సంబరాలు

21:33 - October 19, 2017

శ్రీనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది దీపావళి పండగను సైనికులతో కలిసి జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న గురెజ్ ప్రాంతానికి మోది వెళ్లారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇతర సీనియర్‌ ఆర్మీ అధికారులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఆర్మీ, బిఎస్‌ఎఫ్‌ జవానులతో కలిసి దీపావళిని జరుపుకోవడం ఆనందంగా ఉందని మోది పేర్కొన్నారు. జవాన్లతో సమయాన్ని గడపడం వల్ల తనకు ఎంతో ఎనర్జీ వస్తుందని మోదీ చెప్పారు. జవాన్లు ప్రతి రోజు యోగ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించారు. దేశాన్ని కాపాడడం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని మోది కొనియాడారు.

21:28 - October 19, 2017

ఢిల్లీ : ఇప్పటి వరకు మనకు తెలిసిన దీపావళి అంటే దీపాలు.. టపాకాయల హోరు. 1,000 వాలా,10,000 వాలా లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, తారాజువ్వలు..ఈ సంస్కృతి దేశరాజధానిలో తొలిసారిగా మారింది.కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీలో.. నవంబర్ 1 వరకు టపాసుల అమ్మకాలు, కొనుగోళ్ళను నిషేధించారు. దీంతో ఢిల్లీ వాసులు కాలుష్య రహిత దీపావళి జరుపుకుంటున్నారు. వ్యాపారులు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నారు. వింత వింత విద్యుత్ దీపాలు, గిఫ్ట్ ప్యాక్‌లు, మిఠాయిలు, అలంకరణ వస్తువులతో.. దీపావళి సందడిని మార్చేశారు. టపాకాయలు లేకపోవడం జీఎస్టీ భారంతో వ్యాపారం తగ్గినా కాలుష్యాన్ని తగ్గించడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వ్యాపారులు స్వాగతిస్తున్నారు. అయితే ఒకేసారి టపాకాయలపై నిషేధం విధించకుండా కొంచెం వెసులుబాటు ఇచ్చి ఉంటే బాగుండేదని ఢిల్లీవాసులంటున్నారు.

కాలుష్యంలో దేశంలో టాప్ ఢిల్లీ
ప్రపంచంలో‌ని కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి పది నగరాల్లో ఉంది. మన దేశంలో టాప్ వన్‌గా ఉంది. గాలిలో దుమ్ము కణాల నిష్పత్తి అధికమవడం నైట్రిక్ ఆక్సైడ్, వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్, టపాకాయల వల్ల సల్పర్ డయాక్సైడ్, వ్యర్ధాలు, పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం ఢిల్లీని కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శీతాకాలం మంచు వల్ల దుమ్ముకణాలు గాలిలో కలవకపోవడంతో.. ఢిల్లీ వాసులు శ్వాస కోస వ్యాధులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలం రాకముందే ఆనంద్ విహార్, పంజాబి భాగ్, ఆర్కే పురం, సెంట్రల్ ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం విపరీతంగా పెరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు టపాకాయలు, డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించింది. ఢిల్లీ బదర్ పూర్ విద్యుత్ ప్లాంట్ సైతం మూతపడింది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న వందలాది ఇటుకల బట్టీల పనులు నిలిచిపోయాయి. జాతీయ హరిత ధర్మాసనం 5 రాష్ట్రాలలో పర్యావరణ అత్యవసర పరిస్థితి విధించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లో కాలుష్యం పై అప్రమత్తంగా ఉండాలని కాలుష్య నియంత్రణ మండళ్ళను ఆదేశించింది. అక్రమంగా అమ్ముతున్న 1200 కిలోల టపాకాయలను పోలీసులు సీజ్ చేశారు. 30 మందికి పైగా టపాకాయల అమ్మకం దారులను అరెస్టు చేశారు.

నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
మరోపక్క ఢిల్లీలో టపాకాయల నిషేధం పై సామాజిక మాధ్యమాల్లో హిందూవాదులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. హిందూ సంస్కృతిపై ఈ తరహా నిషేధాలు తగవని ఇది వివక్షాపూరిత చర్య అంటున్నారు. సుప్రీంకోర్టు చర్యను కొందరు తప్పుబడుతుంటే చిన్నారులు, పర్యావరణ పరిరక్షకులు వాస్తవాలు తెలిసిన ప్రజానీకం మాత్రం పర్యావరణ హితంగా దీపావళి జరుపుకుంటున్నారు. పండగంటే ఆనందం.. ఆ ఆనందం అందరికీ పంచేలా కాలుష్య రహితంగా పండగ జరుపుకుంటారని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ వాసులు సుప్రీం ఆదేశాలు పాటిస్తూ.. పర్యావరణ ప్రియులుగా మారి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

21:32 - October 18, 2017

వాషిగ్టంన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓవల్ ఆఫీసులో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంతతకి చెందిన విజిటర్స్‌తో పాటు యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ, సీమా వర్మ, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలను జరుపుకునే సంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించారు.

09:23 - October 3, 2017

విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం..విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పైడి తల్లి జాతరలో తొలి ఘట్టమైన తొలేళ్ల సంబరం ముగిసింది. నేడు ప్రధాన ఘట్టానికి తెరలేచింది. పైడి తల్లి సిరిమాను ఉత్సవం జరుగుబోతోంది. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమానోత్సవం జరుగనుంది. అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సిరిమానోత్సవం ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భానురాజ టెన్ టివికి తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

16:26 - September 30, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవ సంబరానికి వేళైంది. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రాధాన్యతను సంతరించుకునే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు....

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టం సిరిమాను సంబరాలు. ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3న సిరిమానోత్సవం జరగనుంది. సిరిమానుపై అమ్మవారికి ప్రతిరూపంగా ఆలయ పూజారి కూర్చొని భక్తులను ఆశీర్వదించే అపురూప ఘట్టమే ఈ సిరిమానోత్సవం. పట్టణంలోని పైడితల్లి అమ్మవారి చదురుగుడి నుండి కోట వరకు మూడుసార్లు తిరిగి రావడంతో ఉత్సవం ముగుస్తుంది.

కలలో సిరిమాను చెట్టు గురించి తెలిపే అమ్మవారు

అయితే ఈ సిరిమాను ఉత్సవానికి అవసరమైన చింతమాను ఎక్కడ ఉందన్న విషయాన్ని అమ్మవారు ఆలయ పూజారి కలలో కనిపించి చెబుతుంది. ఆ విధంగా ఈ ఏడాది డెంకాడ మండలం రెడ్డికపేట గ్రామంలో సిరిమాను చెట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును నరికి మేళ, తాళాలతో దానిని హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించారు. ఇక్కడే చింతమానును సిరిమానుగా మలచే కార్యక్రమాన్ని చేపడతారు. వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ సిరిమానును, రథాన్ని తయారు చేస్తుంటాయి. దీంతో పాటు సిరిమాను వెంట నడిచే అంజలి రథం, తెల్ల ఏనుగు తయారీ పనులు పూర్తి చేస్తారు. అమ్మవారి సిరిమాను తయారు చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా ఆ కుటుంబీకులు భావిస్తారు.

సిరిమానును అధిరోహించే పూజారులకు చరిత్ర

ఇక సిరిమానును అధిరోహించే పూజారులకూ వంశపారంపర్య చరిత్ర ఉంది. 1758లో పూసపాటి సంస్థానాధీశుడు ఆనందరాజు కాలం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. మొదటగా పతివాడ అప్పలనాయుడు ఈ ఉత్సవాలలో పూజారిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన వంశానికి చెందినవారే పూజారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వెంకట్రావు సిరిమానును అధిరోహించబోతున్నారు.

విజయనగరానికి లక్షలాది మంది భక్తులు...

ప్రతి ఏట సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది భక్తులు విజయనగరం చేరుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రల నుండి కూడా ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తారు. ఈసారి ఉత్సవ నిర్వహణను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఉత్సవానికి అవసరమైన సిరిమాను, ఇరుసుమానుల తయారీని డి.ఎఫ్‌.ఓ లక్ష్మణ‌్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సిరులలిచ్చే కల్పవల్లి...పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

09:57 - September 29, 2017

పశ్చిమగోదావరి : తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని రాఘవాపురం, ఎండపల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి మహిళలు 11 ఏళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. గ్రామ దేవత మరిడమ్మ ఆలయం వద్ద బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక మహిళలు అంటున్నారు. 

09:47 - September 29, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో 12 అడుగులు బతుకమ్మను ఏర్పాటు చేశారు. కాలనీలోని మహిళలంతా దాని చుట్టూచేరి బతుకమ్మ ఆడారు. దాండియా ఆటలాడుతూ అర్థరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. వర్షంపడుతున్నా సద్దుల బతుకమ్మ ఆడుతూ సంతోషంగా గడిపారు. మహిళలు, యువతులు రంగురంగుపూలతో బతుకమ్మలను పేర్చి వాటిచుట్టూరా బతుకమ్మ ఆడిపాడారు.  

08:06 - September 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బతుకమ్మ సంబురాలు ఘనంగా ముగిశాయి. ఈనెల 20న ఎంగిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఈ తొమ్మిది రోజులు రకరకాల బతుకమ్మను పూజించారు.మొదటి రోజు ఎంగిపూల బతుకమ్మ, రెండో రోడు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవ రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ జరుపుకున్నారు. ఆరోజు బతుకమ్మ అలిగివెళ్లడంతో పెద్దగా ఉత్సవాలు నిర్వహించకపోడం ఆనవాయితీగా వస్తోంది. ఏడువ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నిర్వహించిన తెలంగాణ మహిళలు, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. చెరువులు, కాల్వల్లో బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు.

చెరువుల్లో నిమజ్జనం...
సిద్దిపేట జిల్లా కోమటి చెరువు వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. హాస్య నటులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆడపడులు ఆట, పాటలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పోయిరా గౌరమ్మ, మళ్లీరా బతుకమ్మ అంటూ బతుకమ్మలకు కాల్వలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. :ఉమ్మడి నల్గొండ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడకలు ఘనంగా జరిగాయి. నల్గొండ వల్లభరావు చెరువు, సూర్యాపేట సద్దెల చెరువు, భువనగిరి జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వర్షంలోనే బతుకమ్మ ఆడి, పాడారు.

మనువరాలుతో ఎమ్మెల్యే కొండా సురేఖ
మెదక్‌ జిల్లా వేముల ఘాట్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. వర్షంలోనే మహిళలు బతుకమ్మలను పూజించి, ఆడి, పాడారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందు మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే హనుమంతు షిండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జుక్కల్‌ మండలంలో కూడా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. రంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కొత్తవాడలో నిర్వహించిన బతుకమ్మ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తన మనువరాలుతో కలిసి బతుకమ్మ ఆడారు. కరీమాబాద్‌ రంగ సముద్రంతోపాటు కాశిబుగ్గ, చిన్నవడ్డేపల్లి చెరువల వద్ద బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ ఆడిపాడిన అనంతరం గంగమ్మ చెంతకు చేర్చారు.

బతుకమ్మ వేడుకల్లో విషాదం
నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, ప్రజలు కలిసి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆట, పాటలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అలరించాయి. జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేన, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య తలెత్తిన వివాదం బతుకమ్మ వేడుకల్లో కూడా కనిపించింది. కలెక్టర్‌ దేవసేన, ఎమ్మెల్య ముత్తిరెడ్డి వేర్వేరుగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. దేవసేన బాణాపురంలోని వెంకటేశ్వరాలయంలో బతుకమ్మ నిర్వహించగా, ముత్తిరెడ్డి బతుకమ్మ కుంటలో సంతంగా ఏర్పాటు చేశారు. దీంతో సద్దుల బతుకమ్మ ఎక్కడ ఆడాలతో తెలియక మహిళలు ఆయోమయానికి గురయ్యారు. మరోవైపు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ఇందుపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పూలు కోసేందుకు చెరువులో దిగిన లింగన్న మృతి చెందాడు. దీంతో లింగన్న కుటుంబంలో విషాదం నెలకొంది. మృతులు నిరుపేద కావడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. 

10:17 - September 28, 2017
18:21 - September 23, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం కడియం, మంత్రి హరీష్‌రావు సతీమణులతో పాటు..డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి, కవిత, గుండు సుధారాణి, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్‌లు బతుకమ్మలను పేర్చి కోలాటమాడారు. బతుకమ్మ కోలాటంతో ప్రగతి భవన్ ప్రాంగణం సందడిగా మారిపోయింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - సంబరాలు