సీఎం కేసీఆర్

09:41 - February 18, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాలుగా గుర్తింపు పొందిన నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాల నేతలను అక్కడే కట్టడి చేయాలని  ప్రణాళికలను రచించినట్లు సమాచారం. మరో సారి అధికారం దక్కించుకునేందుకు  కీలక నేతల నియోజకవర్గాలే టార్గెట్‌గా అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
మరోసారి అధికారానికి టీఆర్ఎస్ వ్యూహం
మరోసారి రాష్ర్టంలో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం.  అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో  పరిస్థితులను చక్కబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.   అభివృద్ధి నినాదంతో  రాబోయే ఎన్నికలకు వెళ్ళే దిశగా గులాబీ పార్టీ అడుగులేస్తోంది.
కాంగ్రెస్‌ సీనియర్లు, ముఖ్యనేతలకు చెక్‌ పెట్టే యోచన
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటు...  కీలక నేతల నియోజకవర్గాలపైనా గులాబీ బాస్ దృష్టి సారించినట్లు సమాచారం.  కాంగ్రెస్‌లోని సీనియర్లు, ముఖ్యనేతలకు చెక్‌ పెట్టేందుకు గులాబీ దళం ప్రయత్నిస్తోంది. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, డికే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లాంటి నేతలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బలమైన నేతల  అనుచరులను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి కారెక్కేందుకు సుముఖంగా ఉన్న వారికి  ప్రాధాన్యతతోపాటు.. పదవులు కూడా కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో చాలా మందిని కారెక్కించుకున్నారు గులాబీ బాస్‌.... కాగా మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పంథాను అనుసరించనున్నట్లు సమాచారం.  

 

22:00 - February 15, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని తొమ్మిది పాత జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించినందుకు జైట్లీకి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి 2017 వరకు రాష్ట్రానికి రావాల్సిన 1350 కోట్లు విడుదల చేయడంపట్ల కృతజ్ఞతలు చెప్పారు. 2017-18 నిధులను కూడా విడుదల చేయాలని కేసీఆర్‌ కోరారు. ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలన్న కేసీఆర్‌ విన్నపంపై జైట్లీ సానుకూలంగా స్పందించారు. 2018-19 వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 
 

08:31 - February 6, 2018

హైదరాబాద్‌ : అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలనక సంఘాలుగా మార్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పదిహేను వేలకు పైగా జనాభా  ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా ఆలోపు ప్రజలు ఉన్న ఊళ్లను నగర పంచాయతీలుగా  ప్రకటించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.
పురపాలక సంఘాలుగా పెద్ద పంచాయతీలు 
అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అంశంపై మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరైన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడం వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. పెద్ద పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చినా... రెండేళ్ల వరకు పన్నులు పెరగబోవన్న భరోసా కల్పించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం అధించే నిధులతో మెరుగైన రోడ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు  ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని పాలకులు ఆశిస్తున్నారు.  మెట్రోవాటర్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటారు. డబుల్‌ బెడ్‌ రూము ఇళ్ల నిర్మాణం చేపడతారు. 
కొన్ని గ్రామాల విలీనంతో పురపాలక సంఘాటు 
అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 167 గ్రామాలను నైసర్గిక స్వరూపాన్ని బట్టి మున్సిపాటీలు, నగర పంచాయతీలుగా మారుస్తారు. కొన్ని గ్రామాలను విలీనంచేసి పురపాలక సంఘాలు ఏర్పాటు చేస్తారు. అమీన్‌పూర్‌, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడ, ప్రగతినగర్‌, తెల్లాపూర్‌, కొల్లూరు, తుర్కయాంజాల్‌తోపాటు మరికొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్పుచేసే అంశంపై చర్చించారు. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులన ఆదేశించారు.   

 

08:25 - February 6, 2018

హైదరాబాద్ : 2018, 19 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, సంక్షేమానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ రంగాలకు గతంలో కంటే 20 శాతం ఎక్కువ నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలపై మొదటిసారి సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌... పద్దులను శాస్త్రీయంగా రూపొందించాలని కోరారు. శాఖలవారీగా కేటాయింపులు పక్కాగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, ఇతర నిధులు, ఇతరితర నిధుల సమీకరణ వంటి అంశాలపై సమీక్షించారు. 2017-18లో 1.49 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదించారు. ఈ బడ్జెట్‌లోజరిగిన ఖర్చుల వివరాలపై కేసీఆర్‌ ఆరా తీశారు. 
 

13:47 - January 26, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనూ 69వ రిపబ్లిక్‌డే ఉత్సవాలు  ఘనంగా  జరుగుతున్నాయి. ఉదయం 9.15 నిముషాలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు  పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులు నిర్వహించిన కవవాతు ఆకట్టుకుంది.   పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. 

 

09:55 - January 26, 2018
17:47 - January 20, 2018

హైదరాబాద్ : తెలంగాణలో చట్ట విరుద్ధంగా నియమించబడిన ఆరుగురు పార్లమెంటు సెక్రటరీలను అనర్హులుగా ప్రకటించాలని సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ న్యాయస్ధానాలను తప్పు దోవ పట్టించి తన పార్టీలోని నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించారని ఆయన విమర్శించారు. గతంలో చట్ట విరుద్ధంగా నియమించిన పార్లమెంటు సెక్రటరీలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని కేసీఆర్ బేఖాతరు చేస్తూ మరో 21 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

 

15:01 - January 16, 2018

సుప్రీంకోర్టు అసంతృప్త న్యాయవాదుల అంశంలో వివాదం సమసిపోయినట్టేనని బార్ కౌన్సిల్ ప్రకటించింది. సీజే..జడ్జీలకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, సుప్రీంకోర్టులో కార్యాకలాపాలు యదావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సమాంతరంగా కాల్వలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు. ఏపీలో కోళ్ల పందాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయా అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహ రెడ్డి (సీపీఎం), శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), మల్లు రవి (టి.కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:52 - January 16, 2018

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంట సాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నూతన పంచాయతీరాజ్‌ చట్టం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపైనా కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

12:43 - January 16, 2018

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులతో సమాంతరంగా కాల్వలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి పొలాలకు నీరు సరఫరా చేసేందుకు, చెరువులు నింపేందుకు కాల్వలు కీలకమని నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన జలాశయాలు, కాల్వలు, చెక్‌డ్యామ్‌లు, పంప్‌హౌస్‌లు, సొరంగా మార్గాల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. జలాశయాల వద్ద అతిథి గృహాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఎగువ, దిగువ మానేరును జీవధారగా నిర్వహిస్తూ దక్షిణ తెలంగాణకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరాన్ని కేసీఆర్‌ అధికారులు దృష్టికి తెచ్చారు. సింగూరు ఒకసారి నిండితే ఐదేళ్ల వరకు ఇబ్బంది ఉండదన్న విషయాన్ని ప్రస్తావించారు. సింగూరు నుంచి కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ను జీవధారగా మార్చాలని ఆదేశించారు. మెదక్‌ జిల్లాను మెతుకుసీమగా మార్చేందుకు ఇది కీలకమని సూచించారు. ఈ ఏడాది జులై-ఆగస్టు నాటికి మిడ్‌ మానేరు నింపేందుకు అవకాశం ఉంటుందని అధికారులు.. సీఎం దృష్టికి తెచ్చారు. మిషన్‌ భగీరథంలో కీలకమైన ఎస్సారెస్సీని ఎప్పటికీ నీళ్లతో నింపి ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మధ్య మానేరు కాల్వలు, సొరంగమార్గం పనుల పురోగతిని కేసీఆర్‌ సమీక్షించారు. నీరు వచ్చిన వెంటనే చెరువులను నింపి, కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతగిరి, రంగానాయక్‌సాగర్‌ రిజర్వాయర్ల పనులను వేగవతం చేయాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు గ్రావిటీ ద్వారా నీరిచ్చి, ఎక్కువ భూమి సాగయ్యే విధంగా చర్యలు తీసుకోవాని కోరారు. గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ప్రతి ఎకరం భూమికి సాగునీరు అందాలని ఆదేశించారు. గంధమల, బస్వాపూర్‌ జలాశయాల పురోగతిని కూడా కేసీఆర్‌ సమీక్షించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఎక్కువ ప్రాజెక్టులను పూర్తిచేసి.. సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను ఇప్పటి నుంచే తీసుకోవాలని కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - సీఎం కేసీఆర్