సుప్రీంకోర్టు

11:21 - February 16, 2018

ఢిల్లీ : దాదాపు పదేళ్లుగా సాగుతున్న కావేరీ నది జలాల వివాదంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెరదించింది. కావేరీ నది జలాలపై ఏ రాష్ట్రానికి సంపూర్ణ హక్కు లేదని పేర్కొంది. ఆయా రాష్ట్రాలకు నీటిని కేటాయించింది. తమిళనాడుకు 177 టీంఎసీల నీటిని ఇవ్వాలని కర్నాటక రాష్ట్రాన్ని సుప్రీం ఆదేశించింది. కర్నాటక రాష్ట్రానికి 184.75 టీంఎసీలు, బెంగళూరు తాగునీటి అవసరాలకు 4.5 టీఎంసీలు, కేరళ, పుదుచ్చేరిలకు యథాతథంగా కేటాయింపులుంటాయని తెలిపింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళనాడులో అసంతృప్తులు వ్యక్తమౌతున్నట్లు సమాచారం. కరవుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నీటిని అదనంగా కేటాయించాలని కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ మరింత తక్కువగా నీటిని కేటాయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు..ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కర్నాటక రాష్ట్రానికి ఇప్పుడిస్తున్న నీటికి అదనంగా కేటాయింపులు జరిపినట్లు, రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో తమకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

13:50 - January 23, 2018

ఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్‌ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పద్మావత్‌  ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వాలే చూడాలని సుప్రీం కోర్టు సూచించింది. మరో వైపు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌లలో డిస్ర్టిబ్యూటర్‌ సినిమా విడుదల సందర్భంగా భయాందోళనకు గురవుతున్నారు. పద్మావత్‌కు వ్యతిరేకంగా ఉజ్జయిని, జైపూర్‌, సవాయ్‌ మాదోపూర్‌లో కర్నిసేనల ఆందోళనలు చేస్తున్నారు.

08:25 - January 21, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఇటీవలే ప్రధాన మంత్రితో సీఎం బాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. అవసరమైతే విభజన హామీల గురించి సుప్రీంకోర్టుకు కూడా వెళుతామని కలెక్టర్ల సదస్సులో సీఎం బాబు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న క్లౌడ్‌హబ్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చలో పంచుమర్తి అనురాధ (టిడిపి), డా.గంగాధర్ (బిసి జనసభ అధ్యక్షులు) హన్మంతరావు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:18 - January 17, 2018

ఢిల్లీ : ఆధార్ కార్డు ద్వారా వ్యక్తిగత డేటాకు భద్రత ఉందా ? ఎలాంటి భద్రత ఉండదని..ఇది ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని పలువురు సుప్రీంని ఆశ్రయించారు. బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆధార్ కు రాజ్యాంగబద్ధత ఉందా ? అన్న అంశాన్ని సుప్రీం తేల్చనుంది. ఎలాంటి అభద్రత లేదని..గోప్యతకు ఎలాంటి భంగం ఉండదని కేంద్రం తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆధార్ కార్డు ద్వారా పలు ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంటున్నారు. రూ. 500 చెల్లిస్తే ఆధార్ గోప్యత బహిరంగ పరుస్తున్నారనే దానిపై వార్తలు వెలువడడంతో మరింత కలకలం రేగింది. 130కోట్ల ప్రజానీకంలో 90 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని అంచనా. ఇటీవలే ఆధార్ లింక్ గడువును మార్చి 31 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

10:25 - January 17, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, సీనియర్‌ జడ్జిల వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. నలుగురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి భేటి అయ్యారు. వీరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ వివాదానికి ఇక తెరపడనుందా? సుప్రీంకోర్టు పాలన వ్యవస్థ సరైన దిశలో నడవడం లేదని నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఉదయం పది గంటలకు జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకుర్, కురియన్ జోసెఫ్‌లతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సమావేశమయ్యారు. సీజేఐ చాంబర్‌లో ఈ సమావేశం 15 నిమిషాలు పాటు జరిగింది. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చీఫ్ జస్టిస్ చర్చించారు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు చీఫ్‌ జస్టిస్‌ వేసిన తొలి అడుగుగా భావిస్తున్నారు. నలుగురు జడ్జిలతో సిజె బుధవారం మరోసారి భేటి అయ్యే అవకాశం ఉంది. అనంతరం సుప్రీంకోర్టుకు చెందిన మిగతా జడ్జిలతో కూడా దీపక్‌ మిశ్రా టీ సమావేశం నిర్వహించారు. అంతకుముందు అసంతృప్త జడ్జిల వివాదం ఇంకా ముగియనట్లే కనిపిస్తోందని, మరో రెండు మూడు రోజుల్లో సద్దుమణిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వెల్లడించారు.

ఈ వివాదం వారాంతంలోపు ముగుస్తుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టులో పాలన సరిగా జరగడం లేదంటూ ఈనెల 12న నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు చేశారు. వివిధ కేసులపై బెంచ్‌ల ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించిన విషయం తెలిసిందే. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడం సంచలనం సృష్టించింది.

12:55 - January 16, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీల వివాదం ఇంకా సమసిపోలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలే స్పష్టంచేశారు. ఈ వివాదం కొలిక్కి రావడానికి ఇంకా కనీసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని అన్నారు. వివాద పరిష్కారంపైనే దృష్టిసారించామని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా ఈ వివాదం వారాంతంలోపు ముగుస్తుందని చెప్పారు. కీలకమైన కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆ నలుగురు తిరుగుబాటు జడ్జీలకు సీజేఐ స్థానం కల్పించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐ మిశ్రాతోపాటు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. తిరుగుబాటు చేసిన చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లలో ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదు. ఈ ధర్మాసనం రేపటి నుంచి కీలకమైన కేసుల విచారణ మొదలుపెట్టనుంది. ఆధార్ చట్టం చెల్లుబాటు, గే సెక్స్ నేరమా కాదా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంలాంటి కీలక కేసులపై ఈ ధర్మాసనం విచారణ జరపనుంది.

14:32 - January 15, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిల వివాదం సమసిపోయినట్లేనని బార్‌ కౌన్స్‌ల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈ కథ ఇంతటితో సమాప్తమైందని బార్‌ కౌన్స్‌ల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మనన్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు. సిజెఐకి, జడ్జిలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బిసిఐ కమిటి 15 మంది సుప్రీంకోర్టు జడ్జిలతో సమావేశమై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎప్పటిలాగే తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని మిశ్రా వెల్లడించారు.

 

16:09 - January 14, 2018

కృష్ణా : జిల్లాలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఈ కోళ్ల పందాలపై సుప్రీంకోర్టు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకోవాలని..ఇతర జూదాలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ పోలీసుల నిబంధనలు పట్టించుకోని పలువురు యదేచ్చగా బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. చిల్లకల్లు మాత్రం కొంత వెరైటీ పందాలు నిర్వహించారు. కత్తులు కట్టకుండా కోళ్లను బరుల్లోకి దింపారు. ఈ పందాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:16 - January 13, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదం సమసిపోనుందని అటార్ని జనరల్‌ కెకె వేణుగోపాల్‌ తెలిపారు. సుప్రీంకోర్టు హితాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ... సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు అనుభవజ్ఞులు, రాజనీతీజ్ఞులని అటార్ని జనరల్‌ పేర్కొన్నారు. మరోవైపు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా...తిరుగుబాటు చేసిన నలుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌లతో ఆదివారం సాయంత్రం సమావేశమవుతారని సమాచారం. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన దిశలో లేదని...ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని... నలుగురు జడ్జిలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

21:14 - January 13, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదానికి తెర దింపేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మధ్యవర్తిత్వం వహించనుంది. జడ్జిల మధ్య విభేదాలకు ముగింపు పలికే దిశగా ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమావేశమై చర్చలు జరుపనుంది. దీనిపై మాట్లాడేందుకు 50 శాతం మంది న్యాయమూర్తులు తమ సమ్మతి తెలియజేశారని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మనన్‌ మిశ్రా తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇది కుటుంబంలోని తగాదా లాంటిదని దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని మిశ్రా చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - సుప్రీంకోర్టు