సంక్రాంతి

08:03 - May 29, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'..దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో రూపొందబోయే చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ‘మహేష్' లేకుండానే చిత్ర షూటింగ్ ప్రారంభం కావడం విశేషం. ‘శ్రీమంతుడు' తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. ‘శ్రీమంతుడు' ఘనవిజయం సాధించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2018 సంక్రాంతి సందర్భంగా జనవరి 11న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించడం గమనార్హం. అంచనాలకు తగ్గట్టుగానే 'కొరటాల' పక్కా స్ర్కిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘మహేష్' నటిస్తున్న 'స్పైడర్' సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ అవకాశాన్ని 'కొరటాల' సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. వ్యక్తిత్వం ప్రధానంగా ఈ చిత్ర కథను రూపొందించినట్లు, అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి.

21:24 - January 16, 2017
21:22 - January 16, 2017

హైదరాబాద్ : సంక్రాంతి సెలవులు ముగియడంతో .. జనం మళ్లీ నగరబాట పట్టారు. మూడురోజుల పాటు సంక్రాంతి పండగను సొంతూళ్లలో ఆనందోత్సహాలతో జరురపుకుని తిరుగుప్రయాణం కావడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నారు. మరోవైపు సందంట్లో సడేమియాగా ఆర్టీసీ సహా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తరలివెళ్లిన జనం... తిరుగు ప్రయాణమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ముగియడంతో తిరిగి ఉద్యోగ, వ్యాపారాల కోసం వారు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి, గొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం టోల్ గేట్‌ను దాటి వెళ్లేందుకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద తిరిగి అదనపు కౌంటర్లను ప్రారంభించారు. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు త్వరగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మారుమూల పల్లెల నుండి..
ఏపీలోని మారుమూల పల్లెల నుంచి విజయవాడ నెహ్రూబస్టాండ్‌కు చేరుకుంటున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. టిక్కెట్‌ రేటుపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 400గా ఉన్నటికెట్‌కు వెయ్యికిపైగా వసూలు చేస్తున్నారు. మరికొందరు 1300 నుంచి 1500 వరకు దండుకుంటున్నారు. మరోవైపు దోపిడీ విషయంలో ఆర్టీసీ ఏమీ తక్కువ తినలేదు. ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు రేట్లు వసూలు చేస్తోంది. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నా కిటికీలు, సీట్లు సరిగాలేని బస్సులను నడుపుతున్నారు. దీంతో రాత్రివేళల్లో చలికితట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

17:34 - January 16, 2017

నల్గొండ : యాదాద్రిలో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా జరిగింది. అగాఖాన్‌ ఫౌండేషన్‌, తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు 31 దేశాల నుంచి 75 మంది కైటిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, యాదాద్రి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ పాల్గొన్నారు.

15:34 - January 16, 2017
15:12 - January 16, 2017

కాకినాడ : సంక్రాంతి సంబరాల్లో పందాల జోరు కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. మూడు రోజులుగా కొనసాగిన ఈ పందాలు నాలుగో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ పందాలపై పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారనే తారాస్థాయిలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు కూడా పందాలు జరుగుతున్నాయనే విషయం తెలియడం..కోట్ల రూపాయలు చేతులు మారుతుండడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మురముళ్లలో పొట్టేళ్ల పందేలను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర విజయరామారావు హాజరయ్యారు. మరోవైపు పొట్టేళ్ల పందేలను పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజులుగా కోళ్లు, పొట్టేళ్ల పందేళను చూసీ చడనట్లు వ్యవహరించి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజులు ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు నాలుగో రోజు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై తీవ్ర వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

12:13 - January 16, 2017

చెన్నై : తమిళనాడులో జల్లికట్టును నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధురైలోని అళంగనల్లూర్‌, పలమేడు, అవనియాపురంలో జల్లికట్లును నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే.. జల్లికట్టును నిర్వహించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా నిర్వాహకులు మాత్రం పట్టించుకోకుండా జల్లికట్టుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అళంగనల్లూర్‌లో జల్లికట్టును అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

10:48 - January 16, 2017

విశాఖ : సంక్రాంతి పండుగంటే తెలుగువారి ఇళ్లల్లో జరిగే హడావుడి అంతాఇంతాకాదు. భోగి మంటలు,ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆటపాటలు. అంతేనా.. చిన్నారులు ఏర్పాటు చేసే బొమ్మల కొలువులూ ముచ్చటగొల్పుతాయి. ఇంటింటా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఇరుగు పొరుగుని పిలిచి చూపించడంలో ఉండే ఆనందమే వేరు. నేటి ఆధునిక కాలంలో జనం బొమ్మల కొలువులు పెట్టడమే మానేశారు. ఓ కుటుంబం మాత్రం ప్రతి ఏటా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ... మన సంస్కృతి - సంప్రదాయాలను నవ తరానికి పరిచయం చేస్తోంది.

ఆడపిల్లలకు చెందిన వేడుక...

బొమ్మల కొలువు పూర్తిగా ఆడపిల్లలకు చెందిన వేడుక. తమకు నచ్చిన బొమ్మలను అమ్మాయిలు ఒక పద్ధతి ప్రకారం పేర్చుతారు. అందులో దేవతామూర్తుల విగ్రహాలతోపాటు దేశ భక్తుల విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు.. వివిధ వృత్తులకు సంబంధించి విగ్రహాలతోపాటు అన్నిరకాల విగ్రహాలు బొమ్మల కొలువులో కొలువుతీరుతాయి.

బొమ్మల కొలువులో పాల్గొన్న చిన్నారులకు...

బొమ్మల కొలువులో పాల్గొన్న చిన్నారులకు వేడుక ముగిసిన తర్వాత బొమ్మలతోపాటు పసుపు - కుంకుమలతో కూడిన తాంబూలాలను ఇస్తారు. బొమ్మలను జాగ్రత్తగా అలంకరించే ఆడపిల్లలు.. తన కుటుంబాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారని పెద్దలు భావిస్తారు. ఆడపిల్లలే బొమ్మలను అలంకరిస్తారు కాబట్టి.. వారిలో సంబంధ, బాంధవ్యాలు పెంపొందడంతోపాటు కలివిడి తనం పెరుగుతుందని పెద్దలు చెప్తుంటారు.

వారసత్వంగా వస్తున్న కళలు, సంస్కృతి..

ప్రస్తుత ఆధునిక యుగంలో మన వారసత్వంగా వస్తున్న కళలు, సంస్కృతి - సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. మానవులు బిజీలైఫ్‌కు అలవాటు పడిన తర్వాత పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలకు ఆదరణ కరువవుతోంది. ఇందులో భాగంగానే బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడమే మానేశారు. కానీ విశాఖనగరంలోని ఓ కుటుంబం మాత్రం తమ పిల్లలకు ఈ బొమ్మల కొలువును పెట్టడం నేర్పిస్తోంది. తెలుగు బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన చిన్నారులు తమకు ఇది ఎంతగానో నచ్చిందని... ఇకపై ఈ సంప్రదాయాన్ని ప్రతిఏటా కొనసాగిస్తామని చెప్తున్నారు. వారసత్వంగా వస్తోన్న మన సంస్కృతి - సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

09:52 - January 16, 2017

పశ్చిమగోదావరి : ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో కోడి పందేలతో పాటుగా పొట్టేలు పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పొట్టేళ్లు పోటీలో పాల్గొన్నాయి. పందెంలో పాల్గొన్న పొట్టెళ్ల పేర్లు రాముడు, భీముడు, పందెంలో రాముడు పొట్టేలుపై భీముడు పొట్టేలు విజేతగా నిలిచింది. ఈ పందేలను వీక్షించేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

07:01 - January 16, 2017

తూ.గో : కోనసీమలో ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరగనున్న ఈ ప్రభల తీర్ధాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రభలు తమ పొలాల నుంచి వెళ్తే పంటలు బాగా పండుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కోనసీమవాసులంటున్నారు.

అనాదిగా వస్తున్న ఆచారం....

ప్రభల తీర్థం అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామస్తులంటున్నారు. అనేక గ్రామాల నుంచి 11 ప్రభలను జగ్గన్నతోటకు ఊరేగింపుగా తరలించారు. దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల మేర.. ప్రభలను యువకులంతా భుజాలపై మోసుకుని తీసుకువచ్చారు. ఊరేగింపులో తీసుకువచ్చే ప్రభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రభలను మార్గమధ్యలో ఎక్కడా దించకుండా.. జగ్గన్నతోటకు తీసుకురావడం విశేషం. ప్రభల ఊరేగింపులో యువకులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పంటలు బాగా పండుతాయని....

ఊర్ల నుంచి తరలివచ్చే ప్రభలు తమ పొలాల గుండా వెళ్తే పంటలు బాగా పండుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అందుకే ప్రభలు తమ పొలాల గుండా వెళ్లాలని కోరుకుంటారు.

11 ప్రభలు.. పొలాల గుండా.. ఊర్లను దాటుకుంటూ..

ప్రజల ఊరేగింపు మధ్య 11 ప్రభలు.. పొలాల గుండా.. ఊర్లను దాటుకుంటూ.. జగ్గన్నతోటకు చేరుకున్నాయి. శివరూప రుద్రులైన 11 మంది రుద్రులు జగ్గన్నతోటలో సమావేశమై.. తమ గ్రామాల్లోని సమస్యలను ఏకాదశ రుద్రులు తీరుస్తారని ప్రజలు నమ్ముతుంటారు. 450 ఏళ్ల క్రితం జగ్గన్న మహారాజు హయాం నుంచి ఈ ప్రభల తీర్థం కొనసాగుతుందని.. దీన్ని తాము కొనసాగిస్తున్నామని ప్రజలంటున్నారు. అయితే.. తోటలోకి వచ్చేందుకు మధ్యలో కాలువ దాటాల్సి ఉంటుంది. ఆ ప్రభలను కాలువలో నుంచి ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా హరహర అంటూ తీసుకువచ్చే యువకుల ధైర్యం చూడడానికి రెండు కళ్లు చాలవు. మామూలుగానే ఆ కాలువలో నడవలేం. ప్రభను 30 మంది మోస్తే గానీ లేవదు. అలాంటిది కాలువలోంచి ప్రభను తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్లు గగుర్పుట్టిస్తుంది. ఇలాంటి కార్యక్రమాన్ని చూడాలని కోనసీమలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిన్నటివరకు కోడిపందాలతో సంబరాలు చేసుకున్న యువకులు.. ఈ ప్రభల తీర్థంలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు. ఇలాంటి ఆచారం మరెక్కడా లేదని.. దీన్ని జరుపుకోవడం తమకెంతో గర్వంగా ఉందని కోనసీమవాసులంటున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - సంక్రాంతి