సీఎం చంద్రబాబు నాయుడు

11:37 - July 29, 2017

అమరావతి: అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన వ్యవహారాలపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు ఇక నుండి పార్టీని తిరిగి అధికారం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని ఇప్పటినుండే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీనికోసం సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుండి అక్టోబర్‌ 30 వరకు "ఇంటింటికి తెలుగు దేశం "కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు నెలల పాటు ప్రతి నేత ఇంటింటికి వెళ్లి టీడీపీ మూడేళ్ల ప్రభుత్వ హయంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతే వరకు ప్రజలకు చేరుతున్నాయి అనేది తెలుసుకోడానికి కార్యక్రమాలను సిద్ధం చేశారు.

సంక్షేమ పథకాలపై ప్రజల నుండి అభిప్రాయ సేకరణ

ప్రజల నుండి ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోటు పాట్లు ఏమయినా ఉంటే తెలుసుకుని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని బాబు భావిస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధి ఖచ్చితంగా పాల్గొనేలా చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించి ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని నాయకులకు చంద్రబాబు సూచిస్తున్నారు..

ప్రతి జిల్లాలో బహిరంగ సభల ఏర్పాటు

ఇక ఓ వైపు ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం అనంతరం ప్రతి జిల్లాలో బహిరంగ సభలను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నారు. ప్రతి రెండు నెలలకు ఓ జిల్లాలో భారీ బహిరంగ సభలను నిర్వహించి క్యాడర్‌లో ఉత్తేజం నింపేలా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా అక్టోబర్‌లోనే కార్యక్రమాలను చేసి అధికారంలోకి వచ్చామన్న సెంటిమెంట్‌ కూడా బాబు మనసుతో ఉంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల్లో గెలువాలని భావిస్తున్నారు. దీని కోసం ఓ ప్రత్యేక టీంను కూడా సిద్ధం చేస్తున్నారు.

జగన్‌ కూడా అక్టోబర్‌లోనే పాదయాత్ర

మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌ కూడా అక్టోబర్‌లోనే పాదయాత్ర చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకోనుంది. అధికార టీడీపీ కూడా ప్రజల్లోకి వెళ్తుండటంతో... ఏ పార్టీకి ప్రజల నుండి ఎంత మైలేజ్‌ వస్తుందనేది 2019లోనే తెలుస్తుంది.

21:20 - July 18, 2017

అమరావతి : ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బెల్టుషాపుల మూసివేతకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అక్రమంగా మద్యం విక్రయిస్తే అవసరమైతే పీడీ యాక్టుకింద కేసులు పెట్టాలని నిర్ణయించారు. అలాగే రోడ్లపై మద్యం తాగితే కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ ఇసుక రవాణాపై కేబినెట్‌లో సుధీర్ఘంగా చర్చించారు. ప్రతి జిల్లాలో నలుగురితో కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇందులో కలెక్టర్‌, ఎస్పీతో పాటు మరో ఇద్దరితో కమిటీ వేయాలని తీర్మానించారు. ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేసి కేసులు పెట్టాలని మంత్రివర్గం ఆదేశించింది. ఉద్దానం తరహా కిడ్నీ బాధితులకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీ స్టేట్‌ వాటర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు  కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

09:39 - July 10, 2017

అమరావతి: ఏపీ సచివాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఈనెల 17న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయంపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై ఒత్తిడి తెచ్చే అంశంతోపాటు రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు అంశంపై కూడా చర్చిస్తారు. 

09:39 - June 26, 2017

హైదరాబాద్‌ : నగరంలో చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాష్ర్టంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి, రావుల, సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ భేటీ లో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

06:36 - June 26, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా మారిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇక అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోనుంది. దేశ, విదేశీ విమానాలరాకపోకలతో కళకళలాడనుంది. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలు అశలు నెరవేరబోతున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్ర హోదా లభించింది. దీంతో ఈ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. దేశంలోనే ఆక్యుపెన్సీపరంగా దూసుకుపోవడంతో ఈ ఖ్యాతిని త్వరితగతిన అందుకోగలిగింది.

అగ్రదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు

అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించడంతో త్వరలోనే ఈ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అగ్రదేశాలైన అమెరికా, దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా వంటి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత దుబాయ్‌కి విమాన సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఎమిరైట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్ధతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సర్వీస్‌ ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు నేరుగా విమాన ప్రయాణం సులభతరంకానుంది.

విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు తప్పనున్న పడిగాపులు

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు వెళ్తున్న ప్రయాణీకులకు ఇక నుంచి పడిగాపులు తప్పనున్నాయి. ప్రస్తుతం విదేశీ విమాన సర్వీసుల కోసం బోయింగ్‌ 737-800, ఎయిర్‌బస్‌ 319,320,321 విమాన రాకపోకలు సాగించేందుకు ఎయిర్‌పోర్టు రన్‌వే అనువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే విమాన సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంగా పౌర విమానశాఖ పలు విమాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే విజయవాడలో జరిగిన సివిల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌లో సింగపూర్‌, దుబాయ్‌కు చెందిన విమాన సంస్థలతో డీల్‌ కుదుర్చుకున్నారు.

రూ. 162 కోట్లతో ట్రాన్సిట్‌ టెర్మినల్ నిర్మాణం

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇప్పటికే 162 కోట్ల రూపాయలతో ట్రాన్సిట్‌ టెర్మినల్‌ను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ విమాన రాకపోకలు సాగించేందుకు వీలుగా మరో 100 కోట్లతో పనులు చేపట్టారు. తొలి విడత విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2,286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను 3,360 మీటర్లకు పెంచుతున్నారు. మొత్తానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

15:39 - June 22, 2017

చిత్తూరు: వచ్చే రెండేళ్లలో ఏపీలోని ఐటీ రంగంలో లక్ష, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌లో సెల్‌కాన్ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సెల్‌కాన్ మొదటి మొబైల్‌ ఫోన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 2019 నాటికి రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌లో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి లోకేష్‌ చెప్పారు. ప్రతి నెలా ఒక పరిశ్రమకు శంకుస్థాపన, మరో పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. 

14:45 - June 22, 2017

విశాఖ : అన్యాయం చేస్తోన్న ప్రభుత్వాన్ని.. గట్టిగా నిలదీయడం కోసమే మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. విశాఖలో జరుగుతోన్న స్కాం.. మామూలు స్కాం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు.. అందరూ మాఫియాలా తయారై భూములను దోచుకుంటున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబునాయుడి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రెవెన్యూ రికార్డులు మొత్తం మాయం

విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు భూకుంభకోణాలని బహుమతిగా ఇచ్చారని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు మొత్తం మాయం చేశారని ధ్వజమెత్తారు. భూకుంభ కోణాలపై సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లుడుతున్నారని మండిపడ్డారు. సిట్‌ విచారణతో ఎలాంటి న్యాయం జరగదన్నారు. ల్యాండ్‌స్కామ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారని.. చంద్రబాబు కింద పనిచేసే అధికారులతో సిట్‌ వేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. 

21:17 - June 21, 2017

హైదరాబాద్: విశాఖ భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు, లోకేశ్‌ల హస్తం ఉందని... వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు.. టీడీపీ నేతలు దాదాపు లక్ష ఎకరాలు ఆక్రమించారని మండిపడ్డారు.. ఈ విమర్శలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో స్పందించారు.. వైసీపీ నేతలకు చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హతలేదని ఫైర్ అయ్యారు.. 

21:25 - June 17, 2017

అమరావతి: నంద్యా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు టిడిపి తరుపున భూమా బ్రహ్మానందరెడ్డి పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు ఆ పార్టీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కర్నూలు జిల్లా నేతలు భేటీ అయ్యారు.

21:17 - June 15, 2017

అమరావతి: తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను మరింత పటిష్టం చేయడంపై చంద్రబాబు దృష్టిసారించారు. పదేపదే హెచ్చరిస్తున్నా తెలుగు తమ్ముళ్లు కట్టుదాటుతుండడంతో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని డిసైడ్‌ అయ్యారు. లక్ష్మణ రేఖ దాటితే ఇక నుంచి క్షమించే ప్రసక్తే ఉండబోదని పార్టీ సమన్వయ కమిటీలో చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈదిశగా మియాపూర్‌ భూకుంబకోణంలో ప్రధాన నిందితుడు, పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణను పాటించని వారిని ముందు సస్పెండ్‌ చేస్తామని.. ఆ తర్వాతే విచారణ చేపడతానని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా బహిరంగ విమర్శలకు దిగినే తక్షణ చర్యలు ఉంటాయని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు.

చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణపైనే ప్రధానంగా చర్చ జరిగింది.  బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన మంత్రులు గంటా, అయ్యన్న వ్యవహారంపై చంద్రబాబు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.  మంత్రుల స్థాయి వ్యక్తులు బహిరంగ విమర్శలు చేసుకోవడమేంటని ఇద్దరినీ ప్రశ్నించారు.   ఇద్దరికీ ఎన్నిసార్లు సర్దిచెప్పినా బహిరంగ విమర్శలు చేసుకోవడంపట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్టీ నాయకులు చేసుకునే విమర్శల కారణంగా ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్టవుతోందని సీరియస్‌ అయ్యారు. గంటా, అయ్యన్న వ్యవహారంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీకి సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షుడుగా నియమించారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలన్న చంద్రబాబు
పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఇక నుంచి సహించబోనని హెచ్చరించారు. ఇక నుంచి క్రమశిక్షణ ఉల్లంఘించే వారికి సర్దిచెప్పడాలు, హెచ్చరించడాలు ఉండబోవన్నారు.  లక్ష్మణరేఖ దాటే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని... ఆ తర్వాతే విచారణ చేస్తానని నేతలను చంద్రబాబు హెచ్చరించారు.  బహిరంగ విమర్శలకు దిగుతూ పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టతను దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ క్రమశిక్షణపై త్వరలోనే క్యాడర్‌కు శిక్షణా తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వేటు
ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపైనా చంద్రబాబు వేటు వేశారు.  ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  నిజానిజాలు తేలేవరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌  చేస్తున్నట్టు ప్రకటించారు.  జిల్లాల  పార్టీ ఇంచార్జ్‌ల పనితీరుపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. జిల్లాల పార్టీ అధ్యక్షుల పేర్లను ఈ సమావేశంలో చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు సర్ది చెప్పే ధోరణికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇకపై నేతల పట్ల కఠినంగానే ఉండాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టున్నారు.  మరి అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతోనైనా తెలుగు తమ్ముళ్ల మైండ్‌సెట్‌ మారుతుందో.. లేదో చూడాలి. 

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - సీఎం చంద్రబాబు నాయుడు