విజయవాడ

19:25 - June 23, 2017
11:26 - June 22, 2017

విజయవాడ : ఏపీకే కీలకంగా మారిన బెజవాడలో భద్రతను పెంచి ... క్రైం రేట్‌ను తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ... నేరాలను అరికడుతున్నారు. ఈ ప్రక్రియలో పోలీసుల దర్యాప్తుకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగానే పోలీసులు సుమారు వెయ్యికిపైగా కేసులను పరిష్కరించగలిగారు.

సీసీ కెమెరాల కీలకం...
సీసీ కెమెరాల దృశ్యాలను ఆధారంగా చేసుకుని ఖాకీలు తమదైన శైలిలో సఫలీకృతులవుతున్నారు. గతేడాది నగరంలో సంచలనం సృష్టించిన ఎన్నో కేసులు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగానే పరిష్కరించారు. కానిస్టేబుల్ అయూబ్ మృతి కేసు.. బీఆర్టీఎస్ రోడ్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం కేసు... నాలుగు నెలల క్రితం కంకిపాడులో ఓ వివాహిత హత్య కేసు.. ఇలా నగరంలో సంచలనం కలిగించిన పలు కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదించారు. అలాగే వీఐపీల పర్యటనలు, బందోబస్తు, ఆందోళనలు, ట్రాఫిక్ సమస్యలు, అల్లర్లు ఇలా ప్రతి అంశాన్నీ సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాహనాలతో ఢీ కొట్టి పరారవుతున్న వ్యక్తులను, చోరులను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగానే చెక్‌ పెడుతున్నారు.కాగా నేరాలను అరికట్టేందుకు అన్నిరకాలుగా కృషి చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.

అత్యంత జాగ్రత్తగా
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వివిఐపీల పర్యటనలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వివిఐపీల పర్యటనల్లో ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పనిలోనూ వారు అత్యధికంగా సీసీ టీవీ ఫుటేజీపైనే ఆధారపడుతున్నారు. ఇంటెలిజెన్స్, విజయవాడ, గుంటూరు పోలీసులు సీసీ కెమెరాల డేగ కన్నుతో వివిఐపీల రూట్‌మ్యాప్‌ను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రమంత్రులు, సీఎం, రాష్ట్రమంత్రులు, వీవీఐపీలు తరచూ పర్యటిస్తుండడంతో వీటిని సైతం కెమెరాల్లో నమోదయ్యేలా ఎటాచ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. పోలీసుల వ్యవహారాల్లోనూ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నగరంలో దొంగతనాలు... దోపిడీలు.. హత్యలు.. తగ్గించేందుకు.. పోలీసులు సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు.

 

 

13:11 - June 21, 2017

విజయవాడ : చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్..డీఈవో కార్యాలయాల ముట్టడితో ఆయా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. బదిలీలు ఆపాలంటూ ఆందోళన చేశారు. బదిలీల షెడ్యూల్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనాలోచితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయలపై లాఠీఛార్జీ చేయడం పట్ల వారు తీవ్రంగా గర్హించారు. పాఠశాలలను తెరిచిన అనంతరం కూడా బదిలీలు చేస్తున్నారని, రాజకీయ పైరవీలతో బదిలీలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అంతేగాకుండా ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం..6వేల పాఠశాలలను ఏకోపాధ్యాయగా నిర్ణయించడంపై వారు గుర్రుగా ఉన్నారు. మరి వీరి ఆందోళనతో ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

 

18:58 - June 20, 2017

విజయవాడ: ఆటో కార్మికులకు బ్యాంక్‌ రుణాలు ఇప్పించాలని కోరుతూ సిఐటియు ఆటోవర్కర్లు ధర్నా నిర్వహించారు. విజయవాడ లోని ఇండియన్‌ బ్యాంక్‌ కార్యాలయం ఎదుట కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ బాబురావు ధర్నా చేస్తున్న ఆటో కార్మికులకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు రుణాలు అందజేస్తామని .. అధికారంలోకి వచ్చాక కనీసం సమస్యలు కూడా పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోని అమలు చేయాలని .. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో కార్మిక సంఘాలతో కలిసి బ్యాంకుల కార్యకలాపాలను స్తంభింప చేస్తామని బాబురావు హెచ్చరించారు.

13:01 - June 20, 2017

విజయవాడ : కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ జూలై 26న కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేపడుతున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తన వెనక జగన్‌, మోదీ ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఆగస్టులో హామీలు నెరవేరుస్తానన్న చంద్రబాబు.. ఇంతవరకు తన మాట నిలుపుకోలేదన్నారు. 

11:46 - June 20, 2017

విజయవాడ : విజయవాడ, సత్యనారాయణ పురం శిశు విద్యామందిర్‌ పాఠశాల సమీపంలో.. విషాదం చోటు చేసుకుంది. హర్ష అనే బాలుడు .. ఉదయాన్నే పాల ప్యాకెట్‌ కోసం వెళ్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. చెట్టు కొమ్మ ఉన్నట్లుండి విరిగిపడి.. బాలుడి గొంతులో దిగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హర్ష 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనలో మృతి చెందిన హర్ష కుటుంబాన్ని ఆదుకుంటామని.. 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ గందురీ మహేశ్‌ తెలిపారు. 

13:40 - June 19, 2017

విజయవాడ : భవిష్యత్‌లో పేద ప్రజలకు నాణత్యతో కూడిన విలువైన ఇళ్లు ఇవ్వడమే తన అభిమతమన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో ప్రధాని ఆవాస్‌ యోజన ఎన్టీఆర్‌ నగర్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఒకే రోజు ఏపీలో లక్షా 20 వేల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పేరుతో 4 వేల కోట్లను బొక్కేశారని ఆరోపించారు. లక్షా 58 వేల ఇళ్ల నిర్మించాలంటే 9480 కోట్లు, మౌలిక సదుపాయాలకు సుమారు 1100 కోట్ల ఖర్చవుతుందన్నారు. 

15:11 - June 18, 2017

ఇంగ్లండ్ : భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య పోరు తెరలేంచింది. కాసేపటి క్రితం ఓవల్ లో అంపైర్లు టాస్ వేశారు. టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. స్వల్ప స్కోరుకు పాక్ ను కట్టడి చేయాలని భారత్ యోచిస్తోంది. ఇక భారత్ ను ఎలాగైనా ఓడించాలని పాక్ తహతహలాడుతోంది. కానీ పాక్ జట్టుపై భారత్ ఎలాగైనా గెలుస్తుందని క్రీడాభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. కోహ్లీ..యువరాజ్ సింగ్ మెరుపులు మెరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. విజయవాడలో నెలకొన్న సందడి..తదితర వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:15 - June 18, 2017

విజయవాడ : కృష్ణలంక రణదివే నగర్ లో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ వ్యక్తి తన భోజనంలో విషం కలిపి భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను సేవించాడు. భార్య, భర్త, కొడుకు మృతి చెందారు. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి వషమంగా ఉంది. బాలికలకు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న కొడుకు పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరిపిన భార్యభర్తలు నేడు ఆత్మహత్యలు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గరు చనిపోవడంతో కృష్ణలంకలో విషాదం నెలకొంది.  

10:42 - June 18, 2017

విజయవాడ : నికేధన్‌ ఆశ్రమంలో ఇద్దరు బాలికల మిస్సింగ్‌ ఘటనపై కలెక్టర్‌ లక్ష్మీకాంతం సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు ఆశ్రమాన్ని సీజ్‌ చేశారు. ఆశ్రమంలోని 16 మంది బాలికలను సీడబ్ల్యూ అధికారులకు అప్పగించారు. బాలికలు అదృశ్యానికి ఆశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమని చెల్డ్‌వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కృష్ణకుమారి అన్నారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - విజయవాడ