సీఎం చంద్రబాబునాయుడు

18:57 - June 22, 2017

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. ఆగస్టు 1నుంచి అంతర్జాతీయ సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

18:48 - June 22, 2017

చిత్తూరు : తిరుపతి విమానాశ్రయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆవిష్కరించారు. ఇందు కోసం వంద అడుగుల ఎత్తున్న జెండా స్తంభం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలతో పాటు, ప్రధాన రైల్వే స్టేషన్లలో తప్పనిసరిగా జాతీయ జెండాలను ఆవిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. 

20:09 - June 13, 2017

హైదరాబాద్: గురుకుల పాఠశాలలు చాలా గొప్పయ్...మంత్రులు మరి మీ పిల్లల్ని చేర్పిస్తారా అందులో, కొత్తగూడెం కాడ కదిలిని కొడవలి దండు...రగులుతున్న పోడు భూముల పంచాయతీ, ప్రజల అభిప్రాయం మేరకే పార్టీ జంప్...చీప్ గ కథలు చెప్తున్న శిల్పా మోహనుడు, ఆంధ్రలో ఆశా బిడ్డల ఆందోళనలు...పట్టించుకుంటున్నా చంద్రాలు, 68 ఏళ్లు వున్నా ఫించను ఇస్తలేరు...కామారెడ్డి కాడ పెద్ద మనిషి నిరాహార దీక్ష, ఆర్టీసీ బస్సు ఎక్కొద్దంటున్న డ్రైవర్...ఆక్యుపెన్సీ పెంచమంటున్న సంస్థ ఇలాంటి అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:07 - June 10, 2017

గుంటూరు : ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిజికల్‌ లిటరసీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నృత్యం, యోగాభ్యాసం, సంగీతంపై విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. హేతుబద్దత లేని రాష్ట్ర విభజనపై విద్యార్థులకు వివరించాలని  అధికారులకు ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభమవుతున్నందున అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 
పాఠశాల విద్యపై సీఎం చంద్రబాబు సమీక్ష
పాఠశాల విద్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాశాఖ అధికారులతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 4000 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో స్కూళ్లకు టాయిలెట్లు, బయోఫెన్సింగ్, కాంపౌండ్‌  వాల్‌, తరగతి గదుల్లో సరిపడా బెంచీలు తదితర అవసరాలను వెంటనే తీర్చాలన్నారు. డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి బయోమెట్రిక్‌ విధానాన్ని నూరు శాతం అమలుచేయాలన్నారు. స్కూళ్లలో డిజిటల్‌ తరగతులు  నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. 
హేతుబద్దత లేని రాష్ట్ర విభజనపై విద్యార్థులకు వివరించాలి : సీఎం 
హేతుబద్దత లేని రాష్ట్ర విభజనపై విద్యార్థులకు వివరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడేళ్ల పాటు ప్రభుత్వం సాధించిన విజయాలపై అన్ని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. వారికి వ్యాసరచన, వక్తృత్వం పోటీలు  నిర్వహించాలన్నారు. విజేతలను ఎంపిక చేసి వారిని పోలవరం ప్రాజెక్టు, అమరావతి సందర్శనకు తీసుకెళ్లాలన్నారు. అలాగే ప్రతిభ కనబరిచినవారికి బహుతులు కూడా ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు రూపొందించే లెసన్‌ బ్యాంక్స్‌  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు  పంపి.. వారి మధ్య నాలెడ్జ్‌ షేరింగ్‌ జరగాలని చెప్పారు. సాంకేతిక అంశాలలో టీచర్లందరికీ అత్యాధునిక శిక్షణ ఇప్పించాలన్నారు చంద్రబాబు. 
ఫిజికల్‌ లిటరసీ పూర్తిస్థాయిలో అమలుకు ఆదేశం 
ఈ ఏడాది పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని.. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న టీచర్లను అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిజికల్‌ లిటరసీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.  నృత్యం, యోగాభ్యాసం, సంగీతంపై విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. మన సంప్రదాయ నృత్యమైన కూచిపూడిని ప్రోత్సహించాలని చెప్పారు. 

 

18:54 - June 9, 2017

అనంతపురం : రాయలసీమను.. రతనాల సీమగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనంతపురాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడారిగా మారకుండా.. ప్రయత్నిస్తానన్నారు. అనంతపురంలో జరిగిన ఎరువాక కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.  జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో అధికారులెవరైనా.. లంచాలు, కమీషన్లు తీసుకుంటే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు.  

 

19:02 - May 4, 2017

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేశ్‌ జపం చేస్తున్నారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు.. పాలన వదిలేసి లోకేశ్‌ ప్రమోషన్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టారని ఆరోపించారు.. లోకేశ్‌కు ఏం అనుభవం ఉందని అతి తక్కువ సమయంలోనే ముఖ్యమైన పదవులన్నీ ఇస్తున్నారని ప్రశ్నించారు..

07:07 - April 25, 2017

అమరావతి: భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని ప్రాంతంలోని పెనమాక గ్రామంలో భూసేకరణపై కోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలు తీసుకునే వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.

రాజధాని నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్న ఏపీప్రభుత్వానికి హై కోర్ట్‌లో బ్రేకులు పడ్డాయి. ఇప్పటి వరకు 20 రెవెన్యూ గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వానికి.. తాడేపల్లి మండలం పెనమాక గ్రామ రైతులు షాక్ ఇచ్చారు. తమ గ్రామానికి భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నోటిఫికేషన్ పై స్టే విధించింది.

ఏప్రిల్‌ 11న పెనమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్‌

ఈ నెల 11న పెనమాక గ్రామానికి ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 904 మంది రైతులకు చెందిన 660 ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 60 రోజుల్లోగా అభ్యంతరాలు చెప్పాలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులందరూ హై కోర్ట్ లో పిటిషిన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు..రైతులను అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని, అప్పటి వరకు రైతులు తమ భూములు సాగుచేసుకోవచ్చని స్పష్టం చసింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టేవి విధించి . రైతుల అభ్యంతరాలను తీసుకునే వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. హై కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పుకలగాలని కోరుతున్నారు.

3.50 కి.మీ యాక్సిస్‌రోడ్డు కోసమే నోటిఫికేషన్‌

నిజానికి 3.50 కి.మీ కీలకమై యాక్సిస్‌రోడ్డు ఈ పెనమాక గ్రామం నుండే వెళ్లాల్సి ఉంది. అందుకే ఈ గ్రామంలో భూసేకరణ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైతులు భూములు ఇవ్వకపోవడంతో, ఈ ప్రాంతాన్ని మినహాయించి, మిగతా గ్రామాల్లో రోడ్డు పనులు చేస్తున్నారు. తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, రెండు నెలల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చి, భూములు తీసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈనేపథ్యంలో కోర్ట్ స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ప్రయత్నానికి బ్రేక్‌పడినట్టైంది. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఇబ్బంది పెట్టినా ..తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని పెనమాక రైతులు తేల్చి చెబుతున్నారు.

పెనమాక బాటలో మరికొన్ని గ్రామాలు

మరోవైపు పెనమాక రైతుల బాటలోనే ఇతర గ్రామాలు కూడా నడవడానికి సిద్ధం అవుతున్నాయి. మంగళగిరి మండలంలోని నిడమర్రు,కురగల్లు, బేతపూడి గ్రామాల రైతులు తమ గ్రామాలకు ఇచ్చిన నోటిఫికేషన్ల పై కోర్ట్ కు వెళ్లాలిన భావిస్తున్నారు. ఒకవేళ పెనమాక గ్రామం మాదిరిగానే మరికొన్ని గ్రాములు కూడా హై కోర్ట్ కు వెళ్లి స్టే తెచ్చుకుంటే... చంద్రబాబు సర్కార్‌పై తాము చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్టే అంటున్నారు రాజధాని ప్రాంతరైతులు.

15:46 - April 22, 2017

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది మొదలు.. క్రమశిక్షణకు మారుపేరుగా పేరు తెచ్చుకుంది. పార్టీలో ఎంతటి నాయకుడైనా సరే.. తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలుండేవి. పార్టీ, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేది. అవసరమైతే క్రమశిక్షణ తప్పిన నేతలను పార్టీ నుంచి బహిష్కరించేందుకూ నాయకత్వం వెనుకాడేది కాదు. అప్పట్లో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న రేణుకాచౌదరిని, ఎన్టీఆర్‌ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్‌ చేశారు. ఓసారి మోహన్‌బాబు తప్పు చేశారని భావించి, ఆయనపైనా చర్య తీసుకున్నారు. క్రమశిక్షణ విషయంలో ఇంతటి కఠినంగా ఉండేది కాబట్టే, ఎన్నో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొందన్నది పార్టీ సీనియర్లు చెబుతుంటారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా .....

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీడీపీ నాయకులు తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించారే తప్ప.. అధినేతకు గానీ, పార్టీకి గానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అట్లాంటి పార్టీలో, ఇటీవల క్రమశిక్షణ గాడితప్పినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో పార్టీ నాయకుల తీరు, వర్గ రాజకీయాలు, టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. మంత్రులు మొదలు ఛోటామోటా నాయకులంతా తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవలి మంత్రివర్గ విస్తరణ అనంతరం కొందరు నాయకులు అనుసరించిన తీరు, అధినేత ఉదాసీనత.. టీడీపీలో క్రమశిక్షణ నేతిబీర చందమే అన్న భావనను కలిగించింది.

తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వ్యవహార శైలి..

తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వ్యవహార శైలి.. టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందంటూ ఏకంగా చంద్రబాబునే టార్గెట్‌ చేశారాయన. దళిత ఎంపీనైన తనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదన్నది ఆయన మరో అభియోగం. ఇక కడప జిల్లా ప్రొద్దటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎంపిక తీరులో, తెలుగుతమ్ముళ్ల శైలి పార్టీకి తలవంపులు తెచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. చైర్మన్‌ స్థానం కోసం, ఎంపీ సీఎం.రమేశ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వరదరాజుల రెడ్డి వర్గాల మధ్య పంతం.. పార్టీని బజారుకీడ్చిందని టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. ఇక కృష్ణా జిల్లా పెనమలూరులో సంస్థాగత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే బోడేప్రసాద్‌, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ల విభేదాలు.. పరస్పరం తన్నుకునే దాకా వెళ్లింది.

నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ టీడీపీలో సెగలు...

ఇక భూమానాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ టీడీపీలో సెగలు రేపుతున్నాయి. నంద్యాల టికెట్‌ కోసం భూమా, శిల్పా కుటుంబాల మధ్య పోరు సాగుతోంది. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక లేదా ఆయన సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి నంద్యాల రేసులో ఉన్నారు. మాజీమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కూడా భూమా కుటుంబానికే మద్దతు తెలిపారు. ఈ సీటు విషయంలో ఎవరికివారు పంతాలకు వెళుతుండడంతో, అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మనుగడలో ఉన్న జాతీయ పార్టీ తెలుగుదేశంలో.. కాంగ్రెస్‌ తరహా కుమ్ములాటల సంస్కృతి రావడంపై పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలను పార్టీ వేదికలపైనే...

పార్టీ అంతర్గత వ్యవహారాలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని, రోడ్డుకెక్కితే ఎలాంటివారినైనా సహించేది లేదని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే, తెలుగు తమ్ముళ్ల తీరు మాత్రం మారడం లేదు. క్రమశిక్షణ రేఖను దాటి వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇది విపక్షానికి బలంగా మారే అవకాశం లేకపోలేదని టీడీపీ కార్యకర్తలు కలవరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం, ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పెద్ద సంఖ్యలో వలస వచ్చిన ఇతర పార్టీల నాయకుల తీరు కూడా క్రమశిక్షణ లోపించడానికి కారణమన్న భావన వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా, తమ్ముళ్లను దారిలో పెట్టి క్రమశిక్షణను పునరుద్ధరించాలని, అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకైనా సిద్ధపడాలని వారు కోరుతున్నారు. మరి అధినేత అంతటి కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా..? తెలుగు తమ్ముళ్ల తీరులో మార్పు వచ్చే అవకాశం ఉందా..? కాలమే తేల్చాలి. 

14:49 - April 20, 2017

విశాఖ: రాష్ట్రంలో స్కూల్‌ విద్యార్థినులకు 1లక్షా 80వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. చదుకునే అమ్మాయిలు మధ్యలోనే బడిమానేయకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికోసం 75కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. బడికొస్తా కార్యక్రమంలో విశాఖజిల్లాలో 13వేల సైకిళ్లను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంటా పాల్గొన్నారు. 

14:45 - April 6, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులతో పాటు శాఖలు మారిన వారు ఈరోజు తమ బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు, గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు, మార్కెటింగ్‌, సహకార, పశుసంవర్థక, మత్స్య, గిడ్డంగుల శాఖ మంత్రిగా ఆదినారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటును అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు ఇంకా చాంబర్‌ కేటాయించనందున తాత్కాలికంగా ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించి అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు పాత చాంబర్‌లోనే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మూడు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికొస్తుందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - సీఎం చంద్రబాబునాయుడు