సోషల్ మీడియా

06:48 - May 25, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులతో అమాయకులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో దొంగగా భావించి ముగ్గురిని చితకబాదారు గ్రామస్థులు. అటు గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. పిల్లలను అపహరించే ముఠాగా భావించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని అమాయకులపై దాడులకు దిగితే చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంతో ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. పోలీసులు భరోసా ఇచ్చినా ఇంకా రాత్రిళ్లు జాగారం చేస్తూ.. అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులకు దిగుతున్నారు. అయితే ఈ దాడులల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని తట్టి కోర్టు ఏరియాలో బాలరాజు అనే మూగ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. దొంగగా భావించి స్తంభానికి కట్టేసి చితకబాదారు. దీంతో బాలరాజు పరిస్థితి విషమంగా మారింది. ఎడపల్లి మండలం బాపు నగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కాలనీ వాసులు చితకబాదారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియపల్లిలో బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేసి చంపారు. ఘట్కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన బాలకృష్ణ జియపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా దొంగ అనే నెపంతో అతనిపై దాడి చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలాంటి ఘటనలు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న మహిళను... పిల్లలను అపహరించే ముఠాగా భావించి యువకులు దాడికి దిగారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేనట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించి.. దాడుల జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై పోలీస్‌శాఖ స్పందించింది. ఎలాంటి గ్యాంగ్‌లు రాష్ట్రంలోకి రాలేదని, అనవసరంగా అమాయకులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరించారు. అయితే అధికారులు, పోలీసులు ఎంత ప్రచారం కల్పించినా ప్రజల్లో మాత్రం భయం పోవట్లేదు. 

13:13 - May 24, 2018

నిజామాబాద్ : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రాణాలు తీస్తున్నాయి. అమాయకులను పట్టుకుని గ్రామస్తులు..స్థానికులు చితకబాదుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దాడులపై పోలీసు శాఖ స్పందించింది. అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని..చట్టం చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా వారు మారడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు చితకబాదారు. బోధన్ తట్టి కోర్టు ఏరియాలో బాలరాజునే మూగ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దొంగగా భావించిన స్థానికులు చితకబాదడంతో బాలరాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఎడపల్లి మండలం బాపునగర్ లో కూడ ఇద్దరిని గ్రామస్తులు చితకబాదారు. ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. 

08:52 - May 24, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలోని వదంతులు.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఊరి శివార్లలోకి వచ్చే వారిని ఎవరూ... ఏంటి అని కనీసం విచారించకుండానే కర్రలతో చితకబాదేస్తున్నారు. తెలంగాణలో... గడచిన 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని ఇలాగే కొట్టి చంపేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులే అని పోలీసులు ఎంతగా చెబుతున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వాసులు.. మంగళవారం రాత్రి ఇలాగే ఓ వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు. సమీపంలోని కొర్రెముళ్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ.. జియాపల్లిలోని బంధువు రామస్వామి ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో కొందరు యువకులు అతడిపై కర్రలతో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలకృష్ణ మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన కొర్రెముళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గ్రామంలో భారీ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

అటు నిజామాబాద్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భీమ్‌గల్‌ మండలం చెంగల్‌లో బావ, బావమరిదులిద్దరినీ.. స్థానికులు చావబాదారు. దాడిలో గాయపడ్డ మాల్యావత్‌ దేవ్యా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి బావ దేవాగత్‌ లాలూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామిడికాయల కోసం వచ్చిన బావాబామ్మర్దులిద్దరినీ కిడ్నాప్‌ ముఠా అని భావించి గ్రామస్థులు చితకబాదారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా... హిందీలో మాట్లాడినా.. పట్టుకుని చితక్కొడుతున్నారు. ఈడపల్లిలో పిల్లలను ఎత్తుకు పోయేవాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదారు. పోలీసు వచ్చిన.. బాధితుడిని చిలకలపూడి ఆసుపత్రికి తరలించారు. సోషల్‌మీడియా వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిని వ్యాపింప చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు.

బీహార్‌ ముఠా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని.. పిల్లలు, వృద్ధులను కిడ్నాప్‌ చేసి వారి గుండె, మెదళ్లను తీసుకుని తినేస్తున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఆత్మరక్షణ కోసమంటూ.. స్థానికులు సొంతంగానే.. విడతలవారీగా గ్రామంలో పహారా కాస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వారిని వదిలిపెట్టడం లేదు. చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కట్టేసి మరీ కొడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

మొన్నటివరకూ.. హిందీ మాట్లాడుతూ కనిపించిన అపరిచితులపై అనుమానం రాగానే గ్రామస్థులు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు.. తెలుగు మాట్లాడుతున్నా.. తమది పక్క గ్రామమేనని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రిపూట గ్రామశివార్లలో కనిపిస్తే చాలు.. ఎవరో ఏంటో అని ఆరా కూడా తీయకుండా కడతేర్చే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన పని ఉన్నా.. పక్క గ్రామానికి వెళ్లేందుకూ.. పల్లెప్రజలు భయపడిపోతున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా పుణ్యాన.. గ్రామస్థులు దాడులు చేస్తూ.. అమాయకులను హతమారుస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గ్రామస్థుల్లో భయం పోగొట్టేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు.. పోలీసు శాఖ.. పల్లెనిద్ర తరహా కార్యక్రమాన్ని రూపొందించుకుని.. అమలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

21:24 - April 24, 2018

ఢిల్లీ : సోషల్‌ మీడియాను కూడా హిందుత్వవాదం ప్రభావితం చేస్తోందా? అంటే ఔననే చెప్పాలి. కథువా ఘటనపై సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. స్వరభాస్కర్‌ హిందువులను అవమానిస్తున్నారంటూ కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు. దీనికి భయపడ్డ ఈ కామర్స్‌ కంపెనీ అమేజాన్‌-- బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న స్వరభాస్కర్‌ను తప్పించింది. ఇంతకీ సోషల్‌ మీడియాలో ఆమె చేసిన పోస్ట్‌ ఏంటి?

సోషల్‌ మీడియాలో పోస్టర్‌ ఫోటో షేర్‌ చేసిన బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యోదంతం భారత దేశాన్ని కుదిపేసింది. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ తారలు పోస్టర్‌ ఫోటో షేర్‌ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా కథువా ఘటనపై సోషల్‌నెట్‌వర్క్‌లో స్పందించారు. 'నేనో హిందుస్థానీని... దేవీ ఆలయంలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సిగ్గు పడుతున్నానంటూ' పోస్టర్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశారు.

స్వరభాస్కర్‌ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
స్వరభాస్కర్‌ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పోస్ట్‌లో దేవి స్థానం అని రాయడాన్ని సెంటిమెంట్‌గా భావించిన నెటిజన్లు తప్పుపట్టారు. అంతటితో ఊరుకోలేదు...ఆమె నటించిన 'వీరే దీ వెడ్డింగ్‌' సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు.

ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ 'అజ్‌నబీ షహర్‌ కి గుగ్‌లీ'కి స్వర ప్రచారం

స్వరభాస్కర్‌పై వ్యతిరేక ప్రచారం ఈ కామర్స్‌ సంస్థ అమేజాన్‌పై కూడా ప్రభావం పడింది. స్వరభాస్కర్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ 'అజ్‌నబీ షహర్‌ కి గుగ్‌లీ'కి ప్రచారం చేస్తున్నారు. తాజాగా స్వరభాస్కర్ ఓ మ్యూజిక్ సిస్టం కొనాలని ఉందంటూ చేసిన ట్వీట్‌కు అమెజాన్ రిప్లయ్ ఇస్తూ రీట్వీట్ చేసింది. దీనిపై కొందరు అమేజాన్‌ను టార్గెట్‌ చేశారు. హిందువులను అవమానిస్తూ మాట్లాడిన స్వర భాస్కర్‌ను ప్రమోట్ చేసినంతకాలం అమెజాన్‌ను వాడమంటూ హెచ్చరించారు. ఏళ్ల తరబడి యాప్ వాడుతున్నవారు కూడా బై చెప్పేస్తూ డిలిట్ మెసేజిలు పంపుతున్నారు. దీంతో అమెజాన్ వెంటనే స్వరభాస్కర్ రిప్లయ్‌ ట్వీట్‌ను డిలిట్ చేసేసింది. నెటిజన్లు మాత్రం బాయ్ కాట్ అమెజాన్ పేరిట క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీంతో అమేజాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్వరభాస్కర్‌ను తప్పించింది.

స్వరభాస్కర్‌కు వ్యతిరేక ప్రచారమంటు విమర్శలు..
కొందరు మాత్రం స్వరభాస్కర్ చేసినదానిలో తప్పేం లేదన్నారు. స్వర భాస్కర్‌కు అమేజాన్‌ మద్దతుగా నిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కొంతమంది కస్టమర్లు దూరమైనంత మాత్రాన కంపెనీకి నష్టం జరగదన్నారు. ఓ పథకం ప్రకారమే హిందుత్వవాదులు స్వరభాస్కర్‌కు వ్యతిరేక ప్రచారం మొదలెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

13:30 - March 31, 2018

హైదరాబాద్ : అంగట్లో బొమ్మల్లా అమ్మేస్తున్నారు మైనర్‌ బాలికలను.. అభంశుభం తెలియని వారంతా వ్యభిచార కూపంలో నరకయాతన అనుభవిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ.. వింటుంటే కడుపు తరుక్కుపోతుంది... అప్రయత్నంగానే కన్నీరు పెల్లుబుకుతుంది.. రెండు తెలుగురాష్ర్టాల్లోనూ వేలాదిగా సాగుతున్న మైనర్‌ బాలికల అక్రమరవాణాపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం..

తెలుగు రాష్ర్టాల్లో మైనర్‌ బాలికలను అంగడి బొమ్మల్లా అమ్మేస్తున్నారు. పనిచూపిస్తామంటూ తీసుకెళ్ళి వ్యభిచార ఊబి దించేవారు కొందరైతే.. బంధువులే లైంగికంగా వేధించడంతోపాటు అమ్మేస్తున్న ఘటనలూ అనేకం చోటు చేసుకుంటున్నాయి. మరికొందరు ప్రేమపేరుతో వంచించి.. పెళ్ళిచేసుకున్నాక అంగట్లో బొమ్మాల్లా వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ఇలా ఒక్కో బాధిత మైనర్‌ బాలిక గాథ ప్రతిఒక్కరి గుండెలను పిండివేస్తుంది. ఒకవేళ పోలీసులు, ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల చొరవతో నరక కూపంనుంచి బయటపడ్డా... కోర్టు మెట్లెక తప్పదు... మైనార్టీ తీరేదాకా వారంతా ప్రభుత్వ హోమ్‌ల సంరక్షణలో ఉండాల్సిందే.. ఇలా కన్నవారికి దూరమైన బాలికలు తాము నరక యాతన అనుభవిస్తున్నమని కన్నీటి పర్యంతమౌతున్నారు.

వ్యభిచార గృహాలనుంచి కొందరు మైనర్‌ బాలికలను ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు రక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌బంజారాలో బాలికల అక్రమ రవాణా చేపట్టాల్సిన చర్యలు- మీడియా చేయూత లాంటి అంశాలపై సెమినార్‌ నిర్వహించారు. బాధితులను ఎక్కువగా ఫోకస్‌ కాకుండా.. అక్రమ రవాణాకు పాల్పడే బ్రోకర్ల అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.

ఇలాంటి కేసులను సంవత్సరాల పర్యంతం సాగదీయకుండా... ఏడాదిలోపు పూర్తయ్యేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ ప్రతినిధులు సూచించారు. బాధితులు మైనార్టీ తీరి.. వివాహం చేసుకున్నాక కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. కట్టుకున్నవారితో ఇబ్బందులు తలెత్తితాయన్నారు. దీంతో వారు మరింత మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందన్నారు. ఒక సమస్యనుంచి బయటపడ్డవారికి.. మరో సమస్య తలెత్తకుండా.. త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు చైల్డ్‌వెల్ఫేర్‌ సంస్థ ప్రతినిధులు.. అలాగే సమాజంలో వారి వివరాలను ఎంత గోప్యంగా ఉంచాలన్నారు. 

17:40 - March 9, 2018

హైదరాబాద్ : తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, సీఎం కేసీఆర్ బాటే తన బాటని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. నా పుట్టుక టీఆర్ఎస్ లోనే..చావు కూడా టీఆర్ఎస్ లోనేనని హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని తాను పలుసార్లు చెప్పానని..దీనిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వార్తలు రాయొద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు హరీశ్ రావు తెలిపారు.

09:48 - September 2, 2017

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం డిజిటల్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. డిజిటల్‌ రెజిమెంట్‌ బృందానికి శతఘ్నిగా ఆయన నామకరణం చేశారు. వారితో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శతఘ్ని కార్యకర్తలకు సూచించారు.

బైట్: పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

సమాజం, పార్టీకోసం 25 ఏళ్లు కష్టపడేందుకు సిద్ధమన్న పవన్‌

ప్రజారాజ్యం పార్టీ విఫలమైనందున ప్రతీదీ నిరూపించుకోవాల్సిన అవసరం తనముందు ఉందన్నారు. 25 ఏళ్లు సమాజం కోసం, పార్టీ కోసం కష్టపడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. 2018 చివర్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. అప్పుడే తన బలమేంటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల్లో కేవలం సీట్లు గెలవడమే తన లక్ష్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు పవన్‌.

ఎన్నికల పొత్తులపై విధానం రూపొందించలేదన్న పవన్‌

పార్టీలతో పొత్తులపైనా పవన్‌ స్పందించారు. ఎన్నికల పొత్తులపై ఇంకా ఏ విధానం తీసుకోలేదన్నారు. అవన్నీ కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణంపైనే దృష్టిసారించానని... ఆ తర్వాతే పొత్తులపై ఆలోచిస్తానన్నారు.

ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగిస్తానన్న పవన్‌

ప్రత్యేక హోదాపై తన పోరాటం ఆగలేదని పవన్‌ స్పష్టం చేశారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంలో ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. ఏపీకి మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే అక్టోబర్‌ నుంచి దీనిపై పోరాటం చేయనున్నట్టు పవన్‌ తేల్చి చెప్పారు.

ఎన్నికల్లో ఓట్లను డబ్బుతో కొనడం తనకు నచ్చదని...

ఎన్నికల్లో ఓట్లను డబ్బుతో కొనడం తనకు నచ్చదని... ఓటు అమ్ముకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని పవన్‌ అన్నారు పవన్‌.రాయలసీమ కరువుకు నేతలే కారణమని ఆరోపించారు. అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని జనసేనాని స్పష్టత ఇచ్చారు.

12:42 - August 28, 2017

కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూ, నిర్మాతగా మారి, కొద్దిరోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో అందరినీ అలరించిన ధన్‌రాజ్ మరో సారి తండ్రి అయ్యాడు. శనివారం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ అనంతరం ఆయన తనఇంటికి చేరుకోగానే తనకి కుమారుడు పుట్టాడనే శుభవార్త విన్నాడు. కుమారుడిని చూసిన ధన్‌రాజ్ ఎంతో ఆనందపడ్డాడు. వెంటనే ఈ ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసినవారంతా ధన్‌రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

17:02 - August 19, 2017

సన్నీలియోన్ కేరళ పర్యటనపై రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావ‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసిన కూడా ఆమె కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేశారు అభిమానులు. సన్నీలియోన్ కేరళ పర్యటనపై రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందించారు. వారి ప్రేమను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని ఓ కామెంట్‌తో వీడియోను, కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సన్ని. అది చూసిన రామ్ గోపాల్ వర్మ పై విధంగా స్పందించారు. మ‌రి కేరళలో స‌న్నీ లియోన్ కి అంతటి ప్రజా స్పందన రావ‌డం చూసి మమ్ముట్టి, మోహన్ లాల్ జలస్ తో ఏడుస్తారని వర్మ అన్నాడు. కేరళలో వారి ప్రోగ్రాంమ్స్ కి ఎప్పుడు ఇంతగా జనం హాజరై ఉండరు. కేరళ ప్రజల నిజాయితీకి, వారి ఆదరణకి నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ వర్మ సెటైర్స్ వేశాడు.

15:45 - August 14, 2017

హైదరాబాద్: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తెలుగు అమ్మాయి. ఈ మధ్య సినిమాల కన్నా ప్రేమ వ్యవహారం తో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే రోజా, నగ్మా, కుష్బు వంటి నటీమణులు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. వారి వరుసలో కొత్తగా అంజలి చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. సంచలన నటిగా పేరొందిన అంజిలి కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థాయిని అందుకున్నారు. రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అంజలి ఈ మధ్య దేశ రాజధానిలో ఉన్న పార్లమెంట్ను విజిట్ చేసి వచ్చింది. ఎవరిని కలవడానికి వెళ్లింది ఎందుకు వెళ్లింది అనేది తెలియదు కానీ ఏదో పార్టీ అధినేతతో మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనితో మీడియా అంతా ఆమె రాజకీయ రంగప్రవేశంపై దృష్టిపెట్టారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో నాకు రాజకీయాలు అంటే చాలా ఆసక్తి అని నేను వాటిని క్రమం తప్పకుండా ఫాలో అవుతాను అని చెప్పింది. దానితో అంజలి ఏదో ప్రాంతీయ పోలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినవస్తున్నాయి. ఈ అంశంపై అంజలి స్పందిస్తుందే మో వేచి చూడాల్సిందే...

Pages

Don't Miss

Subscribe to RSS - సోషల్ మీడియా