సర్కార్

15:42 - February 14, 2018

ఢిల్లీ : ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ్టికి మూడేళ్లు పూర్తయింది. ఆప్‌ సర్కార్‌ మూడేళ్లలో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరించారు. ఢిల్లీలో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. విద్య, వైద్య రంగంలో తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని కేజ్రీవాల్‌ తెలిపారు. 164 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేశామని...మరి కొద్దిరోజుల్లో 950 మొహల్లా క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 70 ఏళ్లలో 10 వేల పడకలుంటే...ఈ ఏడాది చివరికల్లా మరో 3 వేల పడకలను సమకూర్చుతున్నామని వెల్లడించారు. 20 కొత్త స్కూళ్లను నిర్మించినట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. గత మూడేళ్లలో విద్యుత్‌ చార్జీలను పెంచలేదన్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలను ఆప్‌ గెలుచుకుని రికార్డ్‌ సృష్టించింది.

21:35 - December 1, 2017

హైదరాబాద్ : జీఈఎస్ నిర్వహణ ద్వారా కేసీఆర్ సాధించిందేంటో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు పబ్లిసిటీ కల్పించడం కోసమే హడావిడి చేశారని ఆరోపించారు. రాష్ట్రం పరువు తీయడంతో పాటు.. ప్రభుత్వ ఖజానాపై భారం మోపారని టీకాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. సదస్సులో చూపించినవేమీ నిజాలు కావని వీహెచ్ ఏకంగా ఇవాంక ట్రంప్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించిన తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. సదస్సు మొత్తం కేటీఆర్ షోగా మారిందని ఎద్దేవా చేశారు. ఇవాంక రావడం వల్ల తెలంగాణకు ఒరిగిన ప్రయోజనమేంటని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోట్లాది రూపాయలు వృధా చేసిన కేసీఆర్.. సమ్మిట్ మొత్తం తన కుమారుడు కేటీఆర్‌కు పబ్లిసిటీ కోసం వాడుకున్నారని ఆరోపించారు.

జీఈఎస్ నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజల పరువు తీయడంతో పాటు.. ప్రభుత్వ ఖజానాను నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన వాటిని తామే చేశామని గొప్పలు చెప్పుకునేందుకు సదస్సును వాడుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేటీఆర్‌ అన్నీతానై వ్యవహరించారని వీహెచ్ మండిపడ్డారు. సదస్సులో చూపించినవేవీ నిజాలు కావని ఇవాంక ట్రంప్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. మహిళా సాధికారికత పేరుతో సదస్సు నిర్వహించిన రాష్ట్రంలో.. ఒక్క మహిళా మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు మెట్రో రైలు ప్రారంభానికి కనీస ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నగరంలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. 

20:23 - November 3, 2017

పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు.. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్రకు అడ్డంకులున్నాయా? ప్రభుత్వం అడ్డుపడుతుందా? లేక సవ్యంగా సాగి... ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్పం కోసం జగన్ ప్రయత్నిస్తారా? దీనిపై ప్రత్యేక కథనం.. ఎన్ని మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టినా, పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్ష లాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరించింది. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు విపక్షనేత. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకున్న చంద్రబాబు.. ఇప్పుడా పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. ఓ వైపు ఇడుపుల‌పాయ‌లో ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతుండ‌గా మ‌రోవైపు రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేత‌లు విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేశారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది? ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యమేమిటి? అధికారపక్షాన్ని ఎండగడుతూ, వచ్చే ఎన్నికలే టార్గెట్ జగన్ ముందుకు సాగనున్నారా? పాదయాత్ర షెడ్యూల్ దగ్గరకొచ్చేకొద్దీ ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. జగన్ యాత్రను ఆపే ప్రయత్నంలో ఏపీ సర్కారు ఉందా? తెలుగు నేల ఇప్పటికే పలు పాదయాత్రలను చూసింది. అధికారంలోకి తెచ్చిన అడుగులను, తమ అభిమాన్ని కొల్లగొట్టిన యాత్రలను అనేకం చూశారు ఏపీ ప్రజలు. మరి జగన్ పాదయాత్ర తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? గత పాదయాత్రల అనుభవాలు ఏం చెప్తున్నాయి?

రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు..అధికారపక్షం మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితి..రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు పై ఎత్తులు, అరచేతిలో వైకుంఠం చూపటం తప్ప వాస్తవంగా జరుగుతున్నది శూన్యం అనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశం, రైతుల సమస్యలు, ఇలా ఏపీని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రాజకీయ రంగంలో విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతిసవాళ్లూ మామూలే. అదే సమయంలో అధికారం కోసం నేతలు చేసే ప్రయత్నాలూ సాధారణమే. ఇవేవీ ప్రజల దృష్టి నుండి దూరంగా పోయేవి కాదు. కానీ, ఏం మాట్లాడుతున్నా, ఏ యాత్రలు చేస్తున్నా, అడ్డుకున్నా ప్రజలకు అందాల్సిన సంకేతాలు అందుతూనే ఉంటాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:58 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలింబిస్తోందని పేర్కొంటూ టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. తాము చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగిందని కానీ పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారని తెలిపారు. విజయవాడ, నల్గొండ, మహబూబ్ నగర్ పీఎస్ లను చూడాలని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులని చూడకుండా అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వం మెడలు వంచైనా సరే తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితే సీట్ల కోసం మాట్లాడుతున్నారే కానీ రైతు సమస్యలపై మాట్లాడడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ..దళితులకు మూడెకరాలు..డబుల్ బెడ్ రూం...ఇలాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

06:33 - September 20, 2017

హైదరాబాద్ : గులాబీ సర్కార్‌ నిర్ణయాలే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు అందివచ్చిన ఆయుధాలుగా మారుతున్నాయి. సర్కారు వరుస వైఫల్యాలనే ప్రధాన ఎజెండాగా ఉద్యమ కార్యాచరణకు నడుంబిగిస్తున్నారు హస్తం నేతలు. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించి జనంలోకి వెళ్తోన్న కాంగ్రెస్‌ నేతలు... క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారపార్టీ నేతలపై పదునైన విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల వేడిని రాజేస్తున్నారు.

కేసీఆర్‌ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. వాటిపై కాంగ్రెస్‌ వాయిస్‌ పెంచడం, తద్వారా జనంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాయి. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపు, ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, కొత్త సచివాలయంలాంటి నిర్ణయాలు కాంగ్రెస్‌ ఉద్యమానికి ఆజ్యం పోశాయి. కాంగ్రెస్‌ నేతలు జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే దోహదం చేశాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ ఏకంగా రైతులను సమీకరించి వరుస ఉద్యమాలను చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.

ఇక సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్‌ అంశం కూడా కాంగ్రెస్‌కు కలివచ్చింది. ప్రాజెక్టులపై కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రజెంటేషన్‌ ఇచ్చినా... అసెంబ్లీ బయట కాంగ్రెస్‌ అందులో జరుగుతున్న అవినీతిపై ప్రజెంటేషన్‌ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఆ తర్వాత ప్రాజెక్టుల భూసేకరణపై వరుస ఉద్యమాలతో సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు కాంగ్రెస్‌ పోరాటాలు నిర్వహించింది. స్థానిక రైతులతో కలిసి కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆందోళనలు ఆపార్టీకి మైలేజ్‌ను పెంచిందనే భావనలో నేతలు ఉన్నారు.

ఖమ్మంలో రైతుల ఆందోళన, నేరెళ్ల దళితుల ఘటనపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇక భూపాలపల్లిలో గిరిజనులపై పోలీసుల దాడి... సర్కార్‌ను మరోసారి ఇరుకున పెట్టిందనే చెప్పాలి. ఇక బతుకమ్మ చీరల పంపిణీపై జనంలో వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీన్ని కలిసి వచ్చిన ఆయుధంగా కాంగ్రెస్‌ మలచుకుంటోంది. ఈ ఇష్యూకు పొలిటికల్‌ మసాలా జోడించి గులాబీ సర్కార్‌పై మాటల దాడిని పెంచింది. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీకి టీఆర్‌ఎస్‌ వైఫల్యాలే ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనే పోరాటం చేస్తూ పార్టీ మైలేజ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నారు.

17:11 - September 11, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రలో టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఉట్నూర్‌లో అంబేద్కర్‌, తెలంగాణ అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన.. రైతు సమన్వయ కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప.. ఆ కమిటీలతో ఒరిగేదేమీ లేదన్నారు. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. 

06:31 - September 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఒకరోజు విధులకు సామూహిక సెలవు ప్రకటించారు. కాంట్రీబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 30జిల్లాల కేంద్రాలతోపాటు రాజధాని హైదరాబాద్‌లోనూ ధర్నాలు, ధీక్షలు చేపడుతున్నారు. సెలవుల్లో లేని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు రానున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలపనున్నారు. 2004 సెప్టెంబర్‌ 9వ తేదీన నియమితులైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఈ నిరసనలో పాల్గొంటున్నారు. పాత పింఛను పథకాన్నే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగుల నిరసనలకు పలు ఉద్యోగ సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి. 

08:48 - August 20, 2017

కృష్ణా : ఏపిలో ఆక్వాసాగును కట్టుదిట్టం చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయ భూముల్లో ఆక్వాసాగుకు అనుమతుల్లేకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఒక ఏరియాలో 60 నుండి 70 శాతం భూముల్లో ఆక్వాసాగు ఉంటే వాటిని జోన్‌గా గుర్తిస్తారు. ఆక్వాజోన్ల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తికానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రైతులు, గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆక్వాజోన్ల పరిధిలో ఉండే వారికి సబ్సీడిలు, రుణ, బీమా సదుపాయాన్ని కల్పించనున్నారు. నీటి ముంపు భూములు, లోతట్టు ప్రాంతాలతోపాటు కాలువలు, డ్రెయిన్ల పక్కన ఉన్న భూములను గుర్తించి వాటిలోనే ఆక్వాసాగుకు అనుమతిస్తారు. సారవంతమైన వ్యవసాయభూములను ఆక్వాసాగుకు ఉపయోగించకుండా, ఇందుకు సంబంధించిన కమిటీలో నిష్టాతులు, సైంటిస్టులు చేసే సూచనలకు అనుగుణంగా ఆక్వాసాగు చేయాలని అధికారులు నిర్ణయించారు.

111 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం
జిల్లాలో 111 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. దీనికి తోడు 3వేల హెక్టార్లలో కృష్ణా బ్యారేజ్‌ జలాశయం, 228 మధ్యతరహా చెరువులు, 44.88 చదరపు కిలోమీటర్ల మేర కొల్లేరు సరస్సు, 2, 660 కిలోమీటర్ల మేర నదులు, కాలువలు, 2,825 పంచాయితీ చెరువులు ఉన్నాయి. కైకలూరు, కలిదండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల పరిధిలో 49,645 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో వ్యవసాయం కింద 19,695 హెక్టార్లు, ఆక్వా సాగులో 30,063 హెక్టార్లు ఉంది. ఈ మొత్తం భూమిలో 60.55 శాతం ఆక్వాసాగు కింద ఉంది. అటు నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల పరిధిలో 51044 హెక్టార్ల భూమి ఉండగా .. దీనిలో 25,232 హెక్టార్లలో పంటలు, 5,393 హెక్టార్లలో ఆక్వాసాగవుతోంది. మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల పరిధిలో 1,26,175 హెక్టార్ల భూమిలో 55,504 హెక్టార్లు వ్యవసాయం,15,597 హెక్టార్లు ఆక్వా సాగువుతోంది. ఇక గుడివాడ, నందివాడ, పెదపారుపూడి, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న 31,815 హెక్టార్ల భూమిలో 13,783 హెక్టార్లలో వ్యవసాయం, అంతే విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉంది. ఈ గణాంకాల మేరకు నెలాఖరులోగా ఆక్వా జోన్ల గుర్తింపును జారీ చేయనున్నారు.

రైతులు, గ్రామస్తుల్లో వ్యతిరేకత
మొత్తానికి వ్యవసాయ భూముల్లో ఆక్వా సాగుకు రైతులు, గ్రామస్తుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఆక్వా సాగుకు అనుమతి ఆస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. అమల్లో ఎంత మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి అంటున్నారు ఆంధ్రప్రదేవ్‌ రైతాంగం.

 

21:54 - August 14, 2017

ఢిల్లీ : గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారుల మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది. ఈ ఘటన జీవించే హక్కుకు విఘాతం కల్పించిందని ఎన్‌హెచ్‌ఆర్‌సి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదు రోజుల్లోనే 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. మరో తొమ్మిది మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 72కి చేరింది.

13:49 - August 13, 2017

సిరిసిల్ల : ఇసుక తరలింపు విషయంలో తెలంగాణలో రెండు నెలలుగా విపక్షాలన్నీ ఏకమై.. నేరెళ్ల పైనే దృష్టి సారించాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ప్రతిపక్ష పార్టీలు.. అధికార పార్టీని ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నాయి. దళితులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయం వెలుగు చూసినా అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆధారాలు చూపాలని మంత్రి కెటీఆర్‌ మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఈ వివాదం రోజురోజుకీ పెరగుతుండటంతో నష్ట నివారణ చర్యలపై పార్టీ అధినేత దృష్టి సారించారు. ఎస్పీ విశ్వజిత్ ఆదేశాలతోనే పోలీసులు తమను అకారణంగా వేధించారని బాధితులు తమ గోడును అన్ని వేదికలపై వినిపించారు. రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశంపై ఎక్కువగా దృష్టి సారించడంతో గులాబి పార్టీ దిగిరాక తప్పలేదు. ఇప్పటికీ నేరెళ్ల వివాదంలో శాఖా పరమైన విచారణ పేరుతో పోలీసులు నివేదికలు ఇవ్వడంతో ఓ ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అధికార పార్టీ నేతలు అంతర్గత చర్చలు
అయితే బాధితులు తమ స్వరాన్ని ఇంకా పెంచుతుండటంతో అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. బాధితుల పక్షాన నిలుస్తోన్న ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడుతున్నా.. మరోవైపు నేరెళ్ల ఘటన వేడిని తగ్గించేందుకు అధికార పార్టీ నేతలు అంతర్గత చర్చలను మొదలుపెట్టారు. బాధితులకు అండగా నిలుస్తామని గులాబి నేతలు హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రాంతం కావడంతో నేరెళ్ల ఘటనకు మరింత ప్రాధాన్యత పెరిగింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - సర్కార్