సైనా-సింధు

07:06 - April 16, 2018

ఢిల్లీ : అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన 21వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. ఈ క్రీడల్లో మొత్తం 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది భారత్‌. చివరి రోజు గోల్డ్‌తో పాటు 3రజతాలు, 2 క్యాంసాలు లభించాయి. కామన్వెల్త్‌లో పతకాలు సాధించిన విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21 వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. చివరి రోజు భారత్‌కు తన ఖాతాలో మరో 6 పతకాలు జమచేసుకుంది. మొత్తం 66 మెడల్స్‌ సాధించిన భారత్‌ ఓవరాల్‌ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. పోటీల్లో 26స్వర్ణాలు, 20రజతాలు, 20 కాంస్య పతకాలను భారత్‌ గెలుచుకుంది. 198పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 136 పతకాలతో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో నిలిచాయి.

గేమ్స్‌ చివరి రోజు బ్యాడ్మింటన్ ఉమెన్స్‌ సింగిల్స్‌లో... స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ మధ్య ఫైనల్‌ పోరు హోరాహోరీగా ముగిసింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చివరకు సైనాదే పైచేయిగా నిలిచింది. రెండు వరుస గేమ్స్‌లో ఉత్సాహంగా ఆడిన సైనా 21-18, 23-21తేడాతో సింధుపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్ స్టార్ పీవీ సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కామన్వెల్త్‌ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. 2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లోనూ సైనా గోల్డ్‌ మెడల్ గెలుచుకుంది.

బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్‌ పోరులో మలేషియా ఆటగాడు లీ చాంగ్‌ వీతో తలపడిన శ్రీకాంత్‌ 21-19, 14-21, 14-21 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో శ్రీకాంత్‌ 21-17, 21-14 తేడాతో లీ చాంగ్‌ వీని ఓడించడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీకాంత్‌కు ఇదే తొలి పతకం. మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్స్‌లో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్పలు రజతంతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. న్యూజిలాండ్‌కు చెందిన జోయెల్లె కింగ్, అమంద లాండెర్స్-మర్ఫీ జంటతో తలపడి ఓడారు. పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లోనూ భారత్‌కు రజతమే దక్కింది. రంకిరెడ్డి సాత్విక్- షెట్టి చిరాగ్‌ జోడి ఇంగ్లండ్‌ జట్టుపై... 13-21 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. మహిళల మిక్‌డ్‌ డబుల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో మనికాబాత్రా-జ్ఞానశేఖరన్‌ జోడి కాంస్యం దక్కించుకుంది. అలాగే పురుషుల సింగిల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో ఆచంట శరత్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు మరింత మెరుగ్గా రాణించాలని ట్వీట్‌ చేశారు వీరేంద్ర సెహ్వాగ్‌. 

Don't Miss

Subscribe to RSS - సైనా-సింధు