వివాహం

16:24 - January 13, 2018

ఖమ్మం : జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుని వెళుతున్న వారిని అడ్డుకొనేందుకు వారి కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కారును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ప్రేమ వివాహం చేసుకుని వెళుతున్న వారికి ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన భద్రాది జిల్లా కొత్తగూడెం ఇల్లందులో చోటు చేసుకుంది. సుమన్ గౌడ్..సాహెల్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇల్లందు నుండి హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. మతాంతర వివాహం చేసుకోవడాన్ని అమ్మాయి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారు వెళుతున్న కారును అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. వీరి నుండి కాపాడుకోవాలని నూతన దంపతులు ప్రయత్నించారు. ప్రమాదవశాత్తు గోపాలపురం వద్ద కారు చెట్టును ఢీకొంది. కారు డ్రైవర్ మృతి చెందగా సాహెల్..సుమన్ గౌడ్ లకు గాయాలయ్యాయి. ప్రమాదానికి తమ బంధువులే కారణమని నూతన వధువు పేర్కొంటోంది. 

15:11 - January 11, 2018

నేరాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నా ఆర్థిక కారణాలతో నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యల వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చేస్తున్నారా ? లేక ఆవేశంతో చేస్తున్నారా ? అనేది పక్కన పెడితే వీటికి మూల కారణాలు ఏంటీ ? ఇంతటి భయంకరమైన పరిస్థితులకు అసలు కారణాలు ఏంటీ ? వివాహేతర సంబంధాల కేసుల్లో మహిళలను నిందితురాలిగా చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోవడం యాదృచ్చకమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భర్తల హత్యలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నెలల కాలంలో పది హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరం ఎవరు చేసిన మహిళలు చేసిన నేరంపై ఎందుకు పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తోంది ? వారి పిల్లల భవిష్యత్ ఏంటీ ? తదితర అంశాలపై టెన్ టివి ఫోకస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:35 - January 11, 2018

చిత్తూరు : ప్రేమ హత్యలు..ప్రేమ మరణాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే పలు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం క్రిష్టాపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు ఇంకొకరిని వివాహం చేసుకుందని ఓ ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుప్పంలో నివాసం ఉండే స్నేహాంజలితో తిరుపతి నివాశి దామోదర్ కు పరిచయం అయ్యింది. గత కొన్ని రోజులుగా స్నేహాంజలిపై ప్రేమను పెంచుకున్నాడు. కానీ స్నేహాంజలి కూడా ప్రేమించిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట కుప్పంకు చెందిన ఓ వ్యక్తితో స్నేహాంజలికి వివాహం జరిగింది. స్థానికంగా టీచర్ ఉద్యోగం కూడా చేస్తోంది. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న దామోదర్ జీర్ణించుకోలేకపోయాడు. తిరుపతి నుండి కుప్పంకు వెళ్లిన దామోదర్..స్నేహాంజలి ఇంటి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటికున్నాడు. స్థానికులు ఇతడిని ఆసుపత్రికి తరలించారు. 75 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బతికే అవకాశం లేదని వైద్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:46 - December 9, 2017

ఎన్నాళ్లో వేచిన కల నెరవేరబోతుంది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట ఒక్కటి కాబోతుంది. విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఎంతో కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నా.. తాజాగా వారిద్దరి హడావుడి చూస్తుంటే.. కల్యాణ ఘడియలు దగ్గర పడినట్లు కనిపిస్తోంది. ఈనెల 12న ఈ జంట ఒక్కటి పెళ్లి చేసుకోవడంతో... కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇటలీలోని మిలాన్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైంది. అయితే.. అధికారికంగా వీరి పెళ్లిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా... జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈనెల 12న వీరి వివాహం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ జంట ఇప్పటికే స్విట్జర్జాండ్‌ మీదుగా ఇటలీలోని మిలాన్‌కు చేరుకున్నట్లు సమాచారం. వీరి వివాహం అక్కడి ప్రఖ్యాత వైన్‌యార్డులో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి కోసం అనుష్క తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ముంబై నుంచి స్విస్‌ ఎయిర్‌వేస్‌లో ఇటలీకి ప్రయాణమైంది. మీడియా కంటపడిన అనుష్కను పెళ్లి గురించి ప్రస్తావించకుండా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయింది. ఇక కోహ్లీ మాత్రం ఢిల్లీ నుంచి బయల్దేరాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌ ధరించాడు. కోహ్లీ ఫ్యామిలీ, సన్నిహితులు కూడా మిలాన్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. ఇక సెలెబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అనుష్క వివాహ దుస్తులను డిజైన్‌ చేయగా,.. మేకప్‌ ఆర్టిస్టులు, వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్లను కూడా మిలాన్‌కు తీసుకెళ్తున్నారు. అనుష్క కుటుంబ పూజారి మహరాజ్‌ అనంత బాబా కూడా వీరితో పాటు... మిలాన్‌ వెళ్లారు. మొత్తానికి ఎన్నో రోజులుగా కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండగా... తాజాగా వారిద్దరూ ఒకటి కాబోతున్నారు. 

08:37 - November 24, 2017

చిత్తూరు : ప్రముఖ నటి 'నమిత' వివాహం ఘనంగా జరిగింది. ఇస్కాన్ ఆలయంలో ఈ వివాహం జరిగింది. మూడుముళ్లతో నమిత - వీరేంద్ర చౌదరి ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సినీ నటి రాధిక, శరత్ కుమార్, నమిత కుటుంబసభ్యులు, ఇతర సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం 5గంటల 30నిమిషాలకు వివాహం జరిగింది.

సింధూరి పార్క్ హోటల్ లో 22న సంగీత్ తో నమిత పెళ్లి వేడుక ప్రారంభమైంది. సింధూరి పార్క్ హోటల్ లో సాయంత్రం గం.7.30 నుంచి సంగీత్ నిర్వహించారు. ఇదిలా ఉంటే పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతానని నమిత పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలుగులో 'సొంతం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ, వెంకటేష్‌తో 'జెమిని', బాలకృష్ణతో 'సింహా' తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాలే చేస్తోంది.

11:12 - November 11, 2017

బొద్దుగుమ్మగా పేరొందిన 'నమిత' త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. తెలుగు..తమిళ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఒకప్పుడు 'నమిత'కు తమిళంలో స్టార్ హీరోస్ కి ఉన్న క్రేజ్ ఉండేది. ఈమెకు భారీగానే అభిమానులు కూడా ఉన్నారు. ఏకంగా ఈమెకు గుళ్లు కూడా కట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో 'సొంతం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత 'జెమిని', 'బిల్లా', 'సింహా' వంటి చిత్రాల్లో నటించారు. ఈమె త్వరలోనే వివాహం చేసుకోనుంది. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబును వివాహం చేసుకుంటోందని ప్రచారం జరిగింది. వీటిని శరత్ బాబు..నమిత ఖండించారు. తాజాగా త‌న వివాహం వీరాతో ఈ నెల 24న జ‌ర‌గ‌నుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కొంతకాలంగా వీరా..నమితలు ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాయి. నవంబర్‌ 24న తిరుపతిలో వివాహం చేసుకోబోతున్నట్టు టాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. 

07:39 - October 7, 2017

గోవా : ప్రేమజంట ఒక్కటయింది. పేమతో మొదలయిన బంధం పెళ్లితో మరింత బలపడింది. టాలీవుడ్‌ ప్రేమికులు నాగచైతన్య, సమంత వివాహం గోవాలో ఘనంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతోపాటు సమంత కుటుంబసభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  గోవాలోని ఓ స్టార్‌హోటల్లో ఏర్పాటు చేసిన పెళ్లివేదికపై  చైతు-సమ్మి ఏడడుగులు నడిచారు. శుక్రవారం రాత్రి 11.45 కు హిందూ సంప్రదాయం ప్రకారం చైతూ- సమంత ఒక్కటయ్యారు..కాగా ఇవాళ క్రిష్టియన్‌ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరగనుంది. పెళ్లి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగినా.. ఈనెల 10 హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తోంది.     

 

13:55 - October 6, 2017

గోవా : సమంత, నాగచైతన్యల వివాహం ఇవాళ గోవాలో ఘనంగా జరగబోతోంది. హిందూ సంప్రదాయంలో వివాహం జరిపించనున్నారు. ఈ సందర్భంగా వరుడు నాగచైతన్యను పెళ్లికొడుకుని చేసిన ఫొటోలను అక్కినేని నాగార్జున, వెంకటేశ్‌లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఫొటోలో నాగచైతన్యతో పాటు నాగార్జున, వెంకటేశ్‌ కూడా ఉన్నారు. ఇక పెళ్లికూతురిగా సమంత ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెళ్లికి నాగచైతన్య, సమంత కుటుంబాలతో కలిపి 100 మంది హాజరుకాబోతున్నారు. శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిపించనున్నారు. 

 

07:12 - October 2, 2017

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌-జ్ఞానల వివాహం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా వెంకటాపురంలోజరిగిన ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా వివాహ వేదిక వద్దకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... పరిటాల శ్రీరామ్‌-జ్ఞానలకు అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. ఆ తర్వాత వివాహ వేదిక వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పరిటాల సునీత సాదర స్వాగతం పలికారు. కేసీఆర్‌ వెంట రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. పరిటాల శ్రీరామ్‌-జ్ఞానలను కేసీఆర్‌ ఆశీర్వదించారు. అనంతరం కేసీఆర్‌ వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. పరిటాల సునీత, ఏపీ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు రాజకీయ నాయకులు కేసీఆర్‌ వెంట ఉన్నారు.

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు సహా పలువురు సినీప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు శ్రీరామ్‌-జ్ఞానల వివాహానికి హీజరై వధూవరులను ఆశ్వీర్వదించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... పరిటాల శ్రీరామ్‌కు ఫోన్‌ చేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పరిటాల శ్రీరామ్‌ వివాహానికి హాజరైన కేసీఆర్‌... టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఐదు నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా తీసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగరాపాలక సంస్థ ఎన్నికల్లో విజయానికి టీడీపీ అనుసరించిన వ్యూహంపై ఇద్దరు నేతలు చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలపై కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. 

11:09 - October 1, 2017

అనంతపురం : జిల్లాలోని వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరుగనుంది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంలు వస్తుండడంతో పుట్టపర్తిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్..చంద్రబాబు నాయుడులు విడివిడిగా హెలికాప్టర్ లో వెంకటాపురానికి చేరుకోనున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - వివాహం