విశాఖ

19:18 - October 13, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్, ఒడిషా సరిహద్దులో మరోసారి మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఏవోబీలో ల్యాండ్‌మైన్ పేల్చారు. కోరాపుట్ జిల్లా పనసపుట్ట అటవీప్రాంలో ఘటన చేసుకుంది. కూంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చారు. అయితే భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నాయి. పోలీసు బలగాలు సురక్షితంగా ఉన్నారని ఓఎస్డీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.  

 

17:29 - October 12, 2018

విశాఖ : పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు, సివేరు పోమ హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్‌ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన మీనా.. గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

 

15:29 - October 9, 2018

విశాఖ : విశాఖ నగరంలో చెడ్డీగ్యాంగ్ కలకలం రేపుతోంది. మధురవాడలో హల్ చల్ చేసింది. దసరాకు ముందే గ్యాంగ్ నగరంలో తిష్టవేసింది. చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ కదలికలతో నగరవాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

నగరంలో ఉంటున్న వైజాగ్ వాసులు దసరాకు సొంతూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇళ్ళళ్లో చోరీ చేసేందుకు చెడ్డీగ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో నగర శివారు మధురవాడలో పోతిన మల్లయ్యపాలెంలోని పనోరమా హిల్స్‌లో 66 నెంబర్ విల్లా వద్ద ఈ గ్యాంగ్‌ సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరా దృశ్యాల అధారంగా పోలీసులు నిర్ధారించారు. నలుగురు సభ్యులు సంచరిస్తున్నట్లు పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేశారు. ఆ గ్యాంగ్ సభ్యులు గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. అపార్ట్‌మెంట్‌తోపాటు రెండు, మూడు ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ రాత్రిపూట తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖాలు కనపడకుండా ముసుకులు వేసుకుని ఇళ్ళళ్లోకి చొరబడుతున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన చెడ్డీగ్యాంగ్ ఉత్తరాంధ్రలో సంచరిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చెడ్డీగ్యాంగ్ కదలికలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

 

21:34 - October 2, 2018

విశాఖ : అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ జంట హత్యల విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సిట్ అధికారులు పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అరకు పోలీస్ స్టేషన్ గెస్ట్‌హౌజ్‌లో విచారించనున్నట్లు తెలుస్తోంది. మాజీ సర్పంచ్ సుబ్బారావు, బిసోయ్ మూర్తి, కామరాజులను పోలీసులు విచారిస్తున్నారు. లివిటిపుట్టులో 200 మందిని అదుపులోకి తీసుకుని విచారించి, వదలిపెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23న గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళ్తున్నకిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపి, హత్య చేసిన సంగతి తెలిసిందే. 

కిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమల హత్యకు సంబంధించి ప్రాథమిక నివేదికను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ సీఎం ముఖ్యమంత్రికి అందజేశారు. సీఎం చంద్రబాబుతో సీఎస్ అనిల్ చంద్ర పునేత, డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అరకు జంట హత్యలపై నిగూఢమైన సమాచారం, సాక్ష్యాధారాలతో కూడిన కీలకమైన ప్రాథమిక నివేదికను సీఎంకు అందజేశారు. నివేదికలో ఆరుగురు ప్రధాన నిందితుల పేర్లను పొందుపరిచారు. ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా  ముగ్గురు టీడీపీ అనుచరులు, ఇద్దరు వైసీపీ అనుచరులు, ఒకరు బీఎస్పీ అనుచరుడు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచరాణలో తెలిసింది. ఈ ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. వీరి నుంచి కీలకమైన సమాచారం వస్తోంది. ’ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేని చంపేస్తారనే విషయం తమకు తెలియదని...కేవలం అక్కడ బాక్సైట్‌కు సంబంధించిన అంశంలో కేవలం వారిద్దరిని బెదిరిస్తారు.. భయపెట్టి వదిలేస్తారు..  ఆ బాక్సైట్ జోలికి రాకుండా చేస్తారనేటటువంటి సమాచారంతోటే మావోయిస్టులకు సమాచారం ఇచ్చినట్లుగా’ నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి నుంచి మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు.

 

22:19 - September 28, 2018

విశాఖ : ప్రచార ఆర్బాటం చేసే పతంజలి ప్రొడక్ట్స్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎంతో విశ్వసనీయ బ్రాండ్‌గా ప్రచారం చేసుకునే పతంజలి ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు కనిపించాయి. సింహాచలం గోశాలలోని పద్మావతి నగర్‌లో ఈ విషయం వెల్లడైంది. బాబుకు కడుపునొప్పి రావడంతో పౌడర్‌ను తల్లి పరిశీలించారు. తాము కొన్న పతంజలి ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు కనిపించాయని శేషకుమారి అనే నియోగదారురాలు ఫిర్యాదు చేశారు.  

 

16:25 - September 27, 2018

విశాఖ : అరకులో జరిగిన టీడీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్యలపై టీడీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకులో చేసిన హత్యలు మావోయిస్టులు చేసుండకపోవచ్చు.. వైసీపీ నేతలపైనే తనకు అనుమానం కలుగుతుందన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరినందుకే ఆ పార్టీ నేతలు కక్ష గట్టి కుట్ర పన్ని ఉంటారని ఆరోపించారు. మావోయిస్టులే ఈ హత్యలు చేసివుంటే కారణాలతో ఈపాటికే ప్రకటనలు విడుదల చేసేవారన్నారు.

 

22:12 - September 25, 2018

విశాఖ : అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలతో విశాఖ మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇద్దరి హత్యలతో విశాఖ ఏజెన్సీలో వాతావరణం వేడెక్కింది. ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్‌ గఢ్‌ పోలీసు బలగాలు ఏజెన్సీని భారీ ఎత్తున జల్లెడ పడుతుండడంతో యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. దీనికి తోడు మావోయిస్టులు మన్యంలోనే ఉన్నారన్న వార్తలతో బలగాలు అడుగు కూడా వదలకుండా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అటు.. కిడారి హత్యకు ముందు మావోలు ఆయన వాహనాన్ని చుట్టుముట్టడం.. హత్య తర్వాత పారిపోతున్న వీడియోలు వెలుగులోకి రావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. 

హత్యకు ముందు ఎమ్మెల్యే వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్టిన వీడియో వెలుగులోకి రావడం ఉద్రిక్తతను మరింత పెంచింది. కిడారి వెళుతున్న సమయంలో ఆయన వాహనాన్ని సుమారు 20 మంది మావోయిస్టులు నిలిపి, దాని చుట్టూ నిలబడటం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన్ను కారు నుంచి బలవంతంగా దించి లాక్కెళ్ళారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

అంతేకాదు.. తర్వాత మాజీ ఎమ్మెల్యే సోమను కాల్చి పారిపోతున్న విజువల్స్ కూడా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అడ్డుకుని, తుపాకులతో కాల్చి దారుణంగా చంపిన మావోలు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. 

సోమపై కాల్పుల తర్వాత పరిగెడుతున్న వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జలుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనోగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యల అనంతరం మావోయిస్టులు పారిపోతుండగా, కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టినప్పటి నుంచి కాల్చి చంపినప్పటి వరకూ ఉన్న వీడియోలు బయటకు రావడంతో మన్యంలో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారింది. 

15:24 - September 25, 2018

విశాఖపట్టణం : అరకు ఎమ్మేల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్యేల్యే సివేరు సోమలను మావోయిస్టులు హతమార్చడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టింస్తోంది. కిడారి హత్యకు మావోయిస్టులు పక్కా వ్యూహం పన్నారు. గెరిల్లా తరహాలో మావోయిస్టులు కిడారి కారును చుట్టుముట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. 

విశాఖలోని మన్యం ప్రాంతంలో డుంబ్రిగూడ మండలం తుటంగి దగ్గర అరకు ఎమ్మేల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మేల్యే సోమపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్పెషల్ జోనల్ కమాండర్ చలపతి ఆధ్వర్యంలో దాడి జరిగింది. గత రెండు రోజులుగా ఏవోబీ పరిసరాల్లో చలపతి ఆపరేషన్ నిర్వహించారు. పక్కా సమాచారంతో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది మహిళా నక్సలైట్లున్నట్లు సమాచారం. 

 

13:00 - September 24, 2018

అరకు : మావోల తుపాకులతో దద్దరిల్లిన అందమైన అరకు అగమ్యగోచరంగా తయారయ్యింది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతదేహాలకు శవపరీక్ష పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యం మూగబోయింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకు లోయ నిన్నటి నుంచి కళ తప్పింది. రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల పిలుపుతో అరకులో బంద్‌ కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడ పడుతున్నాయి. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారంటూ డుంబ్రిగూడ ఎస్‌ఐ అమ్మన్‌రావును డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్‌ ఏర్పాటుచేశారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అంత్యక్రియలకు వెళ్లనున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకాశమార్గంలో అరకుకు పంపడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంత్యక్రియలకు జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులంతా హాజరవనున్నారు. రోడ్డుమార్గంలో వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని, భద్రతా కారణాల దృష్ట్యా ఆకాశ మార్గంలో నేతలను తరలించాలని యంత్రాంగం భావించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు. వెళ్లేవారి సంఖ్యను బట్టి అవసరమైతే రెండు, మూడు సార్లు హెలికాప్టర్‌ అటు ఇటు నడపాలని భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజాప్రతినిధులు వెళ్లే మార్గాలను గోప్యంగా ఉంచుతున్నారు.

08:09 - September 24, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల చేతిలో హతమైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు...మాజీ ఎమ్మెల్యే శివెరి సోమ మృతదేహాలను అరకు క్యాంప్ కార్యాలయానికి తరలించారు. అరకు ప్రభుత్వాసుపత్రిలోనే ఇద్దరి మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలను చూసి...బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత....బంధువులు కోరుకున్న చోట అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 

 

Pages

Don't Miss

Subscribe to RSS - విశాఖ