వైద్యులు

15:33 - October 23, 2018

కర్నూలు : జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ కేసులు అధికమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏడుగురు స్వైన్‌ఫ్లూ వ్యాధితో మృతి చెందారు. స్వైన్‌ఫ్లూతో తుంగభద్ర గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. ఆదివారం గోనవరానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా 19 కేసులు నమోదు అయ్యాయి. 8 మంది చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మందికి చికిత్స వైద్యులు అందిస్తున్నారు.  

 

19:13 - October 22, 2018

హైదరాబాద్ : వనస్థలీపురంలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయింది. డెలివరీ సమయంలో ఓ ఆపరేషన్ కు బదులు వైద్యులు మరో ఆపరేషన్ చేయడంతో   
మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు.

గర్భిణీ అయిన శ్వేత ఆగస్టు 15న డెలివరీ కోసం వనస్థలీపురంలోని లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్ర నొప్పి రావడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెలివరీ సమయంలో ఒక ఆపరేషన్ కు బదులు మరో ఆపరేషన్ చేయడం వల్లే ఆమెకు నొప్పి వస్తుందని..మరొక ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. ఈ సమయంలో నొప్పి తీవ్రతరం కావడంతో శ్వేత మృతి చెందింది. దీంతో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. 

మహిళ బంధువు..
’ఆగస్టు 15న ఉదయం 8.30 గంటకు శ్వేతను ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు కాన్పు కాలేదని డాక్టర్ చెప్పింది. నార్మల్ ఆపరేషన్ చేస్తానని చెప్పింది. అయితే మోషన్ పేగులు కట్ చేసింది. దాని వల్ల శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంతకముందుకు ఇద్దరికి నేను ఈవిధంగానే ఆపరేషన్ చేశానని..వారు నా దగ్గరకు గొడవకు రాలేదని.. మీరే నా దగ్గరకు గొడవకు వచ్చారని మాట్లాడింది. నష్టం పరిహారం కోసం మేము ఇక్కడికి రాలేదు’ అని మహిళ బంధువు పేర్కొన్నారు.  

13:11 - October 7, 2018

హైదరాబాద్ : ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్ గుర్తుందా.. శవానికి వైద్యం చేసినట్లు డాక్టర్లు నటించడం. సేమ్ అదే సీన్ హైదరాబాద్‌లో జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థి చనిపోయిన విషయాన్ని కటుంబ సభ్యులకు చెప్పకుండా వైద్యం చేస్తున్నట్లుగా వైద్యలు నటించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. శస్త్ర చికిత్స చేస్తుండగా విద్యార్థి మ‌ృతి చెందాడు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు డాక్టర్లు హడావిడి చేశారు. చివరికి మృతి చెందాడని చెప్పారు. 

సాత్విక్ రెడ్డి అనే విద్యార్థి కూకట్ పల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న మధ్యాహ్నం కూకట్ పల్లిలోని ల్యాండ్ మార్క్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ టెస్టులు చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి కొంపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి వెళ్లాడు. కొన్ని పరీక్షల అనంతరం యువకుడికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అందుకు వారు అంగీకరించారు. సాయంత్రం 5 గంటలకు సాత్విక్ రెడ్డికి వైద్యులు శస్త్ర చికిత్స ప్రారంభించారు. అయితే అతనికి అనస్తీషియా ఇచ్చిన డాక్టర్ డ్యూటీ అయిపోయిందంటూ హడావిడిగా ఆపరేషన్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అతని స్థానంలో సబంధంలేని మరో డాక్టర్ వచ్చాడు. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స చేస్తుండగానే సాత్విక్ రెడ్డి మృతి చెందాడు. అయితే అతడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా సాయంత్రం 5 గంటల నుంచి వైద్యం చేస్తున్నట్లు హడావిడి చేసి.. రాత్రి 10 గంటలకు సాత్విక్ రెడ్డి మరణించాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో చనిపోయాడని తెలిపారు. కాగా సాయంత్రం 7 గంటలకే అతను మరణించినట్లు ఈసీజే రిపోర్టు రావడం గమనార్హం. 

అయితే సాయంత్రం 7 గంటలకు సాత్విక్ రెడ్డి బాగానే ఉన్నాడని, చికిత్స చేస్తున్నామని చెప్పి..రాత్రి 10 గంటలకు మరణించాడని వైద్యులు చెప్పారని అతని కుటుంబ సభ్యులు వాపోయారు. సంబంధంలేని ఆపరేషన్ చేయడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి చనిపోయాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

11:28 - October 2, 2018

చిత్తూరు : వి.కోట మండలం కృష్ణాపురం గ్రామ పంచాయితీలోని కొమ్మరమడుగు చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. విదేశాల నుండి వలస వచ్చే పక్షులకు కరెంట్ షాక్ తగిలింది.దీంతో మూడు పక్షులకు హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో గ్రామస్థులు వెటర్నరీ ఆసుపత్రికి మూడు పక్షులను చికిత్స నిమిత్తం తరలించారు. వెంటనే వైద్యం ప్రారంభించారు. వైద్యం కొనసాగుతోంది. 

 

10:38 - September 10, 2018

హైదరాబాద్ : 'సేవ్ నిమ్స్' అంటూ వైద్యులు గళమెత్తారు. నిమ్స్‌లో డీన్‌గా నియామకం పొందిన ప్రొఫెసర్‌ ఆర్వీ కుమార్‌ను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వైద్యులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవలను బహిష్కరించిన వైద్యులు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. డీన్‌ సీట్లో ఆయన కూర్చోవడానికి వీలు లేదని నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. సోమవారం ఉదయం పాత భవనం ఎదుట వైద్యులు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు.

డీన్ గా కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం నిరవధిక సమ్మెలోకి వెళుతామని హెచ్చరిస్తున్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయని, గతంలో ఏసీబీ విచారించిందని వారు పేర్కొంటున్నారు. అలాంటి అవినీతి ఆరోపణలున్న వ్యక్తి రద్దు అయిన రోజే డీన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిమ్స్ లో వైద్యులు ఆందోళన చేస్తుండడంతో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. 

08:48 - August 23, 2018

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిని వెంటిలేటర్ల సమస్య వెంటాడుతోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్జరీలు చేయలేక వైద్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వెంటిలేటర్లకు మరమ్మత్తులు నిర్వహించే సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
వెంటిలేటర్ల సమస్యతో ఇబ్బందుల్లో రోగులు
గుంటూరులో చికిత్సకు మారుపేరు అయిన సర్వజనాసుపత్రిలో వెంటిలేటర్ల సమస్య నెలకొంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో కోటి రూపాయలతో పది వెంటిలేటర్లలను అధికారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ వెంటలేటర్లు పనిచేయటం లేదు. దీంతో అత్యవసర సేవల నిమిత్తం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటిలేటర్లు లేక వైద్యులు క్లిష్టమైన సర్జరీలు నిలిపివేశారు. ఆస్పత్రిలో వెంటలేటర్లు పనిచేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి
వెంటిలేటర్లు పనిచేయకపోవటంతో అందని చికిత్స
చికిత్స చేయటంలో ఆస్పత్రికి మంచి పేరు ఉండటంతో గుంటూరుతో పాటు ఇతర జిల్లాల ప్రజలు ఆస్పత్రికి వస్తుంటారు. చిన్నారులకు చికిత్స అందించటంలో ఆస్పత్రి మంచి గుర్తింపు సాధించింది. దీంతో చిన్నారులకు సంబంధించి అత్యవసర కేసులు ఏమి ఉన్నా ముందుగా ఈ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే వెంటిలేటర్లు పనిచేయకపోవటంతో వైద్యులు చిన్నారులకు చికిత్స అందించటం లేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులతో పాటు సామాన్య ప్రజలు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరికరాలు సరిగ్గా లేనప్పడు ఆస్పత్రిని ఎలా నడుపుతున్నారని నిలదీస్తున్నారు. పరికరాలు సరిగ్గా లేకపోతే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంపై ప్రజలు మండిపడుతున్నారు. 
పరికరాల మరమ్మతులు టీబీఎస్‌ సంస్థకు అప్పగింత
వెంటిలేటర్ల సమస్య గురించి వైద్యులు మరోలా చెబుతున్నారు. పరికరాలు పనిచేయకపోతే టెలి మ్యాట్రిక్‌ అండ్‌ బయోమెడికల్ సర్వీస్‌ సంస్థ పరికరాలకు మరమ్మత్తులు చేస్తుందని.. ఈ మేరకు ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్లు పనిచేయటం లేదని.. వెంటనే మరమ్మత్తులు చేయాలని గత కొంత కాలంగా సంస్థకు మొరపెట్టుకున్నా...  సంస్థ ప్రతినిధులు పట్టించుకోవటం లేదని తెలిపారు. టీబీఎస్‌ ప్రతినిధులు స్పందించకపోవటంతో సుమారు 6 వేల రూపాయలు ఖర్చు చేసి.. స్థానిక నిపుణుల చేత మూడు వెంటిలేటర్లు బాగు చేయించామని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్లకు మరమ్మత్తులు నిర్వహించాలని టీబీఎస్‌ ప్రతినిధులను ఎన్ని సార్లు అడిగినా స్పందన కరువైందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సకాలంలో వైద్య సేవలు అందించలేకపోతున్నామని అంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటిలేరట్లకు మర్మతులు నిర్వహించి.. గుత్తేదారు సంస్థపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. 

 

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

16:11 - July 1, 2018

మహబూబాద్ : జిల్లా తొర్రూరులో నకిలీ వైద్యులు చలామణి కలకలం రేపుతోంది. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ పై ఇద్దర వైద్యులు చలామణి అవుతున్నారు. డా.పి.రాంబాబు పేరు ఉన్న వైద్యులకు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండడం గమనార్హం. వైద్య విధాన పరిషత్ పరిధిలో డాక్టర్ల నియామకంతో ఈ అనుమానం తలెత్తాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు డాక్టర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:46 - May 31, 2018

హైదరాబాద్ : ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో గాంధీ ఆసుపత్రి వైద్యులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గాంధీ ఆసుపత్రిలోని మెడికల్ అసిస్టెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సమ్మెను విరమించారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపుపై పునరాలోచిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వైద్యులకు హామీ ఇవ్వటంతో వారు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో వున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి వైద్యులు క్షీరాభిషేకం చేశారు. కాగా ఇచ్చిన మాట తప్పితే మరోసారి సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 68 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించటంతో ఆగ్రహించిన అసోసియేట్ ప్రొఫెసర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. 

13:04 - May 31, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వివాదంపై ఇంకా కొలిక్కి రాలేదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో సమావేశమైన మంత్రి లక్ష్మారెడ్డి.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన అనంతరం  టీచింగ్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై మరోసారి ప్రకటన చేస్తామన్నారు. అయితే ఆందోళన విరమించాలా..లేదా అనే అంశంపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఘంనేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సమ్మెను విరమించాలా లేదా అనే దానిపై ప్రస్తుతం తర్జనభర్జనలు పడుతున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - వైద్యులు