సినిమా రివ్యూ

19:11 - March 23, 2018

ఈ మధ్య హీరోగా కొంత గ్యాప్ ఇచ్చి ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన కళ్యాణ్ రామ్ మళ్లీ m.L.A అనే కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాజల్ హీరోయిన్ గా నటించడం, టీజర్, ట్రైలర్స్ లో కామెడీ టచ్ కనిపించడం, సినిమా అంతగా భారీతనం ఉందని కన్వే అవ్వడంతో ఈసినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అలానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. రిలీజ్ కు ముందే ఇలా అంచనాలు పెంచేసిన m.L.A కి ఆడియన్స్ యునానిమస్ హిట్ ని కట్టబెట్టారా..? లేదా ఓడించారా..? అసలు ప్రేక్షకుల తీర్పు ఏంటీ ?

కథ...
కథ విషయానికొస్తే.. m.L.A మంచి లక్షణాలున్న అబ్బాయిగా అందరి చేత పిలిపించుకునే గుడ్ బిహేవియర్ ఉన్న అబ్బాయి కళ్యాణ్ ఇందుని చూడగానే ఇష్టపడతాడు. అయితే ఆమె తన బాస్ కూతురని తెలిసినా కూడా ఆమెను లవ్ లోకి దింపడానికి తన ట్రయల్స్ ను కంటిన్యూ చేస్తుంటాడు. ఆ ట్రయల్స్ లో భాగంగా కంపెనీ సైట్ ను కబ్జా చేసిన మార్దాలిని కొట్టి సైట్ ని విడిపిస్తాడు. ఆ టైమ్ లో ఇందు అతని బాస్ కూతురు కాదని తెలుస్తుంది. మరి ఇందు ఎవరు..? బాస్ కూతురిగా ఎందుకు నటించింది..? ఆమె కథ విన్న కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు..? అసలు m.L.A టైటిల్ కి జస్టిఫికేషన్ లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీ నటుల యాక్టింగ్...
నటీనటుల విషయానికొస్తే... చాలా కాలం తర్వాత హీరోగా కనిపించిన కళ్యాణ్ m.L.A క్యారెక్టరైజేషన్ కోసం మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా మారాడు. లుక్స్ పరంగా ఎనర్జీ పరంగా సూపర్ అనిపించుకున్న కళ్యాణ్ రామ్ కామెడీ టైమింగ్ పరంగా మాత్రం తన వీక్ నెస్ ని కవర్ చెయ్యలేకపోయాడు. డాన్స్ పరంగా అలరించడానికి ట్రై చేశాడు. ఇక ఒక సగటు సినిమాలో హీరోయిన్ ఎలా బిహేవ్ చేస్తుందో... అదే లైన్ ని ఫాలో అయ్యింది కాజల్. తన యాక్టింగ్ స్కిల్స్ కి టెస్ట్ పెట్టేంత సీన్స్ ఈ సినిమాలో లేవు. గ్లామర్ పరంగా కాస్త కో ఆపరేట్ చేసింది. ఇక విలన్స్ గా రవి కిషన్, అజయ్ లుక్స్ తో, డైలాగ్స్ తో ఎఫెక్టివ్ నెస్ తీసుకురాగలిగారు. ఇక పోసాని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పృద్వి, ప్రభాస్ శ్రీను ఇలా టాప్ అరడజను మంది కమెడియన్స్ తమ శక్తిమేర కామెడీ పండించి m.L.A కి సపోర్ట్ అందించారు. లాస్యకి లెన్తీ రోల్ దక్కలేదు. మిగతా నటీనటులందరూ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే.. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాదవ్ ఎలాంటి రిస్క్ లేకుండా పక్కా ఫార్ములా సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఫస్ట్ సినిమానే అయినా.. విజువలేషన్ పరంగా మెచ్యూరిటీ చూపించాడు. అయితే కథలో కానీ, కథనంలో గానీ పెద్దగా మెరుపులు కనిపించలేదు. అలా అని ఇరిటేటింగ్ అవుట్ పుట్ కూడా లేదు. తన వరకూ తాను ఓ మోస్తరు మార్కులు వేయించుకున్నాడు ఉపేంద్ర మాధవ్. మణిశర్మ తన స్తాయికి తగ్గ సంగీతాన్ని అందించలేదు. ఆర్.ఆర్ కు మాత్రం న్యాయం చేశాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే మొదటి నుంచి ఇది కమర్షియల్ సబ్జెక్ట్ అంటూ హింట్స్ ఇచ్చిన టీమ్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ ను అందించింది. కథా పరంగా వీక్ గా ఉన్న m.L.A కామెడీ పండడం వల్ల, ఫైట్స్ బావుండడం వల్ల, బీ, సీ సెంటర్స్ లో కాస్త్ స్ట్రాంగ్ గా నిలబడే చాన్సులున్నాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రం ఒక రెగ్యులర్ సినిమాగానే అనిపిస్తుంది.

ప్లస్...
స్టైలిష్ అవుట్ పుట్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు

మైనస్..
రొటీన్ కథా,కథనాలు
పెద్దగా పేలని కామెడీ
పాటలు

18:53 - May 5, 2017

హైదరాబాద్: టుడే అవర్ రీసెంట్ రిలీజ్ "బాబు బాగా బిజీ " రైటర్ కం డైరెక్టర్ కం హీరో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన ‘బాబు బాగా బిజీ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది.లేట్ లేకుండ ‘ బాబు బాగా బిజీ " టాక్ ఏంటో తెలుసుకుందాం.

స్వచ్ఛమైన కామెడీ తో...

స్వచ్ఛమైన కామెడీ తో హెల్ది ఫిలిం మేకర్ అంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్ .తన శైలి కి బిన్నంగా ఇప్పుడు రొమాంటిక్ కామెడీ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు అవసరాల .హిందీ లో హిట్ టాక్ తెచ్చుకున్న హంటర్ సినిమా కి రీమేక్ ఈ బాబు బాగా బిజీ సినిమా .

మిస్తీ ,తేజస్విని ,శ్రీముఖి వంటి అందమైన బామలు...

మిస్తీ ,తేజస్విని ,శ్రీముఖి వంటి అందమైన బామలు నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం బాబు బాగా బిజీ ఆడియన్స్ కి కొత్త తరహా అనుభవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు ..నవీన్ మేడారం డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ ఫిలిం కావడం తో డైరెక్టర్ చాల కేర్ తీసుకొని ఉంటాడు అని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది .

టీజర్ కు మంచి రెస్పాన్స్

ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ లోనే ఆసక్తి కరమైన డైలాగ్స్ ని చూపించిన డైరెక్టర్ ఈ సారి అడల్ట్ కామెడీ తో అన్ని వర్గాల ఆడియన్స్ మీద పెట్టిన ఫోకస్ స్పష్టంగా కనిపిస్తుంది . మరి ఈ బాబు బాగా బిజీ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ప్లస్ పాయింట్స్ :

అవసరాల శ్రీనివాస్

హీరోయిన్స్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

 

మైనస్ పాయింట్స్ :

మ్యూజిక్

కంఫ్యూజుడ్ స్క్రీన్ ప్లే

కనెక్ట్ కానీ క్లైమాక్

బలం లేని ఎమోషన్స్

 

 

రేటింగ్ 1 .5

18:43 - January 12, 2017

శతచిత్ర నటుడు బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లోతైన పరిశోధన, సమయోచితమైన,ధీరోదాత్త పాత్రల ఆపాదనతో తీసిన ఈ చిత్రం లో నటీనటులే కాకుండా ప్రతిఫ్రేము వెనుక దర్శకుడు క్రిష్ తపన కూడా కనిపిస్తుంది. హిస్టారిక్ యాక్షన్ డ్రామా తో వచ్చిన ఈ సినిమా కేవలం బాలకృష్ణ అభిమానులకే కాకుండా సినిమా ప్రియులందరికీ కూడా సంక్రాంతి సంబరాన్ని, సందడిని ముందస్తుగానే మోసుకొచ్చేసింది.

కథ విషయానికొస్తే....

ఈ సినిమాలో కథ విషయానికొస్తే ... ముక్కలు ముక్కలుగా, చీలికలు, పేలికలుగా చిన్నాచితక రాజ్యాలతో నిరంతరం యుద్ధాలతో సతమతమవుతుంటుంది భారత దేశం. దేశాన్నంతటినీ ఏకతాటిపైకి తేవాలనుకుంటాడు శాతకర్ణి. అప్పుడే శాంతిని సాధించడం సాధ్యమవుతుందని బాల్యంలోనే కలగంటాడు . దానిని నెరవేర్చుకునేందుకు రణం అనే యుద్ధతంత్రంతో శరణమన్న వాడిని సామంతుడిని చేసుకుంటూ జైత్రయాత్ర సాగిస్తాడు. 32 రాజ్యాలను జయించి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. అతని యుద్ధ పిపాసకు, రాజ్యకాంక్షకు తద్వారా సాధించే సుస్థిర శాంతికి తల్లి గౌతమి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశంలో అత్యధిక భాగాన్ని జయించిన తర్వాత విదేశీయులైన యవనుల నుంచి వచ్చే దురాక్రమణ శాతకర్ణికి సవాల్ గా నిలుస్తుంది. దాదాపు తన సైన్యానికి మూడు రెట్లు ఉన్న ఆ విదేశీ మూకలను ఎలా ఎదుర్కొన్నాడు? వారిని తరిమి కొట్టడం ద్వారా దేశ ఖ్యాతిని ఎలా నిలిపాడు అన్నదే క్లైమాక్స్. రాజనీతి, రణనీతి, బీభత్స , భయానక యుద్ధ సన్నివేశాలు, మాతృప్రేమ , కపట మాయోపాయాలు ... కథలో అంతర్భాగంగా సాగిపోయే సంఘటనాత్మక దృశ్యాలు.కథనంలో బిగి ..పట్టు విడవకుండా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ ఘట్టాలు ఒళ్లు గగుర్పాటు కలిగిస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే....

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయాన్ని తరచి చూస్తే బాలకృష్ణ తన వందో చిత్రానికి 100 పెర్సంట్ న్యాయం చేసేందుకు పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చారిత్రక చిత్రాలకు తన ఆహార్యం, హావభావాలు చక్కగా సరిపోతాయన్న భావనను నిజం చేసి నిరూపించాడు. సీనియర్ నటి హేమామాలిని గౌతమి పాత్రలో కుమారుడిని తీర్చిదిద్దడంలోనూ, అతని కల నేర్చడంలోనూ, రాజ్యంలో తలెత్తుతున్న అసంతృప్తభావనలకు సరైన రీతిలో బదులు చెప్పడంలోనూ హుందాతో కూడిన పరిణత ప్రజ్ణను తన నటనలో కనబరిచారు. ఒకవైపు భర్త యుద్ధకాంక్ష, మరోవైపు కుమారుడని సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితిలో కరుణ రసాత్మకమైన మాతృత్వభావనను ఆర్ద్రపూరితంగా పోషించారు వశిష్టాదేవి పాత్రలో శ్రియాశరణ్. మిగిలిన పాత్రలకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కథను నడపడంలో , నాయక పాత్ర ఔచిత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో సందర్భోచితంగా నటీనటులందరూ తమవంతు పాత్రల్లో జీవించారు.

టెక్నీషియన్ల విషయంలో...

టెక్నీషియన్ల విషయంలో నంబర్ ఒన్ మార్కులు దర్శకుడు క్రిష్ కొట్టేస్తాడు. ’అన్ సంగ్‘ హీరోగా తెలుగు వాళ్లకే పెద్దగా తెలియక ఎక్కడో చరిత్ర మూలల్లో పడిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెలికి తీసిన ఘనత ఆయనదే. ఎన్నెన్నో దేశాలు, ప్రదేశాలు తిరిగి , గ్రంథాలయాల్లో శోధించి తాళపత్ర, తామ్ర , శిల్ప శాసనాలను పరిశోధించి దొరికిన ఆధారాలకు అందమైన అల్లికను జోడించి ఒక మంచి చలనచిత్రంగా , చారిత్రక దృశ్య కావ్యంగా మలచిన శిల్పి క్రిష్ . అతితక్కువ కాలవ్యవధిలో నిర్మించినా సెట్టింగులు , గ్రాఫిక్స్ విషయంలో కథకు తగ్గ హంగులు సమకూర్చడంలో క్రిష్ చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ప్రేక్షకుడిని కథతో పాటు భావనా ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎస్సెట్ గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులు ఆశించే డైలాగుల పదును , అదే సమయంలో కథలో పాత్ర ఔచిత్యం రెంటినీ దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా పదునున్న కత్తిలా భాషను పంచ్ లుగా విసరడంలో ..అందులోనూ పౌరుషం ధ్వనింపచేయడంలో రచయిత సాయిమాధవ్ కృతకృత్యుడయ్యాడు. యుద్ధసన్నివేశాల్లో రౌద్రం, వీరరసం, బీభత్సం తొణికిసలాడేలా సాదృశ్యమానం చేయడంలో కెమెరా పనితనం కేక పుట్టిస్తుంది. మొత్తమ్మీద ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు పండగే. స్వయంగా బాలకృష్ణకు ఆత్మసంతృప్తినిచ్చే సార్థక చిత్రం . తెలుగు సినీ అభిమానులకు మధురమైన తీయని అనుభూతి. గతకాలపు తెలుగు జాతి వైభవానికి, చరిత్రలోని ఒక పార్శ్వానికి తెరనిండైన సాక్ష్యం.

 

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

పదునైన సంభాషణలు

నేపథ్య సంగీతం

పాత్రోచిత నటన

 

మైనస్ పాయింట్స్ :

కాసింత నిడివి ఎక్కువ

కథావేగానికి బ్రేక్ వేసిన పాటలు

ప్రధానపాత్రలతో పోలిస్తే ప్రతినాయక పాత్రలు తేలిపోవడం

 

మరి '10 టివి' ఇచ్చే రేటింగ్, కత్తి మహేష్, మరియు 10టీవీ న్యూస్ ఎడిటర్ సతీష్ విశ్లేషణలు చూడాలనుకుంటే వీడియోను క్లిక్ చేయండి....

19:20 - April 14, 2016

ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో ఎక్కువ భాగం ప్రయోగాత్మకంగానూ, ఫ్యామిలీ ఎమోషన్స్ బేస్డ్ గానే సాగాయి. కామెడీ మూవీస్ మీద ఫుల్ గా ఎవరూ ఫోకస్ చేయలేదు. కానీ ఈ సమ్మర్ లో ఆడియన్స్ ను మొదటి నుంచి చివరి వరుకూ ఔట్ అండ్ ఔట్ కామెడీ తో జనాన్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది ఈడో రకం ఆడో రకం. డైనమైట్ తర్వాత ఒక్క సరైన సినిమాలేని విష్ణు, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ప్లాప్ తో కాస్త డల్ అయిన రాజ్ తరుణ్ కి ఈ సినిమా మంచి బూస్టప్ గా నిలిచిపోతుంది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే హీరోల కేరక్టరైజేషన్ ను అద్భుతంగా డిజైన్ చేసాడు దర్శకుడు నాగే్శ్వరరెడ్డి. కామెడీ సినిమాలు తీయడంలో చెయితిరిగిన ఈ దర్శకుడికి ఈ సినిమా లో కామెడీ ని అలవోకగా పండించాడు. ఈ మధ్యకాలంలో కన్ఫ్యూజన్ కామెడీ సినిమాలు రాలేదు. ఆలోటు ఈడో రకం ఆడో రకం సినిమా తీర్చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా రెండున్నర గంటల పాటు నవ్వడమే పనిగా పెట్టుకుంటుందీ చిత్రం.

లాయర్ నారాయణరావు కి ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు నారాయణ రావు దగ్గరే అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తుంటాడు. అతడి భార్య. చిన్న కొడుకు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫ్రెండ్స్ , షికార్లు అంటూ తిరుగుతుంటాడు. అతడికి వదిన దగ్గర చనువెక్కువ. అర్జున్ ఫ్రెండ్ అశ్విన్ ఒక ఆవారా .తండ్రి సర్కిల్ ఇన్సపెక్టర్ . అర్జున్ , అశ్విన్ లు మంచి ఫ్రెండ్స్ . ఎలాంటి పనిచేయాలన్నా వీరిద్దరే కలిసిపనిచేస్తుంటారు. వీరిద్దరూ కలిసి ఒక పెళ్లికెళ్తారు . అక్కడే ఇద్దరూ ఇద్దరమ్మాయిలకి మనసిస్తారు. అందులో అర్జున్ ప్రేమించిన అమ్మాయి నీలవేణి అన్నయ్య ఓ పెద్ద గూండా. తన చెల్లికి ఒక అనాథనిచ్చి పెళ్లిచేయాలనుకుంటాడు. అందుకే అర్జున్ అనాథనని నాటకమాడి ఆమెను అప్పటికప్పుడు రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటాడు. ఇక అక్కడినుంచి అర్జున్ కష్టాలు ప్రారంభమౌతాయి. ఇంట్లో పెళ్లి చేసుకొన్నట్టు చెప్పకుండా మేనేజ్ చేద్దామనుకుంటాడు. కానీ నీలవేణి సరిగ్గా నారాయణ రావు ఇంటినే అద్దెకు తీసుకొని అర్జున్ కి కష్టాలు తెచ్చిపెడుతుంది. అక్కడినుంచి జరిగే కన్ఫ్యూజన్ డ్రామాతో సినిమా రసవత్తరంగా మారుతుంది.

అర్జున్ గా మంచు విష్ణు, అశ్విన్ గా రాజ్ తరుణ్ వాళ్ళ తండ్రులు గా రాజేంద్రప్రసాద్, పోసాని క్రుష్ణమురళి అద్భుతంగా సినిమాను రక్తి కట్టించారు. ముఖ్యంగా మంచు విష్ణు తండ్రి గా రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాకి పెద్ద ఎసెట్ . రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , మంచు విష్ణు డీసెంట్ యాక్టింగ్ సినిమాకి మంచి రిలీఫ్ ఇస్తాయి. హీరోయిన్స్ గా నటించిన సోనారికా, హెబ్బా పటేల్ జనాన్ని గ్లామర్ తో కట్టిపడేసారు. సీమటపాకాయ స్టైల్లో సాగే కన్ఫ్యూజన్ డ్రామానే ఈ సినిమా లోనూ వాడుకున్నాడు నాగేశ్వరరెడ్డి . అయితే దానికి, దీనికి తేడా ఏంటంటే అందులో హీరో ఒక్కడే , కానీ ఇందులో ఇద్దరు హీరోలతోనూ ఈ డ్రామా నడిపించాడు. ఇంటర్వెల్ నుంచి రాజ్ తరుణ్ కేరక్టర్ కు కూడా అర్జున్ తరహా లోనే కన్ఫ్యూజన్ డ్రామా ను యాడ్ చేసి రెట్టింపు కామెడీ పండించాడు డైరెక్టర్ . ఈ సినిమాలోని మిగతా పాత్రలు సినిమా హాయిగా సాగిపోవడానికి తమ వంతు సాయం చేసారు. పెద్ద కొడుకు గా నటించిన రవిబాబు కూడా కామెడీ బాగా పండించాడు. ఇంకా గీతా సింగ్ , వెన్నెల కిషోర్ , సత్యకృష్ణన్ , ప్రభాస్, శ్రీను , రౌడీలు గా నటించిన అభిమన్యు సింగ్, సుప్రీత్ రెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. మొత్తం మీద ఈ నెల లో పైసా వసూలు సినిమాగా బోణి చేసిన మొదటి సినిమా ఈడో రకం ఆడో రకం . సరైనోడు రిలీజ్ వరుకూ ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

మంచు విష్ణు, రాజ్ తరుణ్ , రాజేంద్రప్రసాద్ నటన

సంగీతం, పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కన్ఫ్యూజన్ డ్రామా

ఫోటో గ్రఫీ

హీరోయిన్స్ గ్లామర్

ఔట్ అండ్ ఔట్ కామెడీ

మైనస్ పాయింట్స్ :

ఏవీ లేవు.

రేటింగ్ : 3 

16:17 - February 19, 2016

ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడి పని దర్శకుడు..నిర్మాత పని నిర్మాత చేయాలి...లొకేషన్లు, అక్కౌంట్స్, ఆర్టిస్టుల కోఆర్టినేషన్, ప్రొడక్షన్.. ఇలాంటి పనులు చేయాల్సిన నిర్మాత...కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లో అనవసర జోక్యం చేసుకుంటే...కాస్తో కూస్తే బెటర్ గా రావాల్సిన సినిమా అట్టర్ ఫ్లాప్ గా తయారవుతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ, ఎన్ఆర్ఐ క్యారెక్టర్, కొంత కామెడీ టచ్...ఈ లైన్ తో కృష్ణాష్టమి సినిమాను తెరకెక్కికించాడు దర్శకుడు వాసువర్మ. కథలోకి వెళ్తే...రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు చేసే ఓ ఫ్యామిలీ అంటే అక్కడి జనాలకు హడలు. కళ్లముందే నేరాలు జరుగుతున్నా...ఎవరూ నోరెత్తరు. సాక్ష్యం కోసం చూస్తున్న పోలీసులకు సునీల్ భయం లేకుండా హంతకులను చూపిస్తాడు. సాక్ష్యం చెప్పిన సునీల్ ను చంపేందుకు ఆ హంతకులు వేట మొదలుపెడతారు. ఇదంతా చిన్నప్పటి స్టోరీ. రౌడీల బారి నుంచి కొడుకును తప్పించేందుకు బాల్యంలోనే అతన్ని అమెరికా పంపిస్తాడు సునీల్ బాబాయ్. పెద్దయ్యాక ఇండియా రాకుండా ఆపుతుంటాడు. ఐతే...సొంతూరును, ఇంట్లో వాళ్లను చూడాలనే కోరికతో బాబాయ్ కి చెప్పకుండా ఇండియా వస్తాడు సునీల్. నాటకీయంగా తాను చంపుదామని వెతుకుతున్న రౌడీ ఇంటికే చేరుతాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది క్లైమాక్స్...

హీరోకు సరిపోయే కథతో సినిమా చేయాలి గానీ.....

హీరోకు సరిపోయే కథతో సినిమా చేయాలి గానీ...అప్పటికే నలుగురు హీరోలకు చెప్పిన కథను...సునీల్ రెడీగా ఉన్నాడని అతనితో తీస్తే ఇలాగే ఉంటుంది సినిమా. వాస్తవానికి కృష్ణాష్టమి ఓ స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాల్సిన సినిమా. సునీల్ ను హీరోగా పెట్టడంతో స్టైలిష్ అన్నదే లేకుండా పోయింది. ఇక యాక్షన్ సన్నివేశాలు ఉన్నా...మనోడి కామెడీ ఫేస్ కు అస్సలు సరిపోలేదు. కథలో అవకాశమున్న కామెడీని హీరోయిజం కోసం నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా కృష్ణాష్టమి ఎందుకు కొరగాని సినిమా అయ్యింది. బాగా ఉబ్బిపోయి పేషంట్ లా ఉన్నాడు సునీల్. సినిమాకు పెద్ద మైనస్ గా మారాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టీవీ సీరియల్ లా ఉన్నాయి. ఖర్చు తగ్గించడం కోసం కొన్ని సీన్స్ విదేశాల్లో తీయకుండా గ్రాఫిక్స్ చేశారు. సునీల్ హీరో అని లైట్ తీసుకున్నారేమో నిర్మాతలు. ఇక పరమ రొటీన్ కామెడీ సినిమాకు మరో మైనస్ గా మారింది. ఆర్టిస్టులకు చెప్పించిన డబ్బింగ్ మొదలు...హీరోయిన్స్ నిక్కీ గల్రానీ, డింపుల్ చొపాడే ఓవరాక్షన్, కార్టూన్ క్యారెక్టర్లలా నటించే ముఖేష్ రుషి, అషుతోష్ రానా...సినిమా డ్యామేజీలో పార్ట్ అయ్యారు. డింపుల్ చొపాడే తో అసభ్యకరమైన సీన్స్ చేయించారు. ఈ సీన్స్ ఫ్యామిలీ ఆడియోన్స్ చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి....

బాగోలేని ట్యూన్స్.....

సంగీత దర్శకుడు దినేష్ ట్యూన్స్ ఒక్కటీ బాగా లేదు. ఇలాంటి సినిమాకు కనీసం పాటలన్నా బాగుండాలి. దర్శకుడిగా వాసు వర్మ మరోసారి తేలిపోయాడు. హీరోతో సహా ప్రధాన పాత్రలేవీ సహజంగా అనిపించవు. ఏదో సినిమా కోసం ప్రవర్తించినట్లు ఉంటాయి. కథను, కథనాన్ని ఆసక్తి కరంగా చెప్పకుండా...సాగదీశాడు. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ పూర్తిగా అర్థమైపోతుంది. ఇక క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను ఎలా థియేటర్లో కూర్చోబెట్టాలో ఈ మేకర్స్ కు అర్థం కాలేదు. దాంతో అప్పుడెప్పుడో అమెరికాలో మర్చిపోయిన పోసాని క్యారెక్టర్ ను అల్లుడిగా దించారు. ఇలా కలగాపులగం స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ కు చేరుకుంటుంది కృష్ణాష్టమి. సునీల్ సినిమాల్లో కాస్త కామెడీ ఐనా చూడొచ్చు అనుకునే ఆడియెన్స్ ఈ సినిమాపై అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు....

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

సునీల్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

పాత కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే

దర్శకత్వం

రొటీన్ కామెడీ సీన్స్

సంగీతం

18:29 - February 12, 2016

ఇమేజ్ కు తగిన కథలను ఎంచుకునే కథానాయకులే స్టార్లు అవుతారు. వీళ్లలో నాని మొదటి లిస్టులో ఉంటారు. తనకు సరిపోయే స్టోరీలతో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. నాని సినిమాలో ఎదో కొత్తదనం ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథతోనూ ఈ నమ్మకాన్ని మరింత పెంచాడు నాని. ..

కృష్ణ ..రాయలసీమలోని ఓ కుర్రాడు. బాలకృష్ణ అభిమాని. ఉండేది సీమలోనైనా....గొడవలంటే మహా భయం. ఫ్యాక్షన్ ఫ్యామిలీలోని మహాలక్ష్మి ని ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి ప్రైమరీ స్కూల్ ప్రేమ. వీళ్ల లవ్ స్టోరీకి...మహా లక్ష్మి అన్న అడ్డుపడుతుంటాడు. తన చెల్లితో స్నేహంగా ఉన్నా...కృష్ణ చెడ్డవాడు కాదన్న ఒకే కారణంగా మహాలక్ష్మి అన్న కృష్ణని వదిలేస్తుంటాడు. తన ప్రేమ కారణంగా ఏళ్లకేళ్లు పెళ్లి వాయిదాలు వేస్తున్న హీరోయిన్ ...తన ఇంట్లో వాళ్లతో మాట్లాడమని కృష్ణకు టైమ్ ఫిక్స్ చేస్తుంది. స్నేహితురాలి పెళ్లికి వేరే ఉరెళ్తుంది. ధైర్యం చేసిన కృష్ణ ఒకరోజు బాగా తాగి...మహాలక్ష్మి అన్నకు తమ ప్రేమ విషయం చెప్పడానికి వాళ్లింటికెళ్తాడు. కానీ కృష్ణ ఇంట్లోకి వెళ్లగానే...ఆ ఇంటిపై ప్రత్యర్థుల దాడి జరుగుతుంది. దొరికిన వాళ్లను చంపేస్తుంటారు. ఈ సందర్భంలో మహాలక్ష్మి అన్న తనకు కనిపించిన కృష్ణకు ఓ ముగ్గురు చిన్నపిల్లల్ని అప్పగించి...వాళ్లను క్షేమంగా హైదరాబాద్ చేర్చమంటాడు. తనకీ సాయం చేస్తే...తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. మరి శత్రువుల దాడి నుంచి కృష్ణ ఆ పిల్లలను ఎలా కాపాడాడు. దీని వెనుక ఉన్న మలుపులేంటి అన్నది మిగతా కథ......

నాని మరోసారి తన సహజ నటనతో నాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. భయస్తుడి పాత్ర చేసినా...ఎక్కడా అతిశయం కనిపించలేదు. చాలా కూల్ గా నటించాడు. సక్సెస్ లో ఉన్న ఆత్మవిశ్వాసం కనిపించింది. నాయిక మొహరీన్ బొద్దుగా బాగుంది. పాత్రకు సరిపోయింది. ఏసీపీ పాత్రలో నటించిన సంపత్..సినిమాకు ఫ్లస్ పాయింట్ అయ్యాడు. జమదగ్ని క్యారెక్టర్లో ఫృథ్వీ మరోసారి నవ్వించాడు....

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ స్టోరీ యాక్షన్ ఫిల్మ్ చేయాల్సిన కథ. కానీ దర్శకుడు హను రాఘవపూడి హ్యూమరస్ గా మార్చి...నాని ఇమేజ్ కు తగ్గ సినిమా చేశాడు. సినిమా సక్సెస్ లో హనుకే మూడొంతుల క్రెడిట్ దక్కుతుంది. అన్ని పాత్రలను, అన్ని ట్విస్టులను క్లారిటీగా తెరకెక్కించాడు. నిడివి ఎక్కువవడం ఒక మైనస్ కాగా....సినిమా తొలి అర్థభాగంలో ప్రతి సీన్ లో ఉన్న నాయిక...సెకండాఫ్ లో ఎప్పటికోగానీ కనిపించదు. తమిళ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. పాటల చిత్రీకరణలోనూ క్రియేటివిటీ కనిపించింది. మొత్తానికి తానేలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు చూస్తారో...అలాంటి సినిమానే చేశాడు నాని....

 

ఫ్లస్ పాయింట్స్

  1. దర్శకత్వం

  2. నాని నటన

  3. హాస్య సన్నివేశాలు

  4. మ్యూజిక్

 

మైనస్ పాయింట్స్

  1. సినిమా నిడివి

  2. ఊహాతీత కథనం

Don't Miss

Subscribe to RSS - సినిమా రివ్యూ