సరూర్ నగర్

06:35 - September 5, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనాలు తుది దశకు చేరుకున్నాయి. నేడు కీలక ఘట్టమైన మహా శోభాయాత్ర ఉండటంతో పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్‌లో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేయనుండటంతో ప్రధాన ఊరేగింపు మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం గణేశ్‌ నిమజ్జనంకు భాగ్యనగరం ముస్తాబైంది. వేడుకను సజావుగా నిర్వహించేందుకు.. పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. శోభయాత్రకు అడ్డంకులు లేకుండా..ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలను పోలీసులు నిర్ణయించారు. మొదటగా బాలాపూర్‌ నుంచి గణపతి ఊరేగింపు ఉదయం 6కు ప్రారంభమవుతుంది. అలియాబాద్‌-నాగుల్‌చింత-చార్మినార్‌-అఫ్జల్‌గంజ్‌- ఎం.జె.మార్కెట్‌-అబిడ్స్‌-బషీర్‌బాగ్‌-లిబర్టీ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు కొనసాగుతుంది. అలాగే సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపులు ఆర్‌పీరోడ్‌- ఎంజీరోడ్‌- కర్బలా మైదానం- కవాడిగూడ- ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్డు- ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు- నారాయణగూడ క్రాస్‌రోడ్డు- హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ మీదుగా లిబర్టీ వద్ద కలుస్తాయి. అలాగే ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపులు - రామంతాపూర్‌- అంబర్‌పేట- ఓయూ ఎన్‌సీసీ - దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు వచ్చి కలుస్తాయి. అలాగే అబిడ్స్‌ మీదుగా వచ్చేవి ఎంజే మార్కెట్‌తో పాటు సచివాలయం- తెలుగుతల్లి విగ్రహం వద్ద కలుస్తాయి.

గణేష్‌ విగ్రహాలను తరలించే వాహనాలు మినహా మిగిలినవి ప్రధాన వూరేగింపు సాగే మార్గాల్లో కాకుండా ఇతర చోట్లకు మళ్లిస్తారు. ప్రధాన ఊరేగింపు మార్గం మొత్తం బారికేడ్లతో ఉండటం వల్ల... సాధారణ ప్రయాణికులు ట్రాఫిక్‌ మళ్లింపులను తప్పించుకునేందుకు బేగంపేట, రింగ్‌రోడ్డు మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వచ్చే వాహనదారులకు పలు చోట్ల పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటుచేశారు. ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉన్న ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఆనంద్‌నగర్‌ కాలనీలోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం, గోసేవా సదన్‌, కట్టమైసమ్మ గుడి, నిజాం కళాశాల, ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, బుద్ధభవన్‌ వెనుకభాగం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ స్టేడియం, పబ్లిక్‌ గార్డెన్స్‌ స్థలాల్లొ పార్కింగ్‌కు కేటాయించారు.

ఎన్‌టీఆర్‌ మార్గంలో నిమజ్జనం తర్వాత ఖాళీ ట్రక్కులు, లారీలు నెక్లెస్‌ రోడ్డు మీదుగా ఖైరతాబాద్‌ వంతెన, పీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ట్యాంక్‌బండ్‌ మార్గంలో నిమజ్జనం తర్వాత ఖాళీ వాహనాలు చిల్డ్రన్స్‌ పార్కు, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ, ఇందిరాపార్కు మీదుగా విద్యానగర్‌ మార్గంలో వెళ్లే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినపుడు..అలానే వాహనదారుల సందేహాల నివృత్తికి ట్రాఫిక్‌ అధికారులు 040-27852482, 94905 98985, 9010203626 హెల్ప్‌లైన్‌ నంబర్లను కేటాయించారు.

నిమజ్జనం సందర్భంగా సిటీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్‌సాగర్‌కు దారితీసే.. మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌, సీటీవో ప్లాజా, క్లాక్‌టవర్‌, చిలకలగూడ క్రాస్‌రోడ్‌, రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్‌, మిధాని దగ్గరలోని ఐ.ఎస్‌.సదన్‌, వైఎంసీఏ నారాయణగూడ, జామై ఉస్మానియా వంతెన మార్గాల్లో ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

రాజీవ్‌గాంధీ రహదారి, ముంబయి హైవే మీదుగా నగరానికి వచ్చిన బస్సులను జేబీఎస్‌, వైఎంసీఏ- సంగీత్‌, తార్నాక, జామై ఉస్మానియా వంతెన- నింబోలిఅడ్డ- చాదర్‌ఘాట్‌ మీదుగా ఎంజీబీఎస్‌కు అనుమతిస్తారు. బెంగళూరు నుంచి వచ్చే బస్సులు అరాంఘర్‌ చౌరస్తా- చాంద్రాయణగుట్ట, ఐఎస్‌ సదన్‌, నల్గొండ క్రాస్‌రోడ్సు, చాదర్‌ఘాట్‌ మీదుగా వెళ్లాలి. ప్రైవేటు బస్సులను నగరం వెలుపల నుంచి రాకపోకలకు అనుమతిస్తారు. విమానాశ్రయం నుంచి వచ్చేవారిని నెక్లెస్‌ రోడ్డు, ఎన్‌టీఆర్‌మార్గ్‌, అంబేడ్కర్‌ విగ్రహం, ఫలక్‌నుమా మెయిన్‌ రోడ్డు మీదుగా అనుమతించరు. అలాగే రైల్వే ప్రయాణికులు కూడా ఈ మార్గాల్లో వెళ్లడానికి వీలుండదు. జిల్లాలు, బయట రాష్ట్రాల నుంచి వచ్చే లారీలను ఈనెల 5, 6 తేదీల్లో రాత్రి పూట సైతం నగరంలోకి అనుమతించరు.

17:23 - July 6, 2017

హైదరాబాద్ : వడ్డీ వ్యాపారుల వేధింపులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. నగరంలోని సరూర్ నగర్ లో వడ్డీ వ్యాపారులు ఓ వ్యక్తిపై దాడి చేయడం..దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. వడ్డీ వ్యాపారులైన జంగారెడ్డి..దేవేందర్ రెడ్డిలు సోదరులు. వీరివద్ద జయశంకర్ అనే వ్యక్తి రూ. 2లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిమధ్య ఆర్థిక లావాదేవీలపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం జయశంకర్ పై వడ్డీ వ్యాపారులు జయశంకర్ పై దాడి చేశారు. ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు కొట్టారు. అక్కడనే ఉన్న ఓ మహిళ ఆపేందుకు ప్రయత్నించారు. రెండు లక్షల అప్పుకు మూడు లక్షలు చెల్లించినా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. దాడి జరిగిన విషయాన్ని జయశంకర్ సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు రాచకొండ పీఎస్ కార్యాలయానికి వెళుతున్నట్లు తెలుస్తోంది.
దాడికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో చూడండి...

06:39 - June 3, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో రాజకీయ నేతలే కాదు.. వాళ్ల అనుచరులు కూడా రెచ్చిపోతున్నారు. బిర్యానీ బాగా లేదని అడిగిన పాపానికి సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని కార్పొరేటర్‌ అనుచరులు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సైతం బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామంటున్నారు.

08:15 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక పనితీరు ఎలా ఉందో ఈ ఘటన చూస్తే అర్థమౌతోంది. ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్వయంగా వెళ్లి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరూర్ నగర్ లోని కర్మన్ ఘాట్ లో ఉన్న టింబర్ డిపోలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద వార్త తెలుసుకున్న టింబర్ యజమాని ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. కానీ అక్కడి నుండి స్పందన లేకపోయేసరికి నేరుగా ఫైర్ స్టేషన్ కు వెళ్లి ఘటనా స్థలికి ఫైర్ వాహనాన్ని తీసుకొచ్చే విధంగా చేశారు. కానీ వచ్చిన రెండూ శకటాల్లో మంచినీరు కూడా అయిపోయింది. దీనితో యజమాని స్వయంగా నీళ్లు తె ప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అయ్యేసరికి టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. చివరకు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

22:14 - March 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. మాట్లాడించే పాత్ర ఇష్టమని, చాలా ముఖ్యమైన విషయాలు వక్తలు పేర్కొన్నారని తెలిపారు. పాదయాత్ర విశేషాలు చెప్పాలంటే గంటన్నర టైం పడుతుందని, 154 రోజుల పాటు యాత్ర చేయడం జరిగిందన్నారు. ఈ పాదయాత్ర మరుపురాని అనుభూతినిచ్చిందన్నారు. రాజకీయాల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమౌతాయని, ఒక ఏజెండా కోసం రాజకీయ పార్టీలు కొట్లాడాలన్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్ కు...గత పాలకులు అర్థం కావడం లేదన్నారు. 1520 గ్రామాలు తిరగడం జరిగిందని, తెలంగాణ రాక ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించి ప్రాణాలు అర్పించిన యువత..అడ్డా..కూలీలపై పని చేస్తున్నారు. పాలించే విధానంలో తప్పు ఉందన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవితాల మార్పు అని, వైద్యం...విద్య..ఉద్యోగం..సరిపడా వేతనం ఉండాలని సూచించారు. ఇవి ఉంటే మార్పు వస్తుందని, ఇవన్నీ ఇస్తాయని కేసీఆర్ చెప్పి ఇవ్వలేదన్నారు. తమకు పాదయాత్రలో చూడడం జరిగిందని, మారుమూల ప్రాంతాల్లో పిట్టల్లా ప్రజలు రాలుతున్నారని తెలిపారు. ఉద్యమానికి సపోర్టు ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉందో చూడాలని, శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని నిధులు కేటాయించాలని చెబితే కేవలం కొన్నింటిని మాత్రమే కేటాయించారన్నారు. పరిశ్రమలు తెరిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమలు మూత పడుతున్నా కళ్లు అప్పగించి చూస్తున్నారని, కేసీఆర్ ఖబడ్దార్ అనే హెచ్చరిక చేయాల్సినవసరం వచ్చిందన్నారు. సామాజిక న్యాయమే తెలంగాణ అభివృద్ధికి మార్గం అని మరోమారు స్పష్టం చేశారు. కులాల ఘర్షణ కాదని, వీరి అభివృద్ధి చెందకుండా అభివృద్ధి అనేది అసాధ్యమన్నారు. మాటలతో..చేతలతో కాదని..20 శాతం ఉచితంగా విద్య చెబుతారా ? లేదా ? అని ప్రైవేటు స్కూళ్ల ఎదుట కూర్చొంటామన్నారు. పెద్ద ఎత్తున్న ఉద్యమం వస్తుందని, 22 లక్షల మందికి ఇళ్లు కటిస్తామని చెప్పారని, కానీ కట్టివ్వడం లేదన్నారు. ఇదే కొనసాగితే మీ బెడ్ రూంలో నిద్రపోనివ్వమన్నారు. ఖచ్చితంగా ఇళ్లు కేటాయించాల్సిందేనన్నారు.

పోడు భూముల కోసం..
పోడు భూముల కోసం పోలీసులను పంపిస్తే మళ్లీ మన్యం పోరాటం జరుగుతుందన్నారు. ప్రత్యక్షంగా పోలీసులు..గిరిజనులు తలపడే పరిస్థితి నెలకొంటుందన్నారు. చట్టాలను తుంగలో తొక్కుతున్నారని, కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, లాల్..నీల్ జెండాలు కలిసి పోరాటం చేస్తాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకున్నారని, దీనికోసం ఉద్యమం చేస్తే నిర్భందం ప్రయోగిస్తున్నారని తెలిపారు. ఇవి ఎంతోకాలం సాగవన్నారు. రాజ్యాధికారంలో వాటా రావాలని, సమన్యాయం జరిగి తీరాల్సిందేనన్నారు. మీ విధానం మార్చుకోకపోతే మీరే మారాలని పిలుపునిస్తామని, భవిష్యత్ కార్యాచరణ ఈ వేదిక చూపెడుతుందని తెలిపారు. రాజ్యాధికారం సాధించే దాక ఈ వేదిక కొనసాగాలని ఆకాక్షిస్తున్నట్లు, కలిసొచ్చే శక్తులను ఏకం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల విషయం పక్కన పెడితే మరో జన్మలో కూడా సీపీఎం, సీపీఐ కలిసి ఉంటాయన్నారు. వామపక్షాల ఐక్యతను మరింత పటిష్టం చేస్తామని, అందర్నీ ఐక్యం చేసేలా ప్రయత్నాలు చేస్తామని అందుకే సభకు అందర్నీ పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాజకీయ ముఖచిత్రం మారిపోతోందని, ఇప్పటికే దడ పుట్టిస్తోందన్నారు. పొద్దున నుండి రాత్రి వరకు అన్నీ అబద్ధాలే చెబతున్నారని దీనికి పేపర్ పెట్టాలని అంటున్నామని, బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గొర్రెలు కొంటామని ప్రకటించారని, ఎక్కడి నుండి కొంటారని ప్రశ్నించారు. ముస్లింలపై ప్రేమ ఉంటే ఒక చట్టం చేయాలని పేర్కొన్నారు. ముస్లింలకు మత ప్రాదికన రిజర్వేషన్ లు ఇవ్వడంపై వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ మౌనంగా ఉండిపోయారని తెలిపారు. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సరిపోతుందని, దమ్ముంటే పనిచేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరింది మొట్టమొదట డిమాండ్ చేసింది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిర్వీర్యం చేస్తున్నారని, మోడీ ప్లాన్ తీసినా సరే ఒక రాష్ట్రంలో ప్లాన్ తీయాల్సినవసరం లేదన్నారు. మహిళ సాధికారితపై మాట్లాడుతున్నారని..సిగ్గు లేదా అని నిలదీశారు. మంత్రివర్గంలో ఒక్క మంత్రి కూడా లేదని, వారి బిడ్డను మాత్రం దేశ, విదేశాల్లో తిరిగిపిస్తూ మహిళా సాధికారితపై మాట్లాడిస్తారని ఎద్దేవా చేశారు.

సమరం కొనసాగాలి..
ప్రజా ఉద్యమాలు రాక తప్పదని, లాల్..నీల్ జెండాలు కలిసి పనిచేస్తాయని అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మహాజన పాదయాత్ర ఆశ్వీరదించారో అదే రీతిగా సామాజిక సమరంలో సైనికుల్లా కదలాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా 13 కి.మీటర్ల మేర పాదయాత్ర జరగడం విశేషమని, ఇంత రాత్రి అయినా ఇక్కడ కూర్చొని ప్రసంగాలు వింటుండడం ఆనందం కలిగిస్తోందన్నారు. శరీరం..ఆరోగ్యం. కాదు..మనస్సులో ఒక పెద్ద రాజకీయ సంకల్పం ఉండాలని ఇవి లేకపోతే యాత్ర సాగదన్నారు. శరీరానికి ఆక్సిజన్ ఇచ్చింది ప్రజలేనని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఈ సమరం కొనసాగాలని పిలుపునిచ్చారు. 

19:58 - March 17, 2017

హైదరాబాద్ : పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది... అన్ని వర్గాల ప్రజలను కదిలించింది..పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది. సీపీఎం చేపట్టిన మ‌హాజన పాదయాత్ర ఐదు నెలల క్రితం ఇబ్రహింపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగసభతో ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగింది. 19న హైదరబాద్‌లో జరిగే బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగియనుంది. ఈ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గోనున్నారు. కాగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ మహాబూబ్‌నగర్‌లో మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రంజెటేటివ్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మహాజన పాదయాత్ర సభ్యులు పర్యటించారు. ప్రతి గ్రామానికి వెళ్లి అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలియజేశారు. అలాగే ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసింది. గ్రామీణ స్థాయిలో ఉండే అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. వివిధ రంగాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి లేఖలు రాశారు.

పాలమూరులో..
అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వందల గ్రామాల్లో పాదయాత్ర సభ్యులు పర్యటించారు. అక్కడున్న సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదని.. రైతులు అనేక సమస్యలన ఎదుర్కొంటున్నారని, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వలేదని జిల్లా వాసులు పాదయాత్ర బృందం సభ్యులకు తెలియజేశారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని పాదయాత్ర సభ్యులు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్ట్‌లలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర విజయోత్సవ సభకు ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి దాదాపు పదివేల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. జిల్లాలో వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు ముగింపు సభలో పాల్గొంటున్నారు.

13:34 - March 16, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో ఈ పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర మార్చి 19వ తేదీన ముగియనుంది. 'సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం' పేరిట సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఈ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు రెండున్నర లక్షల మంది హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరు కానున్నారు. వీరితో పాటు వంద మంది అతిథులు హాజరు కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో క్లిక్ చేయండి.

21:30 - March 12, 2017

హైదరాబాద్ : ఈనెల 19న తలపెట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సభా వేదికను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియానికి మార్చినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి. వెంకట్‌ తెలిపారు. నిజాం కాలేజీలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతోనే అనివార్య పరిస్థితుల్లో వేదికను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియానికి మార్చినట్టు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలాంటి మతోన్మాద శక్తులతో ప్రభుత్వం కుమ్మక్కై బహిరంగ సభకు అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. మహాజన పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిస్తే... జనం మాత్రం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

13:43 - September 15, 2016

1994 వేలం ప్రారంభం..
1994 నుండి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కి సొంతం చేసుకున్నారు. దానిని కొంత ఇంట్లో వారు తిని మరికొంత బంధువులకు పంచి మిగిలింది తన పొలంలో చల్లారు. అప్పటి నుండి తన పంటల దిగుబడి పెరిగిందని ఆయన నమ్మకం. ఆ తరువాత ఏడాది నుండి వరసగా 17 ఏళ్లు స్థానికులే ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. 2012లో స్థానికేతరుడు పన్నాల గోవర్ధన్ రెడ్డి ఈ లడ్డూను రూ.7.50 లక్షలకు సొంతం చేసుకున్నాడు. తన తండ్రి చివరి కోరిక మేరకు లడ్డూను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 2014లో మాజీ మేయర్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకున్నందుకే తాను ఎమ్మెల్యేనయ్యానని ఆయన భావిస్తున్నారు. 2015 సంవత్సరం వేలం పాటలో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో రూ.14.65 లక్షలకు స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు.

సంవత్సరం పేరు  ధర
1994 కొలను మోహన్ రెడ్డి  రూ. 450.00
1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.00
1996 కొలను కృష్ణా రెడ్డి రూ. 18,000.00
1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28,000.00
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000.00
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000.00
2000 కల్లెం అంజిరెడ్డి రూ. 66,000.00
2001 జి.రఘునందన రెడ్డి రూ. 85,000.00
2002 కందాడ మాదవ్ రెడ్డి రూ.1,05,000.00
2003 చిగిరింత బాల్ రెడ్డి  రూ. 1,55,000.00
2004 కొలను మోహన్‌రెడ్డి రూ. 2,01,000.00
2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2,08,000.00
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3,00,000.00
2007 జి.రఘునందనాచారి రూ. 4,15,000.00
2008 కొలను మోహన్‌రెడ్డి  రూ. 5,07,000.00
2009 సరిత రూ. 5,10,000.00
2010 శ్రీధర్‌బాబు రూ. 5,35,000.00
2011 కొలను ఫ్యామిలీ రూ. 5,45,000.00
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7,50,000.00
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9,26,000.00
2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి  రూ. 9,50,000.00
2015 కళ్లెం మదన్‌మోహన్‌  రూ. 10,32,000.00
2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14,65,000.00
2017       ? ? ?        ? ? ?
16:11 - March 27, 2016

హైదరాబాద్ : పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న వారికి ఆడపిల్ల అంటే చిన్న చూపే. ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. తాజాగా ఓ భర్త తనకు వారసుడు కావాలంటూ భార్యను హింసిస్తున్నాడు. హింసలకు తాళలేక ఆమె పోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. ఈ ఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. వారసుడు కావాలంటూ తన భర్త నిత్యం వేధిస్తున్నాడని, రోకలబండతో బాదుతున్నాడని లావణ్య వాపోయింది. భర్త అత్తామామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భర్త ఇంటి ఎదుట లావణ్య ఆందోళనకు దిగింది. ఈమెకు పలు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. సరూర్ నగర్లో పీఎస్ లో కేసు నమోదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తోంది. మరి ఈమెకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అన్నది చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - సరూర్ నగర్