హత్య

15:11 - April 23, 2018

వికారాబాద్ : సినీమాక్స్‌ థియేటర్‌లో పార్కింగ్‌ వ్యవహారంలో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మేనేజర్‌ రాఘవేందర్‌పై రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి చేయి చేసుకున్నాడు. దీంతో రాఘవేందర్‌ కిందపడి మృతి చెందాడు. ఘటనకు బాధ్యుడైన రాజేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:28 - April 21, 2018

గుంటూరు : జిల్లాలోని మాచర్ల మండలంలోని శివప్రియనగర్‌లో దారుణం జరిగింది. మానసిక వికాలాంగులైన తన ఇద్దరు చిన్నారులను కన్నతండ్రే కడతేడ్చాడు. పిల్లలను చంపిన అనంతరం తండ్రి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

15:44 - April 17, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై మానవి వేదిక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. కథువా ఘటన చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

07:41 - April 17, 2018

మేడ్చల్ : మహిళలపై దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారం, హత్యలను నిరసిస్తూ మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో సామాజిక,ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. అక్కడ జరిగిన క్యాండిల్‌ ర్యాలీలో విమలక్క పాల్గొన్నారు. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి రావాలన్నారు. ఆసిఫా హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

18:44 - April 10, 2018

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో భార్య.. భర్తను చంపించింది. సలేహ బేగం, ఖాజా భార్యా భర్తలు. అయితే సలేహా బేగానికి తబ్రేజ్‌ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన సలేహా బేగం.. సుపారీ కిల్లర్స్‌కు 2 లక్షల రూపాయలు ఇచ్చి భర్తను చంపించింది. హత్య తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి భార్య సలేహా బేగంతో సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. 

 

07:34 - April 3, 2018

ఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదుల కిరాతకానికి బలైపోయిన 38 మంది భారతీయుల మృత దేహాలు భారత్‌కు చేరుకున్నాయి. పార్థివ అవశేషాలను తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి వికె సింగ్‌ ప్రత్యేక ఆర్మీ విమానంలో ఇరాక్‌ వెళ్లారు. 38 మంది మృత దేహాలను బాగ్దాద్‌ నుంచి అమృత్‌సర్‌కు తరలించారు. మృతుల్లో 27 మంది పంజాబ్‌కు చెందిన వారే. మొత్తం 39 మంది మరణించగా...మరో మృత దేహానికి డిఎన్‌ఏ పరీక్షలు పూర్తి కాలేదు. నాలుగేళ్ల క్రితం పొట్టకూటికోసం ఇరాక్‌కు వెళ్లిన 40 మంది భారతీయులు ఐసిస్‌కు బందీలుగా చిక్కారు. వీరిలో ఒకరు తప్పించుకోగా...39 మందిని ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు. పంజాబ్‌ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.

20:30 - March 31, 2018

అనంతపురం : ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కార్యకర్త శివారెడ్డిని హత్య చేసినవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... డీఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు హత్యలు చేస్తున్నారని వైసీపీ నేతలన్నారు. 

ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి వైసీపీ కార్యకర్త శివారెడ్డిని దుండగులు అత్యంత దారుణంగా నరికి చంపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శివారెడ్డి మృతదేహంతో ఎస్పీ కార్యాలయం వరకు వైసీపీ కార్యకర్తలు శవయాత్ర నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై భారీగా మోహరించారు. 

మోహరం పండుగ సందర్బంగా ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. శివారెడ్డి హత్యతో ప్రశాంతంగా ఉన్న కందుకూరులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే... ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌ అండదండలతోనే శివారెడ్డి హత్య జరిగిందని వైసీపీ నేతలంటున్నారు. సీఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో ఎదుగుతున్న వైసీపీ నేతలను టీడీపీ హత్య చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. గతంలో కూడా మంత్రి పరిటాల సునీత అండదండలతో వైసీపీ నేతలను హత్య చేశారని... నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్‌ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... డీఎస్పీ వెంకటేశ్వరరావు వైసీపీ నేతలతో చర్చించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు. అయితే... నిందితులను అరెస్ట్‌ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని... శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు వైసీపీ నేతలు. టీడీపీ రాజకీయ హత్యలపై భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏదిఏమైనా రాజకీయ హత్యతో..ప్రశాంత వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మరి ఈ పరిస్థితులన్నీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. 

10:30 - March 30, 2018

హైదరాబాద్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేననే మాటలు ప్రస్తుత కాలంలో నిజమని రుజువు చేస్తున్నాయి. పవిత్రమైన భార్యాభర్తల బంధం కూడా దీనికి అతీతంగా లేదనే ఘటన నగరంలోని కుకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఆస్తి తగాలతో తీవ్రంగా గొడపడిన ఓ భర్త భార్యనుఅతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశారు. హత్య చేసిన ఆనవాళ్లు దొరకకుండా వుండేందుకు సంఘటనాస్థలంలో కారంపొడి చల్లి పరారయ్యాడు. ఓ స్థలం విషయంలో తలెత్తిన తగాదా భార్య ప్రాణం తీసేంత వరకూ వెళ్లింది. గురువారం రాత్రి భార్య జయదేవి గొంతునులిమి భర్త శ్రీనివాస్ హత్య చేశారు. ఈ ఘటన రాఘవేంద్ర సొసైటీలో జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. గతకొంతకాలం నుండి ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో వున్న భర్త శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

10:54 - March 20, 2018

చిత్తూరు : తిరుపతిలోని కొంకావీధిలో విజయలక్ష్మీ అనే మహిళ దారుణ హత్యకు గురయ్యింది. మధ్యాహ్నం అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన ఆగంతకులు.. అడ్వాన్స్‌ తెస్తామంటూ వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం 8గంటలకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అద్దె అడ్వాన్స్‌ ఇచ్చే నెపంతో ఇంట్లోకి వచ్చారు. మహిళ ఒంటరిగా ఉన్నట్టు గమనించారు. ఇదే అదనుగా మహిళ నగలు దోచుకోడానికి యత్నంచారు. విజయక్ష్మీ తిరగబడటంతో .. ఆమెపై కత్తులతో దాడిచేసి.. ఒంటిమీద ఉన్న నగలును దోచుకెళ్లారని కుటుంబసభ్యులు అంటున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

14:06 - March 17, 2018

కడప : అగ్రవర్ణాల యువతిని ప్రేమించడమే నేరమైపోతోంది. దళిత యువకులు అగ్రవర్ణాలకు చెందిన యువతిని ప్రేమిస్తే అదో పాపమై పోతుంది. ఆ యుకుడిని ఏం చేసేందుకైనా సిద్ధమైపోతున్నారు. పరువు - ప్రతిష్ట పేర్లతో దారుణాలకు వడిగడుతున్నారు. దళిత యువకులను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. ఇదే తరహాలో కడప జిల్లాలో జరిగిన దళిత యువకుడి హత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమకు కులం, మతం, హోదాలు వెతుకూత జంటపక్షులను హతమారుస్తున్న విధానంపై 10టీవీ కథనం..

దళితుల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారి బతుకుల్లో వెలుగులు నిండడం లేదు. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలోనూ వారి బతుకులు ఎక్కవ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. వారికి ఏ చట్టం న్యాయం చేయదు. పోలీసులు అండగా నిలవరు. వారిపై జరుగుతున్న దారుణాలు, అకృత్యాలను ఏ చట్టమూ అడ్డుకోలేకపోతోంది. 
కడప జిల్లా ఖాజీపేట మండలం బుడ్డాయపల్లెలో దారుణం జరిగింది.  అగ్రవర్ణాల దాష్టీకం మరోసారి వెలుగుచూసింది. కుల రక్కసి బుసలు కొట్టింది. బుడ్డాయపల్లెకు చెందిన విజయ్‌కుమార్‌ అనే దళితయువకుడు...  గత సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఖాజీపేటలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న విజయ్‌.. అదే ప్రాంతంలోని అగ్రవర్ణాలకు చెందిన  ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి నుంచి కూడా అంగీకారం తెలపడంతో కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని ఆ అమ్మాయికి హామీనిచ్చాడు. 

విజయ్‌కుమార్‌ ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అమ్మాయి తండ్రి విజయ్‌కుమార్‌ను మందలించాడు. మరోసారి మా అమ్మాయి జోలికొస్తే చంపేస్తానని బెదిరించాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అయినా విజయ్‌- అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ ఆగిపోలేదు. రోజూ కలుసుకునేవారు. ఎప్పటిలాగానే ఓ రోజు విజయ్‌కుమార్‌ సాయంత్రం ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందు గ్రామంలోని పాఠశాల దగ్గరికి వెళ్లాడు. ఆ తర్వాత అతను మళ్లీ తిరిగి రాలేదు. కమలాపురం దగ్గర రైలు పట్టాలమీద శవమై తేలాడు.  అమ్మాయి తల్లిదండ్రులే ఈ దారుణానికి ఒడిగట్టారని విజయ్‌ బంధువులు, దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విజయ్‌ను చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

విజయ్‌కుమార్‌ది ముమ్మాటికి హత్యేనని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి.. మృతుడి కుటుంబానికి  న్యాయం చేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. లేకుండా ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. విజయ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని వారు కోరుతున్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్‌  చేసి.. కఠినంగా శిక్షించాలని  డిమాండ్‌ చేస్తున్నారు

Pages

Don't Miss

Subscribe to RSS - హత్య