సీపీఐ

06:58 - August 14, 2018

అమరావతి : ఏపీలో వామపక్ష, జనసేన పార్టీల కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై మూడు పార్టీల అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నారు. విజయవాడ వేదికగా ఈ పార్టీల నేతలు భేటీ అయ్యి చర్చించారు. టీడీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించారు.

ఏపీలో దూకుడు పెంచిన లెఫ్ట్‌, జనసేన కూటమి..
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, వామపక్షాల కూటమి దూకుడు పెంచింది. రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సమస్యలపై ఉద్యమించేందుకు మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా మూడు పార్టీలు ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నాయి.

యాత్రల పేరుతో జనానికి దగ్గరవుతున్న జనసేనాని..
ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ యాత్రల పేరుతో ప్రజలకు దగ్గరవుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వామపక్షాలు సైతం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఆయా రంగాల్లోని ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు ఐక్యంగా ముందుకు సాగేందుకు విజయవాడలో సమావేశం అయ్యారు. భవిష్యత్‌ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ప్రత్యేకహోదా, పోలవరం నిర్వాసితులు, నిరుద్యోగం, సీపీఎస్‌ రద్దుతోపాటు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలను మూడు పార్టీలు కలిసి చేపడుతాయని సమావేశానంతరం నేతలు స్పష్టం చేశారు. మొత్తానికి మూడు పార్టీల నేతల భేటీ నేపథ్యంలో త్వరలో ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార టీడీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని టార్గెట్‌ చేస్తూ , వారి వైఫల్యాలను ఎత్తిచూపేలా మూడూ పార్టీలో జనంలోకి వెళ్తనున్నాయి.

17:17 - August 6, 2018

ఢిల్లీ : రైతులు, వ్యవసాయ కార్మికులు జరుపుతున్న పోరాటానికి సీపీఐ మద్దతిస్తోందనా ఆ పార్టీ నేత సురవరం ప్రకటించారు. యూనివర్సిటీ గ్రాంట్ రద్దు చేయడం రాబోయే కాలంలో స్వయంప్రత్తికి నష్టం కలుగుతుందని అభిప్రాయ పడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 9న దళిత సంఘాలు చేపట్టే పోరాటానికి భారత్ బంద్ కు సీపీఐ మద్దతు తెలియచేస్తుందన్నారు. పాక్ టెర్రరిజాన్ని ఆపాలని సీపీఐ కోరుతోందని, చర్చల కోసం ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ప్రతిపాదనలను ఎన్డీయే సమ్మతించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 

06:48 - August 3, 2018

హైదరాబాద్ : సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కలిశారు. విభజన హామీలపై మరోసారి పోరు చేయటానికి సిద్ధమయ్యామని మధు తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో టీడీపీ బలం తగ్గుతుందని.. ప్రజల్లో టీడీపీపై అసంతృప్తి పెరుగుతుందని మధు అన్నారు. సీపీఎం, సీపీఐ, జనసేనలు కలిసి పోరాడుతుంటే టీడీపీ తట్టుకోలేకపోతుందని.. అందుకే పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబు విమర్శలకు దిగుతున్నారని రామకృష్ణ అన్నారు. 

17:37 - July 28, 2018

విజయవాడ : రైతులతో పాటు అన్ని రంగాల్లో మార్పు రావాల్సిన అవసరముందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మార్పు కోసం జనసేనతో కలిసి పని చేస్తామన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నామని.. ఇప్పుడు మరింత ఊపు వచ్చిందని.. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు రామకృష్ణ. 

22:00 - July 26, 2018

హైదరాబాద్ : హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించారు వామపక్ష నేతలు. గిరిజనులకు న్యాయం కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. హరిత హారం పేరుతో పోడు భూముల విధ్వంసాన్ని ఆపాలని... అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల సదస్సు
పోడు రైతులకు అండగా పోరాటాలు చేయాలని వామపక్ష నేతలు నిర్ణయించారు. పోడు భూముల విధ్వంసంపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఇతర వామపక్షాల నేతలు హాజరయ్యారు.

భూముల్లో వున్న ఖనిజ సంపదను దోచుకోవడానికే హరిత హారం
ప్రభుత్వం హరితహారం పేరుతో... భూముల్లో వున్న ఖనిజ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతుందన్నారు తమ్మినేని వీరభద్రం. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకుని.. గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. గిరిజనులకు న్యాయం జరగడం కోసం వామపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు తమ్మినేని.
అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తుంది : -సున్నం రాజయ్య
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటుందన్నారు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య. వామపక్షాల ఆధ్వర్యంలో 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వస్తే ప్రతిఘటిస్తామని సున్నం రాజయ్య హెచ్చరించారు.అధికారంలోకి వస్తే దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌.. అధికారం వచ్చాక గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని చాడా వెంకటరెడ్డి విమర్శించారు. వామపక్షాల పోరాటం ద్వారానే కౌలుదారీ, అటవీ హక్కుల చట్టం వచ్చిందన్నారు.ప్రభుత్వం హరిత హారంతో కాలుష్యాన్ని నివారించాలే గానీ.. గిరిజనుల సాగు భూములను స్వాధీనం చేసుకుంటే సహించేది లేదని వామపక్ష నేతలు హెచ్చరించారు. 

07:55 - July 22, 2018

హైదరాబాద్ : నైజాం వ్యతిరేక పోరాటంలో కార్మిక హక్కుల కోసం రాజ్ బహదూర్‌ గౌర్‌ చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కార్మిక ఉద్యమనేత రాజ్ బహదూర్ గౌర్‌ శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్ పాల్గొన్నారు. రాజ్‌బహదూర్‌ శతజయంతి ఉత్సవాలు కమ్యూనిస్టుల్లో ఉత్సాహం నింపుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాజకీయాల్లో రాజ్‌ బహదూర్‌ ఆదర్శవంతమైన వ్యక్తి అని వక్తలు కొనియాడారు.

17:47 - July 17, 2018

విజయవాడ : టీడీపీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. అయితే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్షాలన్నీ కలిసి ఐక్యంగా పోరాడతామంటున్న రామకృష్ణతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:38 - July 13, 2018

విశాఖపట్టణం : ప్రత్యామ్నాయ రాజకీయాలకు కలిసొచ్చే అన్ని పార్టీలతో ఒక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన రాజకీయ ప్రత్యామ్నాయ కార్మిక గర్జనలో మధు, రామకృష్ణలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మధు విమర్శించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 15లోగా కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని.. చేయకపోతే ఆందోళనకు దిగుతామని మధు హెచ్చరించారు. రేపు వామపక్షాలు ఆధ్వర్యంలో రాజమండ్రిలో దళిత సదస్సు.. 15న విజయవాడ సమస్యలపై సదస్సు ఉంటుందన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ, బీజేపీలు విస్మరించాయన్నారు. వామపక్షాలు మినహా ఇతర అన్ని పక్షాలు కార్పొరేట్ పక్షాలనే ఆయన ఆరోపించారు. 

17:11 - July 10, 2018

విజయవాడ : రైతాంగ సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటాలు తప్పవన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో వ్యవసాయదారుల సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది. ఈ సమావేశంలో పలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపించారు. అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని హామీలిచ్చి విస్మరించారన్నారు. రైతుల సమస్యలతో పాటు.. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్నారు రామకృష్ణ.

06:48 - July 8, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఆ నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తారా? ఇరు నేతల మధ్య వర్గ పోరుతో పార్టీ క్యాడర్ కారెక్కడానికి సిద్ధమవుతుందా? మాజీ ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరితే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటుకు ఎసరు రానుందా? ప్రస్తుతం హుస్నాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ చర్చ రసవత్తరంగా మారింది. ఇంతకీ హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే అంశంపై 10టీవీ పొలిటికల్‌ స్టోరీ. ఎన్నికలు సమీపిస్తుండటంతో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్న ఎమ్మెల్యే స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్‌తో పాటు సీపీఐ తహతహలాడుతోంది. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి, చాడ వెంకట్‌ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యే బొమ్మవెంకన్న కొడుకు, టీపీసీసీ సెక్రటరీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఇందుర్తి నియోజకవర్గం ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇందుర్తి నియోజకవర్గంతో పాటు విభజనతో ఏర్పాటైన హుస్నాబాద్‌ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. దీంతో 2014 ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వడంతో కాంగ్రెస్‌ అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించింది. అయితే తెలంగాణ సెంటిమెంట్‌ కారణంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వోడిదెల సతీష్‌ విజయం సాధించారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకట్‌ రెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి తహతహలాడుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికిన సీపీఐకి వచ్చే ఎన్నికల్లో మద్దతు పలకాలంటూ సీపీఐ కాంగ్రెస్‌ను కోరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ మద్దత్తుతో సీపీఐ నుంచి చాడ వెంకట్‌ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడుతుండగా..... కాంగ్రెస్‌ మాత్రం మద్దతుపై తన అభిప్రాయాన్ని ఇంత వరకు బహిర్గతం చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్‌ నియోజక వర్గంలో విజయం సాధిస్తుందని పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో పొత్తుల గందరగోళంతో పాటు టికెట్ల గందరగోళం కాంగ్రెస్‌ను కలవర పెడుతోంది.

ఇక సర్వేల ఫలితాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి కాస్త వ్యతిరేకంగా వస్తుండడంతో ఫలితాలను మార్చే పనిలో పడ్డారు ఎమ్మెల్యే సతీష్‌ బాబు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి కాంగ్రెస్‌ను దెబ్బతీసే పనిలో పడ్డారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి కేసీఆర్‌ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు గులాబీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఒక వేళ ప్రవీణ్‌ రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తే మాత్రం ఎమ్మెల్యే సతీష్‌ బాబు సీటుకు ఎసరు వచ్చే ప్రమాదముందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ఇంకా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తే మాత్రం పార్టీ క్యాడర్‌ పోయి గెలుపు గుర్రాలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని పలువురు పార్టీ నేతలు అంటున్నారు. పొత్తుల విషయం పక్కన పెడితే గెలిచే స్థానాల పైన కాంగ్రెస్‌ దృష్టిసారించక పోవడం మాత్రం టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అదృష్టంగా చెప్పుకోవాలని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - సీపీఐ