సీఎం చంద్రబాబు

15:49 - March 27, 2017

గుంటూరు : పోలవరం పూర్తిచేయడం ప్రస్తుతం చాలా అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరంపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌కుముందు సభ్యులకు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సీఎం తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల నీళ్లలో వీలైనంతవరకూ నీళ్లను వాడుకునేలా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రకటించారు. 2018కి గ్రావిటీ ద్వారా పోలవరం నీటి వినియోగం ఉంటుందన్నారు. 

 

11:39 - March 27, 2017

అమరావతి: బాబు వస్తే జాబు వస్తుందన్న హామీకి ఇప్పటికీ కట్టుబడిఉన్నామని... అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు.. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగభృతి కల్పిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు

06:54 - March 27, 2017

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల దిగువన బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని వినిపిస్తున్న డిమాండ్ .....

ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉంది. ఏపీ రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈ ప్రాంతంలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్ ఏర్పడింది. ఈ కొత్త వంతెనకు రూ.2,500 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రాథమిక సర్వే పూర్తిచేసింది.

మున్నేరు వరద నీటి ఆధారంగా బ్యారేజీ నిర్మాణంపై కసరత్తు ...

రాజధాని ప్రాంతం కావడంతో కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మాణం కీలకంగా మారింది. దీంతో మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. వర్షాలకు మున్నేరు నుంచి వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజీలో నిల్వ ఉంచి మిగతా నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. దీంతో 50 టీఎంసీల దాకా నీరు వృథా అవుతోంది. బ్రిడ్జి నిర్మాణంతో 15 టీఎంసీల నీటినైనా నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో కొత్త వంతెనను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

06:48 - March 27, 2017

గుంటూరు : రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలోని రైల్వేకాలనీలో నిరాశ్రయులైన బాధితుల కోసం అవసరమైతే జైలుకు వెళతానని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 40 సంవత్సరాలుగా రైల్వేకాలనీలో జీవిస్తున్న వారికి ఇళ్లు ఖాళీ చేయమని రైల్వే బోర్డు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా సీఎం చంద్రబాబు మోహం చాటేస్తున్నారని విమర్శించారు.

18:01 - March 25, 2017

అమరావతి: ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ రూపొందించిన అమరావతి నగర పరిపాలన భవన నమూనాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధికారులు వివరించారు. నిర్మించబోయే అమరావతి నగర విశేషాలను మా ప్రతినిధి విజయచంద్రన్‌ అందించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:44 - March 25, 2017

అమరావతి: రాజధాని నిర్మాణంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని... సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేలా రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు.. 9 సిటీల్లో 25 టౌన్‌షిప్‌లు వస్తాయని ప్రకటించారు.. అమరావతి పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడారు..

16:12 - March 24, 2017

అమరావతి: రాయలసీమలో తప్పు చేస్తే గౌరవంగా ఒప్పుకుంటామని... లేదంటే సై అంటూ ముందుకు వెళతామని జగన్ మాత్రం రణం లేదు.. శరణం లేకుండా పలాయనం చిత్తగించాడని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... డబ్బులు తీసుకుని పార్టీలు మారామని జగన్ ఆరోపించారని, మరో సారి అంటే కేసు వేస్తామని హెచ్చరించారు. జగన్ కు జ్యుడిషరీ ఎంక్వయిరీ అంటే భయమని పేర్కొన్నారు. తన మంత్రి వర్గంలో ని మంత్రి పై జ్యుడీషరీ ఎంక్వయిరీకి ఓప్పుకున్న సీఎం ఒక్క చంద్రబాబు మాత్రమే అన్నారు. జగన్ వ్యవహార శైలి నచ్చకే 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారని విమర్శించారు.

07:51 - March 24, 2017

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సుపరిపాలనుకు ఎన్నో అవార్డులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో సీఎన్ బీసీ మీడియా సంస్థ.. స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించింది. ఈ అవార్డును సీఎం చంద్రబాబు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని.. ఇవి తమ బాధ్యతను మరింత పెంచుతున్నాయని చంద్రబాబు అన్నారు. అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.  

 

16:38 - March 23, 2017

అమరావతి: ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఒక్క అగ్రిగోల్డ్‌ నిందితులనే కాకుండా .. ఆర్థిక నేరాలకు పాల్పడే వారు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్తులో ప్రజలను మోసం చేయాలంటేనే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ సీఎం.

16:31 - March 23, 2017

అమరావతి: విజయవాడ నగరంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలో జనసంఖ్య పెరగడంతో అద్దెల బాదుడు ఎక్కువైంది. యజమానులు ఇష్టానుసారంగా అద్దెలు పెంచేస్తున్నారు. గతంలో 2వేలు ఉన్న అద్దె ధర ఇప్పుడు ఏకంగా 5 వేలకు చేరిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.... హైదరాబాద్‌లో కూడా లేని అద్దె ధరలు విజయవాడలో ఉన్నాయి.

రాజధానిగా మారిన తర్వాత విజయవాడలో పెరిగిన జనం....

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ఏపీ రాజధానిగా మారిపోయింది. రాజధాని అనగానే ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం, మంత్రుల పేషీలతోపాటు వివిధ శాఖలకు చెందిన ఆఫీసులు ఉంటాయి. దీంతో సహజంగానే జనసంఖ్య పెరుగుతుంటుంది. విజయవాడలోనూ అదే జరిగింది. రాజధానిగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడకు మకాం మార్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు అధికమయ్యారు. వీరితోపాటు ఇతర చిరు వ్యాపారులు, విద్యార్ధులు, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్ధుల సంఖ్య పెరిగింది. దీంతో అద్దె రూములు దొరకడం గగనమైపోయింది. ఇదే అదనుగా భావిస్తోన్న యజమానులు అద్దెను అమాంతం పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడలో ఇంటి అద్దెలపై సీఎం చంద్రబాబు శాసనమండలిలో ప్రస్తావించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు.

విజయవాడలో 1.80 లక్షల గృహాలు....

విజయవాడలో ప్రస్తుతం 1.80 లక్షల గృహాలు ఉండగా... వీటిలో 10.5 లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. దీంతో అద్దె ఇళ్లు దొరకడం కష్టతరమైంది. ఒక వేళ దొరికినా అద్దె బాదుడు ఎక్కువైంది. ఇక ఫ్యామిలీస్‌కు అద్దె ఇవ్వడానికి ఇంటి యజమానులు ముందుకురావడం లేదు. బ్యాచ్‌లర్స్‌కే రూమ్స్‌ ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. వారి నుంచైతే ఎక్కువ బాడుగ వసూలు చేయవచ్చని యజమానులు భావిస్తున్నారు.

అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్‌రూమ్‌కు రూ. 7వేల అద్దె...

అపార్టుమెంట్లలో సింగిల్‌ బెడ్‌రూంకు 7 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌కు 13వేలు, త్రిపుల్‌ బెడ్‌రూమ్‌కు 16వేలకుపైగా యజమానులు వసూలు చేస్తున్నారు. వన్‌టౌన్‌, అయోధ్యనగర్‌, పటమట, గవర్నర్‌పేట, కృష్ణలంక, భవానీపురం, మొగల్రాజపురం ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మెయింటనెన్స్‌ కింద మరో 1000 నుంచి 1500 అదనంగా వసూలు చేస్తున్నారు. అరకొర సౌకర్యాలు ఉన్న రెండు గదుల ఇంటికి సైతం 4వేల నుంచి 5వేలు వసూలు చేస్తున్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు ప్రాంతాల్లో 3 గదులున్న ఇళ్లకు 8వేలు వసూలుచేస్తున్నారు. దీంతో ఇక్కడ దశాబ్దాలుగా ఉంటూ చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఇబ్బందిగా మారింది.

యజమానులను కట్టడి చేయాలంటున్న అద్దెదారులు...

ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇంటి అద్దెలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అద్దెదారులు కోరుతున్నారు. ఇంటి అద్దెలను ఎడాపెడా పెంచేస్తున్న యజమానులను కట్టడి చేయాలని విన్నవిస్తున్నారు. ఇంటి అద్దెలపై ఓ చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - సీఎం చంద్రబాబు