సీపీఎం

18:28 - April 24, 2017

విజయవాడ : ఏపీలో రైతుల పండించిన పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. పంటల గిట్టుబాటు ధరలు, కరవు సహాయక చర్యలు, ప్రభుత్వ విధానాలపై విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మిర్చి, పసుపు పంటల్ని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఎం, వైసీపీ కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.

15:32 - April 24, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం దేవునిగుట్టలో గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని సీపీఎం ఖండించింది. పదిహేడేళ్లుగా అడవిలో ఉంటూ, భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమికొట్టడాన్ని తప్పుపట్టింది. 2006 అటవీ చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి, భూముల నుంచి తరిమికొడుతారా ? అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లను తగులబెట్టి, పసు సంపదను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

21:22 - April 23, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ దీక్షచేస్తున్న ఉద్యమకారులు నిరాహారదీక్ష విరమించారు.. నర్సాపురం ఆస్పత్రిలో ఉన్న ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చిన అఖిలపక్ష నేతలు దీక్ష విరమింపజేశారు.. రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం దీక్షచేస్తున్న ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు నర్సాపురం ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడకూడా దీక్ష చేసిన ఉద్యమకారులకు సీపీఎం రాష్ట్ర నేత ఉమామహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.. దీక్ష విరమించినా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు..

17:28 - April 23, 2017

హైదరాబాద్ : కార్మిక సంఘాల్ని విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సీపీఎంపొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలకు రాఘవులు హాజరయ్యారు. చిన్న చిన్న రాయితీలు ఇస్తూ కార్మికుల్ని భ్రమలకు గురిచేస్తున్నారని విమర్శించారు.. సీఎం స్థాయిలోనే కార్మిక సంఘాల్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని రాఘవులు విమర్శించారు.

15:25 - April 23, 2017

విజయవాడ : కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు కోసం సీపీఎం చేపట్టిన 72 గంటల దీక్ష ముగింపు సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. కృష్ణలంక నుండి సిటీలోకి వెళ్లడానికి రోడ్డుమార్గం లేనందున..వెంటనే కృష్ణలంక నుండి బందర్‌ రోడ్డు వెళ్లడానికి యుద్ధ ప్రాతిపదికన మూడు వంతెనలు నిర్మించాలని ఇందుకు 15 రోజుల సమయం పెడుతున్నట్లు మధు తెలిపారు. ఒకవేళ సబ్‌వేలను నిర్మించకపోతే అన్ని సంఘాలు, పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. కృష్ణలంక రోడ్డు సమస్య పరిష్కరించకుంటే కరకట్ట మెయిన్‌రోడ్డును బంద్‌ చేస్తామని హెచ్చరించారు.

14:25 - April 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం తుందుర్రులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరవదిక నిరహార దీక్ష రెండవ రోజు కొనసాగుతుండగా..పోలీస్ బలగాలు దీక్షను భగ్నం చేసి బలవంతంగా నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తామని సీపీఎం నాయకులు తెలిపారు. నిరవదిక దీక్ష చేస్తున్న వారిని పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో కొందరికి తీవ్రగాయాలయ్యాయని డాక్టర్‌ రత్నకుమారి తెలిపారు.

21:19 - April 22, 2017

శ్చిమగోదావరి :జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్వాసితుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం సహా పలువురిని అరెస్టు చేశారు. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వేరొకచోటికి తరలించాలని డిమాండ్‌ చేస్తూ... తుందుర్రువాసులు, వామపక్షాలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలందరూ పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

21:27 - April 19, 2017

ఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించింది. బిజెపి, సంఘ్‌ పరివార్‌ శక్తులు అనుసరిస్తున్న మతతత్వ విధానాలపై పోరాటాలకు పార్టీ పిలుపు ఇచ్చింది. ప్రజలతోపాటు రైతుల, మహిళా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు.

సంక్షోభంలో వ్యవసాయ రంగం ...

ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌ ఉద్యమాలకు రూపకల్పన చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలతో దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళుతోందని సీపీఎం కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దళితులు, మైనారిటీలపై జరుగుతున్నదాడులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.

ఆత్మహత్యల బాట పట్టిన అన్నదాతల సమస్యలపై ....

పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యల బాట పట్టిన అన్నదాతల సమస్యలపై సీపీఎం కేంద్ర కమిటీలో ప్రధానంగా చర్చించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి హమీ పథకానికి నిధులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీపీఎం కేంద్ర కమిటీ తప్పుపట్టింది. ప్రజా పంపణీ వ్యవస్థ నుంచి కిరోసిన్‌, పంచదారను ఉపసంహరించడాన్ని తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎన్నికల సంస్కరణపై కూడా సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై పరిమితి తొలగించడాన్ని సమావేశం తప్పుపట్టింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారానే డొనేషన్లు తీసుకోవాలన్నకేంద్ర సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే విధంగా ఉందని సీపీఎం కేంద్ర కమిటీ విమర్శించింది.

మహిళా బిల్లుపై ఎన్నికల హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ

మహిళా రిజర్వేషన్లపై కూడా ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ విమర్శించింది. రాజ్యసభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నా ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించింది. లోక్‌సభలోపాటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కూడా సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే దేశంలో ఏక పార్టీ పాలనకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కల్లోల కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ద్వారా ప్రయత్నించాలని సీపీఎం కేంద్ర కమిటీ సూచించింది.   

15:41 - April 18, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. దేశంలో విలయతాండవం చేస్తున్న కరవు, వ్యవసాయ ఉత్పత్తలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మంచినీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సమావేశంలో విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గోసంరక్షకులు చేస్తున్న దాడులపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్రపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడుతూ...ప్రజల మధ్య గడపటానికి ఎంచుకున్న మార్గం పాదయాత్ర అని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించనట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ...ట్రిపుల్ తలాక్ పై బీజేపీ అనవసరంగా కల్పించుకొంటోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాతంత్ర శక్తులకు కలుపుకుని బలమైన ఉద్యమం నిర్మించాలని సమావేశాల్లో నిర్ణయించారు.

12:12 - April 17, 2017

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్‌ బ్యూరో భేటీ అయ్యింది. అంతర్జాతీయ అంశాలతోపాటు దేశంలోని రాజకీయ పరిణామాలపై పొలిట్‌బ్యూరో చర్చిస్తోంది. ప్రధానంగా జీఎస్టీ బిల్లు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి ఎన్నిక, ఈవీఎంల టాంపరింగ్‌, పార్టీ స్థానిక మహాసభల నిర్వహణపై చర్చ జరుగుతోంది. వీటితోపాటు కశ్మీర్‌ పరిస్థితులు, గో సంరక్షణ దాడులు, రైతుల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై పొలిట్‌బ్యూరో చర్చిస్తోంది. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తమిళనాడు రైతులు చేస్తున్న నిరసనపై చర్చ జరగనుంది. ఈ పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయించిన అంశాలపై రేపు, ఎల్లుండి జరిగే కేంద్రకమిటీలో చర్చించనున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - సీపీఎం