వైసీపీ

18:11 - October 17, 2017

అనంతపురం : జగన్ వచ్చినప్పుడే ప్రభుత్వంలో కదలిక..స్పందన వస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ధర్మవరంలో చేనేత సమస్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. జగన్ వస్తున్నాడు...అనంతకు..అని తెలిసిన సమయంలో ప్రభుత్వం స్పందించిందని..అందులో భాగంగా 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే 11 మందికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. కానీ ఆ ఆర్థిక సాయం రూ. లక్షన్నరకు మించి లేదన్నారు. మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 

15:20 - October 17, 2017

అనంతపురం : ప్రముఖ వ్యాపార వేత్త వై.వి.శివారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మీడియాకు తెలియచేశారు. పరిశ్రమలను నెలకొల్పి పరోక్షంగా..ప్రత్యక్షంగా..అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. మూడు వేల మంది కార్యకర్తలు..మూడు వందల వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరుగుతోందని, పదవిని ఆశించి రావడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని..అందర్నీ కలుపుకొని వెళుతానని తెలిపారు.

 

 

21:51 - October 16, 2017
16:39 - October 16, 2017

అనంతపురం : వైసీపీలో విభేదాలు భగ్గుమన్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత  చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డికి పార్టీలో అన్యాయం జరిగిందంటూ ఆయన వర్గం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిని మిథున్‌ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:28 - October 16, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ బీసీ డిక్లరేషన్‌ను రూపొందించబోతున్నది. రాష్ట్రంలో బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి... పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోబోతున్నారు. ఇందుకోసం ఈరోజు వైఎస్‌ జగన్‌.. విజయవాడలో బీసీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జిల్లాలవారీగా నేతల నుంచి సమాచారం సేకరించనున్నారు. అలాగే బీసీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు... వైసీపీ ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. అనేక దఫాల చర్చల అనంతరం వైసీపీ 'బీసీ డిక్లరేషన్‌' ప్రకటించే అవకాశం ఉంది. 

06:49 - October 15, 2017

విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్రకు రెడీ అవుతోన్న వేళ ఆ పార్టీకి పెద్ద షాకే త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌చ్చే నెల 2 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యే టైంకు కాస్త అటూ ఇటూగా వైసీపీ నుంచి కీల‌క వ్యక్తులు జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ పాలిటిక్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీలో జోష్‌ నింపగా.. ప్రతిపక్షాన్ని డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీతో పాటు కాంగ్రెస్‌ నుంచి కూడా కొందరు కీలక నేతలు టీడీపీవైపు తొంగి చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ బుట్టా రేణుక టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బుట్టా రేణుకతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జ‌గ‌న్...క‌ర్నూల్ జిల్లా నేత‌ల‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాము పార్టీ మార‌డం లేద‌ని కొందరు నేతలు చెప్పగా...ఎంపీ బుట్టా రేణుక మాత్రం పార్టీలో కొన‌సాగే విష‌యంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..బుట్టా రేణుక పార్టీ మారడం ఖాయమన్న ప్రచారానికి మరింత బ‌లం చేకూరింద‌ని వైసీపీ నేత‌లు చర్చించుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను కర్నూలు ఎంపీగా కాక..ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్‌ సూచించడంతో వైసీపీని వీడేందుకు ఆమె సిద్ధపడినట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అంగీకరిస్తే..కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే బుట్టా మాత్రం ఇందుకు ససేమిరా అన్నారట. ఎంపిగానే పోటి చేస్తాన‌ని, ఎమ్మెల్యేగా పోటి చేసే ఉద్దేశం తనకు లేద‌ని కుండబద్దలు కొట్టేశారట. ఈ పరిణామాలతోనే బుట్టా రేణుక త‌న‌దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు బుట్టా రేణ‌క భర్త గ‌తంలో చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రేణుక కూడా భర్త బాటలో నడుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త‌న స‌న్నిహితులు,అనుచ‌రుల‌తో సమావేశమైన త‌రువాత..పార్టీ మార్పుపై రేణుక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వ‌ల‌స‌ల‌తో స‌త‌మ‌తమవుతున్న వైసీపీకి బుట్టా రేణుక పార్టీ మారితే మ‌రింత న‌ష్టం త‌ప్పద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

06:46 - October 15, 2017

విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటమితో కుదేలైన వైసీపీని గాడిన పెట్టేందుకు జగన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? మూసపద్ధతిలో కాకుండా వినూత్న పద్ధతిలో పాదయాత్ర ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారా? ప్రజా సమస్యలే ఎజెండాగా బాబు సర్కార్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహాలకు జగన్‌ పదునుపెడుతున్నారట. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు అనుమతి వస్తుందని భావిస్తున్న వైసీపీ నేతలు...జగన్‌ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. అసలు జగన్‌ పాదయాత్రకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. జగన్ పాదయాత్రకు సంబంధించి హాజరు మినహాయింపుల అనుమతులు కోరుతుండగా.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లలో యాత్రకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు మాత్రం అనుమతి వస్తుందని, హాజరు మినహాయింపు సంగతి ఏమౌతుందో చూడాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడక పోయినా..జగన్‌ పాదయాత్రకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

న‌వంబ‌రు 2 నుంచి సుదీర్ఘ పాద‌యాత్రకు శ్రీకారం చుట్టేందుకు జగన్‌ రెడీ అవుతున్నారు. పట్టణాలతో పాటు ప‌ల్లెలు, గ్రామాల్లో విస్తరిస్తేనే పార్టీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పాద‌యాత్ర పూర్తిగా ప‌ల్లెలు, గ్రామాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే పాదయాత్రను అట్టహాసంగా ప్రారంభించేందుకు వైసిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారట. సుమారు లక్ష మందితో పాదయాత్రను మొదలుపెట్టి అధికార పార్టీకి పెద్ద సవాల్‌ను విసరాలని భావిస్తున్నారట. 3 వేల కిలోమీటర్లకు పైగాసాగే పాదయాత్ర అన్ని జిల్లాలను కలుపుతూ 122 నియోజకవర్గాల్లో ఉండేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఈ పాదయాత్రలో జనాన్ని ఆకర్షించేందుకు పీకే కొత్త వ్యూహాలు సిద్ధం చేశారట. నవరత్నాల పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఇవేకాక జనాల నాడిని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి కొత్త హామీలు ప్రకటించాలని భావిస్తున్నారట. ఇక జగన్‌ పాదయాత్రలో మరో ఆసక్తిరమైన అంశంపై ప్రచారం హోరెత్తుతోంది. ప‌ల్లె జ‌నాల‌ను ఆక‌ర్షించేందుకు త‌న తండ్రి మాదిరిగా జ‌గ‌న్ కూడా పంచె ధరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా వైసీపీ అధినేత పాదయాత్రకు సీబీఐ కోర్టు తీర్పు కీలకం కానుంది. 

10:47 - October 13, 2017

 

హైదరాబాద్ : కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విన్నవించనున్నాడు. 6నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరునట్టు తెలుస్తోంది. సీబీఐ కోర్టు కాసేపట్లో ఈ పిటిషన్ విచారించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:57 - October 11, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ ...తాను చేపట్టబోయే పాదయాత్ర విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. పాదయాత్రపై పార్టీ నేతల నుంచి సలహాలు-సూచనలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే... స్థానిక సమస్యలపై ఫోక్‌స్‌ చేయాలని జగన్‌ నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత పాదయాత్ర ప్రారంభం  
నవంబర్‌ రెండో తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేయబోతున్నారు.. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 125  నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఈ మేరకు జగన్‌.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమావేశమయ్యారు. పార్టీ నేతల నుంచి సలహాలు-సూచనలు తీసుకున్నారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇతర జిల్లాల్లో ప్రజా సమస్యలపై సభలు-ధర్నాలు నిర్వహించాలని జగన్‌ నేతలకు చెప్పారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నం 
ఈ పాదయాత్ర ద్వారా వైసీపీ శ్రేణుల్లో జోష్‌ నింపడంతో పాటు.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని జగన్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులు- నిరుద్యోగుల సమస్యల విషయంలో.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిసైడ్‌ అయ్యారు. 
మినహాయింపు వచ్చినా.. రాకున్న పాదయాత్ర
అయితే ఆస్తు కేసులో జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. పాదయాత్ర సందర్భంగా దీనిపై మినహాయింపు ఇవ్వాలని కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు నుంచి మినహాయింపు వచ్చినా.. రాకపోయినా.. పాదయాత్ర చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఉండేందుకు మరోసారి జగన్‌ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. 

19:15 - October 10, 2017

అనంతపురం : ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తానని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడతానని...చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న అక్రమాలను ఎండగడతానన్నారు వైఎస్‌ జగన్‌. 

అనంతపురం ఎమ్ వైఆర్ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పదో యువభేరి సదస్సుకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి, యువతకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో జగన్‌ వివరించారు. 

పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించి కేంద్రం మాటతప్పినా.. చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి వుంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేవని.. యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవన్నారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు... ఇప్పుడు మాట మార్చి... ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయని ప్రశ్నించడం దారుణమన్నారు. 

ప్రత్యేక హోదా కోసం తాను ఎంతవరకైనా వెళ్తానని జగన్‌ స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. 

ఇక రాష్ట్ర ప్రజల సమస్యలపై నవంబర్‌ 2 నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు జగన్‌ తెలిపారు. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలై... ఆరు మాసాల పాటు కొనసాగి ఇచ్చాపురంలో ముగుస్తుందన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి సమస్యలను తెలుసుకుంటానని... చంద్రబాబు సర్కార్‌ చేసిన అక్రమాలను ఎండగడతానని జగన్‌ స్పష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో ఇకపై ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నియోజకవర్గ సమన్వయకర్తలకు అప్పగిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - వైసీపీ