విజయం

07:52 - March 23, 2017

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌..రంగారెడ్డి..హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో జనార్థన్‌రెడ్డికి 9734 ఓట్లు రాగా..తన ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 5095 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డిపై 4,639 ఓట్ల తేడాతో జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు. 

 

16:50 - March 20, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురువేసింది. జరిగిన మూడు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్‌ కంచుకోట కడప జిల్లాలో వైసీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఓడించి.. అక్కడ టీడీపీ పాగా వేసింది. 40 ఏళ్ల వైఎస్‌ రాజకీయ కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేసి.. బీటెక్‌ రవి 33 ఓట్లతో విజయం సాధించారు. కడపలో విజయం కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడే మకాం వేసి వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు. ఇక బీటెక్‌ రవి విజయంతో తెలుగు తమ్ముళ్లు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలంతా స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

62 ఓట్ల మెజారిటీతో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం ....

ఇక కర్నూలులోనూ ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై.. టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి.. 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1084 ఓట్లకు గాను 1077 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 564 ఓట్లు రాగా.. వైసీపీకి 502 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లకుండాపోయాయి. చంద్రబాబు, లోకేశ్‌ ఆశీస్సులతో విజయం సాధించానని.. ప్రజాసమస్యలపై మండలిలో తన గళం విప్పుతానన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.

87 ఓట్ల మెజారిటీతో వాకాటి నారాయణరెడ్డి గెలుపు ...

నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డి.. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలో మొత్తం 851 ఓట్లకు గాను వాకాటి 465 ఓట్లు సాధించారు. ఆనం విజయ్‌కుమార్‌రెడ్డికి 378 ఓట్లు పోలయ్యాయి.

అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థులను గెలిపించారు...

ఇదిలావుంటే.. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థులను గెలిపించారన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. వైఎస్‌ కంచుకోట అయిన కడపలో టీడీపీ అడుగుపెట్టిందని.. భవిష్యత్‌లో పులివెందులలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ విజయాన్ని కొట్టి పారేసిన వైసీపీ ....

అయితే.. వైసీపీ మాత్రం టీడీపీ గెలుపును కొట్టిపారేస్తున్నారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి విజయం సాధించారన్నారు. టీడీపీకి ధైర్యం ఉంటే.. ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని సవాల్‌ విసురుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పాలక పక్షం నేతలు అంటున్నారు.

09:30 - March 12, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపి చరిత్ర సృష్టించింది. త్రిబుల్‌ సెంచరీతో యూపీలో రాజకీయ సునామీని సృష్టించింది. ఓ వైపు మోదీ వాక్‌చాతుర్యం..మరోవైపు అమిత్‌షా రాజకీయ చతురత..ఈ రెండు కలిసి ఉత్తరప్రదేశ్‌ను ఇప్పుడు శాసించబోతున్నాయి. ఇంతటీ ఘనవిజయం సాధించిన యూపీలో... బీజేపీ ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టనుంది..? 
యూపీలో రాజకీయ సంచలనం 
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజేపి ప్రభంజనం సృష్టించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుచుకొని విపక్షాలకు దడపుట్టించింది. ఎగ్జిట్‌పోల్స్‌, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు సైతం అందకుండా బిజేపి సాధించిన ఈ ఘన విజయం అందరి దృష్టినీ ఆకర్షించింది. 
యూపీ సీఎం రేసులో ఐదుగురు 
త్రిబుల్‌ సెంచరీతో యూపీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపి..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీని ఎవరు అధిష్టింపబోతున్నారనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. సీఎం రేసులో ప్రధానంగా ఐదుగురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌, బీజేపి యూపీ అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, ఘాజీపూర్‌ ఎంపీ మనోజ్‌ సిన్హా, బీజేపి  ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతిధిగా ఉన్న శ్రీకాంత్‌ శర్మల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే, ఇప్పటివరకు కేంద్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ యూపీ సీఎం బరిలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ యూపీ సీఎంగా చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశం. రాజ్‌నాథ్‌తో పాటు..గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ రేసులో ఉన్నారు. ఇక పార్టీ బలోపేతం నుంచి ప్రచార కార్యక్రమాలన్ని చూసుకున్న బీజేపి యూపీ అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు కూడా అవకాశాలు లేకపోలేదు. వీరితో పాటు రాష్ట్ర బీజేపీలో గట్టిపట్టున్న ఘాజీపూర్‌ ఎంపీ మనోజ్‌ సిన్హా, పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతిధిగా ఉన్న శ్రీకాంత్‌ శర్మల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

15:30 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రచ్చ రచ్చ చోటు చేసుకుంది. డీఎంకే ఎమ్మెల్యేల విధ్వంసంతో అసెంబ్లీ రణరంగమై పోయింది. కుర్చీలు..బళ్లాలను విరిచివేశారు. స్పీకర్ ధన్ పాల్ పై పేపర్లు చించివేశారు. దీనితో సభను రెండుసార్లు వాయిదా వేశారు. జరిగిన తీరుపై డీఎంకే సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ చెలరేగింది. స్పీకర్ తీరును నిరసిస్తూ అసెంబ్లీలోనే డీఎంకే సభ్యులు బైఠాయించారు. రంగంలోకి దిగిన మార్షల్స్ సభ్యులను బయటకు పంపించారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. దీనిపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరిగిన చొక్కాతో స్టాలిన్ బయటకు రావడం కలకలం రేగింది. అక్కడున్న వారికి అభివాదం చేస్తూ మీడియాతో మాట్లాడారు.

స్టాలిన్ ఆగ్రహం..
స్పీకర్ సభా మర్యాదలను పాటించలేదని విమర్శించారు. రహస్య ఓటింగ్ జరగకుండా సభను నడపాలని స్పీకర్ ప్రయత్నించారని, స్పీకర్ తన చొక్కా తానే చించుకున్నారని ఆరోపించారు. తనపట్ల మార్షల్స్ ఘోరంగా ప్రవర్తించారని, కొట్టి..తిట్టి..బలవంతంగా బయటకు లాక్కెళ్లారని తెలిపారు. తమను లోపల బంధించి చేయి కూడా చేసుకున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు కొంతమంది గాయపడ్డారని, అసెంబ్లీలో తనను కూడా కొట్టారని తెలిపారు. దీనికి నిరసనగా గవర్నర్ ను కలుస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.

సభ ప్రారంభం..పళని విజయం..
డీఎంకే సస్పెండ్ అనంతరం సభను స్పీకర్ ధన్ పాల్ ప్రారంభించారు. సభ ప్రారంభం అయిన తరువాత జరిగిన పరిణామాలు, స్పీకర్ చర్యలను నిరసిస్తూ 8మంది సభ్యులున్న కాంగ్రెస్ సభ్యులు, ముస్లీం లీగ్ సభ్యుడు వాకౌట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో తామే నెగ్గామని పళనిసెల్వం వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు. ఏకంగా స్వీట్లు కూడా పంచేశారు. సభలో బయట అలాంటి పరిస్థితి నెలకొనగా సభ లోపల స్పీకర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఆరు డివిజన్ లుగా ఓటింగ్ నిర్వహించారు. చివరకు పళనిస్వామికి అనుకూలంగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు పడ్డాయి. దీనితో పళని స్వామి విజయం సాధించినట్లు స్పీకర్ వెల్లడించారు. పళని విజయం సాధించడంతో శశికళ వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం తెరపడినట్లేనని భావిస్తున్నారు.

15:20 - February 13, 2017

అశ్విన్ ఆఫ్ స్పిన్ లోతో అదరగొట్టిన వేళ..ఉప్పల్ లో భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీ సారథ్యంలో వరుస విజయాలతో పరుగులెడుతోంది. వరుసగా ఆరో సిరీస్ విజయంతో భారత్ రికార్డు సృష్టించింది. శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండీస్ పై 2-0, న్యూజిలాండ్ పై 3-0, ఇంగ్లండ్ పై 4-0 తేడాతో భారత్ సిరీస్ లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ వేదికగా బంగ్లాదేవ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో సైతం భారత్ తన దూకుడును ప్రదర్శించింది. వరుసగా ఆరో టెస్టు సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ కోహ్లీ వరుసగా నాలుగో సిరీస్ లో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.
బంగ్లాదేశ్ పై 208 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 459 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. కేవలం 250 పరుగులకే బంగ్లా క్రీడాకారులు పెవిలియన్ బాట పట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 687/6, రెండో ఇన్నింగ్స్ లో 159/4 చేయగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 338, రెండో ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జడేజా, అశ్విన్ లకు తలో నాలుగు వికెట్లు, ఇషాంత్ కు రెండు వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటింగ్ లో మహ్మదుల్లా 64, సర్కార్ 42, హక్ 27, రహీం 23 పరుగులు చేశారు.

21:30 - February 12, 2017

బ‌ంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులోనూ విజయానికి 7 వికెట్ల దూరంలో టీమిండియా ఉంది. ప్రత్యర్థి ముందు 459 ప‌రుగులు భారీ టార్గెట్ ఉంచిన కోహ్లి సేన‌.. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్లు తీసింది. మ‌రో రోజు ఆట మిగిలి ఉండ‌గా.. విజ‌యానికి ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. నాలుగో రోజు 3 వికెట్‌కు 103 ప‌రుగులు చేసిన బంగ్లాదేశ్‌.. ఇంకా 356 ప‌రుగులు వెనుక‌బ‌డే ఉంది. స్పిన్‌కు స‌హ‌క‌రిస్తున్న పిచ్‌పై కూడా బంగ్లా బ్యాట్స్‌మెన్ పోరాడుతున్నారు. భార‌త బౌల‌ర్లలో అశ్విన్ 2, జ‌డేజా ఒక వికెట్ తీసుకున్నారు. ఆట ముగిసే స‌మ‌యానికి ష‌కీబ్ 21, మ‌హ్మదుల్లా 9 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. అయితే భారత స్పిన్నర్లు జోరు మీదుండ‌టంతో... చివ‌రి రోజు.. మొత్తం వికెట్లు పడకుండా.. ఓటమిని తప్పించుకోవడం బంగ్లాకు కష్టమైన పనే అంటున్నారు క్రికెట్ నిపుణులు.

 

10:28 - February 9, 2017

హైదరాబాద్ : మీడియా  ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో 10టీవీ సత్తా చాటింది. 10టీవీ వర్సెస్‌ స్నేహ టీవీ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో 10టీవీ ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న 10టీవీ... నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు సాధించింది.  177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్నేహటీవీ ఆరంభం నుంచే తడబడింది.  10టీవీ బౌలర్లు చెలరేగడంతో... వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. 107 పరుగులకే స్నేహ టీవీ జట్టు ఆలౌట్‌ అయ్యింది. దీంతో  69 రన్స్‌ తేడాతో 10టీవీ భారీ విజయాన్ని నమోదు చేసింది.  10టీవీ జట్టు గెలుపులో కెప్టెన్‌ శ్రీనివాస్‌ కీరోల్‌ పోషించారు. 4 వికెట్లు తీసిన  శ్రీనివాస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆరు భారీ సిక్సర్లతో చెలరేగిన రోహిత్‌కు మ్యాక్సిమమ్‌ సిక్స్‌ అవార్డు లభించింది. ఈనెల 11న న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ టీమ్‌తో 10టీవీ తలపడనుంది.

16:33 - January 28, 2017

హైదరాబాద్: గ్రాండ్‌స్లామ్ ఓపెన్ శ‌కంలో సెరెనా విలియ‌మ్స్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయ‌ర్‌గా నిలిచింది. ఇవాళ జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన సెరెనా టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఓపెన్ ఎరాలో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ ప్లేయ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఫైన‌ల్లో రెండవ సీడ్ సెరెనా 6-4, 6-4 స్కోర్‌తో 13వ సీడ్ వీన‌స్‌పై అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఓపెన్ శకంలో 22 టైటిళ్లు సాధించిన స్టెఫీ గ్రాఫ్ రికార్డును బ్రేక్ చేసింది సెరెనా. మ‌హిళ‌ల సింగిల్స్ చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మార్గరేట్ కోర్ట్ 24 టైటిళ్లు గెలిచి టాప్‌లో ఉంది. కానీ ఆమె అమెచ్యూర్‌, ప్రొఫెష‌న్ శ‌కాల‌కు క‌లిపి ఆ రికార్డును న‌మోదు చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ను సెరీనా గెలవడం ఇది ఏడో సారి.

20:04 - January 22, 2017

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఖమ్మం, సిద్ధిపేట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సిద్ధిపేట్ విజయం  సాధించింది. 11 పాయింట్స్ తేడాతో ఖమ్మం పై సిద్ధిపేట్ గెలుపొందింది. ఖమ్మం 20 పాయింట్లు, సిద్ధిపేట్ 31 పాయిట్లు సాధించింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి.

21:12 - January 21, 2017

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. హన్మకొండలోని జవహర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. నల్గొండ, వరంగల్ జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు నల్గొండ పై వరంగల్ విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - విజయం