శశికళ

12:09 - October 12, 2017

 

చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెరోల్‌పై విడుదలైన శశికళ తిరిగి బెంగళూరు జైలుకు బయల్దేరారు. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు శశికళకు జైళ్లశాఖ మంజూరు చేసిన ఐదు రోజుల పెరోల్‌ బుధవారంతో ముగిసింది. దీంతో నేడు ఆమె తిరిగి బెంగళూరు జైలుకు తిరిగి వెళుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడిన ఆమె బెంగళూరులోని పరప్పణ ఆగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల శశికళ భర్త నటరాజన్‌ అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నటరాజన్‌కు కిడ్నీ, కాలేయ మార్పిడి ఆపరేషన్‌ చేశారు. దీంతో భర్తను చూసేందుకు అనుమతినివ్వాలంటూ శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన జైళ్ల శాఖ గత శుక్రవారం ఐదు రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. అయితే పెరోల్‌కు కొన్ని షరతులు విధించింది. ఆమె తన బంధువుల నివాసంలో మాత్రమే ఉండాలని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, మీడియా ప్రకటనలు చేయరాదని నిబంధనలు విధించింది.

13:54 - October 6, 2017

చెన్నై : పెరోల్‌పై శశికళ పరప్పన్‌ జైలు నుంచి బయటకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు శశికళకు కర్నాటక జైళ్ల శాఖ అనుమతివ్వడంతో ఆమె  జైలు నుంచి విడుదలైంది. ఆమెకు స్వాగతం పలికేందుకు పలువురు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజులు వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని, రాజకీయ కార్యక్రమాలకు  హాజరైతే పెరోల్‌ రద్దు చేస్తామని జైళ్ల శాఖ హెచ్చరించింది.

 

13:23 - October 6, 2017

చెన్నై : శశికళకు పెరోల్ లభించింది. అనార్యోంతో ఉన్న తను భర్తను పరామర్శించేందుకు పెరోల్ కు అనుమతిచ్చింది. ఐదు రోజుల పెరోల్ కు కర్నాటక జైళ్ల శాఖ అంగీకరించింది. వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్ల శాఖ అదేశించారు. మరికాసేపట్లో పెరోల్ పై శశికళ జైలు నుంచి బయటకు రానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:52 - September 12, 2017

చెన్నై : అన్నాడిఎంకేలో చిన్నమ్మ శశికళ శకం ముగిసినట్లేనా? తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ అన్నాడిఎంకె నిర్ణయం తీసుకుంది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకే మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పాలని భావించిన చిన్నమ్మ
శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేపట్టిన నియామకాలు, ప్రకటనలను ఆమోదించమని స్పష్టం చేసింది. పార్టీ రెండాకుల గుర్తును తిరిగి కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలని సమావేశం నిర్ణయించింది.

మరోవైపు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి ప‌ళ‌ని ప్రభుత్వం బ‌ల‌నిరూప‌ణ నిర్వహించాల‌ని డీఎంకే నేత స్టాలిన్ మద్రాస్‌ కోర్టుకు వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పీఎంకే పార్టీకి చెందిన బాలు కూడా పిటిష‌న్ వేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబ‌ర్ 10వ తేదీన  మద్రాస్ హై కోర్టు విచారణ చేపట్టనుంది. 

తమిళనాడు ప్రజలను, పార్టీ కార్యకర్తలను పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మోసం చేశారని దినకరన్‌ మండిపడ్డారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. అన్నాడిఎంకెకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌ వెంట ఉండడంతో పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 

శశికళకు  కాలం కలిసి రాలేదు. జయలలిత మరణానంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడం....పన్నీర్‌ సెల్వంను సిఎంను పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి. తదనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. సిఎంగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలో అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుపాలయ్యారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పార్టీలో కొందరికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. శశికళ, దినకరన్‌కు  అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు  తాజాగా తీర్మానం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో  వేచి చూడాల్సిందే.

07:33 - August 29, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాసానికి ప్రధాన ప్రతిపక్షంతో పాటు శశికళకు చెందిన దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... పళణిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ నేతలు సమావేశమై మరో ఎత్తుగడ వేశాయి. శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించాలని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈసీకి ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశారు. అలాగే జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికను కూడా తమ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇక దినకరన్‌ వర్గంలోని ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి వారిని అనర్హులుగా ప్రకటించి.... తమపై పెట్టిన అవిశ్వాసాన్ని తప్పించుకోవాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. 

17:40 - August 22, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజు రోజుకు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. రెండాకుల విలీన ప్రక్రియ జరిగిన కొన్ని గంటల్లోనే టీటీవీ దినకరణ్‌ షాక్‌ ఇచ్చారు. 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసిన ఆయన...పళనిస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బాంబు పేల్చారు. అంతేకాదు అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు పొలిటిక్స్ సస్పెన్స్ థ్రిలర్‌ను తలపిస్తున్నాయి. అన్నాడీఎంకే మాజీ సీఎం ఒ.పన్నీర్‌ సెల్వం వర్గం, సీఎం పళనిస్వామి వర్గం విలీనమై ఆనందోత్సాహాల్లో మునిగితెలుతుండగానే శశకళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ ఊహించని షాక్ ఇచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు. పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని కీలక ప్రకటన చేశారు. సీఎంను మార్చాలి ఈ సర్కార్ మాకొద్దు అని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో పళినిస్వామిపై ఉన్న నమ్మకంతోనే మద్దతిచ్చామని..అయితే ఆ విశ్వాసం ఇప్పుడు పోయిందని గవర్నర్‌కు వివరించారు.

19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు దినకరన్‌ స్పష్టం చేయడంతో పళనిస్వామి సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. అయితే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ రంగంలోకి దిగారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు తగ్గిందని స్టాలిన్ తెలిపారు.

ఇప్పటివరకు పళనిస్వామికి మద్దతుగా ప్రతిపక్షాలు, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కలిపి 117 మంది ఉన్నారు. డిఎంకె మిత్ర పక్షానికి 86 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు పళని వర్గం నుంచి శశికళ వర్గం దూరం కావడంతో 95 స్థానాలకు అన్నాడింఎకె వర్గం పడిపోయింది. అసెంబ్లీలో బలనిరూపణకు 117 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

దినకరన్ కు చెందిన 19 మందితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో, ఇప్పటికిప్పుడు బల ప్రదర్శన జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిణామాలను పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. బలనిరూపణ కోసం దినకరన్‌ వర్గం నుంచి ఎమ్మెల్యేలను లాగేందుకు లాబీయింగ్‌ చేస్తారా? లేక దినకరన్ కు చెక్‌పెట్టేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తారో చూడాలి. 

15:08 - August 21, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తీసుకున్నాయి. గత కొన్ని రోజులుగా రాజకీయాలు రోజుకో విధంగా టర్నింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకున్నాయి. ఈపీఎస్..ఓపీఎస్ గ్రూపులు విలీనం కావడానికి రంగం సిద్ధమౌతోంది. ఉదయం నుండి ఈ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విలినానికి సంబంధించి పన్నీర్ సెల్వం పలు డిమాండ్స్ వినిపిస్తున్నారు. పార్టీ నుండి శశికళను..దినకర్ లను తొలగించాలని..ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని..కేబినెట్ మూడు మంత్రి పదవులు ఇవ్వాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శశికళను తొలగిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పళని పేర్కొంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి పన్నీర్ సెల్వం చేరుకున్నారు.

కాసేపట్లో పన్నీర్ - పళని వర్గాలు భేటీ కానున్నాయి. ఇదిలా ఉంటే దినకరన్ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. రాజకీయ సమీక్షరణాలు మారుతున్న నేపథ్యంలో గవర్నర్ చెన్నైలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. పన్నీర్..పళనీ వర్గాలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు, నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం జరుగనున్నట్లు సమాచారం. 

14:31 - August 21, 2017

చెన్నై : బెంగళూరులోని పరప్పన జైలులో తమిళనాడు దివంగత సిఎం జయలలిత నెచ్చెలి శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపణలు చేసిన ఐపిఎస్‌ అధికారిణి రూప దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు. జైలులోని సిసిటివి ఫుటేజీని అవివీతి నిరోధక శాఖకు అందజేశారు. శశికళ, ఆమె బంధువు ఇళవరసి జైలు బయటకి వెళ్లి.. కొద్దిసేపటి తర్వాత లోపలికి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇద్దరూ జైలు దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండడడం గమనార్హం. శశికళ వెంట ఓ బ్యాగ్‌ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. శశికళ అధికారులకు లంచం ఇచ్చి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని జైళ్ల శాఖ డిఐజిగా ఉన్న సమయంలో రూప ఆరోపణలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీచేశారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

14:30 - August 21, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. పన్నీరు - పళనిస్వామి కలయికకు మరో సమస్య అడ్డుతగిలింది. మొదటి నుంచి పన్నీర్‌ వర్గం శశికళను పార్టీ పదవి నుంచి తొలగించాలని కోరుతోంది. ఇందుకు పళనిస్వామి వర్గం కూడా సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ రెండు వర్గాలు విలీనైపోతాయని ప్రచారం జరిగింది. కానీ వీరి విలీనానికి శశికళను తొలగింపే ప్రధాన అడ్డంకిగా మారింది. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం కుదరదని పళనిస్వామి తేల్చిచెప్పారు. మరోవైపు దినకరన్‌ ఇంటికి ఎమ్మెల్యేలు క్యూకడుతున్నారు. శశికళను పార్టీ పదవి నుంచి తొలగిస్తే ప్రభుత్వాన్ని అస్థిరపర్చుతామని దినకరన్‌ హెచ్చరిస్తున్నారు. దీంతో తమిళ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

13:10 - August 21, 2017

చెన్నై : అన్నాడీంఎకే ప్రధాన కార్యదర్శి శశికళ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలు విలీనం తర్వాత శశికళను తొలగిస్తూ తీర్మానం చేయనున్నారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - శశికళ