వేడిమి

12:45 - March 9, 2018

ఎండాకాలం వచ్చేసింది..ఇప్పటి నుండే ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

 • కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది.
 • పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.
 • ప్రతి రోజు రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగితే కడుపు నొప్పి..అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
 • కీరలో 95 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చల్లదనం అందిస్తుంది.
 • వేసవిలో కీర ముక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిని వైద్యులు పేర్కొంటుంటారు. 
12:24 - April 17, 2017

విజయవాడ : భానుడి ప్రతాపానికి విజయవాడ నగర వాసులు విలవిల్లాడుతున్నారు. మండుతున్న ఎండలకు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉదయం నుంచే నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అటు ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు పెరిగిపోయాయి. ఆలయ అధికారులు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండతో ఇబ్బంది పడుతున్నారు. దర్శనానికి కార్డు సిస్టం, ఒకే కౌంటర్ ఉండటంతో చిన్నపిల్లలు, మహిళలు ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. వ్యాపారులు కూడా సాయంత్రం సమయంలోనే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

 

 

13:30 - March 21, 2017

వేసవి కాలం వచ్చేసింది..ఇక ఉక్కపోత..చెమట..వడదెబ్బ..ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల ప్రభావం వల్ల శారీరకంగా..మానసికంగా..కృంగి పోతుంటారు. మరి ఈ సమస్య నుండి బయటపడడం ఎలా ? కొన్ని చిట్కాలు..

 • వేసవిలో నీడలోనే గడిపితేనే మంచిది. ఉద్యోగులు..బయటకు వెళ్లే వారు సన్ స్ర్కీన్, టోపి, సన్ గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి.
 • వేసవికాలంలో తగినంత నిద్ర ఉండి తీరాల్సిందే. సమయానికి నిద్ర పోవడం వల్ల మానసిక ప్రశాంతత చేరుకుంటుందనడంలో సందేహం లేదు.
 • వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల నీరసం రాదు. అంతేగాకుండా శరీరంలోని నరాలు..ఎముకలు బలంగా ఉంటాయి.
 • రోజు ఉదయం..సాయంత్రం వ్యాయామం చేయండి. కనీసం 20 నిమిషాలైనా నడవాలి.
 • తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
08:58 - March 3, 2017

ఎండాకాలం వచ్చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు. మార్చి..ఏప్రిల్..మే నెలలో ఇంకా ఎండలు ఉండనున్నాయో ప్రజలు భయపడిపోతున్నారు. దీనితో ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు కూలర్లు..ఏసీలను వాడుతుంటారు. ఏసీలు..కూలర్ల విక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. కానీ ఏసీలు కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

 • ఏసీ ఏర్పాటు చేయాలని అనుకొనే గది పరిణామం ఎంతుంటుంది. ఎంత సామర్థ్యం కావాలనే దానిని అంచనా వేసుకోవాలి. ఇతరుల సూచనలు..సలహాలు తీసుకోవాలి.
 • ఎక్కువ రేటింగ్ ఉండే ఏసీల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ 3 స్టార్ ఆపైన రేటింగ్ ఉండే ఏసీలను తీసుకోవడం బెటర్.
 • ప్రధానంగా ఏసీ కాయిల్స్ తుప్పు పడుతుంటాయి. కోటింగ్ రక్షణ ఉందా ? లేదా ? అనేది తెలుసుకోవాలి. ఇందుకు బ్లూ ఫిన్ కండెన్సర్ లేదా మైక్రో చానల్ కండెన్సర్ అయితే బెటర్. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో మెరుగైన చల్లదనాన్ని అందిస్తాయి.
 • ఇన్వర్టర్‌ టెక్నాలజీ ఉన్న ఏసీలు ఎంచుకోవడం ఉత్తమని పలువురు సూచిస్తున్నారు. దీనివల్ల 50 శాతం మేరకు విద్యుత్‌ ఆదా అవుతుందంట.
 • ఏసీల్లో ఆటో క్లీన్‌ మోడ్‌ ఉంటుంది. దానివల్ల తరచూ శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది. ఇలాంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
12:29 - April 22, 2016

రానుంది మే నెల.. మండే ఎండల సీజన్.. కానీ తెలుగు సినీ లవర్స్ కి మాత్రం కూల్ అయిన కన్నుల పండుగ. కారణం.. అగ్ర హీరోల సినిమాలు వరసబెట్టి రిలీజవుతున్నాయి. వచ్చే నెల మాత్రం టాలీవుడ్ వెండితెర క్రేజీ సినిమాలతో ఉక్కిరిబిక్కిరి కాబోతోంది. సూర్య సినిమా '24', సాయి ధరమ్ తేజ 'సుప్రీం', మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం', నితిన్ 'అ..ఆ'.. ఇలా దేనికదే డిఫరెంట్ జానర్స్ లో వస్తున్నాయి .సో.. అలా ఈ సమ్మర్ సమరానికి సిద్ధమౌతున్న సినిమాలపై ప్రత్యేక కథనం..

బ్రహోత్సవం..
ఈ రేస్ లో అన్నిటికన్నా క్రేజీ మూవీ బ్రహ్మోత్సవం . శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కలయిక లో వస్తున్న రెండో సినిమాగా వస్తున్న ఈ మూవీ వీపరీతమైన అంచనాలతో రెడీ అవుతోంది. శ్రీమంతుడు తరువాత అదే జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకుంటున్నారు. సమంత, ప్రణీత అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు . సమ్మర్ జాబితాలో బ్రహ్మోత్సవం ఓ టాప్ సినిమా. శ్రీమంతుడు సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావటంతో పాటు..శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ..సెంటిమెంట్లను బాగా నమ్మే సినీ పరిశ్రమలో మహేష్ బాబు ఫ్యాన్స్ కు 'మే టెన్షన్' పట్టుకుందట. దీనికి కారణం గత చరిత్రే అంటున్నారు. మేలో విడుదలైన మహేష్ బాబు గత సినిమాలు అన్నీ ఫట్ మన్నాయి. ఇదే ఇప్పుడు వీరిని వెంటాడుతున్న భయం. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన నిజం, నాని సినిమాలు మే నెలలోనే రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే ఆ తరువాత మహేష్, ఏ సినిమాను మే నెలలో రిలీజ్ చేయలేదు. 12 ఏళ్ల తరువాత మరోసారి మే నెలలో సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్నాడు సూపర్ స్టార్. దీనికి తోడు మహేష్ బాబు కెరీర్ లో రెండు వరుస విజయాలు సాధించిన రికార్డ్ లేదు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన మహేష్, సెంటిమెంట్ ను బ్రేక్ చేసి హిట్ కొడతాడా..? లేక మరోసారి అభిమానులను నిరాశపరుస్తాడా..? అన్నది ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి శ్రీమంతుడు రికార్డ్ లను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణతీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 13న విడుదల కాబోతోంది.
స‌మ్మ‌ర్ సీజ‌న్ ను స‌ద్వినియోగం చేసుకోడానికి ముఖ్యంగా మే నెల‌ను టార్గెట్ గా చేయ‌డానికి ఈ చిత్ర‌ యూనిట్ క‌ష్ట‌ప‌డుతోంది. 'బ్ర‌హ్మోత్స‌వం' విడుద‌ల తేదీని ఇప్పుడు ప‌క్కాగా ఫిక్స్ చేసేసారు. మే నెల్లో విడుద‌ల చేస్తార‌న్న స‌మాచారం త‌ప్ప, అధికారికంగా ఈ సినిమా రిలీజ్ ను ఇంత వ‌రుకూ అనౌన్స్ చేయలేదు. మే 6 న కానీ, 24 కానీ లేదా మే 31న కానీ 'బ్ర‌హ్మోత్స‌వం' విడుద‌ల ఉంటుంద‌ని, ఇప్ప‌టివ‌రకూ అంద‌రూ భావించారు. కానీ అనూహ్యంగా మే 13న ఉంటుంద‌ని సూప‌ర్ స్టార్ షాకిచ్చాడు. అంతేకాదు ఆడియో రిలీజ్ డేట్ పై కూడా ఇప్పుడు స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమ‌న్ రిలేష‌న్స్ తో ప‌క్కా కుటుంబ క‌థా చిత్రంగా 'బ్ర‌హ్మోత్స‌వం' సినిమా తెర‌కెక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలో తిరుమ‌ల తిరుప‌తి ‘బ్ర‌హ్మోత్స‌వం’ ఎపిసోడ్ హైలైట్ కాబోతోంద‌ని అంటున్నారు. సూప‌ర్ స్టార్ ఖాతాలో ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్టుగా న‌మోద‌వుతుందేమో చూడాలి.

కేజ్రీ మూవీ 24..
మే నెల్లోనే రాబోతున్న మరో సూపర్ క్రేజీ మూవీ '24'. కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య, వెరైటీ కథల్ని నెరేట్ చేయడంలో చెయి తిరిగిన దర్శకుడు విక్రమ్ కుమార్ కలయికలో వస్తున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ మే 6 న రిలీజ్ కు సిద్ధమౌతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ , కోలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 24. సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. విడుదలకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న 24 టీం ఫైనల్గా మే 6న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ముందుగా ఏప్రిల్ నెలాఖరున సినిమా రిలీజ్కు ప్లాన్ చేసినా టాలీవుడ్లో సరైనోడు రిలీజ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఫైనల్గా సూర్య 24 రిలీజ్ కు మే 6న ముహుర్తం ఖరారు చేశారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. సూర్య తన సొంత నిర్మాణసంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాడు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్పై చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్య‌కు అభిమానులున్నారు. ఆయ‌న న‌ట‌న‌ను ఆరాధించే వాళ్లున్నారు. ఇప్పుడు 24 సినిమా విష‌యంలో ఇది మరోసారి ప్రూవైంది. సాధార‌ణంగా ఆడియో వేడుక‌లంటే వీకెండ్స్ లో ప్లాన్ చేస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ఫంక్ష‌నైనా వారాంతంలో పెట్టిన‌పుడే జ‌నం కూడా వ‌స్తారు. అభిమానుల‌కు కూడా అనువుగా ఉంటుంది. కానీ మొన్న సూర్య 24 సినిమా ఆడియో వేడుక ఆ మధ్యజరిగింది. కానీ శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు ఫుల్ క్రౌడ్ వ‌చ్చారు. సూర్యను చూడ్డానికి అభిమానులు ఎగ‌బ‌డ్డారు. పైగా 24 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తెలుగులో అదిరిపోతోంది. ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి మ‌రీ సినిమాను కొనేస్తున్నారు బ‌య్య‌ర్లు. తెలుగులో 20 కోట్ల బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. ఇదంతా సూర్య‌కు ఉన్న క్రేజ్.. విక్ర‌మ్ కే కుమార్ పై ఉన్న న‌మ్మ‌క‌మే. ఓ త‌మిళ సినిమాకు ఇంత స్థాయి మార్కెట్ అంటే చిన్న విష‌య‌మేమీ కాదు. పైగా కొంత‌కాలంగా సూర్య ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇంత జ‌రిగినా.. 24 సినిమాపై మాత్రం ఎక్క‌డ‌లేని ప్రేమ‌ను చూపిస్తున్నారు మ‌న ప్రేక్ష‌కులు. చూడాలిక‌.. సూర్య ఈ న‌మ్మ‌కాన్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టుకుంటాడో..?

అ.ఆ..
ఇక సమ్మర్ సమరానికి సిద్ధపడ్డ మరో సినిమా త్రివిక్రమ్ అ, ఆ. నితిన్ హీరోగా, సమంత, మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ తెచ్చేసుకుంది. త్రివిక్రమ్ బ్రాండ్ వేల్యూతో అ, ఆ మూవీ బ్రహ్మాండమైన బిజినెస్ కూడా చేసేసింది. మే 6 న వస్తున్న ఈ సినిమా గురించి సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వెండి తెరకు అర్ధవంత మైన పదాలను అద్ది ఆ పదాలతో చక్కని సంభాషణలు వ్రాసి అది ఏ ఆర్టిస్ట్ చెబితే సూటిగా ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుందో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తెలిసినంత గా ఎవరికీ తెలియదని తెర ఎరిగిన సత్యం. తను ఏమి చెప్పా లనుకున్నాడో దొంక తిరుగుడు లేకుండా సూటిగా తెరపై పాత్రలు ద్వారా రావలసిన పలితాన్ని రాబట్టి అటు ప్రేక్షకులనే కాదు సినీ పండితులను సైతం ఆలోచించే విధం గా వుంటాయి ఈ మాష్టారి మాటలు. ఇప్పుడు అ ఆ అంటూ మరో ప్రేమ కదా చిత్రం ‘అ ఆ ‘ల కొత్త అర్ధాన్ని చెపుతూ మే 6న ప్రేమికుల హృదయాన్ని వెచ్చగా తట్టబోతున్నాడు త్రివిక్రమ్. అ, ఆ షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఈ సినిమా విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన సమంతా .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. లవ్ .. సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ ఇవన్నీ కూడా త్రివిక్రమ్ సినిమాలో పర్ఫెక్ట్ గా వుంటాయి. ఆడియన్స్ ను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంటాయి .. అనూహ్యమైన విజయాలను అందుకుంటూ వుంటాయి. అదే జాబితాలో ఈ సినిమా కూడా చేరబోతోందంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ అ, ఆ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మే 6న అ..ఆ..
చిన్నదాన నీకోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాలతో డీలా పడ్డ నితిన్ .. అ, ఆ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు.గతంలో ముగ్గురు స్టార్ హీరోలతో రెండేసి చొప్పున సినిమాలు తీసిన త్రివిక్రమ్ తరువాత హీరో గా నితిన్ ను ఎన్నుకోవడమే ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయింది. ఈ సినిమా తో త్రివిక్రమ్ తన రేంజ్ ను తగ్గించుకొన్నాడని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. అయితే త్రివిక్రమ్ పై నున్న అపారమైన నమ్మకంతో చిన్న హీరో సినిమా అయినా... అ, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరుతుందని అనుకుంటున్నారు. మే లో అన్ని పెద్ద సినిమాలతోనూ పోటీ పడుతూ... అ, ఆ మండే ఎండల సీజన్ ను పండువెన్నెల విందుచేస్తుందని త్రివిక్రమ్ అభిమానులు భావిస్తున్నారు. మరి మే 6న వస్తున్న ఈ సినిమా అందరి అంచనాల్ని ఎలా అందుకుంటుందో చూడాలి.

సుప్రీమ్..
ఇక ఫైనల్ గా ఈ సమ్మర్ లో వస్తున్న మరో హీటెక్కించే మూవీ సుప్రీమ్. సాయిధర్మ్ తేజ హీరోగా పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి మలిచిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో సరైన సినిమాలు తీయలేకపోతున్న దిల్ రాజు సుప్రీమ్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా మే 6 సమరానికి సిద్ధంగా ఉంది.

సుప్రీంపై దిల్ రాజు ఆశలు.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు.. ఈ మధ్య బాగా డల్ అయిపోయాడు. ఆయన బేనర్ స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. గత ఏడాది సుబ్రమణ్యం ఫర్ సేల్.. కేరింత సినిమాలు ఓ మోస్తరుగా ఆడగా.. ఈ ఏడాది ‘కృష్ణాష్టమి’ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో మాంచి హిట్టిచ్చి తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఆయన ఆశలన్నీ ‘సుప్రీమ్’ మీదే ఉన్నాయిప్పుడు. ఏప్రిల్ 1నే విడుదలవుతుందని అనుకున్న ఈ సినిమా.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం సుప్రీమ్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సుప్రీమ్ సినిమాను మే 6న విడుదల చేయాలని ఫిక్సయ్యాడు రాజు. ఐతే ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్-సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అ..ఆ’ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా నెల రోజుల ముందే రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఐతే మే 13న ‘బ్రహ్మోత్సవం’ రిలీజవుతున్న నేపథ్యంలో పోటీ ఉన్నా సరే.. మే 6నే ‘సుప్రీమ్’ రిలీజ్ చేయడం బెటరని ఫిక్సయ్యాడట రాజు. అంతేకాదు అదే రోజున సూర్య 24కి కూడా సుప్రీమ్ పోటీగా బరిలోకి దిగుతోంది. అనిల్ రావిపూడి మిలిచిన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దిల్ రాజు.

రికార్డ్సు బద్దలు కొడుతుందా 
ఇక సుప్రీమ్ కు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ సీజన్ లో రిలీజౌతున్న మిగతా మూడు సినిమాలూ మూడు వేరు వేరు జోనర్స్ లో సినిమాలు. బ్రహ్మోత్సవం పక్కా ఫ్యామిలీ జానర్, 24 పక్కా సెంటిఫిక్ జానర్, ఇక త్రివిక్రమ్ అ, ఆ రొమాంటిక్ లవ్ జానర్ . సుప్రీమ్ మాస్ యాక్షన్ జానర్ . కాబట్టి సమ్మర్ సీజన్ కు మాస్ యాక్షన్ మూవీ అయిన సుప్రీమ్ కు కలెక్షన్స్ బాగా ఉండొచ్చని అంటున్నారు. పైగా పెద్ద సినిమాలైన వాటితో సుప్రీమ్ కు ఏ మాత్రం పోటీ ఉండదని కూడా అంటున్నారు. మొత్తానికి సాయిధర్మ తేజ్ సుప్రీమ్ సరైన టైమ్ చూసుకొని సమ్మర్ బరిలోకి దిగుతున్నాడు. సినిమా ఏ మాత్రం హిట్టు టాక్ తెచ్చుకున్నా సుప్రీమ్ టాక్సీ కి తిరుగే ఉండదు. మే 6 న వస్తున్న సుప్రీమ్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

సమరంలో విజేతలు ఎవరు ? 
ప్రతి సినిమా రిలీజ్‌కి సుమారు రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆయా హీరోల మూవీల రిలీజ్ డేట్స్ మాత్రం పోటాపోటీగా ఉండడం విశేషం. సమ్మర్ హాలిడేస్‌లో మరి ఈ రూల్ వర్తించదు కదా..? అందుకే మే నెల్లో నాలుగు సినిమాలూ అవకాశాన్ని వినియోగం చేసుకోడానికే ట్రై చేస్తున్నాయి. మరి ఈ సమ్మర్ సమరంలో ఎవరు విజేతలో చూడాలి.   

07:57 - April 22, 2016

వేసవిలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. చెమట రూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవహారం తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్లు సమృద్ధిగా అందుతాయి. ఎండ దెబ్బకు వచ్చే నీరసాన్ని చిటికెలో నివారించే వీలు చిక్కుతుంది. దీనికితోడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటి తిండ్లకు దూరంగా ఉంటే వేసవిలో అనారోగ్య సమస్యలు రాకుండా గట్టెక్కొచ్చు. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు.. తాగకూడదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? 

మజ్జిగ : వేసవికాలంలో తీసుకోవాల్సిన బెస్ట్‌ ఫుడ్స్‌లో మజ్జిగ ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు... శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.

పుదీనా: ఇది మనకు చాలా సులభంగా దొరుకు తుంది. చౌకైనది కూడా. ఇదొక హెల్దీ హెర్బ్‌. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు . పుదీనాతో మంచి ఫ్లేవరబుల్‌ చట్నీలు చేసుకోవచ్చు . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్‌ గా సహాయపడుతుంది.

ఉల్లిపాయలు: ఉల్లిపాయలో అమేజింగ్‌ కూలింగ్‌ ప్రొపర్టీస్‌ ఉన్నాయి . అందుకే వీటిని రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవాలి. కర్రీస్‌, సలాడ్స్, రైతాలు, చట్నీస్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది . ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్‌ యాంటీ అలర్జిన్‌ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.

పుచ్చకాయ : వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్‌ ఫుడ్‌ పుచ్చకాయ. ఈ రెడ్‌ కలర్‌ జ్యూస్‌ ఫ్రూట్‌ లో 90శాతం నీళ్లు, 10శాతం ఫ్లెష్‌ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది.

కర్బూజా : వేసవికి మరో బెస్ట్‌ ఫుడ్‌ మస్క్‌ మెలోన్‌ (కర్బూజా). వేసవిలో డైలీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరో ఆహారం ఇది. ఇందులో ఉండే వాటర్‌ కంటెంట్‌ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది.

జామకాయ: జామకాయలో విటమిన్‌ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.

కొబ్బరి బోండాం: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది.

నిమ్మకాయ: శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది.

కీరదోసకాయ: కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.

ఫైనాపిల్‌: ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్‌ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

10:15 - April 12, 2016

వేసవిలో బయట అతిగా తిరగడం, తినడం ఈ రెండూ పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. ఆయిల్‌స్కిన్‌ ఉన్నవారిపై మాత్రం ఎండ ప్రభావం స్వల్పంగా ఉంటుంది. వేసవిలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. పాలిస్టర్‌, టెరీకాటన్‌, పట్టునైలాన్‌, షిఫాన్‌ వంటి చీరలను అస్సలు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు నూలు చీరలు మామూలు కాటన్‌ చీరలు వాడటం శ్రేయస్కరం. అలాగే వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురురంగు వస్త్రాలను, దుస్తులనుగానీ ఉపయోగించరాదు.
లేత రంగువి లేదా తెలుగు రంగువి ఎండ వేడిమిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది. బ్రాలని, జాకెట్లను వదులుగా తొడుక్కోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే జాకెట్లు వాడకూడదు. వేసవిలో అలంకరణల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. నూనె పదార్థాలు తినటం అస్సలు మంచిది కాదు.
నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, పైనాపిల్‌, మ్యాంగో వంటి ఫ్యూట్‌ జ్యూస్‌లను తీసుకోవాలి. బాదం మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ వంటివి తీసుకోవచ్చు. మజ్జిగనీళ్ళు, పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. తేనె కలిపిన నిమ్మరసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో రెండుపూటలా చన్నీళ్ళ స్నానం చేయాలి. 

07:37 - April 11, 2016

సమ్మర్‌ వచ్చిందంటే అందరికీ హడలే. ఎండాకాలం అంటే బయట మాత్రమే కాదు. ఇంట్లో కూడా చాలా హాట్‌గా ఉంటుంది. చెమట, ఉక్కపోత కారణంగా.. ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా.. వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. తీవ్రస్థాయిలో ఉండే ఎండలకు వడదెబ్బ తగలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం..

ఆనియన్‌ జ్యూస్‌: వడదెబ్బ నివారించడానికి ఆనియన్‌ జ్యూస్‌ చక్కటి హోం రెమిడీ. ఆనియన్‌ జ్యూస్‌ని చెవుల వెనుక భాగం, ఛాతీ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి కడుపులోకి తీసుకోవచ్చు. 

చింతపండు రసం: చింతపండులో విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వేడినీటిలో చింతపండు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిలో పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.

మజ్జిగ : మజ్జిగలో ప్రొబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినీళ్లు : మంచినీళ్లు ఎక్కువగా తాగలేనప్పుడు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి.. ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.

కొత్తిమీర లేదా పుదీనా జ్యూస్‌ : కొత్తిమీరతో గానీ, పుదీనా ఆకులతో గానీ జ్యూస్‌ తయారుచేసుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగడం వల్ల వడదెబ్బ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ సింపుల్‌ హోం రెమిడీ బాడీలో హీట్‌ని తగ్గిస్తుంది.

తులసి విత్తనాలు : తులసి విత్తనాలను రోజ్‌ వాటర్‌లో కలిపి, తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

సోంపు : సోంపు గింజలు శరీరంలో ఉష్ణోగ్రతని వేగంగా తగ్గిస్తాయి. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. కాబట్టి గుప్పెడు సోంపు గింజలు తీసుకుని, రాత్రంతా నానబెట్టి..ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఫలితం ఉంటుంది.

12:37 - March 20, 2016

విశాఖపట్టణం : జూలో మృగరాజు నీటి కొలను నుంచి బయటకు రావటంలేదు. పులి గాండ్రించటంలేదు.. పక్షులు చురుగ్గా ఉండడంలేదు.. మిగిలిన జంతువులూ సేమ్‌ టు సేమ్‌..!! ఎందుకిలా..? విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్. సందర్శకులకు దర్శనమివ్వని వన్యప్రాణులు. నీడచాటున తప్ప మరెక్కడా కానరాని జంతువులు. ఈ పరిస్థితికి కారణం ఒకటే.. ! ప్రజలను చండప్రచండ వీక్షణంతో బెంబేలెత్తిస్తోన్న భానుడు.. జంతువులపైనా అంతే తీక్షణతను చూపుతున్నాడు. దీంతో మూగప్రాణులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. విశాఖపట్నంలో ప్రస్తుతం 37 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జంతువులు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం అల్లాడుతున్నాయి. ఎండకు బెదిరి.. చెట్ల నీడన, బోనుల్లోనే ఉండిపోతున్నాయి. జంతువులకు నీరూ ప్రధాన సమస్యగా మారింది. జూపార్క్‌లోని నీటికొరత కారణంగా.. మూగజీవుల సంరక్షణ కష్టతరమైందని అధికారులు చెబుతున్నారు. అయినా.. వేసవితాపం నుంచి మూగజీవాలను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అంటున్నారు.

నెలకొరిగిన 2500 భారీ వృక్షాలు..
హూద్ హూద్ తుపాను వల్ల 2500 భారీ వృక్షాలు విశాఖ జూలో నేలకొరిగాయి. దీని వల్ల పచ్చదనం తగ్గి ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి జంతువులను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. వేసవిలో వన్యప్రాణులను కాపాడుకోవడం జూ అధికారులకు సవాల్ గా మారుతోంది. గత ఏడాది 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవి దాన్ని తలదన్నే రీతిలో ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూలోని అరుదైన జంతుజాలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

07:52 - March 9, 2016

చెమట పడితే శరీరానికి మంచిదే. వ్యర్థాలు ఆ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కానీ కొంతమందికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. అవేంటంటే...
శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో 'బి' విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అరటి పండ్లు, గుడ్లు, గింజలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.
శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్‌ 'సి' ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అందుకోసం పాలు, క్యారెట్‌, ఆకుకూరలు, చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.
జింక్‌ తగినంతగా ఉంటే నోటి, శరీర దుర్వాసనలు తొలగిపోవడంతో పాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. వేయించిన గుమ్మడి గింజల్లో, ఎండిన పుచ్చకాయ గింజల్లో జింక్‌ ఎక్కువగా దొరుకుతుంది. పది గ్రాముల గుమ్మడి గింజలని తింటే వాటి నుంచి రోజువారీ అవసరాలకు కావల్సిన జింక్‌లో డెబ్బై శాతం లభిస్తుంది.

Don't Miss

Subscribe to RSS - వేడిమి