వైసీపీ నేత

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

12:18 - March 31, 2018

అనంతపురం : వైసీపీ నాయకుడు శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు నిరసనగా ఆసుపత్రి మార్చురీ ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టిడిపి నాయకులే ఈ హత్యకు కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎస్ఐ ను సస్పెండ్ చేయాలని..హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. 

16:59 - June 17, 2017

కడప : వైఎస్‌ కుటుంబానికి పెట్టనికోటగా ఉండే... కడపలో జగన్‌ పట్టు నిలుపుకునే పనిలో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబాయ్ వివేకా ఓటమితో ... ఉలికిపడ్డ వైసీపీ .. జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాపై వైఎస్‌ జగన్ కుటుంబం మార్క్‌ కోల్పోకుండా... జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

పట్టు నిలుపుకునే ప్రయత్నంలో వైసీపీ

కడప జిల్లాలో తన ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. వివేకా ఓటమిపై విశ్లేషణలు చేసుకుంటూ... ముందుకు కదులుతుంది. ఇందులో భాగంగా టీడీపీలోని అసంతృప్త నేతలకు గాలం వేయాలని ప్రయత్నిస్తోంది. వైఎస్ రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు.. అంచెలంచలుగా జిల్లాలో తమ రాజకీయ బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. వారి వారసత్వాన్ని జగన్ అందిపుచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో కొంత మేరకు వైసీపీ బలహీనపడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో పట్టు కోల్పోతున్నామన్న భావన జగన్‌లో కూడా ఉందని అంటున్నారు.

జగన్ వ్యవహర శైలిపై స్థానిక నాయకుల్లో అసహనం

జగన్ వ్యవహార శైలి వల్ల కూడా పార్టీలో నేతలు అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. జగన్‌ వైఖరి కారణంగా చాలామంది పార్టీ నుంచి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా జగన్‌ జిల్లాపై దృష్టి సారించారు. దీంతో ఒక్క పులివెందులకే పరిమితం కాకుండా.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెలలో రెండు రోజులు జిల్లాలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను వింటున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలనే యోచనలో ఉన్నారు. అదే సందర్భంలో టీడీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు జగన్.

టీడీపీలో అసంతృప్తి నేతలకు గాలం...

ప్రధానంగా టీడీపీలో ఉంటూ అసంతృప్తిలో ఉన్న బలమైన నేతలను వైసీపీలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీలోని నాయకుల వద్దకు తన దూతలను పంపించాలని యోచిస్తున్నారు. జమ్మలమడుగులో ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో రామసుబ్బారెడ్డిని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అలాగే రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాన్ని కూడా వైసీపీలోకి ఆహ్వానించాలని జగన్ యోచిస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా జిల్లాపై పట్టు సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారనేదానిపై సందిగ్థత నెలకొంది.

14:34 - February 6, 2017

అనంతపురం :ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత జగన్‌ మాటల తూటాలు పేల్చారు. బాబుకు రైతులంటే ప్రేమ లేదని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టులు కడితే వేస్ట్‌ అని .. మనసులో మాట పేరుతో పుస్తకం రాసుకున్న చంద్రబాబుకు ఇపుడు రైతుల మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని జగన్‌ ప్రశ్నించారు. 

20:18 - April 14, 2016

హైదరాబాద్‌ : నగర శివారు జవహర్‌నగర్‌లో శాస్త్రి అనే వ్యక్తి పై వైసీపీ నేత బాల్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. జవహర్‌నగర్‌లోని మైత్రీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై శాస్త్రి అల్వాల్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. 

15:12 - April 11, 2016

విశాఖ :పూలే ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేయడం లేదని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పూలే జయంతి రోజున గొప్పగా ప్రసంగాలు చేయడం ద్వారా బీసీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసి.. నిధులు ఖర్చు చేయడం ద్వారానే వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని ఆరోపించారు ధర్మాన. 

06:47 - October 15, 2015

కర్నూలు : జిల్లాలో ఫ్యాక్షన్‌ గొడవలు మరోసారి పడగవిప్పాయి. ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో వైసీపీ నేత రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు దాడి చేశారు. సినీ ఫక్కీలో దాడి చేసిన దుండగులు.. రాఘవరెడ్డి వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టి.. అనంతరం వేటకొడవళ్లతో నరికారు. తీవ్రగాయాలైన రాఘవరెడ్డిని మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా రాఘవరెడ్డి మృతి చెందాడు.

17:01 - September 14, 2015

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేత వంగవీటి రాధా ఫైర్ అయ్యారు. ప్రత్యేకహోదా అంశం పైకిలేవనెత్తకుండా రాష్ట్ర యువతను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ....ఇప్పటికైనా..రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో భారీ ప్రజాఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.

18:31 - July 1, 2015

చిత్తూరు:ఐఏఎస్ అయిన ఆయన అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2014 ఎన్నికల్లో ఎంపీ విజయం సాధించారు. ఎన్నెన్నో హామీలతో ఎంపీ పదవి చేజిక్కించుకున్న ఆయన, చివరకు ప్రజలకు కనిపించకుండా పోతున్నారు. చెన్నైలో నివాసముంటూ, అడపాదడపా సొంత నియోజకవర్గంకు వచ్చిపోతున్నారు. ఇంతకీ నియోజకవర్గంలో కనబడకుండా పోయినా ఆ ప్రజాప్రతినిధి ఎవరు.?
ప్రజలు ఆయన్ను మరచిపోయారా.? ఆ మిస్టరీ ఏంటో ఓ సారి చూద్దాం...
తమిళనాడు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్‌గా విధులు....
నిజానికి రాజకీయాల్లో అకస్మాత్తుగా ఊడిపడ్డ వ్యక్తి వరప్రసాద్. తమిళనాడు రాష్ట్రంలో జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసి రిటైర్ మెంట్ సమయానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవిని కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున నాటి ఎన్నికల్లో తిరుపతి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. చాలా కాలం ఎవ్వరికీ కనిపించలేదు. చివరకు 2014 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి తిరుపతి ఎంపీగా విజయం సాధించారు. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు మాత్రం ఆయన ముఖం చూపకుండా చెన్నైలోనే సెటిలయ్యారు.
సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదని విమర్శలు......
నెల్లూరు, చిత్తూరు జిల్లాలో విశాలంగా విస్తరించి ఉన్న తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని కవర్ చేయడం కష్టమే అయినప్పటికీ, ఒక్కో ఊరికి నెలలో ఒకటి రెండు రోజులు కేటాయించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, వరప్రసాద్ ఆ పని చేయడం లేదు. సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదన్న విమర్శలున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మార్చుతామని గత ప్రభుత్వ హామీని పట్టించుకునే వారు లేరు. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పిస్తామన్న హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వీటి గురించి కనీసం ఎంపి వరప్రసాద్ పార్లమెంట్‌లో మాట్లాడిన దాఖలా లేదు. తిరుపతిలోని ఎంపి కార్యాలయం ఎప్పుడూ బోసిపోయి ఉంటుంది. ఎంపీ కనిపించరన్న ప్రచారంతో అవసరం కోసం ఇక్కడకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. మరి దీనిపై ఆయన ఏమంటున్నారు.
తిరుపతి, కాళహస్తి ఆఫీసులతో చేతులు దులుపుకుంటారా.?
తిరుపతి లాంటి అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం అభివృద్దికి పాటుపడటం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు వరప్రసాద్. తిరుపతి, కాళహస్తి లాంటి కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు ప్రారంభించి ఆయన చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా ఆయన నియోజకంలో ఎప్పటికప్పుడు పర్యటించి, సమస్యలు పరిష్కరించాలని జనం కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - వైసీపీ నేత