వైడ్ యాంగిల్

20:15 - September 25, 2017

నోరు జారుతున్నారు. సై అంటే సై అంటున్నారు. తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీకంత సీన్ లేదంటే నీకంత సీన్ లేదంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంతని సవాల్ విసురుతున్నారు.. ఏం జరుగుతోంది? నార్త్ కొరియా మొండితనం, పెద్దన్న మూర్ఖత్వానికి ఫలితం ఏం కాబోతోంది? ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలీ ఉద్రిక్తతలకు కారణం ఎవరు? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..

ఓ పక్క బెదిరింపులు...మరోపక్క ఆంక్షలు..ఆకాశం నుంచి మిస్సైళ్లు.. సముద్రతలం నుంచి యుద్ధ నౌకలు.. ఉత్తరకొరియాను పిప్పి చేస్తాం అని ట్రంప్ పళ్లు నూరుతుంటే.., పోవోయ్.. నీకంత సీన్ లేదు.. నీ తాట తీస్తా అంటున్నాడు ఉత్తరకొరియా కిమ్. ఈ ఇద్దరి వ్యవహారం శృతిమించి యుద్ధంగా పేలితే అది ప్రపంచానికి తీరని ముప్పు కావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.ఉత్తరకొరియా..అన్ని విషయాల్లోనూ అమెరికా కంటే చిన్నదే. నో డౌట్. కానీ మొండితనంలో మాత్రం తక్కువది కాదు. నా జోలికొస్తే నేను నష్టపోయినా నిన్ను వదలను అనే తరహాలో కనిపిస్తోంది. అసలు ఉత్తర కొరియా ధైర్యమేంటి. ఆంక్షల వలయం చుట్టుముడుతున్నా అణుపరీక్షలు కొనసాగించటంలో ఆంతర్యమేంటి.

ఉత్తర కొరియాతో అమెరికా తలపడుతుందా? చిన్నదేశం కొరియాకు అంత శక్తి ఉందా? అసలు కొరియా అమెరికాకు ప్రత్యర్థిగా ఎందుకు మారింది? అమెరికాను సవాల్ చేసే పరిస్థితికి ఎందుకొచ్చింది? ఆయుధాలు ఎందుకు సమకూర్చుకుంటోంది? ఈ పరిస్థితులకు ప్రపంచ పెద్దన్న ఎంత వరకు కారణం.. తినటానికి తిండి లేకపోయినా చేతిలో ఆయుధం కావాలి. అభివృద్ధి అంతంత మాత్రమే అయినా, ఆయుధాగారం నిండుగా ఉండాలి.. విద్య, సామాజిక అబివృద్ధి మాట తర్వాత.., బడ్జెట్ లో మెజారిటీ కేటాయింపులు అణ్వాయుధాలకే కేటాయిస్తున్న పరిస్థితి అనేక ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కనిపిస్తున్నదృశ్యం .. దీనికి కారణం ఎవరు? పేదరికం, అవిద్య, వెనుకబాటుతనం వర్ధమానదేశాలను వేధిస్తున్నాయి. అభివృద్ధి క్రమంలో ఈ రంగాలపై ఆ దేశాలు దృష్టి పెట్టాల్సిన సందర్భం ఇది. కానీ, అమెరికా ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని పరిహసిస్తూ, తన ప్రయోజనాల కోసం, ప్రపంచంపై తన పట్టుకోసం సామంత రాజ్యాల తరహాలో మెలగమంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ క్రమంలో ఆంక్షలు, బెదిరింపులు ఎన్ని చుట్టుముట్టినా పోరాటానికి దిగే వాళ్లూ ఉంటారు. ఇప్పుడు ఉత్తరకొరియా మొండితనం వెనుక ఇలాంటి కారణాలే కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:30 - September 22, 2017

 

అరవై కెమేరాలు..అనుక్షణం పరిశీలించే కళ్లు.. కోట్లాది ప్రేక్షకులు.. చివరకు మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు.. వెరసి ఇప్పుడు సీజన్ వన్ టైటిల్ ఎవరిదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బిగ్ బాస్ షో మొదలయ్యేపుడు..ఈ గందరగోళం తెలుగులోకి కూడా వచ్చిందా అనే వాదనలు వినిపించాయి. ప్రేక్షకుల్లోని వాయరిస్టిక్ ఇంట్రస్ట్ ని రేటింగ్ మార్చుకునే ఈ ప్రోగ్రామ్ ఇతర భాషల కంటే తెలుగులో కాస్త క్లీన్ గానే సాగిందనే ఇంప్రెషన్ తెచ్చుకుంది. 

బతకటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ నో సెల్‌ఫోన్, నో టీవీ, నో న్యూస్ పేపర్. వర్చువల్ లివింట్ ఎన్వైర్ మెంట్. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు లేని పరిస్థితి. కానీ, తలుపుసందులోంచి చూసే వాడికి కలిగే ఆనందాన్ని నిద్రలేపి క్యాష్ చేసుకునే ఈ ప్రోగ్రామ్ ఫార్మాట్ తెలుగులోనూ మంచి ఫాలోయింగే సాధించింది. ఇప్పుడు టెలివిజన్ చరిత్రలో మొదటి సారి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో బిగ్ బాస్. హిందీలో సల్మాన్ తో నడిచిన ఈ షో కోసం తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ తారక్ కు అప్పజెప్పారు. అయితే అప్పటి వరకు బుల్లి తెర మీద ఎలాంటి షోలు చెయ్యని తారక్ బిగ్ బాస్ షోని ఎంతవరకు లాగగలడు అని అందరు అనుకున్నారు. మరి జూనియర్ తన ప్రతిభతో బుల్లి తెరపై కూడా విశ్వరూపాన్ని చూపించాడనిపించుకున్నాడు. బిగ్ బాస్ షోమొదటి సీజన్ లో తారక్ రోల్ కు మంచి మార్కులే పడ్డాయి


బిగ్ బాస్ షో..దేశ విదేశాల్లో ఈ షోకున్నంత ఆదరణ.. మరే టీవీ రియాల్టీషో కి రాలేదంటే అతిశయోక్తి కాదు.. అదే సమయంలో దీనిపై విమర్శలూ అదే రేంజ్ లో వచ్చాయి.. తెలుగులో కాస్త ప్రశాంతంగానే నడిచిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ వన్ గెలుపెవరిదా అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో రేకెత్తిస్తోందివినోదానికి అర్ధాలు, రూపాలు మారుతున్న కాలం. కొన్ని టీవీ షోలు బూతు డైలాగులను, డబుల్ మీనింగ్ పంచ్ లనే ఎంటర్ టెయిన్ మెంట్ గా భావిస్తున్న పరిస్థితి ఇప్పుడుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి కబుర్లు తెలుసుకోవాలనుకునే సాధారణ మనిషిలోని ఉత్సాహాన్ని నిద్రలేపటంలో కొంత వరకు సక్సెస్ అయింది. ఇప్పుడీ గేమ్ లో టైటిల్ విజేత ఎవరో త్వరలో తేలనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

20:14 - September 21, 2017

బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబురం. తీరొక్క పూలు, కోటొక్క పాటల కోలాహలం. తెలంగాణ అస్తిత్వ వైభవం. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం. ప్రకృతి రమణీయత. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. తెలంగాణలో బతుకమ్మ సంబరం మొదలైంది. ఎంగిలి పూల వేడుకతో ఆరంభమైంది. అసలు బతుకమ్మ తెలంగాణకు ఎలాఅస్తిత్వమైంది...ఆడపడుచులతో ఎలా మమేకమైంది...బతుకమ్మ ఇచ్చే బతుకు సందేశమేంటి. బతుకమ్మ పూలతో చేసే జాతర. అందాల హరివిల్లును నేలమీద పరిచే వేడుక . కంచెలు కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న తెలంగాణలో కన్నీటి చెలిమె బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటపు పండగ బతుకమ్మ. తెలంగాణ ఊరూవాడా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

బతుకమ్మపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే బతుకమ్మ అంటే ప్రకృతితో పెనవేసుకున్న మానవీయ బంధం. సమతా మమతల సారం. ఒక నవ్యనూతన సామాజిక చైతన్యం. ప్రకృతితో బతుకమ్మ ఎలా మమేకమైంది...దేనికీ పనికి రాని పూలకు బతుకమ్మ ఉత్సవం ఎలా విలువనిచ్చింది...బతుకమ్మ అంటే మూర్తీభవించిన మహిళ. చెరువుల రక్షణ కోసం ప్రాణార్పణకు వెరవని మగువ. సామాజిక చైతన్య తెగువ. దశాబ్దాల బతుకమ్మ ఉత్సవం స్త్రీలతో ఎలా పెనవేసుకుంది..?బతుకమ్మ చుట్టూ రాజకీయం ఎందుకు ముసురుకుంటోంది...బతుకమ్మ ఉత్సవం కొందరికే సొంతమైనట్టు ప్రచారమెందుకు...బతుకమ్మ అస్తిత్వమైన తెలంగాణలో బతుకుమ్మలను ఎందుకు చిదిమేస్తున్నారు...మహిళా సంఘాలు సంధిస్తున్న ప్రశ్నలివి. బతుకు కోసం, బతుకు భద్రత కోసం బతుకమ్మ కావాలి. గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడుదాం. మహిళలపై హింసలేని తెలంగాణ కోసం పోరాడుదాం.

బతుకమ్మ పండుగలో మూడు ప్రధానమైన అంశాలు. ఒకటి ఆడబిడ్డలు, రెండు చెరువు, మూడు పూలు. చెరువులో పూలను వదలడం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నా అన్నింటికీ మించి చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూలనివాళి బతుకమ్మ. చారిత్రక కథనాలు ఎలా ఉన్నా తెలంగాణకు సజీవ అస్తిత్వం బతుకమ్మ. కోటి రతనాల తెలంగాణాకు ఒక పూల తోరణం. తొమ్మిదిరోజుల పాటు ఈ పూలవనం ప్రతి ముంగిటా అందంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:08 - September 20, 2017

అమరావతీ ఊపిరి పీల్చుకో...రాజమౌళి వస్తున్నాడు.. మాహిష్మతి కాదు.. దాని తలదన్నే డిజైన్లతో భవనాలు సెలక్ట్ చేయబోతున్నాడట.. అమరావతిలో ముఖ్యమైన భవనాల డిజైన్ల విషయంలో జక్కన్న క్రియేటివిటీ వాడబోతున్నారు. దేశ విదేశాల ఆర్కిటెక్కులు, ఎన్నో ఏజన్సీలు చేయలేని పనిని రాజమౌళి చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈగ ఎగిరినట్టే, ఉదయఘర్ సామ్రాజ్యం వెలిగినట్టే, మాహిష్మతి అబ్బురపరిచినట్టే, అమరావతి డిజైన్లు కూడా వస్తాయని ఏపీ సర్కారు భావిస్తోందా? ఇది కావాలని చేస్తున్న కాలయాపనా? లేక మహిష్మతి పట్ల చంద్రబాబుకున్న ఇష్టమా?

అమరావతి..భ్రమరావతి..మాహిష్మతమరావతి ..డిజైన్లు, సంస్థలు, ఆర్కిటెక్కులు మారుతున్నట్టే... అమరావతికి మారుపేర్లూ పెరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న స్టంట్లు అనేక ప్రశ్నలను రేరెత్తిస్తున్నాయి. అనేక విమర్శలకు కారణమౌతున్నాయి. గుళ్లూ గోపురాలను డిజైన్ చేయించుకున్నారంటే ఓ అర్ధముంది..ఫ్యాట్ వెడ్డింగ్ డిజైనర్లుగా సలహా అడిగారంటే అర్ధం చేసుకోవచ్చు..కానీ, ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భవనాల డిజైన్ల గురించి ఓ డైరెక్టర్ ని సంప్రదించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మరి సర్కారీ యంత్రాగంలోని ఆర్కిటెక్కులు.. కోట్లు ఛార్జ్ చేసి డిజైన్లు ఇచ్చిన కన్సల్టెంట్ లు వీరికంటే ఓ సినిమా నిపుణుడికి ఎక్కువ తెలుస్తుందా?

దేశ విదేశాల ఆర్కిటెక్కుల ప్రతిభ సరిపోలేదు..మూడేళ్ల కాలం, పర్యటనల మీద పర్యటనలు నడిచాయి.. డిజైన్లు రావటం... పక్కకు పోవటం జరిగిపోతూనే ఉన్నాయి.. కానీ, బాబుగారి కన్ను మాహిష్మతి మీద పడింది. ఆ రేంజ్ డిజైన్లు కావాలంటున్నారు. గ్రీన్ మ్యాట్ అద్భుతాలను రియల్ లైఫ్ లో సాకారం చేయాలని భావిస్తున్నారు. మరి ఇది కాలయాపన వ్యవహారమా? లేక పనిజరిగేదేమైనా ఉందా? రాజధాని అంటే నాలుగు రోడ్లు, పది భవనాలు, ఓ పార్కు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు, వారి బాగోగులు , ఇతర ప్రాంతాలకు కూడా పాలనా పరంగా అందుబాటులో ఉండటం, పారదర్శక విధానాలు అని గుర్తిస్తే ఆధునిక అమరావతి కల సాకారమయినట్లే.. ఈ దిశగా సాగకుండా జై మాహిష్మతీ అంటూ కలలు కంటే ప్రయోజనం ఉంటుందా? గ్రాఫిక్స్ డిజైన్లను వాస్తవంలో కావాలనటంలో అర్ధం ఉందా? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:59 - September 19, 2017

దేశంలో పులుల లెక్కల తెలుసు కానీ, ఆదివాసీల లెక్కలు తెలియవు..ఇదీ మన ప్రభుత్వాల చిత్తశుద్ధి.. అడవి పుట్టినప్పటి నుంచి గిరిజనుడిదే భూమి. అక్కడి సాగుభూమిపై, గూడేలపై ఆదివాసీలకే హక్కు. ఒక్కమాటలో చెప్పాలంటే అడవికి గిరిజనుడే రాజు. కానీ జరుగుతున్నదేమిటి? కారణాలు అనేకం చెప్తూ ఆదివాసులను అడవులనుండి తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ దారుణాలకు తెలంగాణ వలస వచ్చిన గొత్తికోయలు బలవుతున్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌, జార్ఖండ్, తమిళనాడు, ఆంద్ర, తెలంగాణ ఇలా దేశంలో ఏ ఒక్క రాష్ట్రమూ దీనికి అతీతం కాదు.. అధికారంలో ఉన్న ఏ పార్టీలకి తేడాలేదు. అడవి బిడ్డలకు అన్యాయం చేయటంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ అడవులకు వలస వచ్చిన గొత్తికోయల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. గత పదేళ్ల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోని అడవుల్లో పలు చోట్ల గుత్తికోయల ఆవాసాలు కనిపిస్తున్నాయి. చత్తీస్ ఘడ్ రాష్ట్రం దాడుల నుంచి తట్టుకోలేక గోదావరి దాటి జీవనోపాధి కోసం వలస వచ్చిన గుత్తికోయలకు ఇక్కడా అభద్రతే ఎదురవుతోంది. తలదాచుకోవాలని తెలంగాణకు వచ్చిన గుత్తికోయల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైంది..

అడవుల్లో ఎంతకాలం ఉన్నా స్థానికులు కాలేని పరిస్థితి..ఓ పక్క పోడు వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానాన్ని ఆసరాగా చేసుకుని అటవీ సిబ్బంది సాగించే దుర్మార్గాలు.. మరోపక్క స్థానిక గిరిజనుల వ్యతిరేకత.. వెరసి గొత్తికోయలకు నిలువల నీడలేని పరిస్థితి ఏర్పడుతోంది.. స్వతంత్ర భారతంలో ఎవరైనా ఎక్కడైనా బతికే అవకాశం ఉంది. కానీ, ఆదివాసీల బడుగు బతుకులను ఆసరాగా తీసుకుని అధికార యంత్రాంగం దారుణంగా ప్రవర్తిస్తోంది.అసలీ అడవి ఎవరిది? ఆ అడవిని నిజంగా కాపాడుతున్నదెవరు? ఆ అటవీ సంపదను నాశనం చేస్తున్నదెవరు? కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే న్యాయాన్ని అనుసరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. చారెడు నేల అడిగితే లాఠీ ఝుళిపిస్తున్నారు.. పోడు వద్దంటూ తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా ఆదివాసీల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారు.. మరి ఆదివాసుల్ని తరిమేస్తే అడవి కళకళలాడుతుందా? కానీ వీరిలో 40 శాతం మంది నివాసాలని కోల్పోయి వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారన్నది విషాదకరమైన వాస్తవం.. ముఖ్యంగా 1990ల నుంచి ప్రపంచీకరణలో భాగంగా ఆధిపత్య దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై కన్ను వేశాయి. ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే అక్కడ స్థానిక ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని కార్పొరేట్‌ శక్తుల ద్వారా తమ పంజా విసురుతున్నాయి. ఈ వేటలో ప్రధాన బలిపశువులు ఆదివాసీలే.

గత 30 ఏళ్లలో మొత్తం 35 లక్షల ఎకరాల అటవీ భూమి చట్టబద్ధంగా నాశనమైంది. దానిపై ఎలాంటి చర్యలు, పరిశీలనలు లేవు. కానీ, పొట్టకూటికోసం మాత్రం తనసొంతమైన అడవితల్లి ఇచ్చిన సంపదను ఉపయోగించుకుంటే, పండించుకుంటే, ప్రభుత్వాలకు నొప్పి కలుగుతోంది. ఈ దేశమూలవాసులను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికీ వారికోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోగా, ఉన్న కాస్త ఆధారాన్ని పోగొట్టే ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:59 - September 13, 2017

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనలు పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్న రోహింగ్యాల పరిస్థితిపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
సొతగడ్డకు బరువయ్యారు.. 
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం.  చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:42 - September 8, 2017

సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. చావుతో ఛాలెంజ్ చేసే పరిస్థితి లేతబుగ్గల చిన్నారులకు ఎందుకు వస్తోంది? ఎవరా పరిస్థితి కారణమౌతున్నారు? ఈ డెత్ గేమ్ లబారినుండి పిల్లలను కాపాడేదెలా? క్యాండీ క్రష్, జెల్లీ సాగా, కలర్ స్విచ్, పియానో టైల్స్, పొకెమాన్, టెంపుల్ రన్, ఈ పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంకా చెప్తే ఇవన్నీ అవుట్ డేటెడ్. కానీ, ఈ గేమ్ ల సరసన ఓ డెత్ గేమ్ ఎంటరయింది. వచ్చీ రాగానే చావుమేళం మోగిస్తోంది. సరిగ్గా 50 రోజుల్లో చిన్నారుల ఉసురు తీస్తోంది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది.

ఫైనల్ స్టేజ్ ఆత్మహత్య
తీరానికి వచ్చి బ్లూవేల్స్ అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయి. అదే పేరును ఈ గేమ్ కి పెట్టారు. పేరుకి తగ్గట్టుగానే దీని ఫైనల్ స్టేజ్ ఆత్మహత్యతో ముగుస్తుంది. పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టుగా చిన్నారులు, బలహీన మనస్తుల.. ఇది ఆడించినట్టల్లా ఆడి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఓ హిప్నాటిక్ గేమ్.. రష్యాలో వందలమంది టీనేజర్లు బలయ్యారు. చూడటానికి జస్ట్.. ఓ మొబైల్ గేమ్ అనిపిస్తుంది .. కానీ, 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట లేత మనసులను దారుణంగా వేటాడేస్తుంది. భావోద్వేగాలతో ఆడుకుంటూ, పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది. ఈ ప్రాణాంతక క్రీడను రూపొందించిన సైకో డెవలపర్ ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఆట అనేక కాపీ ప్రోగ్రామ్ ల రూపంలో ఇంటర్నెట్ లో వివిధ దేశాలకు విస్తరిస్తూనే ఉంది.

నిన్నటిదాకా పోకెమాన్
ఇప్పుడు బ్లూ వేల్ ఛాలెంజ్.. సవాల్ విసురుతోంది. నిన్నటిదాకా పోకెమాన్ సంచలనం కలిగించింది. అంతకుముందు ఛోకింగ్ గేమ్ ఊపిరి తీసింది. అన్నిటికీ కారణం స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్.. ఇప్పుడు సమాచారం కోసం కంటే... వినోదానికి, అంతకంటే వికృత చేష్టలకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. సాంకేతిక ప్రగతి ఎంటర్ టైన్ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అదే సమయంలో వినోదాన్ని హై ఎండ్ కి తీసుకెళ్లే అప్లికేషన్లు కొన్ని, ప్రమాదాల అంచుకు లాక్కెల్లే గేమ్ లు మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మనుషులు బయటి ప్రపంచాన్ని వదిలేసి వర్చువల్ వాల్డ్ కి పరిమితం అవుతూ సామాజిక జీవనాన్ని మరచిపోతున్నారు. ఇప్పుడు బ్లూవేల్ లాంటి గేమ్ లు ఆ ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశముంది. రెండంచుల కత్తిలాంటి టెక్నాలజీని వాడుకోవటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు జీవితమే చేజారుతుంది. కీప్ వాచింగ్ టెన్ టీవీ. న్యూస్ ఈజ్ పీపుల్.

 

21:38 - September 7, 2017

దేశంలో జర్నలిస్టులు ప్రమాదర పరిస్థితిలో ఉన్నారా? నిజాలను వెలికి తీసినా, ఓ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా ప్రాణాలకే ముప్పుగా మారుతోందా? వరుస హత్యలు ఏ హెచ్చరికలిస్తున్నాయి? కొందరి అసహనం అంతిమంగా పాత్రికేయుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందా? వరుస దాడులు ఏ సంకేతాలిస్తున్నాయి? గౌరీ లంకేశ్ వరకు జరిగిన అనేక ఘాతుకాలు ఏం చెప్తున్నాయి? ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియా ఇప్పుడు పెను ప్రమాదంలో ఉందా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
జర్నలిస్టుల రక్తంతో తడిసిపోతున్న భారత్
జర్నలిస్టుల రక్తంతో భారత దేశం తడిసిపోతోంది. నిర్భీతిగా నిజాల్ని వెల్లడించే జర్నలిస్టులను ను అదుపులో పెట్టడానికి కొన్ని శక్తులు ఉవ్విళ్లూరుతున్నాయి.  మీడియా స్వేచ్ఛను అణగదొక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వెంటాడి, వేటాడి, మాటువేసి పకడ్బందీగా అడ్డు తొలగించుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:32 - September 6, 2017

ఏం ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందా? లేక నియంతృత్వం ఉందా?మతాన్ని ఆధారంగా చేసుకున్న కుటిల రాజకీయాలను ఎండగడితే తప్పా? మూఢనమ్మకాలను, మూర్ఖ విశ్వాసాలను తప్పుపడితే పాపమా?హక్కుల కోసం నినదించటమే, లౌకిక సమాజంకోసం కలలుకనటమే నేరమా? ఆ తూటాలు పేల్చిన చేతులెవరివి? ఆ చేతలను పురికొల్పిన ఆలోచనలెవరివి? కల్బుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్, గౌరి లంకేశ్...ఈ వరుసలో ఎందరు? ఈ దేశంలో హేతువాదులకు, ఉద్యమకారులకు, పాత్రికేయులకు రక్షణ లేదా? నిజాల నిగ్గు తేల్చే జర్నలిస్టుల ప్రాణాలకు గ్యారంటీ లేదా? గౌరి హత్య ఏ సంకేతాలిస్తోంది..

గౌరీ లంకేశ్..ప్రఖ్యాత జర్నలిస్ట్ లంకేశ్ వారసురాలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతో అనుభవం ఉన్న ధైర్యశాలి. నమ్మిన విలువల కోసం.. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, దళితులు, మహిళల హక్కుల కోసం నిరంతరం తపించిన గౌరి లంకేశ్ ని చంపిందెవరో ఊహించటం కష్టం కాదు.. ఎవరి తూటాలకు బలయ్యారో గ్రహించటం కష్టం కాదు.. కానీ, నిజం నిగ్గుతేలుతుందా అంటే.. గత అనుభవాల దృష్ట్యా అనుమానమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?ప్రభుత్వ విధానాల లోపాలను వేలెత్తితే వేధిస్తారా?రాజకీయ పార్టీల మతతత్వ కుట్రలను ప్రస్తావిస్తే జైల్లో పెడతారా?మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? ఈ దేశంలో ఏ శక్తులు రాజ్యమేలుతున్నాయి? ఆ తుపాకుల పట్టిన చేతులకు దన్నుగా నిలిచిందెవరు?


నిషేధాల కాలమంటూ పెన్నును వణికించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసహనంతో రగిలిపోతూ మీడియాపై దాడులకు దిగుతున్నారు. పరువు ప్రతిష్ట అంటూ నిజాలకు ముసుగులు తొడుగుతున్నారు. ప్రశ్నంచే గొంతుకలను నులిమేస్తున్నారు. ఇదేనా దేశంలో జరుగుతోంది? జరుగుతున్న పరిణామాలే సంకేతాలిస్తున్నాయి? కాల్చి చంపేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ఒకరిని చంపేశారు. ఇంట్లోకెళ్లి మరొకరిని హత్య చేశారు. ఎంఎం కల్బుర్తి, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్.. ఈ వరుసలో ఇప్పుడు గౌరీ లంకేశ్.. ఓవరాల్ గా దేశంలో కవులు, రచయితలు, స్వేఛ్చావాదులపై దాడులు పెరిగాయి. తూటాలు దిగుతున్నాయి. ప్రశ్న ప్రజాస్వామ్యం ఉందనటానికి ఓ బలమైన ఉదాహరణ. అలాంటి ప్రశ్నబతికి ఉన్నప్పుడే హేతువాదంపై అడుగులు పడతాయి. లౌకిక వాదాన్ని విశ్వసిస్తారు. మతతత్వాన్ని విస్మరిస్తారు. అందుకే... ప్రశ్నను ఆయుధంగా చేసుకున్న పాత్రికేయులు, రచయితలపై ఈ దాడులు. ప్రశ్న బతికినపుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

20:47 - September 5, 2017

అయిదు దేశాలు..భవిష్యత్ ప్రపంచ ముఖచిత్రాలు..ఒక్కటైన స్నేహహస్తాలు..చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశం ఇప్పుడు అభివృద్ధి, సహకారం లాంటి అంశాలనే కాదు... తీవ్రవాదంలాంటి అంశాలకూ వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రపంచంలోని పలుదేశాల కూటములలో అత్యంత ప్రభావం చూపుతున్న కూటమిగా బ్రిక్స్ దేశాల కూటమి నిలబడింది. బ్రిక్స్‌ కూటమి తొలిసారి పాకిస్థాన్‌ ఉగ్రమూకలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను తొలిసారి ప్రస్తావించింది. అంతర్జాతీయ వేదికపై నేరుగా పాక్‌లోని ఉగ్రమూకలను పేరు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా బ్రిక్స్‌ కూటమిలో భారత్‌ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్‌ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం , బ్రిక్స్‌ కస్టమ్స్‌ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్‌ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ కూడా అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. మరోపక్క పశ్చిమదేశాల ఆధిపత్యానికి గండికొట్టేలా ప్రత్యేక రేటింగ్ ఏజన్సీ ప్రతిపాదనలు కూడా వచ్చాయి. మొదలై తక్కువ కాలమే అయింది. కానీ, సాధించిన మార్పు చాలా ఎక్కువ. ఆధిపత్య దేశాలను సవాల్ చేస్తూ ఏటా పలు ఒప్పందాలతో బ్రిక్స్ దేశాలు ముందడుగు వేస్తున్నాయి. 2009లో తొలి సమాదేశం నాటినుంచి, 2017లో చైనా సమావేశం వరకు బ్రిక్స్ దేశాలు వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. పరస్పర సహకారంతో అభవృద్ధి బాటలో నడిచేందుకు, ప్రపంచ శాంతిని స్థాపించేందుకు కూడా గళమెత్తుతున్నాయి.

పక్క పక్కనున్న దేశాలు కాదు.. ఏ సారూప్యతలు లేవు.. సాంస్కృతకంగా పోలికలు లేదు..కానీ, కలసి పనిచేస్తూ.. పరస్పరం స్నేహహసర్తం అందించుకుంటూ పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఎదురొడ్డి.. ముందుకు సాగటమే లక్ష్యంగా బ్రిక్స్ అడుగులేస్తోంది. అడుగడుగునా ఆధిపత్యమే రాజ్యమేలుతున్న ప్రపంచంలో, ఆయుధ సంపత్తి, ధనబలమే పైచేసి సాధించగల కాలంలో... ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలు అత్యవసరం. వేదికలపై చేతులు కలపడమే కాదు.... విధానాల రూపకల్పన అమలులోనూ ఆ ఉత్సాహాన్ని చూపగలగాలి. ముఖ్యంగా పశ్చిమ దేశాల ఆధిప్యత రాజ్యమేలుతున్న సమయంలో వర్ధమాన దేశాలకు దన్నుగా నిలబడేందుకు బ్రిక్స్ లాంటి కూటమి మరింత బలపడాల్సిన అవసరం ఉంది.పూర్తి వివరాలకు వీడియో చూడండి

Pages

Don't Miss

Subscribe to RSS - వైడ్ యాంగిల్