శాసనసభ

14:40 - October 11, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన పార్టీలో చేరితే కృ‌ష్ణా, గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కానీ నాలుగేళ్లుగా పవన్‌తో నాదెండ్ల మైత్రి పూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలు..సమావేశాలకు మనోహర్ సూచనలు చేస్తున్నారు. జనసేన భావజాలం, పవన్ వ్యక్తిత్వం..నాదెండ్ల నిర్ణయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల మధ్య సఖ్యత పెంచాలని ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందనే చెప్పవచ్చు. అంతేగాకుండా జనసేనకు దూరంగా ఉన్న సామాజిక వర్గాన్ని అక్కున్న చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరొందారు. మరి నాదెండ్ల ఎంతమేరకు సక్సెస్ అవుతారు ? ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

18:32 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అందింది. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ ను శాసనసభ కార్యదర్శి కలిశారు. గెజిట్ నోటిఫికేష్ ను అందించారు. మంత్రివర్గ సిఫార్సులకు అనుగుణంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు అనుగుణంగా శాసనసభ సచివాలయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ప్రతిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అందించారు. శాసనసభ రద్దు కావడంతో అన్ని స్థానాలు ఖాళీ అయ్యాయని సీఈసీకి అందిస్తారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది. 

16:28 - July 5, 2018

విజయవాడ : ఏపీ టీడీపీ యువరాజు నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరికీలోకి దిగబోతున్నారా..? ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు.. ? రాయలసీమా లేక కోస్తా ప్రాంతమా ? ఏ స్థానం నుంచి పోటీపడతారు..? అక్కడ ఎదురయ్యే సవాళ్లు ఏంటి..?  వాచ్‌ దిస్‌స్టోరీ. 
ఎమ్మెల్సీ ద్వారా లోకేశ్‌ కు మంత్రి పదవి
నారా లోకేశ్‌.. ఇపుడు ఏపీ టీడీపీలో పవర్ పుల్ నేమ్. 2014కు ముందు వరకూ పార్టీకి సంబంధించి తెరవెనుక వ్యవహారాలు చక్కదిద్దటంలో కీలకంగా వ్యవహరించిన లోకేశ్‌... ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి చేజిక్కించుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయినా.... ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేరనే విమర్శను మూటగట్టుకున్నారు. ఇప్పుడు 2019 సార్వత్రికల్లో ప్రత్యక్ష పోరుకు సై అని చెప్పటంతో లోకేశ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
రాయలసీమ నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం 
తండ్రి చంద్రబాబునాయుడు, మావయ్య బాలకృష్ణ రాయలసీమ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందున లోకేశ్ కూడా రాయలసీమ నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాజధాని ప్రాంతం నుంచి కూడా  పోటీలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే చర్చ తెలుగుదేశం వర్గాల్లో నడుస్తోంది. అధిష్ఠానం ఎక్కడి నుంచి బరిలోకి దింపితే అక్కడ నుంచి పోటీకి సై అంటున్న లోకేశ్ అందుకు తగ్గ కసరత్తు తెరవెనుక ముమ్మరం చేశారు. 
చంద్రగిరి నియోజకవర్గంపై లోకేశ్ ఊగిసలాట 
నారా లోకేశ్ బలబలాలు పరిశీలిస్తే..., తండ్రి చంద్రబాబు కుప్పం నుంచి 6సార్లు పోటీ చేసి తిరుగులేని అభ్యర్థిగా ఉన్నారు. లోకేశ్ కు అత్యంత సేఫ్ జోన్ కూడా అదే నియోజకవర్గం అని అంతా భావిస్తున్నారు. లోకేశ్ కోసం చంద్రబాబు కుప్పం స్థానాన్ని త్యాగం చేస్తే..  చంద్రబాబు ఎక్కడి నుంటి పోటీ చేస్తారన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది. నంద్యాలలో చంద్రబాబు పోటీ చేయాలనే డిమాండ్ స్థానికంగా బలంగా ఉంది. అయితే తనను తాను నిరూపించుకోవటానికి లోకేశ్ వేరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. అటు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో పోటీచేయాలని లోకేశ్ గతంలో భావించారు.  ఈ మేర ఆ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే ఆ నియోజకవర్గం ఎప్పుడూ ఒకేలా ఉండదని .. స్థానిక నాయకులను సెట్ చెయ్యటం కాస్త క్లిష్టమైన పని అని తండ్రి చంద్రబాబే హెచ్చరించటంతో ఆ నియోజకవర్గంపై లోకేశ్ ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. మావయ్య బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపూరం నియోజకవర్గం నుంచి కూడా లోకేశ్‌ పోటీ చేస్తారనే చర్చకూడా కొంతకాలం నడిచింది. అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచి బరిలో ఉన్న బాలకృష్ణకు తగు ప్రత్యామ్నాయం చూపిస్తేనే ఇక్కడ లోకేశ్ పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 
కోస్తా ప్రాంతంలో లోకేశ్ పోటీ చేస్తే..
రాయలసీమ కాకుండా కోస్తా ప్రాంతంలో లోకేశ్ పోటీ చేస్తే.. రాజధాని ప్రాంతంపై పట్టు ఉంటుందని పార్టీ వర్గాల్లో అభిప్రాయం  వ్యక్తమవుతోంది. ఇందుకు తగిన స్థానం పెనమలూరు నియోజకవర్గమేని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు మంచి పేరు ఉండటంతో... లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేయాలనుకుంటే బోడేప్రసాద్‌కు తగు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి లోకేశ్‌ అసెంబ్లీ బరిలోకి దిగుతారనే ప్రచారంతో పార్టీలో జోరుగా జర్చలు సాగుతున్నాయి.  ఇప్పటి  పరిస్థితులను బట్టి లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలంటే ఒకే ఇంటి నుంచి మూడు టిక్కెట్లు ఇచ్చే అంశం కూడా చర్చలకు రావచ్చు. ఒకే ఇంట్లో  ముగ్గురికి టిక్కెట్లు ఇస్తే విమర్శలు ఎదురవుతాయా..? దీనిపై  పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

 

21:57 - May 25, 2018

బెంగళూరు : కర్నాటక స్పీకర్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రమేశ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక.. ఏకపక్షం కావడంతో.. జెడిఎస్‌ కాంగ్రెస్‌ శిబిరం ఊపిరి పీల్చుకుంది. రమేశ్‌కుమార్‌ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 

తీవ్ర ఉత్కంఠను.. కుమారస్వామి బలనిరూపణపై నీలినీడలను కమ్మిన కర్నాటక శాసనసభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. జెడిఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు బలనిరూపణ వేళ.. స్పీకర్‌ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. బీజేపీ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ కూడా స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేయడంతో.. ఉత్కంఠ నెలకొంది అయితే.. శుక్రవారం అసెంబ్లీ సమావేశమయ్యే సమయానికి.. బీజేపీ తమ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. 

బీజేపీ నిర్ణయంతో.. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ బోపయ్య.. ఆయన్ను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా.. వివిధ పక్షాల నాయకులు.. స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను అభినందిస్తూ.. గతంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో.. జెడిఎస్‌-కాంగ్రెస్‌ సర్కారు బలనిరూపణ  అప్పటికే దాదాపు ఖరారైపోయింది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసతీర్మాన ప్రతిపాదన చేయడం.. బీజేపీ వాకౌట్‌ చేయడంతో.. ఊహించినట్లే జెడిఎస్‌-కాంగ్రెస్‌ సర్కారు విజయం సాధించింది. దీంతో.. మూడు రోజులుగా కర్నాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. 

21:05 - May 19, 2018

విజయవాడ : కన్నడ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. యడ్యూరప్ప రాజీనామాతో... ప్రజాస్వామ్యం గెలిచిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు.. అధికారం కోసం ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టి.. అడ్డదారిలో అధికారం చేపట్టాలని బీజేపీ యత్నించగా.. విపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించాయన్నారు. మోదీ, అమిత్‌షా అధికారం కోసం ఇలా వ్యవహరిస్తే... భవిష్యత్‌ తరాలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అని చంద్రబాబు ప్రశ్నించారు.

బీజేపీకి తగిన శాస్తి జరిగిందన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. బల నిరూపణకు బీజేపీకి 15 రోజులు గడువు ఇచ్చివుంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదని... కానీ సుప్రీంకోర్టు కల్పించుకుని వెంటనే బలపరీక్షకు ఆదేశించడంతో... విధిలేని పరిస్థితుల్లో యడ్యూరప్ప రాజీనామా చేశారన్నారు నారాయణ. 

13:19 - April 3, 2018

హైదరాబాద్ : టీ-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ కౌంటర్‌ దాఖలు చేయనందుకు ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తదుపరి విచారణను ఆరో తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయకపోతే ఇంక కౌంటర్‌ ఉండదని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. 

09:19 - March 21, 2018

గుంటూరు : ఇవాళ ఏపీ అసెంబ్లీలో పలు సంక్షేమ, అభివృద్ది పథకాలపై చర్చ జరగనుంది. స్మార్ట్ పల్స్ సర్వే,  ప్రభుత్వం ఆధ్వర్యంలోకి ఏపీఎస్ ఆర్టీసీ, గిరిజన తండాలను గ్రామపంచాయితీల స్థాయికి పెంచే అంశంపై శాసన సభలో చర్చలు జరగనున్నాయి. దాంతోపాటు కరువు జిల్లా అనంతపురంలో  చెరువులను నింపే నోటీసు పై చర్చకూడా చర్చ జరగనుంది. ఎకనామికల్ డెవలప్‌మెంట్‌ బోర్డు-2018 బిల్లు ను సీఎం చంద్రబాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు 
వ్యవసాయ అనుబంధ రంగాలు, పంటల బీమా,  కరువు నివారణ, రైతు బజార్లపై లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. 
శాసన మండలిలో కూడా పలు అంశాలపై చర్చ 
ఇక శాసన మండలిలో కూడా పలు అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల భవనాల నాణ్యత, కెరీర్ అడ్వాన్‌మెంట్స్  స్క్రీమ్‌పై చర్చ  జరగనుంది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం, సిటిజన్స్‌ చార్టులు, ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, గంజాయి ఎగుమతి, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు అవకాశం ఉంది. దాంతోపాటు సంక్షేమం, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల ప్రాజెక్టులపై   కూడా మండలిలో  లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. 

07:01 - March 16, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష ముగిసింది. 48 గంటల దీక్ష అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ కుమార్‌లకు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డిలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే తన కుటుంబ సభ్యులను ఎవరినైనా నల్గొండ నుంచి పోటీ చేయించి గెలవాలని కోమటి రెడ్డి సవాల్‌ విసిరారు. ఎమ్యెల్యేగా చివరిసారి మాట్లాడుతున్నానంటూ.. సంపత్ కుమార్ ఉద్వేగానికి లోనయ్యారు. అలంపూర్ ప్రజలు ఎప్పటికి తన గుండెల్లో ఉండిపోతారని అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగనందునే తన పై కక్ష కట్టారని సంపత్‌ కుమార్‌ ఆరోపించారు.

తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ, 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు కూర్చున్న కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లు దీక్షను విరమించారు. గురువారం నాడు టీ పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, గీతారెడ్డిలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉత్తమ్‌, జానారెడ్డితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు రోజుల పాటు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు బుధవారం ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలుపగా.. చివరి రోజు జేఏసీ ఛైర్మన్‌ కోదండ రామ్‌ గాంధీ భవన్‌కు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు మద్దతు ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ సిఫారసు లేకుండా ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని తప్పుబట్టిన కోదండరామ్‌ వారి సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ... సీఎం కేసీఆర్‌ పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కేసీఆర్‌ తెలంగాణకు పట్టిన శని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పై పోరాటం చేస్తామనే కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీని ఫాం హౌస్‌లోనో, ప్రగతి భవన్‌లో గానీ నిర్వహించుకుంటే బాగుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను బహిష్కరించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారన్నారు. సహజ సూత్రాలకు వ్యతిరేకంగా స్పీకర్‌ కాంగ్రెస్‌ సభ్యులపై నిర్ణయం తీసుకున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. స్వామిగౌడ్‌కు హెడ్‌ సెట్‌ తగిలిందనడం పచ్చి అబద్ధం అని, ఆధారాలుంటే చూపాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్‌ చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ పై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. కేసీఆర్‌కు దమ్ముంటే నల్గొండ నుంచి పోటీ చేసి గెలవాలని.. లేదంటే తన కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల్లో ఉండనని.. గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనని శపథం చేశారు. నల్లగొండతో పెట్టుకుంటే మాడిపోతావ్‌ అంటూ కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు. దీక్షలో కూర్చున్న మరో నేత సంపత్‌ కుమార్‌.. ఎమ్మెల్యేగా చివరిసారిగా మట్లాడుతున్న.. బాధగా ఉందంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పార్టీ మారనందుకే తనపై కక్ష కట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని సంపత్‌ కుమార్‌ ఆరోపించారు.

ఓ వైపు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌, ఇంకో వైపు స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్‌ సభ్యులు వేసిన వాజ్యం శుక్రవారం కోర్టు బెంచ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం చీఫ్ ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసి శాసన సభ్యత్వ రద్దు పై ఫిర్యాదు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓట్లు తగ్గించేందుకే కుట్రపూరితంగా ఇద్దరు సభ్యుల శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు.

10:35 - March 13, 2018

హైదరాబాద్ : అందరూ ఊహించినట్టే జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రారంభమైన శాసనసభలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ ప్రసగించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటి ఛైర్మన్ స్వామిగౌడ్ గాయపడడం కలకలం రేగింది. మంగళవారం ప్రారంభమైన సమయంలో స్పీకర్ తొలుత మాట్లాడారు. ఘటన జరగడం బాధాకరమని, ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అరాచక చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎన్.ఉత్తమ్, డికే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, పద్మావతిలు సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు, అంతేగాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వం ను రద్దు చేస్తున్నట్లు, ఈ తీర్మానాన్ని ఆమోదించాలని మంత్రి హరీష్ రావు సభలో తెలిపారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు, సస్పెండ్ అయిన వారు సభలో నుండి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. 

07:59 - March 13, 2018

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రణరంగాన్ని తలపించింది. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రసంగం కాపీలను చించివేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైంది. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. మరోవైపు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో మహేష్ రెడ్డి (టి.కాంగ్రెస్), మన్నె గోవర్దన్ (టీఆర్ఎస్), బి.వెంకట్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - శాసనసభ