విడుదల

18:29 - June 16, 2018

తమిళనాడు : రాష్ట్రానికి కావేరీ జలాలను వదలాలని నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. మైసూర్‌లోని కాబినీ డ్యామ్‌ నుంచి తమిళనాడుకు 20 వేల క్యూసెక్కుల నీటిని త్వరలోనే విడుదల చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో డ్యామ్‌లలో ఇన్‌ఫ్లో బాగా పెరిగిందని సిఎం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్‌ చివరి నాటికి తమిళనాడుకు 10 టిఎంసిల నీటిని విడుదల చేస్తామన్నారు. ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని కుమారస్వామి తెలిపారు. కుమారస్వామి నిర్ణయాన్ని 'మక్కల్‌ నీది మయ్యం' పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హసన్‌ స్వాగతించారు. స్నేహపూర్వక సంబంధాల ద్వారానే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయని కమల్ ట్వీట్ చేశారు. కావేరీ జలాల విషయంలో కమల్‌హసన్‌ ఇటీవల కుమారస్వామితో భేటి అయిన విషయం తెలిసిందే. 

18:17 - June 8, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ళ టీడీపీ పాలనపై వైసీపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. చంద్రబాబు హామీలపై వీడియోను కూడా విడుదల చేశారు. నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా ఉందని సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ర్టంలోని అన్ని వ్యవస్థలనూ సీఎం భ్రష్టు పట్టించారంటూ టీడీపీపై తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

18:22 - May 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం, పోలీసు శాఖ శుభవార్తను ప్రకటించింది. భారీగా పోలీసు నియామకాలకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారీ స్థాయిలో పోలీస్ నియామకాలను ప్రభుత్వం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ నాలుగు నోటిఫికేషన్స్ ను విడుదల చేసింది. మొత్తం 18,428 పోలీస్ పోస్ట్ లకు నోటిఫికేషన్ ను జారీచేసింది. 739 ఎస్ఐ పోస్టులు, 16727 కానిస్టేబుల్, ఏఎస్ ఐలు 26, ఫైర్ విభాగంలో 168, వార్డెన్స్ 221, ఆర్ఎస్ ఐలు 471, డిప్యూటీ జైలర్స్ 15, స్టేషన్ ఆఫీసర్స్ 19 వంటి పలు విభాగాలలో మొత్తం 18,428 పోలీస్ పోస్ట్ లకు పోలీస్ శాఖ నోటిఫికేషన్ ను జారీచేసింది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి వివరాలను పోలీస్ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

07:47 - May 30, 2018

ఢిల్లీ : సిబిఎస్‌ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఈ సంవత్సరం 86.7 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నలుగురు విద్యార్థులు టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. గురుగావ్‌కు చెందిన డిపిఎస్‌ విద్యార్థి ప్రఖర్‌ మిత్తల్...బిజ్నోర్‌ ఆర్‌ కె పబ్లిక్‌ స్కూలు విద్యార్థి రిమ్‌జిమ్‌ అగర్వాల్... షామ్లి స్కాటిష్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి నందిని గార్గ్‌... కొచ్చిన్‌ భవన్‌ విద్యాలయానికి చెందిన జి.శ్రీలక్ష్మి టాపర్లుగా నిలిచారు. వీరు మొత్తం 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలదే ఉత్తీర్ణతా శాతం అధికంగా ఉంది. 88.67 శాతం అమ్మాయిలు, 85.32 శాతం అబ్బాయిలు పాసయ్యారు. 99.60 శాతం ఉత్తీర్ణతతో తిరువనంతపురం టాప్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నయ్‌ 97.37 శాతం అజ్మేర్ 91.86 శాతంతో నిలిచాయి. మొత్త 16 లక్షల 38 వేల 428 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు.

 

18:39 - May 26, 2018

ఢిల్లీ : సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. 12 వ తరగతి పరీక్షలో 83.01 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే సత్తా చాటారు. నోయిడాకు చెందిన మేఘనా శ్రీవాత్సవ టాపర్‌గా నిలిచారు. మొత్తం 500 మార్కులకు గాను మేఘనకు 499 మార్కులు వచ్చాయి. ఎకనామిక్స్‌, భూగోళశాస్త్రం, సైకాలజీ, చరిత్రలో మేఘన వందకు వంద మార్కులు సాధించింది. ఇంగ్లీష్‌లో 99 మార్కులు వచ్చాయి. ఈ ఘనత తన కృషితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకే దక్కుతుందని మేఘన చెప్పింది. తనకు సైకాలజీ చదవాలని ఉందని, యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియాలో చదవాలనుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో సామాజిక సేవ చేయాలని ఉందని పేర్కొంది.

 

13:43 - May 12, 2018

విజయవాడ : ఏపీ ఐసెట్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఎమ్‌బీఏ, ఎమ్‌సీఏలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలో 52 వేల 216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 48వేల 635 పరీక్ష రాశారు. ఇందులో మొత్తం 4వేల 537 విద్యార్థులు అర్హత సాధించారు. 92.60 శాతంతో గతేడాది కంటే ఈ సంవత్సరం 6.0 శాతం ఎక్కువ ఉత్తీర్ణత  శాతం నమోదైనట్లు మంత్రి గంటా తెలిపారు. అనుకున్న సమయానికి రికార్డు స్థాయిలో ఫలితాలు విడుదల చేశామన్నారు. 

 

13:14 - May 4, 2018

విజయవాడ : కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులలో ప్రవేశానికై నిర్వహించిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వర్సిటీ ఉపాధ్యక్షుడు రాజా హరీన్‌ అభినందనలు తెలిపారు. ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 1 నుండి 20 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 100 శాతం స్కాలర్‌షిప్‌లతో పాటు నగదు బహుమతి అందిస్తామన్నారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికై  మే 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. 

 

13:48 - May 3, 2018

గుంటూరు : ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. మొత్తం 7,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 7,430 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలో 39 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 

 

13:49 - May 2, 2018

విశాఖ : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఎంసెట్ లో 78.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో 1,90,022 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,38, 017 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌ లో 73, 373 మంది పరీక్షకు హాజరు కాగా 63,800 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 131 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ జరిగిందని మంత్రి గంటా తెలిపారు. జూన్ 11 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈనెల 26 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్..బోగి సూరజ్ కృష్ణ ( 95.27) శాతం, సెకండ్ ర్యాంక్..గట్టు మైత్రేయ( 94.93 శాతం), థర్డ్ ర్యాంక్..పి.లోకేశ్వర్ రెడ్డి (94.22 శాతం), ఫోర్త్ ర్యాంక్..జివి.నాయక్ శ్రీవర్ధన్ (94.20శాతం ), ఐదో ర్యాంక్..షేక్ వాజిద్ ( 93.78 శాతం), ఆరో ర్యాంక్...బసవరాజు జిష్ణు (93.51 శాతం), ఏడో ర్యాంక్ అయ్యపు వెంకటం, ఎనిమిదో ర్యాంక్ కేవీఆర్ హేమంత్ కుమార్ (92.71 శాతం), తొమ్మిదో ర్యాంక్ యజ్ఞేశ్వర్ (92.67 శాతం), పదో ర్యాంక్ విష్ణు మనోజ్ఞ(92.56శాతం). 
 

18:05 - April 29, 2018

విశాఖ : గీతం యూనివర్శటీ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష గ్యాట్‌ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్‌ ఎమ్‌.ఎస్‌ ప్రసాదరావు విడుదల చేశారు. మే 16 నుంచి మూడు రాష్ట్రాల్లోని క్యాంపస్‌లలో అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ జరగనుందని తెలిపారు. హైదరాబాద్‌ గీతం క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా బిఆర్క్‌ కోర్సు ప్రారంభిస్తున్నామని, విశాఖ క్యాంపస్‌లో ఎమ్‌ఆర్క్‌ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొదటి పది ర్యాంకర్లకు ఫీజులో పూర్తి రాయితీ.. తరువాతి 90 ర్యాంకర్లకు 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దేశంలో 11 యూనివర్శటీలకు మాత్రమే ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా ఇప్పుడు గీతంకు రావడం గర్వకారణమని తెలిపారు. దీని ద్వారా సొంత కోర్సుల నిర్వహణ, ఫారెన్‌ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో వెసులుబాటు కలుగుతుందని ఎమ్‌.ఎస్ ప్రసాదరావు అన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - విడుదల