విమర్శలు

17:29 - January 19, 2017

నెల్లూరు : సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సమాజ్‌వాదీ , కాంగ్రెస్‌లు కుంభకోణాలతో దేశాన్ని అభివృద్ధిలో వెనక్కునెట్టాయన్నారు. అభివృద్ధే ప్రధాన ప్రచారంగా రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లోకి వెళ్లుతున్నామని వెంకయ్య చెప్పారు. 

 

13:24 - January 11, 2017

హైదరాబాద్ : చంద్రబాబుకు గండికోటపై ఎందుకంత భయమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తిచేసి ప్రాజెక్టులను తాను పూర్తిచేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. రిజర్వాయర్‌ల వద్దకు వెళ్తుంటే ప్రజాప్రతినిధులను ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. 12ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని బాబు ప్రశ్నించారు. హంద్రనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించారని విమర్శించారు. 

 

12:35 - January 11, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడారు. మోడీ నినాదాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగదు కొరత దేశ ప్రజలను ఇంకా వెంటాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై రెండో దశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
 

 

20:13 - January 4, 2017

హైదరాబాద్ : ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్‌లను ఎందుకు చెల్లించడంలేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే పేద విద్యార్థులను విద్యను దూరం చేయడమా అని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.  

 

16:28 - January 4, 2017

విజయవాడ : టీడీపీ నాయకులు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. స్థలాలే కాకుండా.. సొసైటీలను కూడా కబ్జా చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి పి.గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రి స్విస్‌ ఛాలెంజ్‌ అంటూ నిరుపేద రైతుల భూములను కొల్లగొట్టేస్తుంటే.. ఆయన కొడుకు బుక్‌ఫెస్టివల్‌ వంటి కార్యక్రమాలకు హైజాక్‌ చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని టీడీపీ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

21:57 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ కొత్తగా భూసేకరణ చట్టాన్ని తీసుకురావడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని తెలంగాణలో నూతన భూసేకరణ చట్టాన్ని తీసుకురావడం వెనక కుట్ర ఉందని ఆరోపించాయి. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కరోజు శాసనసభా సమావేశాలను బహిష్కరించాయి.

తెలంగాణ భూసేకరణ చట్టాన్ని తీసుకురావడంపై విపక్షాల నిరసన
కొత్త భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ శాసనసభా సమావేశాలను కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం ఒక్కరోజు బహిష్కరించాయి. సీఎం కేసీఆర్‌ శాసనసభను తప్పుదోవపట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూసేకరణ విషయంలో సీఎం అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. భూసేకరణచట్టం-2013లో నిర్వాసితులకు ఉన్న హక్కులను సవరణ చట్టంలో లేకుండా చేశారని ఉత్తమ్‌ ఆరోపించారు.

భూసేకరణ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీపీఎం మండిపాటు
భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు సీరియస్‌గా స్పందించాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీపై సీఎం విషం కక్కారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మండిపడ్డారు. సభలో ప్రతిపక్షాల గొంతునొక్కేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌వైఖరికి నిరసనగా ఇవాల్టి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతిపక్షాల పట్ల మాకు గౌరవం ఉంది : సీఎం కేసీఆర్‌
విపక్షాలు సభను వాకౌట్‌ చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక విధానంలో ప్రతిపక్షాల పాత్ర ఘననీయమైనదని.. ప్రభుత్వ పరంగా వారి పట్ల మాకు గౌరవం ఉందని కేసీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు మంచి సూచన ఇస్తే తీసుకుంటామని... వారిని అవమానించేదేమి లేదని కేసీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ సభను వాకౌట్‌ చేయడమంటే పారిపోవడమే : హరీశ్‌రావు

మరోవైపు కాంగ్రెస్‌ సభను వాకౌట్‌ చేయడమంటే పారిపోవడమే అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సభలో మాట్లాడటం ఇష్టం లేకనే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్‌ చేశారని మండిపడ్డారు. సభను ఎన్ని రోజులైనా జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా..కాంగ్రెస్‌ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిందన్నారు.

20:07 - December 29, 2016

2013 భూసేకరణ చట్టం ఎందుకూ పనికిరానిదనీ.. 2016 భూసేకరణ చట్టం చాలా మెరుగైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాశితులకు ఈ చట్టంతోనే న్యాయం జరుగుతుందన్నారు. రాబోతున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఈ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని విమర్శించారు. 2013 చట్టాన్ని తాడు, బొంగరం లేని చట్టంగా సీఎం అభివర్ణించడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కేసీఆర్‌.. 2013 భూసేకరణ చట్టానికి మద్దతు పలికి ఇప్పుడు పనికిమాలిన చట్టంగా అభివర్ణించటంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మరోపక్క బలవంతపు భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలనే డిమాండ్ తో టీజేఏసీ కన్వీనర్‌ కోదండరాం దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే సీపీఎంపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో అద్దంకి దయాకర్ (టీ.కాంగ్రెస్ నేత), జూలకంటి రంగారెడ్డి(సీపీఎం నేత),నరేశ్ ( టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. 

21:50 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ చట్టంపై విపక్షాలు మండిపడ్డాయి. 2013 భూ సేకరణ చట్టంలో సవరణలు అని చెప్పి.. ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఎలా తెస్తుందని విపక్ష నేతలు ప్రశ్నించారు. దీనిపై కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని విపక్షాలు నిర్ణయించాయి.

తాడు, బొంగరం లేని చట్టం వ్యాఖ్యలపై విపక్షాల మండిపాటు
తెలంగాణ భూసేకరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కేంద్ర భూసేకరణ చట్టాన్నితాడు, బొంగరం లేని చట్టంగా సీఎం అభివర్ణించడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కేసీఆర్‌.. 2013 భూసేకరణ చట్టానికి మద్దతు పలికి ఇప్పుడు పనికిమాలిన చట్టం అనడంలోని ఆంతర్యం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టీటీడీపీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని సీపీఎం పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యతిరేకించారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు యత్నాలు
మొత్తంగా అధికార పార్టీ మినహా అన్నీ పార్టీలు తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించాయి. 2013 భూసేకరణ బిల్లుకు సవరణలు అని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై ఎవరికివారుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 

21:46 - December 28, 2016

హైదరాబాద్ : సీపీఎంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ తీవ్రంగా మండిపడింది. రైతులను నిట్టనిలువునా దగా చేసేందుకే, తెలంగాణ భూసేకరణ చట్టాన్ని తెచ్చారంటూ పార్టీ నాయకులు విమర్శించారు. రైతుల జీవితాలను రోడ్డు పాల్జేసే భూసేకరణ బిల్లుకు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా, గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఎం పిలుపునిచ్చింది.

సీపీఎంని నిందించడం కేసీఆర్ అవివేకం
తెలంగాణ భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీపీఎంపై విరుచుకుపడడాన్ని, పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేసీఆర్‌వి అర్థం లేని మాటలని సీపీఎం నేతలు తిప్పికొట్టారు. సీపీఎం ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగానే ఆందోళనలు నిర్వహిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మల్లన్నసాగర్‌ లాఠీచార్జి, కాల్పులకు సీపీఎంని నిందించడం అవివేకమని తమ్మినేని ఆక్షేపించారు.

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపు
భూసేకరణ బిల్లుతో పాటు సీఎం విమర్శలకు వ్యతిరేకంగా, గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సీపీఎం పిలుపునిచ్చింది. సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ఓర్వలేక విమర్శలకు తెగబడ్డారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. మల్లన్నసాగర్‌లో జరిగిన కాల్పులకు సీపీఎం నేతలే కారణమన్న సీఎం, తగిన ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. సీఎం వీధిరౌడీలా మాట్లాడడం సరికాదన్నారు.

సీఎం ఒక్కసారైనా ఎందుకు వెళ్లలేదు : సీపీఎం
తన ఫామ్‌హౌజ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని మల్లన్నసాగర్‌కు సీఎం ఒక్కసారైనా ఎందుకు వెళ్లలేదని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఉసురు తీసేందుకే తెలంగాణ భూసేకరణ బిల్లు తెచ్చారని మండిపడ్డారు.

కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీపీఎం నేతలు
ప్రజల పక్షాన, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా.. సీపీఎం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం తన ధోరణి మార్చుకోకుంటే.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

19:10 - December 25, 2016

అనంతపురం : ప్రధాని మోడీకి చిత్తశుద్ది ఉంటే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌ విసిరారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మోదీనే అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. కార్పొరేట్‌ సెక్టార్లకు మద్దతు పలికేందుకే ప్రధాని మోదీ నోట్లు రద్దు చేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలోని కరవు మండలాలను ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - విమర్శలు