శ్రీకారం

21:37 - August 2, 2018

అసిఫాబాద్ : సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు నాలుగేళ్లుగా మూతపడిన సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
అసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన 
కోమ్రం భీం అసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సిర్పూర్‌ పేపర్‌ మిల్లును పునః ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. గత ప్రభుత్వాల తప్పిదం వల్ల, మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందన్నారు. పేపర్‌ మిల్లు పునః ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. జేకే పేపర్స్‌ అనే సంస్థ పేపర్‌ మిల్లు ప్రారంభానికి ముందుకు వచ్చిందని  తెలిపారు. 
మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తెరిపించేందుకు కృషి : కేటీఆర్ 
జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తెరిపించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. కార్మికులకు అండగా ఉండటానికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్ పాలనను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కోసం 25 కోట్లు వెంటనే మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగజ్‌ నగర్‌ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. 

 

08:18 - June 28, 2018

ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్ధానంలో మరో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు కేంద్రం శ్రీకారం చుట్టింది. యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు మార్గం సుగమం చేస్తూ యూజీసీ చట్టం, 1956ను తొలగిస్తూ నూతన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నూతన ముసాయిదా చట్టంపై జులై 7లోగా విద్యాసంస్థలు, మేథావులు, నిపుణులు, తల్లితండ్రులు తమ విలువైన సూచనలు, సలహాలను పంపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కోరింది. విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చడంలో యూజీసి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఈ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషన్‌ తలకెత్తుకోనుంది. 

 

19:06 - June 8, 2018

కరీంనగర్ : ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ చిన్నారులకు విద్యను అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. వినూత్న ప్రయోగంతో ఈ విద్యాసంవత్సరంలో సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగంతో చిన్నారులు ఆధునికతను అందిపుచ్చుకోవడంతో పాటు శ్రమనూ తగ్గించుకోనున్నారు. 

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు విద్య మరింత చేరువ కానుంది. చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యునిసెఫ్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్టు విధానంతో విద్యార్థులు.... నోటితో చదువుతూ విద్యనభ్యసించాల్సిన పరిస్థితికి చెక్ పడబోతోంది. వారు చదవాలనుకున్నది వారి చేతిలోని డివైజర్‌ చకచకా చదివేస్తుంది. 

ఇదిగో దీనిపేరే డాల్ఫియో డివైజర్‌..... ఈ వినూత్న ప్రయోగాన్ని ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 64 పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నారు. డాల్ఫియో డివైజర్ సిస్టం ద్వారా పుస్తకాల్లోని పాఠాలను వినే విధానం అమలు చేస్తున్నారు. ఇందుకోసం వంద తెలుగు, ఆంగ్ల పుస్తకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీంతో  రైటింగ్ ఆర్థోమెటిక్ విధానం అమలు చేస్తున్నారు. చదువులో వెనకబడిన చిన్నారులు ఈ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నారు ఉపాధ్యాయులు. 

డాల్ఫియో డివైజర్‌ను ఛార్జ్ చేసిన తరువాత ప్రతి బుక్‌పై గెట్ స్టార్టెడ్ పేరుతో ప్రత్యేకంగా చిప్ ను ఏర్పాటు చేశారు. ఆ చిప్ వద్ద డివైజర్ ఉంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన డివైజర్‌ను పాఠ్యాంశంపై ఉంచితే డివైజర్‌ చక చకా చదివేస్తుంది. అయితే ఈ ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. డాల్ఫియో డివైజర్ విధానం వల్ల చిన్నారులకు భాషపై పట్టు... స్పష్టమైన ఉచ్ఛరణ కూడా వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ విధానంపై విద్యార్థులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సరికొత్త విధానంతో చిన్నారులు చదువుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని చేపడుతోన్న ఈ పద్దతిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా బుక్‌పై చిప్‌ను ఏర్పాటు చేసినప్పుడు పేపర్‌ చినిగితే బుక్‌ను చదివే అవకాశం లేకుండా పోతుంది. ఈ సమస్యను అధిగమించ గలిగితే ఈ నూతన విధానం చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరక్షరాస్యత నిర్మూలన... డ్రాప్ అవుట్స్ ను బడికి రప్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. 

 

07:49 - May 31, 2018

గుంటూరు : మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రెండు ఆరోగ్య రథాలను ప్రవేశపెట్టింది. వీటిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభించారు. సీలేరు, కడప జిల్లాల్లో ఈ ఆరోగ్యరథాలు ప్రజలకు వైద్యసేవలు అందించనున్నాయి. ఇందులో ఉచితంగానే రోగులకు మందులు, వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
రెండు ఆరోగ్య రథాలను ప్రారంభించిన సీఎం
మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.  రెండు ఆరోగ్య రథాలను సిద్ధం చేసింది. 90 లక్షల విలువైన ఈ రెండు ఆరోగ్య రథాలను సీఎం చంద్రబాబు తన నివాసమైన ఉండవల్లిలో  ప్రారంభించారు. జెండా ఊపి ఆరోగ్య రథాలను ప్రారంభించారు. 
ఆరోగ్య రథాలకు డబ్బును సమకూర్చిన ఏపీ జెన్‌కో
కార్పొరేట్‌ సర్వీసు రెస్పాన్స్‌బిలిటీ నిబంధన కింది ఏపీ జెన్‌కో 90లక్షలు సమకూర్చింది.  ఈ రెండు ఆరోగ్య రథాలలో ఒక వాహనాన్ని సీలేరు.. మరో వాహనాన్ని కడప జిల్లాకు కేటాయించారు. ఈ  ఆరోగ్య రథాలతో వివిధ రోగాలకు సంబంధించిన 150 వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈసీజీ, రక్తపరీక్షలు, ఐదు పెరామీటర్‌ మానిటరింగ్‌ సిస్టం, నీరుడు పరీక్ష, నెబురైజర్, హార్ట్‌ఎటాక్‌ వచ్చిన రోగికి వైద్య సేవలు అందించి.. ప్రమాదం నుంచి రక్షించుటకు తగిన సౌకర్యాలు ఈ ఆరోగ్య రథాలలో ఏర్పాటు చేశారు. 
ఉచితంగా రోగులకు మందులు
ఆరోగ్య రథాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తాయి. ఈ రథాలలో ఒక మెడికల్‌ ఆఫీసరు, ఫార్మాసిస్ట్‌ స్టాఫ్‌నర్సు, టెక్నీషియన్‌ ఉంటారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగానే అందజేయనున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూలాంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. కేన్సర్‌లాంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి.. ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆసుపత్రులకు పంపిస్తారు. రోగులకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్‌ మెడిక్‌ రికార్డులో అప్లోడ్‌ చేసి రోగి ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తారు.  ఆరోగ్య రథాలకు ఒక్కోదానికి అదనంగా 3 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైనా పీహెచ్‌సీకి రాలేనివారు ఉంటే..ఈ అంబులెన్స్‌లు ఆయా గ్రామాలకు పంపి ఇంటి వద్దనే ఉచిత సేవలు అందిస్తుంది.

 

18:37 - March 28, 2018

నెల్లూరు : త్వరలో 10 రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. రేపు శ్రీహరికోటలో జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా అతిపెద్ద ఎస్-బ్యాండ్‌తో కూడిన జీశాట్-6ఏ అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నారు. మరో 15 రోజుల్లో పీఎస్ఎల్‌వీ-సీ 41రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1-9 అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. రేపటి ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీచెంగాళమ్మ ఆలయంలో శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

07:33 - December 30, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ ప్రజలతో కేటీఆర్‌ అనుసంధానమయ్యారు. ప్రజలతో లైవ్‌ చాట్ చేశారు. నెటిజన్లు వ్యక్తం చేసిన.. అభిప్రాయాలకు, ప్రశ్నలకు.. తనదైన శైలిలో స్పందించారు. 
రెండు గంటల పాటు కేటీఆర్‌ లైవ్‌చాట్‌
తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్... సోషల్ మీడియాలో ప్రజలకు చేరువయ్యారు. ట్విట్టర్ వేదికగా... రెండు గంటలకు పైగా సాగిన కేటీఆర్‌ లైవ్‌చాట్‌... మూడు సమాధానాలు, ఆరు చమత్కారాలుగా  సాగింది. రాజకీయ, వ్యక్తిగత, వృత్తిగత, పరిపాలనాపరమైన అంశాలపై కేటీఆర్‌.. సూటిగా.. సందర్భోచితంగా స్పందించారు. ప్రముఖులకు  సంబంధించి...వచ్చిన ప్రశ్నలపై.. ఒక్క పదంతో.. వారి వ్యక్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్‌ .. ఓ టాస్క్‌ మాస్టర్‌...! హరీశ్‌రావు.. హార్డ్‌వర్కర్‌..! సచిన్‌.. ఓ లెజెండ్‌..! అని చెప్పిన కేటీఆర్‌.. పవన్‌ ఓ ఎనీగ్మా..! రేవంత్‌ రెడ్డి ఎవరూ అంటూ..? తన సంభాషణను ఆసక్తికరంగా.. సాగించారు.   
ఆ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యం : కేటీఆర్‌
అలాగే చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదెందుకు అని అడిగితే... ప్రభుత్వం, ప్రజలు వేరు అనే భావన ఉందని.. నిజానికి రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యమని కేటీఆర్‌ బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజిన్‌ అన్న మాటకు ఎన్నికల గురించి వర్రీ లేదన్నారు. కేంద్ర కెబినెట్లో చేరుతారా? అని అడిగితే ఉన్నదాంతోనే సంతోషంగా ఉన్నానన్నారు. 
పాత బస్తీకి మెట్రో రైలు వస్తుందన్న కేటీఆర్ 
అలాగే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రీకృతంగా మాత్రమే కాకుండా..  సమ్మిళిత అభివృద్ధి దిశగా పోతుందని... పాత బస్తీకి కచ్చితంగా మెట్రో రైలు వస్తుందని చెప్పారు. సీఎన్జీ, ఎల్పీజీ బస్సుల వినియోగం గురించి అడిగితే ఎలక్ట్రికల్‌ వాహనాలే సరైన పరిష్కారం అన్నారు. నగరంలో వైఫై  ప్రాజెక్ట్ మూడు వంతులు పూర్తైందని.. త్వరలోనే మరిన్ని హాట్‌ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తవుతుందన్నారు.  
తన అభిరుచులను వెల్లడించిన కేటీఆర్‌ 
అలాగే తన అభిరుచులను కూడా.. కేటీఆర్‌ వెల్లడించారు. బాలివుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్ తన అభిమాన నటుడని.. రాహుల్‌ ద్రావిడ్‌, కోహ్లీ, రోహిత్‌లు అభిమాన క్రికెటర్లని చెప్పారు. బరాక్ ఒబామా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడన్నారు. ఇక ఇండియన్‌ చైనీస్‌ తనకు ఇష్టమైన ఆహారమని.. అమెరికాలో ఉన్నప్పుడు వంట చేసిన విషయాన్ని చెప్పారు. అదే విధంగా.. అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్‌టీఆర్‌, మహేశ్‌బాబుల గురించి.. తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ తన సోదర రాష్ట్రమని..  టీఆర్‌ఎస్‌ను ఆంధ్రలో విస్తరించే ఆలోచనలేవీ తనకు తెలియవని చెప్పారు.
నెర్వస్‌గా ఫీల్ అయ్యాను : కేటీఆర్‌ 
అలాగే మెట్రో ప్రారంభం, జీఈఎస్ సమావేశం రెండూ ఒకేరోజు ఉండటమే ఈ ఏడాది గుర్తుండిపోయే రోజని వివరించారు. జీఈఎస్ సదస్సులో చర్చను నిర్వహించిన సందర్భంలో నెర్వస్‌గా ఫీల్ అయ్యానని కేటీఆర్‌ చెప్పారు. అలాగే  ఫిట్‌గా ఉండటమే కొత్త సంవత్సర తీర్మాణామని మంత్రి కేటీఆర్ నెటిజన్లకు స్పష్టం చేశారు. 

 

12:10 - October 18, 2017

హైదరాబాద్ : పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 2 గంటలకు అమెరికా బయలుదేరారు....మొత్తం 9 రోజుల పాటు మూడు దేశాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. చివరి రెండు రోజులు లండన్‌లో పర్యటించి అమరావతి డిజైన్స్‌ను సీఎం చంద్రబాబు ఖరారు చేయనున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరారు. పెట్టుబడులు ఆకర్షించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఫారిన్‌ టూర్‌ చేపట్టారు. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్‌లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు విదేశాల్లో పర్యటించనున్నారు. ఆయన 18 నుంచి 20వరకు అమెరికా పర్యటనలో ఉంటారు. 21నుంచి 23వరకు యూఏఈలో పర్యటిస్తారు. యూకేలో 24నుంచి 26 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

మూడు దేశాల పర్యటనలో రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమెరికాలో ఐయోవా గవర్నర్, ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ నార్తీలను కలుస్తారు. చికాగోలో గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్‌వర్క్ సభ్యులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు.   అనంతరం ఐయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి, రీసెర్చ్ పార్కులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐయోవా గవర్నర్ ఇచ్చే విందులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయి కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు గురించి వివరించనున్నారు. అమెరికా పర్యటనలో చివరి రోజు వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొంటారు.

అమెరికా పర్యటన అనంతరం ఈనెల 21 నుంచి 23 వరకు యునైటెడ్ అరబ్ దేశాలను చంద్రబాబు విజిట్‌ చేస్తారు. ముందుగా నాన్ రెసిడెంట్స్ కమ్యూనిటీతో భేటీ కానున్నారు. బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌, ఎమిరేట్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, రాయల్ ఫ్యామిలీ వెల్త్ మేనేజర్‌, ఎమిరేట్స్ గ్రూపు-దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్, ఒమన్ ఎండోమెంట్ మినిస్టర్‌తో సమావేశమై... ఏపీలో ఎయిర్‌పోర్టు ఎకోసిస్టమ్‌ గురించి చర్చించనున్నారు. ఆ తర్వాత యూఏఈ ప్రభుత్వ, పరిశ్రమల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు, అబుదాబీలోని రాజకీయ, వర్తక, వాణిజ్య ప్రముఖులతో డిన్నర్ సమావేశంలో పాల్గొంటారు. 

యూఏఇ నుంచి చంద్రబాబు నేరుగా యూకే వెళ్లనున్నారు. ఈనెల 24 నుంచి 26 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమరాతిలో నిర్మించనున్న శాశ్వత అసెంబ్లీ, హైకోర్ట్, పరిపాలన నగరం డిజైన్స్‌ను పరిశీలించనున్నారు. పర్యటనలో చివరి రోజు డిజైన్స్ ఖరారు చేయనున్నారు. ఈనెల 27న ముఖ్యమంత్రి బృందం తిరుగు ప్రయాణం కానుంది. 

21:43 - October 12, 2017

సూర్యపేట : సమైక్య పాలనలో, కాంగ్రెస్ నేతల హయాంలో దక్షిణ తెలంగాణ దగాపడిందన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఆనాడు కాంగ్రెస్ నేతలే దగా చేశారని కేసీఆర్ ఆరోపించారు. సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సూర్యాపేటలో పర్యటింటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు. తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈరోజు నష్టపరిహారం గురించి మాట్లాడుతున్న  ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన నియోజకవర్గంలో భూములు మునిగితే ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష ఉత్తమ్ కుమార్‌ రెడ్డిలు అడ్డుకున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాటి సమైక్యవాదులైన కాంగ్రెస్ నేతలు దగా చేశారని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో నీరు పారేదని అన్నారు. అప్పుడు, ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. 

18:54 - October 4, 2017

కర్నూలు : అమరావతి తరహాలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే పనిగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో కార్పొరేషన్ పార్కులు, వీధి దీపాలు, రోడ్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కేఈ.కృష్ణమూర్తి తెలిపారు. 

22:18 - September 15, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - శ్రీకారం