సాయం

06:33 - March 6, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ఆశలు అడుగంటుతున్నాయి. సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రితో టీడీపీ జరిపిన సంప్రదింపులు కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కహామీ ఇవ్వలేదు. పార్లమెంట్‌లోనే ప్రకటన చేస్తామంటూ అరుణ్‌జైట్లీ తేల్చి చెప్పారు. దీంతో ఏపీకి సాయంపై కేంద్రం కరుణిస్తుందా.. లేదా అన్న సందిగ్దం నెలకొంది.

ఢిల్లీలో ప్రత్యేక హోదా ఉద్యమం హోరెత్తుతోంది. ఏపీకి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని ఉద్యమిస్తున్నారు. పార్లమెంట్‌ బయటా, లోపలా తమ ఆందోళనలు ఉధృతం చేశారు. టీడీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ నిరసన హోరు పెంచారు. ఒకవైపు నిరసనలు తెలుపుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కేంద్రం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సోమవారం సాయంత్రం కీలక భేటీ జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో టీడీపీ ఎంపీలు, ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు అరుణ్‌జైట్లీని కోరారు. రెవెన్యూలోటు 16వేల కోట్లను భర్తీ చేయాల్సిన విషయాన్ని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని కోరారు. గత కొద్దిరోజులుగా ఏపీలో హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, రాజకీయ పరిణామాలను కూలంకషంగా జైట్లీకి వివరించారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరినట్టు యనమల రామకృష్ణుడు తెలిపారు. న్యాయపరంగా రావాల్సిన హక్కులను అమలు చేయాలని కోరామన్నారు.

ఆర్థికలోటు, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా అటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తామని జైట్లీ చెప్పినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అంగీకరించిన విషయాల అమలులో కొంత ఆలస్యం జరుగుతోందన్న భావన ఉందన్నారు. రాబోయే రోజుల్లో నిర్ణయం చేసిన మేరకు వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని జైట్లీ హామీనిచ్చారని హరిబాబు తెలిపారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ఏ ఒక్క అంశంపైనా అరుణ్‌జైట్లీ స్పష్టమైన హామీనివ్వలేదు. ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడి చెబుతామంటూ దాటవేశారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఏ విషయమైనా పార్లమెంట్‌లోనే చెబుతానని చెప్పారు. మరి దీనిపై టీడీపీ ఏం చేయనుందో చూడాలి. 

14:56 - January 12, 2018

ఢిల్లీ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కొరానన్నరు సీఎం చంద్రబాబు. సేవారంగంలో దక్షిణాదిరాష్ట్రాలకంటే ఏపీ చాలా వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని ప్రదాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రం రెవెన్యూలోటును ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నదని .. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. షెడ్యూల్‌-9, 10 లలో విభజన సరిగా జరగలేదని.. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడానకి చొరవచూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు చంద్రబాబు.

రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఇచ్చిన 2500 కోట్లు తోడుగా మరో వెయ్యికోట్లు త్వరలో మంజూరు చేస్తామని ప్రధాని చెప్పారన్నారు. విభజన చట్టం 13లో పేర్కొన్న 11 సంస్థల ఏర్పాటుపై చర్చించానన్నారు చంద్రబాబు. ఇప్పటికే 9 సంస్థలను శాక్షన్‌ చేశారన్నారు. ఇంకా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరామన్నారు. దుగరాజు పట్నం పోర్టును త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు.

18:29 - January 11, 2018
19:08 - October 28, 2016

గుంటూరు : అమరావతి నిర్మాణంలో కేంద్రం తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరున్‌ జైట్లీ. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. ఇప్పటికే ఏపీకి అనేక ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఏపీని ఒంటరిగా వదిలవేయమని.. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రూపొందించబోయే రాజధాని అందమైన, అద్భుతమైన పట్టణంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్ర సంస్థలు ఇవ్వడం జరిగిందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పరిశ్రమలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఏపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నట్లు, ఐదేళ్లలో ఏపీకి రూ. 2...3 లక్షల కోట్టు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే మూలధనంపై పన్ను రద్దు విషయాన్ని ఢిల్లీకి వెళ్లగానే సానుభూతితో పరిశీలించి పరిష్కరిస్తానని తెలిపారు. 2004నుండి ఐదేళ్లలో వచ్చిన సాయం కంటే ఈ రెండున్నరేళ్లలో ఎక్కువ సాయం వచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ రానటువంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏపీలో మోడీ ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. విజయవాడలో భూ సేకరణ అయితే అత్యంత ఆధునిక విమానాశ్రయం తయారవుతుందన్నారు. విదేశీ రూపంలో నిధులు ఇవ్వడం జరుగుతుందని, త్వరలోనే ఈ కార్యక్రమం అమలు కాబోతోందన్నారు. అమరావతి గ్రేటర్ అమరావతిగా మారుతుందని ఆకాంక్షించారు. హైదరాబాద్ లా అమరావతిని తీర్చిదిద్దగల సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. నా బార్డు నిధులతో పోలవరం నిర్మాణం చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. 

 

06:35 - August 19, 2016

విజయవాడ : విభజన తర్వాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి 19 వందల 76కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే దీనిపై అటు అధికారపక్షం సహా అన్ని రాజకీయ పక్షాలు పెదవి విరుస్తున్నాయి. ప్రత్యేక హోదాను పక్కనబెట్టి కేంద్రం ప్యాకేజీకే పరిమితం కావడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 1976 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇందులో రెవెన్యూ లోటు కింద 1,176 కోట్ల నిధులను కేంద్రం ఏపీకి విడుదల చేసింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు, రాజధాని అభివృద్ధికి 450 కోట్లు కేటాయించారు. దీంతో గడిచిన రెండు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ 1500 కోట్ల నిధులను అందించినట్లయ్యింది. అలాగే తాజా ఆర్థిక సహాయంతో కేంద్రం మొత్తం 3,989 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లయ్యింది. నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటును పూడ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతున్నా.. కేంద్రం మాత్రం అరకొర సహాయంతో చేతులు దులుపుకుందనే విమర్శలు చుట్టుముడుతున్నాయి.

బాబు అసంతృప్తి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంపై అటు సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో స్పష్టత లేదన్నారు. హోదా ఇస్తారా లేదా ప్యాకేజీతో పరిమితం చేస్తారా అనేది స్పష్టంగా తెలపాలన్నారు. అంతేకాదు బుందేల్‌ ఖండ్‌కు మంచి ప్యాకేజీ ఇచ్చారని, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు సీఎం చంద్రబాబు, అలాగే విభజన చట్టంలోని హామీలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనన్నారు. మరోవైపు కేంద్ర ప్యాకేజీపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అరకొర నిధులతో కొత్త రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నిలదీస్తున్నారు. కేంద్ర ప్యాకేజీ ఏపీ ప్రజలకు కేంద్రం తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. అరకొర నిధులు ఇస్తే లాభం లేదన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు..
అటు ప్రతిపక్ష పార్టీ సీపీఎం సైతం కేంద్ర ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను పక్కనబెట్టి కేవలం 1900 కోట్లు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. సీఎం చంద్రబాబు వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ బంద్‌ సహా పలు ఆందోళనలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన బాటపట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రకటించిన ఈ ప్యాకేజీ ఏమాత్రం సంతృప్తి కలిగించే అవకాశం కనపడటం లేదు. 

21:54 - June 9, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 4వేల కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. ఇవాళ నాబార్డు అధికారులతో పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీసింగ్ సమావేశమయ్యారు. మెదక్‌ జిల్లాలో నాబార్డ్ పనులతో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో విడత కింద ఇస్తామన్న 1976కోట్ల రుణాన్ని త్వరలోనే అందజేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో పాటు 2017, 2018 సంవత్సరాల్లో చేపట్టే పనులపై కూడా ఓ అవగాహనకు వచ్చారు. 

 

22:01 - June 3, 2016

విజయవాడ : కేంద్రంనుంచి మరింత సాయం అందాల్సివుందన్నారు. బాబుఏపీకి కేంద్రంనుంచి మరింత సాయం అందాల్సి ఉందన్నారు... సీఎం చంద్రబాబు నాయుడు.. చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేరలేదని చెప్పుకొచ్చారు.. టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టు కల సాకారమవుతోందని తెలిపారు.. విజయవాడలో రెండోరోజు నవ నిర్మాణదీక్షకు బాబు హాజరయ్యారు. విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్‌కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. 

16:36 - February 15, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి 280 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరువు సహాయనిధి కింద ఈ నిధులను మంజూరు చేసింది. రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరవు బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిధులను విడుదల చేశారు. తమిళనాడుకు రూ.1,773 కోట్లు, అసోం రూ.332.57 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌ - రూ.170.19 కోట్లను కేంద్రం కేటాయించింది. 

18:14 - January 14, 2016

ఢిల్లీ : కరవుతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కరుణ చూపింది. తమకు కరవు సాయం ప్రకటించాలని గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉన్నతస్థాయి సంఘం కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కరవు సాయంగా రూ.800 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అత్యున్నతస్థాయి కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు వెల్లడదించారు. గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇంత పెద్ద మొత్తంలో మంజూరు చేయలేదని చెప్పుకొచ్చారు.
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కరవు బృందం ప్రకటించింది. వెంటనే కరవు సాయంపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి పోచారాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనితో మంత్రి పోచారం కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు వెంటనే కరవు సహాయం అందించాలని కేంద్ర మంత్రిని పోచారం కోరారు. అనంతరం జనవరి మొదటివారంలో తెలంగాణకు కరవు సాయం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. తెలంగాణలో కరవు నష్టం 2500కోట్లని కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని, దీనిపై టీఎస్ సర్కార్.. 3వేల కోట్ల సాయం చేయాలని కోరినట్టు మంత్రి తెలిపారు. ఈ అంశం తమ దృష్టిలో ఉందని... వచ్చేనెల మొదటి వారంలో దీనిపై ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిశారు. కరవు సాయం వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అనుకున్నట్లుగానే కేంద్రం కరవు సాయం ప్రకటింది. కానీ అడిగినంత ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

13:37 - January 13, 2016

హైదరాబాద్ : ఎందరో త్యాగధనుల ఫలితంతో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఎంతో మంది విద్యార్థులను తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడంతో స్వరాష్ట్రం సిద్ధించింది. అలాంటి అమరుల కుటుంబాలు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు..ఒక్క అడుగు ముందుకు..ఆరడుగులు వెనక్కి వెళ్లిపోతుండడంతో.. వారి కుటుంబాలకు నిరీక్షణ తప్పడంలేదు. 
అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో..ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమం కోసం పోరాడిన వీరులు ఎందరో. నాటి ఉద్యమ కాలంలో ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలి..ఉద్యమానికి ఊపిరి పోశారు. ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రం అవతరించడంతో..ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీఇచ్చింది.10లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఇంటికో ఉద్యోగం, 3ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు లేని వారిక ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు 500 కుటుంబాలను గుర్తించి వారికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. కానీ..మిగిలిన హామీలపై మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. స్వరాష్ట్రం ఏర్పడి 19నెలలు గడుస్తున్నా..అమరుల కుటుంబంలో ఇంతవరకు ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు. అసలు అమరుల కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి, అర్హత లేని కుటుంబస్తుల పరిస్థితి ఏంటి అన్న విషయాలపై గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉన్నా..ఇంతవరకు దాన్ని పట్టించుకున్న వారే లేరు.
కలెక్టర్ల ప్రపోజల్స్ పై గందరగోళం 
ఇక కలెక్టర్ల నుండి వస్తున్న ప్రపోజల్స్ కూడా గందరగోళంగా ఉన్నాయని అధికారులంటున్నారు. మానవతా దృక్పథంతో తప్పితే.. టెక్నికల్‌గా ఉద్యోగ నియామకాలు చెల్లవని అధికారులంటున్నారు. ఓవైపు గైడ్ లైన్స్ అంశాన్ని పక్కనపెట్టి, మరోవైపు నిజమైన అమరవీరుల గుర్తింపుపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమరుల కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - సాయం