వైఎస్ జగన్

07:39 - December 17, 2018

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనైతిక పొత్తులు పెట్టుకోవడంలో, అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. నందమూరి హరికృష్ణ మృతదేహం పక్కనే పెట్టుకుని టీఆర్ఎస్‌తో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించడం దారుణం అన్నారు. టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తును కేటీఆర్ వ్యతిరేకించడంతోనే.. చంద్రబాబు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసన్నపేట బహిరగం సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

21:22 - November 28, 2018

శ్రీకాకుళం: రుణమాఫీ విషయంలో మహిళలు, రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ రేట్లు పెంచి కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నారని, నదుల అనుసంధానం పేరుతో నిధుల దోపిడీకి పాల్పడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. 308వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
తిత్లీ తుఫాన్ బాధితులకు కనీసం 15శాతం న్యాయం కూడా చేయలేదని.. ప్రచార ఆర్భాటమే తప్ప బాధితులను ఆదుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాన్ వల్ల రూ.3,435 కోట్లు నష్టం జరిగిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని... అంత నష్టం వాటిల్లితే.. బాధితులకు ఎంత డబ్బిచ్చారు అని జగన్ ప్రశ్నించారు. అంత భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు రూ. 520 కోట్లు మాత్రమే విడుదల చేశారని.. ఆయన చెప్పిన నష్టంలో 15శాతం కూడా ఇవ్వలేదన్నారు. రూ. 520 కోట్లలో కూడా రూ. 210 కోట్లే ఖర్చు చేశారని చెప్పారు. కానీ ప్రచారం కోసం తిత్లీ బాధితులను ఆదుకున్నామని విజయవాడలో ప్లెక్సీలు, ఆర్టీసీ బస్సులపై ఫొటోలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా చంద్రబాబు తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకునే విధంగా ఉందన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు.. మీ దీవెనలతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. జగన్‌ అనే నేను.. ఆ 3,435 కోట్లలో ప్రతిరూపాయి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

10:31 - November 21, 2018

విజయనగరం: సొంతిల్లు అనేది కల.. జీవితాంతం కష్టపడితే కానీ ఓ ఇంటి వారు కాలేరు. దీనికి కూడా లక్షలకు లక్షలు అప్పు తీసుకోవాలి.. ప్రతినెలా వేలకు వేలు వడ్డీలు కట్టాలి. ఇది కామన్. ఈ సిస్టమ్ మారుస్తానంటూ హామీ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్. విజయనగరం జిల్లా కురుపాం ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఊహించని హామీ ఇచ్చారు. పేదలు అందరికీ ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఫ్రీగా ఇచ్చే ఆ ఇంటిని ఇంట్లోని తల్లి లేదా భార్య పేరుతో రిజిస్ట్రర్ చేయించి ఇస్తామని వెల్లడించారు. 
ఉచిత ఇల్లుపై బ్యాంక్ అప్పు కూడా :
 అధికారంలోకి వస్తే ఉచితంగా కట్టించి ఇచ్చే ఇల్లుపై బ్యాంక్ అప్పు కూడా వచ్చే విధంగా చూస్తామన్నారు. అత్యవసరంగా డబ్బు అవసరం అయితే బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చన్నారు. అలా తీసుకునే అప్పుపై కేవలం 25పైసలు (పావలా) మాత్రమే వడ్డీ వసూలు చేసే విధంగా ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు జగన్. ఇల్లు కట్టించి ఇవ్వటమే కాకుండా ఆ ఇంటిపై అప్పు తీసుకోవటం, దానికి కేవలం పావలా వడ్డీ స్కీమ్ తీసుకురావటం జరుగుతుందన్నారు. దీనిపై అత్యవసర సమయంలో వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకుని.. కట్టలేని దుర్భర స్థితి ఉండదన్నారు. 2019లో దేవుడు దయతలచి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తానని ప్రకటించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్లను ఈ విధంగా నిర్మించి ఇవ్వటం జరుగుతుందన్నారు.

16:54 - November 10, 2018

కడప: కాంగ్రెస్-టీడీపీ కలయికను నిరసిస్తూ ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య వైసీపీలో చేరుతున్నారు. ఈనెల 13న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎల్లుండి నుంచి వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న బొబ్బిలిలో బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. అయితే ఏ ప్రతిపాదనతో ఆయన వైసీపీలో చేరుతున్నారు?.. ఏదైనా హామీ లభించిందా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయ్య కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

10:58 - November 3, 2018

ప్రకాశం: ఎన్నికల కాలం వచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలల కాలం ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలకు చెక్ పెట్టే పని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి కాయకల్ప చికిత్స ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహించిన ఆయన.. పద్ధతి మార్చుకోకుంటే ఫైరింగే అంటు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు వరుసగా రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. అటు అధికారిక కార్యక్రమాలతో పాటు, ఇటు పార్టీ ప్రాధాన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉండేలా ఈ సారి షెడ్యూల్ రూపొందించారు. శుక్రవారం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రబాబు రాత్రి బస చేసి మరీ పార్టీలో నెలకొన్న వివాదాలను పరిష్కరించే పనిలో పడ్డారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీడీపీకి పార్టీ పరంగా అత్యంత సమస్యాత్మకమైనవి ఆరు ఉన్నాయి. వాటిలో నాలుగు నియోజకవర్గాలపై అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. నాయకుల మధ్య పొరపొచ్చాలు, అవినీతి, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి వంటివి ఆయా చోట్ల అసమ్మతికి కారణమైన నేపథ్యంలో సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే పని ప్రారంభించారు.

Image result for chandrababu angryపార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు, నేతల ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టే దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు జిల్లా నేతలతో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. సంతనూతల పాడు సమన్వయ కమిటీ సమావేశంలో.. పార్టీ నేతలకు చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. రాజకీయాలు తనకు నేర్పవద్దంటూ సంతనూతలపాడు నేతలపై సీరియస్ అయ్యారు. ప్రతీ ఒక్కరి జాతకం తన వద్ద ఉందన్న సీఎం.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేను గౌరవించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నామంటే అర్ధమేంటని నేతలను నిలదీశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో.. వర్గ విబేధాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు.. ఇకనైనా తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో ఇంకా కొత్త, పాత వంటి పదాలు వినిపిస్తున్నాయని, అన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. పార్టీ శ్రేణులకు భవిష్యత్ దిశానిర్దేశం  చేశారు. రానున్నది ఎన్నికల కాలమన్న చంద్రబాబు.. కలికట్టుగా పనిచేసి.. పార్టీ విజయానికి దోహద పడాలని సూచించారు. మిగిలిన నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు.

Image result for veligonda projectఇక తొలి రోజు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. మార్టూరు మండలం డేగరమూడి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు....వెలిగొండ  ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాకు నీళ్లు ఇచ్చామన్న చంద్రబాబు...త్వరలోనే గోదావరి నీళ్లను నాగార్జున సాగర్‌కు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌ స్థానానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

జగన్‌పై జరిగిన దాడిపై చంద్రబాబు తన శైలిలో స్పందించారు. కోడి కత్తిపైన వైసీపీ నానా రచ్చ చేసిందని...దాడి చేసింది జగన్ వీరాభిమాని అయితే అది టీడీపీ పెట్టారంటే తనకు ఏం చెప్పాలో  తెలియట్లేదన్నారు. అసలు ఇదెక్కడి కోడి కత్తి డ్రామానో అర్థం కావడం లేదని  చంద్రబాబు అన్నారు.

Image result for attack on ys jaganవిభజన హామీలను నెరవేర్చమంటే కేంద్రం దాడులకు దిగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రత్యర్థులను వేధించడం కోసమేనని అన్నారు. ఇవన్నీ చూసి ఓ సీనియర్ నాయకుడిగా తట్టుకోలేకపోయానని..రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఉద్ధేశ్యంతోనే జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్నాని చంద్రబాబు స్పష్టం చేశారు.

తొలిరోజు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినా.. రెండో రోజు మాత్రం పార్టీకి ఇబ్బంది పెడుతున్న సమస్యలకు చెక్ పెట్టనున్నారు. మరి చంద్రబాబు హెచ్చరికలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి. 

 
16:53 - October 31, 2018

హైదరాబాద్: తనపై హత్యాయత్నం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని జగన్ ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందని, దాడి వెనుక ప్రభుత్వం వైఫల్యం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై జరిగిన దాడిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 8మందిని జగన్ ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ హోం సెక్రటరీ, డీజీపీ కనుసన్నల్లోనే సిట్ విచారణ కొనసాగుతోందని, ఆ విచారణపై తనకు నమ్మకం లేదని జగన్ తెలిపారు.

Image result for jagan attackedహత్యాయత్నం కేసులో సక్రమంగా విచారణ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని, కుట్ర కోణాన్ని సజావుగా దర్యాప్తు చేయాలని కోరుతూ జగన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వ తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా ఆపరేషన్ గరుడ పేరిట ఓ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని జగన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ అని చెబుతున్నారని, టీడీపీ సానుభూతిపరుడే ‘ఆపరేషన్ గరుడ’ పాత్రధారి అని, అతను నటుడు శివాజీ అని ఆరోపించారు. పాదయాత్రలో తనపై ఓ దాడి చేస్తారని, టీడీపీ ప్రభుత్వ పతనానికి ఆ సంఘటన దారితీస్తుందని నటుడు శివాజీ గతంలో చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదో భారీ కుట్ర అని అర్థమవుతోందని, ప్రతిపక్ష నేతను హత్య చేసి ‘ఆపరేషన్ గరుడ’లో భాగమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
Image result for jagan attackedఅక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ తన వద్దకు వచ్చి తనపై దాడి చేయబోయాడని జగన్ పేర్కొన్నారు. పదునైన కత్తితో తనపై దాడి చేయబోతే, తాను తృటిలో తప్పించుకున్నానని, కిందకు వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలో గుచ్చుకుందని వివరించారు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని, ప్రాథమిక చికిత్స అనంతరం తాను హైదరబాద్‌కు వచ్చానని, సిటీ న్యూరో ఆసుపత్రిలో తనకు చికిత్స చేసి 9 కుట్లు వేశారని తెలిపారు.
 
తనపై దాడి జరిగిన గంటలోనే ఏపీ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టారని, పబ్లిసిటీ కోసం జరిగిన దాడి అంటూ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని జగన్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇదంతా ఆపరేషన్ గరుడ’లో భాగం’ అని పేర్కొన్న విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. తనపై దాడి చేసిన శ్రీనివాస్ దగ్గర లభ్యమైన లేఖలో మూడు చేతి రాతలు ఉన్నాయని, ఇది అనుమానాలకు తావిస్తోందని జగన్ చెప్పారు.
 
Image result for srinivasa rao accusedకాగా, జగన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.
19:48 - October 28, 2018

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఘటన.. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య చిచ్చు రాజేసింది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ నాయకులు.. సానుభూతి కోసం జగనే చేయించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు జగన్‌కు వీరాభిమాని అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. 

కాగా, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు కొత్త పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనంటూ.. మెంబర్ షిప్ కార్డ్ ఒకటి నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. దీనిపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇదంతా వైసీసీ ట్రేడ్ మార్క్ మార్పింగ్ ట్రిక్‌గా అభివర్ణించారు. అంకాలు నంబూరి అనే వ్యక్తి కార్డుకు సంబంధించిన నంబర్‌ను శ్రీనివాసరావుదిగా వైసీపీ నేతలు మార్చారని.. అవన్నీ ఫోటోషాప్ జిమ్మిక్కులని వెల్లడించారు. ‘మీరు మారరు.. మీ నాయకుడు మారరు’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.

ట్విటర్‌లో వరుస ట్వీట్లతో వైసీపీపై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘‘వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ జిమ్మిక్కులు. కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గంలోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేశారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు’’ అని లోకేశ్ తన ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

18:24 - October 28, 2018

ఢిల్లీ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వమే రక్షణ కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు కోరారు. జగన్‌పై దాడి ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం జరిపే విచారణపై తమకు నమ్మకం లేదని, కేంద్రం తక్షణమే థర్డ్ పార్టీ సంస్థతో విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు. సిట్ లేదా కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలన్నారు. జగన్‌పై దాడి ఘటనపై రాష్ట్రపతి, హోంమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నంపై స్వతంత్ర దర్యాఫ్తు జరిపించాలని రాష్ట్రపతి, హోంమంత్రిని తాము కోరతామన్నారు. ఓటమి భయంతో జగన్‌పై చంద్రబాబే దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే సీఎం కనీసం ఖండించలేదని మండిపడ్డారు. 

జగన్‌పై దాడి ముమ్మాటికీ హత్యాయత్నమే అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే దీనిని ప్రభుత్వం చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందని, సానుభూతి కోసం వైసీపీ కార్యకర్తే దాడి చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రచారం కోసం జగనే చేయించుకున్నారని సీఎం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నిందితుడు శ్రీనివాసరావు, క్యాంటీన్ యజమాని ఇద్దరూ టీడీపీకి చెందిన వారే అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం, డీజీపీ ప్రోద్బలంతోనే హత్యాయత్నం జరిగిందన్నారు. ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబే అన్న వైవీ సుబ్బారెడ్డి... ఆపరేషన్ గరుడపైనా విచారణ జరిపించాలని హోంమంత్రిని కోరతామన్నారు. తిత్లీ తుఫాను సహాయక చర్యల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు విమర్శించారు. ఢిల్లీ వచ్చి కూడా సీఎం అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను అంతమొందిస్తే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవొచ్చని టీడీపీ కుట్ర చేస్తోందని మరో వైసీపీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. శ్రీనివాసరావును ప్రేరేపించి జగన్ హత్యకు కుట్ర చేశారన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. 

జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను ధర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ వైసీపీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పలువురు మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్యనాయకులు ఆదివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. హత్యాయత్నం ఘటనపై విచారణకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని.. ఏపీకి చెందిన పోలీసు అధికారులతో కాకుండా థర్డ్‌ పార్టీతో నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు.

జగన్‌ని అంతమొందించటానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఆరోపించారు. అధికార పార్టీ అండతోనే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని, డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసమే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వారు విమర్శించారు.

16:28 - October 25, 2018

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కత్తితో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. కాగా జగన్‌పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్.. టీడీపీకి చెందిన వాడని వైసీపీ నాయకులు.. కాదు.. జగన్ అభిమాని అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్ అన్న సుబ్బరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్‌కు అభిమాని. ఎలాంటి గొడవలు పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు' అని చెప్పాడు.

మరోవైపు శ్రీనివాస్ జగన్ అభిమాని అని చెప్పే విధంగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తిరుగుతున్నాయి. న్యూ ఇయర్, పొంగల్ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో శ్రీనివాస్ రూపొందించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్ ఫొటో పక్కన తన ఫొటో ఉంచి విషెస్ చెబుతూ ఈ పోస్టర్ తయారు చేయించాడు శ్రీనివాస్.

16:05 - October 25, 2018

హైదరాబాద్: తనపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. నేను క్షేమంగా ఉన్నానని జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, ప్రజల ప్రేమ, ఆశీర్వాదం తనను కాపాడాయని చెప్పారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు నేను భయపడను అన్న జగన్.. ప్రజల కోసం మరింతగా కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు. పిరికిపందల చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని.. తన ప్రజా సంక్షేమ పోరాటాలను ఆపలేవని జగన్ పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని జగన్ కోరారు. 

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కత్తిపోటుకు గురైన జగన్ కాసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య నేరుగా నగరంలోని సిటీ న్యూరో సెంటర్‌కు బయల్దేరారు. భార్య భారతి జగన్ వెంట ఉన్నారు. 

సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో జగన్ భుజానికి చికిత్స జరుగుతోంది. జగన్ భుజానికి తగిలిన గాయానికి మూడు కుట్లు వేసినట్టు తెలుస్తోంది. జగన్‌కు గాయమైన ప్రదేశంలో రక్తనమూనాలను పరిశీలించాల్సి ఉందని, కత్తిపై విషపదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న విషయం పరీక్షల తర్వాత తేలే అవకాశం ఉందని సమాచారం.

Pages

Don't Miss

Subscribe to RSS - వైఎస్ జగన్