు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో కలకలం రేపుతోంది. ఆటగాళ్ల తీరుపై భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వాళ్లంతా ఇంటి నుంచి పారిపోయారని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

17:49 - April 4, 2017

పెద్దపల్లి : ఇచ్చిన అప్పు తిరిగి అడిగిన పాపానికి ఓ మహిళను దారుణంగా కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్యచేశాడో దుర్మార్గుడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన స్రవంతి, సంతోష్‌ దంపతులు రెండేళ్ల క్రితం ఇంటి ఎదురుగా ఉండే రాదాటి శ్రీనివాస్‌ అనే యువకునికి 40 వేల రూపాయల అప్పు ఇచ్చారు. అప్పు విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. స్రవంతి భర్త సంతోష్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ ఆమెతో గొడవపడి కిరోసిన్‌ పోసి నిప్పు అంటించాడు. శ్రీనివాస్‌ పారిపోవడానికి ప్రయత్నించగా.. అతన్ని ఆమె పట్టుకోవడంతో సగం కాలిపోయాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలైన స్రవంతి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - విచారణ