సెలవులు

16:09 - November 1, 2017

చెన్నై : భారీ వర్షాలు తమిళనాడు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నై నగర శివార్లైన కాంచిపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వరద ముంచెత్తింది. దీంతో జనం భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నాయి. వర్షం కారణంగా నగరంలోని పలు రహదారులు, కాలనీలు చెరువుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు.. ఆలయాల్లోకీ వరద నీరు వచ్చి చేరింది. రవాణా వ్యవస్థ తీవ్రస్థాయిలో దెబ్బతింది. ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలతో కుంభవృష్టి కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో జనం వణికిపోతున్నారు. మరోవైపు శ్రీలంక-గల్ఫ్ ఆఫ్‌ మన్నారు నడుమ కేంద్రీకృతమైన అల్పపీడనం తూర్పు బంగాళాఖాతం దిశగా కదులుతుండటం రుతుపవనాలు వేగంగా మారి భారీ వర్షాలకు దారీతీస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తీరప్రాంతాల్లోని చెన్నై, కాంచిపురం, తిరువళ్లూరు, కడలూరు, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కడలూరులో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

11:11 - August 30, 2017

ముంబై : దేశవాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెతున్నాయి. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తెంచెందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలకు మహాప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరో రెండు రోజులపాటు ముంబైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబైలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:27 - July 15, 2017

హైదరాబాద్ : అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు వాయిదా వేసుకున్నట్లు అకున్ తెలిపారు. అకున్ సబర్వాల్ వినతిని ప్రభుత్వం అంగీకరించింది. నేటి నుంచి పది రోజుల సెలవులపై వెళ్తున్నట్లు నిన్న  అకున్ సబర్వాల్ ప్రకటించారు. దీంతో ఉన్నతస్థాయిలో అకున్ పై ఒత్తిళ్ల కారణంగానే ఆయన సెలవులపై వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. డ్రగ్స్ కేసు కీలక దశలో ఉన్నక్రమంలో అకున్ సెలవులపై వెళ్తాననడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఈరోజు ఉన్నట్టుండి సెలవులను రద్దు చేసుకుంటున్నట్లు అకున్ ప్రకటించారు. ఈనేపథ్యంలో డ్రగ్స్ రాకెట్ లో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది సినీరంగ ప్రముఖులకు నోటీసులు అందాయి. ఇవాళ మరికొంతమందికి ఈ కేసులో నోటీసులు జారీ చేయనున్నారు. అయితే రెండో జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అన్న ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కొడుకులు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటుతున్నాయి. పేర్లు బయటికి రాకుండా ఉండేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:22 - May 17, 2017

గుంటూరు : గత కొద్ది రోజులుగా మిర్చ రైతుల అందోళన దృష్టిలో ఉంచుకుని గుంటూరు మిర్చి యార్డుకు మార్కెట్ అధికారులు సెలువులు రద్దు చేశారు. సెలవులు రద్దు చేయడంతో కొనుగోళ్లు యథాతథం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ఈ రోజు ఉదయం నుంచి మిర్చి కొనుగోళ్లు మందకొండిగా సాగుతున్నాయి. అయితే ఎండ వేడికి హమాలీలు ముందుకు రావడంలేదు. యార్డు చైర్మన్ హమాలీలకు నచ్చజెప్తున్నారు. మిర్చి కొనుగోళ్లు ఉదయం 10 వరకు, తర్వాత సాయంత్ర కొనుగోళ్లు చేయాలని హమాలీలు కోరుతున్నారు. 

17:44 - May 5, 2017

అమరావతి: మిర్చి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ సెలవులను 40 రోజుల నుంచి 20 రోజులకు తగ్గిస్తున్నామని .. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌, ఆదినారాయణ రెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధరల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతుల విషయంలో రాష్ట్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ...మంచి క్వాలిటీ ఉన్న మిర్చికి ఆరు వేల ధర కేటాయించిందని చెప్పారు. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

11:47 - April 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుండే సెలవులను ప్రకటించారు. ఎండలు తీవ్రతరం అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి విద్యాసంవత్సరం ఈ నెల 22తో ముగియనుంది. దీంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమౌతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 40-43 డిగ్రీలకు చేరుకుంటుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లకు వెళ్లే వారి పరిస్థితి అంతా ఇంతా కాదు. బుధవారం సీఎం కేసీఆర్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుండే స్కూళ్లకు సెలవులివ్వాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ నుంచి సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానుంది.

06:57 - April 15, 2017

ఉత్తర్ ప్రదేశ్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి రోజున ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మహనీయుల పేరిట ఉన్న సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై మహనీయుల జయంతి రోజుల్లో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ఉండబోవని సిఎం స్పష్టం చేశారు. అందుకు బదులుగా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను ఆ రోజు విద్యార్థులకు బోధించాలని సూచించారు. చాలా మంది దీన్ని తప్పుగా భావించే అవకాశం ఉందని...మహా పురుషుల కార్యక్రమాలు జరపడం ద్వారా వారి గురించి తెలుసుకునే అవకాశముంటుందని యోగి అభిప్రాయపడ్డారు. యూపీలో 365 రోజుల్లో 192 రోజులు ప్రభుత్వ సెలవుల కిందే పోతున్నాయి. ఆయా కులాలు, మతాల ప్రజలను సంతోషపరచేందుకు మహనీయుల పేరిట సెలవులు ప్రకటించారు. దళితులు, వెనకబడిన తరగతుల అభ్యున్నతికి పాటు పడతామని యోగి చెప్పారు.

07:41 - December 11, 2016

హైదరాబాద్ : నెల రోజులు దాటినా.. ప్రజలకు నగదు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే చేతిలో డబ్బుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్యులకు మరిన్ని రోజులు మనీ కష్టాలు తప్పేట్టు లేదు. వరుసగా 3 రోజులకు బ్యాంకులకు సెలవు కావడం, ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులతో .. అన్ని వర్గాల ప్రజలు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

ఏటీఎంలల్లో నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో క్యాష్ లేదు
ఎవరి నోట విన్నా..నోట్ల కష్టాలే. ఎక్కడ చూసినా డబ్బులు కావాలని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలే. ఇళ్లు గడవడానికి కూడా డబ్బులు లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు డబ్బులో రామచంద్రా అంటూ... నానా యాతన పడుతున్నారు. ఒక్కొక్కరికి వారంలో 24 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నా... స్థానికంగా మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ఏటీఎంలల్లో నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో డబ్బులేదనే సమాధానమే ఎదురవుతోంది.

అంతులేకుండాపోతున్న కష్టాలు
కొన్ని బ్యాంకుల వద్ద అడపా దడపా డబ్బులు చెల్లిస్తున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఉన్న డబ్బులను ఎక్కువ మందికి సర్దే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాదారులకు పదివేల వరకు నగదు ఇస్తుంటే.. కొన్ని బ్యాంకుల్లో రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో జనం కష్టాలకు అంతులేకుండా పోయింది.

నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు
డిసెంబర్‌ 5వ తేదీ నుంచి 15 వరకు హైదరాబాద్‌లో వేతనాలు, జీతాలు తీసుకునే అవకాశం ఉన్నా బ్యాంకులు, ఏటీఎంల్లో డబ్బులు లేక ఇళ్లు గడవని పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు వాపోతున్నారు. నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజులు పాటు బ్యాంకులు సెలవులు
ఇక మూడు రోజులు పాటు బ్యాంకులు సెలవులు రావడంతో జనాలు ఇబ్బందులు మరిన్ని పెరగనున్నాయి. ఇప్పటికే ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమివ్వడంతో వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నోట్ల రద్దుతో కుదైలైన మార్కెట్ రంగం
నోట్ల రద్దుతో మార్కెట్ రంగం కుదైలైంది. కనీవినీ ఎరుగని రీతిలో కోట్లలో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. నిత్యం బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరుతూనే ఉన్నారు. ఖాతాదారులకు సరిపడా నగదు సరఫరా లేక గ్రామీణ స్థాయి బ్యాంకుల సేవలు పూర్తిగా స్తంభించాయి. ఏటీఎం కేంద్రాలు కూడా పేలవమైన సేవలు అందిస్తుండడంతో ఖాతాదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. హైదరాబాద్‌ నగరంలో అడ్డా కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. అటు చేతిలో డబ్బుల్లేక.. ఇటు ఎవరూ పనులకు పిలవక కూలీలు తీవ్రంగా కుమిలిపోతున్నారు.

కుటుంబాలు గడవక మహిళల ఆవేదన
రోజుల తరబడి బ్యాంకుల్లో క్యూలు కడుతున్న చిల్లిగవ్వ అందడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చునే ఓపిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని మహిళలు చెబుతున్నారు.

మరింత ఆందోళనలో సామాన్యులు
నోట్ల కష్టాలు తీరే మార్గం కనిపించకపోవడంతో.. పేదలు, సామాన్యులు రోజురోజుకు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అవసరాలకు సరిపడా నగదును సరఫరా చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. 

11:54 - December 10, 2016

హైదరాబాద్ : గత 31 రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రజలు నగదు కష్టాలు పడుతూనే వున్నారు. కొంపాగోడూ వదిలేసిన బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే వున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కష్టాలు మరింతగా పెరగనున్నాయి..బ్యాంకులకు శనివారం నుండి సోమవారం వరకూ  మూడు రోజులు సెలవులు రానున్నాయి. అంతంత మాత్రగానే వున్న బ్యాంక్ సేవలు మూడు రోజుల పాటు లేకపోవటంతో జనాల పాట్లు చెప్పనలవికాకుండా వుండే అవకాశముంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే..ఎవరిని కదిపినా ఒక్కటే ఆవేదన. ఎక్కడ చూసినా పెల్లుబికుతున్న తీవ్ర ఆసహనం. కనీస అవసరాలకు కావాల్సిన డబ్బులు కూడా లేక ఎంతో మంది పేదలు పస్తులుండాల్సిన దుస్థితి. గంటల కొద్దీ క్యూలో నిలబడ్డా.. అవసరాలకు సరిపడా నగదు దొరకని పరిస్థితి. పెద్ద నోట్లు రద్దై నెల రోజులు పూర్తయినా... ప్రజల కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా... సరిపడా నిల్వలు లేక ఖాతాదారులు నగదు కోసం నానా తంటాలు పడుతూనే ఉన్నారు. నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. ఆర్బీఐ నుంచి అరకొర నగదు అందుతుండడంతో క్యాష్ కష్టాలు రోజు రోజుకు జఠిలమవుతున్నాయి. నెల జీతం కోసం ఎదురు చూసే వేతన జీవుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పండుటాకులు పింఛన్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నా నగదు అందే పరిస్థితులు లేకుండా పోయాయి.  

21:51 - November 26, 2016

హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ప్రజల పరిస్థితి. కరెన్సీ లేక 18 రోజులుగా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా బ్యాంకులకు వచ్చిన సెలవులు.. ఆ కష్టాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలు ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు ఉదయం నుంచే ఏటీఎంల వద్ద బారులు తీరారు. మరోవైపు ఏటీఎంల నుంచి రెండు వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండడంతో గండం ఎలా గడుస్తుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. 
18 రోజులు గడుస్తున్నా....
నోట్లు రద్దు చేసి 18 రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. మరోవైపు బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రావడంతో ప్రజల కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. నగదు తీసుకునేందుకు ఏటీఎంలు ఒక్కటే దిక్కయ్యాయి. దీంతో ప్రజలంతా ఏటీఎం వద్ద బారులు తీరారు. రద్దీ పెరగడంతో.... గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అందరికీ క్యాష్‌ అందని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల క్యూలైన్లలో నిలబడ్డవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక ఏటీఎంలలో 2 వేల నోటు మాత్రమే వస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెలవెలబోతున్న వ్యాపారాలు
మరోవైపు చిల్లర కష్టాలతో వ్యాపారాలన్నీ వెలవెలబోతున్నాయి. మార్కెట్‌కు వచ్చే వాళ్లంతా రెండు వేల నోట్లు తెస్తుండడంతో చిల్లర ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులంటున్నారు. ఏటీఎంలలో చిల్లర నోట్లు కూడా పెడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏటీఎంల దగ్గరకు భారీగా ప్రజలు వస్తుండడంతో ఏటీఎంలు కూడా మొరాయిస్తున్నాయని.. దీంతో ఇబ్బందులు తీవ్రమవుతున్నాయని ప్రజలంటున్నారు. ఇక ఈరోజు బ్యాంకులకు సెలవు అని తెలియక చాలా ప్రాంతాలలో ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. తీరా విషయం తెలుసుకుని నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
ప్రజలకు కాంగ్రెస్‌ అండ 
ఇక సిద్దిపేటలో ఏటీఎం కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడి అవస్థలు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్‌ అండగా నిలిచింది. క్యూలైన్లలో నిలబడ్డవారికి వాటర్‌ బాటిళ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు అందజేశారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బ్యాంకులకు సెలవు కారణంగా ప్రజలకు మరో రెండు రోజులు ఇబ్బందులు తప్పేటట్లు లేదు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - సెలవులు