విభజన హామీలు

09:23 - April 11, 2018

విజయవాడ / ఢిల్లీ : ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా చేస్తున్న దీక్షలతో నేతల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్షలు కొనసాగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఎంపీల దీక్షలకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గాల్లో నిరసనలు..ఆందోళలు చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం రహదారుల నిర్భందం చేసిన వైసీపీ బుధవారం రైల్ రోకో నిర్వహిస్తోంది. విజయవాడలోని ప్రధాన రైల్వే స్టేషన్ కు చేరుకున్న వైసీపీ నేతలు రైల్ రోకో నిర్వహించడానికి యత్నిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో నేతలు రైల్ రోకోలు నిర్వహించడానికి సన్నద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

21:13 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ మండలస్థాయి వరకూ.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు కూడా.. అసెంబ్లీ వరకూ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి తన నిరసనను తెలియపరిచారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ.. ర్యాలీల్లో పాల్గొన్న నేతలు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంపై... కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ.. ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతోన్న తెలుగు దేశం శ్రేణులు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించాక, సచివాలయం వరకూ సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యే హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు నాయుడు సైకిల్‌ ర్యాలీ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు.

తెలుగువారితో పెట్టుకున్న వారికి కాంగ్రెస్‌కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం శ్రేణులు సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. అనంతపురం నగర మేయర్‌ స్వరూప, పాతవూరులోని గాంధీ విగ్రహాన్ని అభిషేకించి, పళ్లెంతో డప్పు కొడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదే జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రత్యేక హోదా హామీ అమలు కోరుతూ.. తెలుగుదేశం, వైసీపీ నాయకులు విడివిడిగా బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. కడప జిల్లాలో టీడీపీ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. పులివెందులలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఢిల్లీలోఅన్ని పక్షాల మద్దతు కూడగడుతున్న తమ అధినేతను, జగన్మోహన్‌రెడ్డి విమర్శించడంపై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రొద్దుటూరులో టీడీపీ ఇంఛార్జి వరదరాజులు రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీలు పాల్గొన్నాయి. హోదా కోసం ఎంతగానో శ్రమిస్తున్న చంద్రబాబును కేంద్రం వేధిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలోని ప్రధాన రహదారుల్లో టీడీపీ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో పెద్దాపురం నుంచి సామర్లకోట వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించారు.

రాజమండ్రి నగరంలో తెలుగుదేశం నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు, ఇతర నాయకులు బైక్‌ ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ శ్రేణులు బౌక్‌ ర్యాలీ నిర్వహించి, స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. కేంద్రం వైఖరికి నిరసనగా అంబేడ్కర్‌ సెంటర్‌లో అర్ధనగ్నంగా బైఠాయించారు. అనంతరం అదే సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులు భారీ బైక్‌ ర్యాలీ తీశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడే, ఆర్టీసీ బస్సులను శుభ్రం చేయడం ద్వారా వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం నాయకులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎక్కడికక్కడ.. బీజేపీ వైఖరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 

07:03 - April 4, 2018

విజయవాడ : వైసీపీ పన్నిన రాజకీయ ఉచ్చులోపడి టీడీపీ విలవిల్లాడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామా నుంచి ఎన్డీయే నుంచి వైదొలగడం, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం వరకు వైసీపీ అజెండా నిర్దేశించిందన్నారు. ఈ విషయంలో వైసీపీ విజయం సాధించిందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో టీడీపీ మరింత బలహీన పడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు జాతీయ పార్టీ నేతలు ఆయన్ను కలుసుకోడానికి క్యూ కట్టేవారన్నారు. ఇప్పుడు చిన్నా చితక నేతలును కలిసి చంద్రబాబు.. తన స్థాయిని దిగజార్జుకున్నారని చెప్పారు.

 

12:38 - April 1, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈసారి కేంద్ర పెద్దలతో కాకుండా ఇతర విపక్ష నేతలతో ఆయన భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఆయన పలువురు జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. తొలుతో 2, 3 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి 3,4 తేదీల్లో పర్యటన ఖరారైంది. విభజన హామీలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం..తదితర విషయాలను జాతీయ పార్టీల నేతలకు బాబు వివరించి మద్దతు తెలియచేయాలని కోరనున్నారు. కానీ ఢిల్లీలో బాబు ఎవరెవరిని కలుస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

19:44 - March 30, 2018

హైదరాబాద్ : విభజన హామీలపై పవన్‌కళ్యాణ్‌కు శ్రద్ధ తగ్గిందని.. జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. అందుకే తాను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మాజీ అధికార్లతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశానని తెలిపారు. విభజన హామీలపై పవన్‌ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ -జెఎఫ్‌సీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి.. ఈరకంగా వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. 
స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎస్‌ కాకి మాధవరావు, పద్మనాభయ్య, ప్రొఫెసర్‌ గలాబ్‌, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్‌ఏ దొరతో కలిసి 15 మంది ఉన్నారు. విభజన హామీల కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ మొదటి దశ అయితే... తాము ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండో దశ అన్నారు జేపీ. పవన్‌కల్యాణ్‌ మొదట చూపించినంత శ్రద్ద.. లెక్కలు తేలిన తర్వాత చూపించడం లేదని... అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు జేపీ వివరించారు. 
అమిత్‌షా లేఖను కమిటీ పరిశీలిస్తుందన్న జేపీ 
ఏపీకి 74 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని జేఎఫ్సీ తేల్చిందని... దీనిపై తమ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం చట్టబద్దంగా ఇంకా చాలా హామీలు అమలు చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంకెల తేడా కనిపిస్తోందన్నారు. అమిత్‌షా రాసిన లేఖపై కూడా తమ కమిటీ పరిశీలిస్తుందన్నారు. కేంద్ర పెద్దలు సమయమిస్తే ఢిల్లీ వెళ్లి అన్ని లెక్కలు అందజేస్తామన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి అనేది అన్ని రాష్ట్రాల సమస్య అని, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా అందులో ఉన్న అంశాల సాధనకు కృషి చేయాల్సిన అవసరముందని... అందుకే రాష్ట్రానికి చెందిన నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు జేపీ. 
నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయి : జేపీ
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొట్టమొదట తానే చెప్పానన్నారు జేపీ. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు నెరవేర్చినా... ఇంకా చట్టబద్దంగా నెరవేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయని వాటిని సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. అయితే... ఇప్పుడు కావాల్సింది ఆరంభశూరత్వమో.. ఆవేశమో కాదని... ఆలోచించి సాధించుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆపి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని జేపీ సూచించారు. మొత్తానికి విభజన హామీల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో... పవన్‌ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ -జెఎఫ్‌సీలో సభ్యుడిగా ఉన్న జేపీ.. ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. 

 

08:28 - March 27, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం..కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహాని అనుసరించబోతోంది ? ఇప్పటి వరకు సభ ఆర్డర్ లో లేదని చెబుతూ వాయిదాలు వేస్తూ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతుండడంతో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామలు అమలు చేయాలంటూ టిడిపి..వైసిపి..కాంగ్రెస్..పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా సీపీఎం..ఆర్ఎస్పీ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. దీనితో అవిశ్వాస తీర్మానం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపక్షాలన్నీ ఒక్కటి కావడంతో కేంద్రం తప్పించుకోలేని స్థితి నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశంపై వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు వ్యూహాన్ని మార్చారు. వెల్ లోకి వెళ్లకుండా నిరసన తెలుపాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో కలిసి పోరాటం చేద్దామని టీఆర్ఎస్ ఎంపీలు సూచించారు.

మొత్తానికి ఏడు అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు రానున్నాయి. దీనితో తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుని వచ్చే వారం చర్చ...ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మొత్తం 80 మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని సమాచారం. కాంగ్రెస్ 48, టిడిపి 15, సీపీఎం 9, వైసీపీ 8, ఆర్ఎస్పీ 1 బలంగా ఉంది. 

17:33 - March 24, 2018

విశాఖపట్టణం : టిడిపి..బిజెపి పార్టీలు ఇచ్చిన విభజన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని సీపీఎం పేర్కొంది. విశాఖ రైల్వే జోన్ కై సీపీఎం మహా పాదయాత్ర నాలుగో రోజు గాజువాకకు చేరుకుంది. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పడంతో నమ్మి ఓటేసిన విశాఖ వాసులకు మొండి చెయ్యి చూపారని నగర కార్యదర్శి గంగారావు పేర్కొన్నారు. 

15:47 - March 24, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ తీరును అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టారు. గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి..బిజెపి పొత్తు వికటించింది. ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. లేఖలో ఉన్న అంశాలపై అసెంబ్లీలో బాబు వివరణ ఇచ్చారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెబుతారా ? అంటూ ప్రశ్నించారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు కానీ ఏపీకి ఏమి చేయడం లేదని ఏపికి ఒక రూల్..ఇతర రాష్ట్రాలకు మరొక రూలా అని ప్రశ్నించారు.

కేంద్ర ప్ర‌భుత్వ తీరు ఎలా ఉందంటే.. క‌ష్టం మ‌నది.. అంటే మ‌న‌ ద‌గ్గ‌ర ట్యాక్సుల రూపంలో తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మ‌న‌కి క‌ష్టాలు ఉన్న‌ప్పుడు డ‌బ్బులు మాత్రం ఇవ్వ‌కుండా ట్యాక్సులు మాత్రం వ‌సూలు చేసుకుంటారని విమర్శించారు. అని ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పారని, హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారని గుర్తు చేశారు. అది కూడా స‌రిగ్గా అమ‌లు చేయడం లేద‌ని అన్నారు. రాష్ట్ర హ‌క్కుల‌పై కేంద్ర మంత్రుల‌కు చాలా లేఖ‌లు రాశామ‌ని, ఢిల్లీకి కూడా ఎన్నోమార్లు వెళ్లడం జరిగిందని, కష్టాలపై తాను సవివరంగా చెప్పడం జరిగిందన్నారు.

పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన చట్టంలో పెట్టినవి ఎందుకు ఇవ్వరని మరోసారి ప్రశ్నించారు. రావాల్సినవి అడుగుతుంటే ఎదురుదాడి చేస్తున్నారని, కేంద్ర మంత్రులు అస‌త్యాలు ఎందుకు చెబుతున్నార‌ని నిల‌దీశారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని ఇటీవలే భారత ప్రధాని మోడీ లోక్ స‌భ‌లో గుర్తు చేయడం జరిగిందని, అలాంటి పార్టీ ఇప్పుడు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడితే త‌ప్పేంటని చంద్రబాబు పేర్కొన్నారు. చివ‌రి బ‌డ్జెట్ లోనూ రాష్ట్రానికి సాయం చేయ‌లేద‌ని, దీనితో తాము పోరాటానికి దిగామ‌ని స్పష్టం చేశారుర. మిత్ర పక్షంగా చేయాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వం చేయలేదని బాబు వ్యాఖ్యానించారు. 

12:58 - March 19, 2018
06:58 - March 18, 2018

హైదరాబాద్ : కేంద్రంపై అవిశ్వాస అస్త్రానికి విపక్షపార్టీలు పదునుపెడుతున్నాయి. బీజేపీ వ్యతిరేకులను ఏకతాటిపై తెచ్చేదుకు జోరుగా మంత్రాంగాలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న టీడీపీ అధినేత తన చాణక్యాన్ని హై రేంజ్‌కు చేర్చారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్‌, మరోవైపు వామపక్షాలు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో.. ఢిల్లీలో రాజకీయం రంజుగా మారింది. సభ ఆర్డర్‌లో లేదన్న సాకుతో శుక్రవారం తప్పించుకున్నా.. సోమవారం అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని విపక్షపార్టీలన్నీ పట్టుదలగా ఉన్నాయి. మోదీ వ్యూహం గెలుస్తుందా .. చంద్రబాబు చాణక్యం ఫలిస్తుందా అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

పార్లమెంటులో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి పలు పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలను ఇతర పార్టీలు నమ్మడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాగా తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ కు పట్టుబట్టాలని, డివిజన్ అడగాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్ధేశం చేశారు. పార్టీ ఎంపీలు, వ్యూహకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు ఆరుగురు ఎంపీల బృందం ఈ రెండురోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి, అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు.

సోమవారం దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అవిశ్వాసానికి ... జాతీయస్థాయిలో పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని, ఇది ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని షాక్‌గా పరిణమించిందని టీడీపీ నేతలు అంటున్నారు. అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జగన్‌, విజయసాయిరెడ్డి.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని మంత్రి దేవినేని విమర్శించారు.

అటు వైసీపీ నేతలు మాత్రం టీడీపీ తప్పిదాలవల్లే రాష్ట్రానికి ప్రత్యే హోదా రాకుండా పోయిందని విమర్శిస్తున్నారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడతామంటూ జగన్‌ ప్రకటించిన తర్వాతే టీడీపీలో కదలిక వచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో లెఫ్ట్‌పార్టీలు దూకుడు పెంచాయి. నో కాన్ఫిడన్స్‌ మోషన్‌కు మద్దతు ఇచ్చి మోదీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు వామపక్ష నేతలు. తమ మద్దతు తోపాటు మోదీ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. పార్లమెంట్‌లో సోమవారం ఎవరు అవిశ్వాసం పెట్టినా తాము తప్పకుండా మద్దతు ఇస్తామన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు ప్రాధాన్యత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు.

అటు ప్రధాని మోదీపై కారాలు మిరియాలు నూరుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా అవిశ్వాసానికి మద్దుతు ఇవ్వాలని సీపీఐ ఏపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఏపీలో అవినీతి పాలన నడుస్తోందని, ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒప్పుకున్నారని అందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు రామకృష్ణ.

విపక్షాలన్నీ ఏకం అవుతుండటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడుతోందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.. చివరికి కొందరు బీజేపీ ఎంపీలు కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. సభ ఆర్డర్‌లో లేదన్న సాకుతో శుక్రవారం అవిశ్వాస గండం నుంచి తప్పించుకున్న మోదీ ప్రభుత్వం సోమవారం కూడా ఇదే వ్యూహాన్ని అమల్లో పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీనికోసం ఎన్డీయే మిత్రపక్షాలను ఉసిగిగొల్పి.. సభలో గందరగోళం సృష్టించడానికి మోదీ అండ్‌ టీమ్‌ సిద్ధం అయినట్టు విమర్శలు వస్తున్నాయి. అయితే అన్ని పరిణామాలకు సిద్ధపడే రంగంలోకి దిగామని, హౌస్‌ ఆర్డర్‌లో లేదనే సాకుతో అవిశ్వాసాన్ని తిరస్కరిస్తే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - విభజన హామీలు