శ్రీకాకుళం

09:36 - October 19, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుఫాను బీభత్సం శ్రీకాకుళం జిల్లా ప్రజానీకాన్ని వెంటాడుతూనే ఉంది. తీరప్రాంత ప్రజానీకం కారు చీకట్లో కాలం వెళ్ళదీస్తున్నారు. సీఎం పర్యటనలో హడావుడితప్ప తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు. తినడానికి తిండి, చేయడానికి కూలీ లేదు.. చుట్టూ నీళ్ళు.. విషపురుగుల మధ్య జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చావడమో.. ఊరొదలడమో తప్ప తమకు వేరే మార్గం లేదంటున్నారు. తిత్లీ తుఫాను ఆగిపోయి సుమారు వారం రోజులు దాటుతున్నా.. అది సృష్టించిన బీభత్సం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇంకా కోలుకోలేదు. 
విద్యుత్‌ సరఫరా లేక తీరప్రాంత గ్రామాల్లో అంధకారం నెలకొంది. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనలో హడావుడి తప్ప ఏమీలేదని విమర్శిస్తున్నారు. దోమలు పెరిగిపోయాయని.. అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. సహాయ కార్యక్రమాలపై అధికారులు కోతలు కోయడమే తప్ప వాస్తవానికి  చేసిందేమీ లేదని మండిపడుతున్నారు.
తీరప్రాంతాల్లో ఇంతవరకూ విద్యుత్‌ పునరుద్ధరణ చేయలేదు.  తొమ్మిది రోజులుగా బెండి గ్రామానికి విద్యుత్‌ సరఫరాలేదు. పలాసాతోపాటు.. జాతీయరహదారికి అత్యంత సమీపంలోని ఈ గ్రామంలో కొవ్వొత్తులు కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. కట్టుకునేందుకు బట్టల్లేవు, చిన్నపిల్లలకు పాలులేవు.. వెలిగించుకోడానికి కొవ్వొత్తులు లేవు  ఎటైనా వెళ్దామంటే సరైన దారి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజానీకం..
తీరప్రాంతాల్లో మహిళలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు  చూస్తున్నారు.  సుమారు ఇరవై ఏళ్ళుగా పెంచుకున్న చెట్లన్నీ నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిపని కూడా దొరకని పరిస్థితినెలకొంది..  ఆదాయ మార్గమే లేనప్పుడు.. తాము తీసుకున్న డ్వాక్రా రుణాలు ఎలాచెల్లించాలంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు ఇక్కడ బతుకుదెరువు కూడాలేదని.. ఊరొదిలిపోవడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు. 
సీఎం పర్యటించే ప్రాంతాల్లో తప్ప మరెక్కడా రోడ్లను క్లియర్‌ చేయడం లేదంటున్నారు. విరిగిపడ్డ చెట్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏమాత్రం తొలగించలేదని మండిపడుతున్నారు. హడావుడిగా అరగంటసేపు జనరేటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేశారనీ.. దీనివల్ల కొందరికి విద్యుత్‌షాక్‌ తగలడంతో ఆపేశామంటున్నారు ప్రజలు. 

17:49 - October 18, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుఫానుతో గూడు చెదిరిపోయిన పక్షుల్లా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. తినేందుకు తిండి లేక..తాగేందుకు మంచి నీరు లేక విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని కష్టాలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించారు. తిత్లీ బాధితులను  కొందరు అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసిందని... అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తోలు తీస్తానని హెచ్చరించారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు..తుపాను వల్ల పచ్చటి ఉద్దానం మొత్తం నాశనం అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. మూడు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని... జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరపున నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రంగాల వారీగా నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు.
ప్రజలకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. కేరళకు తుపాను వస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని... ఇక్కడి తుపాను బయట ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. తుపాను నష్టాన్ని వీడియోల రూపంలో బయట ప్రపంచానికి తీసుకెళ్తామన్నారు. కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 

10:19 - October 18, 2018

శ్రీకాకుళం : అసలే వెనుకబాటుకు గురైన జిల్లా. పులిమీద పుట్రలా తుఫానుల తాకిడికి అల్లాడిపోతోంది. ఆహారపానీయాలకు చిన్నారుల నుండి పెద్దవారి వరకూ అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ఎంతగా స్పందించినా తిత్లీ  తుపాను దెబ్బనుండి ఇప్పుడిప్పుడే కాస్తగా కోలుకుని పంట నష్టాలను అంచనావేసుకునే క్రమంలోనే మరో ప్రమాదం పొంచి వుండటంతో శ్రీకాకుళం వాసులు చిరుగుటాకుల్లా వణికిపోతున్నారు. ప్రాణాలతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లినా ప్రాణాలతో బైటపడి తిరిగి కోలుకుంటున్న సమయంలో మరో ప్రమాదంతో ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. వందలాది ఎకరాల్లో అరటి, జీడి మామిడి పంటలతో పాటు కొబ్బి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు మరోసారి తుపాను ప్రమాదం ఉందని వార్తలు రావడంపై జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఈ నెల 23న ఉత్తర అండమాన్, అగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు ఓ బులెటిన్ ను కూడా విడుదల చేసింది. అల్పపీడనం తొలుత బలపడి వాయుగుండంగా, ఆతర్వాత తుఫానుగా మారినప్పుడే దాని గమనం తెలుస్తుందని వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోసారి బంగాళాఖాతంలో తుపాను వస్తే దానికి ‘గజ’ అని పేరు పెడతామని వెల్లడించారు. తుపాను ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అయితే అప్పుడే ప్రజల్లో తుపాను గురించి వదంతులు రెచ్చగొట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. 

 

12:46 - October 17, 2018

శ్రీకాకుళం : జిల్లాలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. ఇటీవలే తిత్లీ తుపాన్‌తో జిల్లాలో అపార నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉద్దాన్నం ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. వేలాది కొబ్బరిచెట్లు నేలకూలడం..పంటలు నీట మునిగిపోవడం..నివాసాలు నేలమట్టమయ్యాయి. దీనితో ఉద్దాన్నం వాసులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో దత్తత తీసుకున్న సహలాలపుట్టుగ గ్రామంలో లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. 
తుపాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతోందని, కొబ్బరి పంటకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. మిగిలిన చెట్లను రక్షించాలని రైతులు కోరుతున్నారని, పడిపోయిన చెట్ల ప్రాంతాన్ని క్లియర్ చేయాలంటున్నారని తెలిపారు. మరలా కొబ్బరి పంట రావాలంటే చాలా కాలం పడుతుందని, అరటి చెట్లు పంట పెట్టడం..కోకో పంటలు వేసుకొనే విధంగా ప్రభుత్వ స్థాయిలో ఆలోచించాలని సూచించారు. ఇక్కడ చాలా మంది చిన్న రైతులున్నారని, ఒక సంవత్సరపు పాటు ఒక్కో పంచాయితీకి హార్టికల్చర్ అధికారిని కేటాయించాలని సూచించారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 

12:42 - October 17, 2018

శ్రీకాకుళం : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిత్లీ తుపాను బాధితులను పవన్ పరామర్శించనున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి, సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్యలపై పవన్ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు ముందే ప్రకంపనలు రేగాయి. 

 

11:49 - October 17, 2018

విజయవాడ : తిత్లీ తుపాను సాయంపై కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచుతోంది. తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు .. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖను రాశారు. రెండు జిల్లాలను ఆదుకోవడానికి తక్షణ సాయంగా 1200 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు.  టీడీపీ ఎంపీలు  కేశినేని నాని, కొనకళ్ల  నారాయణ, మాగంటి బాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి గన్నవరం విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. తుఫానుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 3,435.29 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోనే మకాం వేసిన ఏపీమంత్రి నారా లోకేష్‌.... సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా సహాయం అందిస్తున్నామన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని,  పునరావాసం కల్పించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాకు కేంద్ర బృందాలను వెంటనే పంపాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. రాజ్‌నాథ్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. మరి దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

16:12 - October 16, 2018
శ్రీకాకుళం: జిల్లాలో తిత్లీ తుపాను వల్ల జరిగిన నష్టం వివరాలను బుధవారం సాయంత్రంలోగా అందచేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృధ్దిశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన.. మంగళవారం మందస సబ్‌ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పునరుద్దరణ పనులను పరిశీలించారు. ఈ రాత్రికి సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అవ్వాలని లోకేష్ ఆదేశించారు. అనంతరం డీఆర్డీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. తుఫాను ధాటికి జిల్లాలో 5వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనా వేశామని, తండాలలో ఎక్కువ ఇళ్లు పడిపోయాయని అధికారులు మంత్రికి తెలిపారు. జిల్లాలో తాగునీరు అందని ప్రాంతాలకు యుధ్దప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.

12:47 - October 15, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాను ఉద్దానం కిడ్నీ బాధితులకు శాపంగా మారింది. ఉద్దానం కిడ్నీ బాధితులపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కరెంటు లేకపోవడంతో సోంపేట డయాలసిస్ కేంద్రం పనిచేయడం లేదు. డయాలసిస్ అందుబాటులో లేక కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ డయాలసిస్ కేంద్రాలకు వెళ్లలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మార్గాలు లేకపోవడంతో కిడ్ని రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  

 

07:34 - October 15, 2018

హైదరాబాద్ : తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తుపాను బాధితులకు తనవంతు సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు అందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంతేకాకుండా తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న సిక్కోలును ఆదుకోవావడానికి ముందుకు రావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో పలువురు అభిమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విజయ్‌దేవరకొండపై ప్రజలు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి మరింతమంది ముందుకు వచ్చి శ్రీకాకుళం ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇటీవలే వరదలతో అతలాకుతలమైన కేరళకు విజయ్‌దేవరకొండ రూ.5 లక్షల విరాళం ప్రకటించాడు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ.25 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన సంగతి తెలిసిందే.

 

16:25 - October 14, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. తిత్లీ వల్ల పలువురు మృతి చెందారు. తుపాన్ తో అపార నష్టం వాటిల్లింది. తిత్లీ తుపాను దెబ్బ నుంచి ఉద్దానం వాసులు తేరుకోలేదు. కరెంట్ లేకపోవడంతో నాలుగు రోజులుగా పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 180 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. తాగేందుకు నీరు లేదని బాధితులు వాపోతున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - శ్రీకాకుళం