విద్యార్థులు

19:21 - September 18, 2018

శ్రీకాకుళం : ఈ వాహనానికి పెట్రోల్‌ అవసరం లేదు. వాయుకాలుష్యం సమస్యే ఉత్పన్నంకాదు. జీపీఎస్‌ విధానంతో ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు.  తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. శ్రీకాకుళం జిల్లా కుర్రాళ్లు రూపొందించారు. 

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చూపారు. తక్కువ పెట్టుబడితో వినూత్న బైక్‌ను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగచేయని ఈ నానోబైక్‌ ఇప్పుడు సిక్కోలు రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఈ నానో బైక్‌ తయారీకి ఖర్చు అయ్యింది కేవలం 13 వేల రూపాయలు మాత్రమే. ఇది పూర్తిగా బ్యాటరీ ద్వారా నడుస్తోంది. ఎలాంటి ఇంధనం దీనికి అవసరం లేకుండా విద్యార్థులు తీర్చిదిద్దారు.

నానోబైక్‌ బ్యాటరీని మూడు గంటలపాటు చార్జింగ్‌ చేస్తే... 60కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.  ఇది వంద కేజీల బరువును మోయగలదు.  గరిష్టంగా 40 కిలోమీటర్ల స్పీడ్‌తో నడువగలదు. నెలరోజుల్లో ఈ బైక్‌ను తయారు చేసినట్టు ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెబుతున్నారు. తమకు మరింత ప్రోత్సాహం అందిస్తే.. ఇలాంటి బైక్‌లు ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటున్నారు.

శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నా నిఖిల్ నేతృత్వంలోని విద్యార్థుల బృందం తయారుచేసిన నానో బైక్ ను క్రాంతి అనే లెక్చలర్ పర్యవేక్షణ లో రూపొందించబడింది. ఈ బైక్‌ అందరి ప్రశంసలు  అందుకుంటోంది. వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న ఈ రోజుల్లో కేవలం పదమూడు వేల రూపాయలతోనే ఎన్నో సౌకర్యాలు కలిగిన ఈ నానో బైక్ అందుబాటులోకి రావడం నిజంగా అభినందనీయమే. విద్యార్థుల కృషికి అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

14:17 - August 24, 2018

రంగారెడ్డి : జిల్లాలోని గండిపేట సీబీఐటీ కాలేజ్‌ ముందు విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన ఆందోళన నాలుగవరోజుకు చేరుకుంది. కాలేజీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏ కేటగిరీ విద్యార్థులకు మాత్రమే ఫీజులు తగ్గించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.   విద్యార్థులను మేనేజ్‌మెంట్‌ బెదిరిస్తోందని ఆరోపిస్తున్నారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్ధతు తెలిపాయి. మీడియాను కాలేజీ యాజమాన్యం లోనికి అనుమతించలేదు. అంతేకాకుండా ఓ విద్యార్థినిపై కాలేజీ యాజమాన్యం చేయి చేసుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

08:26 - August 24, 2018

హైదరాబాద్ : సీబీఐటీ కాలేజీలో విద్యార్థులు కదం తొక్కారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా కాలేజీ ఆవరణలో నిరసనకు దిగారు. మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కాలేజీ యాజమాన్యం.. తమపై భౌతిక దాడులకు దిగడంతో విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. 
రూ.86 వేలు అదనంగా చెల్లించాలన్న యాజమాన్యం
హైదరాబాద్‌లోని సీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్‌లో ఎ, బి కేటగిరి విద్యార్థులను టీఎఫ్ ఆర్సీ నిర్ణయించిన ఫీజుల కంటె ఒక్కో విద్యార్థి 86 వేల రూపాయలు అదనంగా చెల్లించాలంటూ యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజు కట్టేది లేదని స్పష్టం చేయడంతో ఈ నెల 31 వరకు యాజమాన్యం గడువు విధించింది. ఆ లోపు ఫీజు కట్టకపోతే పరీక్షలకు అనుమతి లేదని తెగేసి చెప్పింది. యాజమాన్యం నిర్ణయంతో విద్యార్థులు క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 
విద్యార్థులపై చేయి చేసుకున్న ప్రిన్సిపాల్‌ 
ఉదయం నుండి క్లాసులు బాయ్‌కాట్‌ చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపాల్‌ చేయి చేసుకోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన ఉధృతం చేశారు. కోర్టులో ఫీజులు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారని అందుకే కాలేజీ యాజమాన్యం ఫీజులు పెంచిందని పోలీసులు అంటున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీని పోలీసు అకాడమీగా మార్చేస్తున్నారని.. న్యాయం అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. 
ఆందోళన చేస్తున్న విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారు : విద్యార్థులు
ఫీజుల భారం మోయలేమంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను టార్గెట్‌ చేసి డిటైన్‌ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మీడియాతో మాట్లాడినా కాలేజీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడలేదన్న పోలీసులు  
విద్యార్థులపై ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడలేదని... కేవలం డిటైన్‌ అయిన విద్యార్థులే కావాలని ఆందోళన చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. 
ఫీజుల పెంపు తగ్గించే వరకు ఆందోళన
ఫీజుల పెంపు తగ్గించే వరకు ఆందోళన ఆపేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెంచిన ఫీజు కట్టేదిలేదని...పాత ఫీజులనే కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

13:40 - August 23, 2018

హైదరాబాద్ : సీబీఐటీ కాలేజ్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పెంచిన ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు సీబీఐటీ ముందు ధర్నాకు దిగారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఒక్క సంవత్సరానికి ఒక్కో విద్యార్థి అదనంగా 86 వేలకు పైగా చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే నాలుగు సంవత్సరాలకు గానూ 4 లక్షల వరకు డబ్బులు కట్టాల్సివస్తుందని.. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని విద్యార్థులు అంటున్నారు. ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపల్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రిన్సిపాల్‌ విద్యార్థుల చొక్కాలు చించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాలేజీ యాజమాన్యం మీడియాను అడ్డుకుంది. 

13:02 - August 22, 2018

గుంటూరు : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనితో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభింస్తోంది. నదుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ పలువురు విద్యార్థులు ఈతకని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన తాడేపల్లి తాడేపల్లి మండలం చినరావూరులో చోటు చేసుకుంది....వివరాల్లోకి వెళితే....బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు రావడంతో చిర్రావురు గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ఈతకని కృష్ణానదికి వెళ్లారు. అందులో వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్లినట్లు సమాచారం. అందులో ముగ్గురిని స్థానికులు కాపాడారు. దీనితో సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికైనా విద్యార్థులు నదుల్లోకి వెళ్లవద్దని..పలువురు సూచిస్తున్నారు....

 

18:18 - August 18, 2018

ఢిల్లీ : వరదలతో అస్తవ్యస్తమైన కేరళను ఆదుకోవాలంటూ ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన చేపట్టారు. అనంతరం హోంశాఖ కార్యాలయానికి వెళ్తుండగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:16 - August 16, 2018

సిరిసిల్ల : తాగునీటి వసతి కల్పించాలంటూ ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నిరసన తెలిపారు. స్కూల్‌లో నీటి వసతిలేక ఇంటి వద్ద నుండి నీళ్లు తీసుకెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్ధితి కొనసాగుతుందని, నీటి వసతిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చలనం లేదంటున్నారు. ఇప్పటికైనా, అధికారులు స్పందించి తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

13:43 - August 11, 2018

హైదరాబాద్‌ : మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో ప్రవేశ పరీక్ష పేపర్‌ లీక్‌ అయిందని వీసీ చాంబర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం కావడంతో ప్రవేశ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ అవడంతో విద్యార్థులు నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ డౌన్‌ డౌన్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. వీసీ చాంబర్‌ వద్దకు ఒక్కసారిగా విద్యార్థులు దూసుకురావడంతో విద్యార్థుల మధ్య తోపులాట జరిగి కొందరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

11:12 - August 3, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలో ఇద్దరు విద్యార్థులను బలిగొన్న స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. గురువారం న్యూ సెంచరీ స్కూల్ గోడ కూలడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఐదుగురు విద్యార్థులకు గాయాలైన సంగతి తెలిసిందే. దీనితో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

మరోవైపు స్కూల్ ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్, అధికారులు ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ను సీజ్ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ ను సీజ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని, విద్యార్థులను వేరే పాఠశాలలో చేర్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి వైద్యు ఖర్చులు ప్రభుత్వం భరించే విధంగా చూస్తామని జేసీ వెల్లడించారు. 

21:53 - August 2, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ కుమారుడు ధర్మపురి సంజయ్‌.. నర్సింగ్‌ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని నాయినికి ఫిర్యాదు చేశారు. ఆయనపై, కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీడబ్ల్యూడీ నాయకురాలు సంధ్య నేతృత్వంలో తల్లిదండ్రులు హోం మంత్రిని కలిశారు. ఈ మేరకు డీజీపీతో ఫోన్లో మాట్లాడిన నాయిని పోలీస్‌ కమిషనర్‌తో విచారణ జరిపించాలని ఆదేశించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - విద్యార్థులు