హత్య కేసు

15:42 - June 5, 2018

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సిట్‌ బృందానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేసే అర్హతలేదని అనుమానితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కేసులో అనుమానితులను గతంలోనే నిర్దోషులుగా ప్రకటించిన సిట్‌ వారిపై నార్కో ఎనాలసిస్‌ టెస్ట్‌ చట్ట వ్యతిరేకమని వాదించారు. సిట్‌ వేసిన పిటిషన్‌ చట్టబద్ధం కాదన్న న్యాయవాది వెంకటేశ్వర శర్మ ఈ పిటిషన్‌పై కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తామన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

12:25 - June 3, 2018

చిత్తూరు : మదనపల్లెలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది హత్య కేసులో మిస్టరీ వీడింది. లాయర్‌ నాగజ్యోతి మర్డర్‌ కేసులో ఆమె భర్తే హంతకుడని తేలింది.   కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు తెలిపారు.  

చిత్తూరు జిల్లా మదనపల్లిలో  సంచలనం సృష్టించిన లాయర్‌ నాగజ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. గత నెల 30న బైక్ పై ఇంటికి వెళుతున్న నాగజ్యోతిని ఆగంతకులు అటకాయించి.. నడిరోడ్డుపైనే గొంతు కోసి చంపేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లభించక పోయినా.. మిస్టరీని ఛేదించారు పోలీసులు.

మృతురాలు నాగజ్యోతి భర్త జితేంద్ర కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు.. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి. రెండేళ్ల క్రితం నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గొడవలు తారస్థాయికి చేరడంతో...తన భార్యను చంపాలని నిర్ణయిం చుకున్నాడు  జితేంద్ర. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న తన క్లైంటుతో ఒప్పందం కుదుర్చుకుని హత్యకు  ప్లాన్‌ చేశారు. మొత్తానికి నిందితుడు జితేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కిరాయి హంతకుల కోసం గాలిస్తున్నారు.

17:29 - May 7, 2018

హైదరాబాద్ : వనస్థలిపురంలో టిఫిన్ సెంటర్ లో జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈనెల 3వ తేదీన ఈ హత్య జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. టిఫిన్ సెంటర్ లో కృష్ణ అనే వ్యక్తి గొంతు కోసిన ఘటనలో నిర్వాహకుడు గిరిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తి దయాకర్ ను కూడా అరెస్టు చేశారు. వైన్ షాప్ వ్యవహారంలో గిరి..కృష్ణల మధ్య వివాదం ఉన్నట్లు సమాచారం. 

08:14 - May 6, 2018

వాషింగ్టన్ : అమెరికాలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో ఫెడరల్‌ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు ఆడమ్‌ పూరింటన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. పురింటన్‌ జాత్యహంకారంతోనే శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పు ప్రకారం 52 ఏళ్ల పూరింటన్‌ జైలులోనే జీవితం గడపాల్సి ఉంటుంది. 50 ఏళ్ల జైలుశిక్ష తర్వాతే అతనికి పెరోల్‌ లభిస్తుంది. ఫిబ్రవరి 22, 2017లో శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్ కెన్సాస్‌లోని ఓ బార్‌లో ఉండగా పురింటన్‌ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా అలోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆడమ్‌ను అడ్డుకోబోయిన లాన్‌ గిలోట్‌ కూడా గాయపడ్డ విషయం తెలిసిందే.

 

19:58 - April 16, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆసిఫా కుటుంబానికి, ఆమె తరపు వాదిస్తున్న లాయర్‌కు రక్షణ కల్పించాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు తరలించాలని కోరుతూ ఆసిఫా తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు జమ్ముకశ్మీర్‌ ట్రయల్‌ కోర్టులో విచారణ జరిగింది. 8 మంది నిందితులు తమని తాము నిర్దోషులుగా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని కూడా వారు న్యాయమూర్తిని కోరారు. కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ కాపీలను నిందితులకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి మత్తు మందిచ్చి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

 

20:10 - February 4, 2018

నల్గొండ : కాంగ్రెస్‌ పార్టీ కోసం, కార్యకర్తలకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధమన్నారు కాంగ్రెస్‌నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్‌యే కిరాయి రౌడీలను పెట్టించి తనను బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. శ్రీనివాస్‌ హత్యతో కేసీఆర్‌ ప్రమేయం లేకపోతే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. లేదంటే ఈ హత్యకు కారణం కేసీఆర్‌ అని ప్రజలు నమ్ముతారన్నారు. నల్లగొండ నడిబొడ్డున శ్రీనివాస్‌ విగ్రహాన్ని చేయించి ప్రజల గుండెల్లో నిలిచే విధంగా విగ్రహావిష్కరణ చేయిస్తామన్నారు. 

 

19:44 - February 3, 2018

కొమ్రం భీం అసిఫాబాద్ : జిల్లాలో మొన్న జరిగిన దళిత మహిళ సావంత్‌ భాయ్‌ హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వతీరును నిరసిస్తూ... ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద టీమాస్‌ నేతలు నిరసన తెలిపారు. జనవరి 31న మర్తిడి గ్రామంలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పటించారని.. వారు అధికార పక్షంకి చెందిన వారవడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని టీమాస్‌ నేతలు ఆరోపించారు. వెంటనే నిందుతులను రిమాండ్‌కి పంపి అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని టీమాస్ నేతలు డిమాండ్‌ చేశారు.

 

17:12 - February 3, 2018

హైదరాబాద్ : గతనెల 29తేదీన జరిగిన బీటెక్‌ విద్యార్థిని అనూష హత్య కేసును ఛేదించిన పోలీసులు .. నిందితుడు మోతీలాల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో బండరాయితో మోది హత్య చేసినట్టు మోతీలాల్‌ ఒప్పుకున్నాడు. వేరేవారితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే మోతీలాల్‌ ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని.. ఈ కేసులో ఎంతటి వారున్న వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది.

 

21:49 - January 30, 2018

నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో ముమ్మాటికీ పోలీసులు, టీఆర్‌ఎస్ పెద్దల పాత్ర ఉందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హత్యపై జిల్లా ఎస్పీ చెప్పినది కట్టుకధగా తేలిపోయిందని ఆయన అన్నారు. హత్య జరిగిన సమయంలో కాల్ డేటా కావాలని అడిగితే, ఇస్తామని చెప్పి తమను పోలీసులు మోసం చేశారని కోమటిరెడ్డి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు కేసును నీరు గార్చారన్న కోమటిరెడ్డి ..సీబీఐకి దర్యాప్తు  అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. 

 

07:55 - January 29, 2018

నల్గొండ : జిల్లాలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో 11 మంది నిందితులు కాగా... 8 మందిని అరెస్ట్ చేశారు. మిర్చి బండి దగ్గర పంచాయితీనే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హత్యలో రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చారు. పోలీసుల తీరుపై  శ్రీనివాస్‌ భార్య లక్ష్మీ, కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బజ్జీలబండి నాటకమాడారని ఆరోపించారు. ఎస్పీ చెప్పిన విషయాలు వాస్తవ దూరంగా ఉన్నాయని దుయ్యబట్టారు.
హత్యలో రాజకీయ కుట్ర ఏం లేదన్న ఎస్పీ 
నల్గొండలో ఈ నెల24న జరిగిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసును పోలీసులు చేధించారు. హత్యలో రాజకీయ కుట్ర ఏం లేదని.. కేవలం చిన్న గోడవనే ఈ హత్యకి దారితీసిందని ఎస్పీ తెలిపారు. ఈ నెల 24న మాండ్ర మహేశ్‌ తమ్ముడు రాంబాబు క్యాన్సర్‌ వ్యాదితో చనిపోయాడు. దీంతో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మహేశ్‌ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లాడు. రాత్రి అంత్యక్రియలు ముగిసిపోయాక.. మహేశ్‌ స్నేహితులైన చింతకుంట్ల రాంబాబు, శరత్‌ మిర్చి బండి దగ్గరికి వెళ్లారు. అక్కడ సదరు మిర్చి బండి యజమానికి రాంబాబు స్నేహితులకు మధ్య ఘర్షణ జరిగింది. విషయం పోలీసులకు తెలువడంతో నిందుతులను చెదరగొట్టారని, పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ గుమిగూడారని, శ్రీనివాస్ మందలించడంతో ఆగ్రహంతో దాడికి పాల్పడి హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు. 
8మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
ఈ హత్యకేసులో నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  కేసుకు సంబంధించి 11మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో ఏ-1గా చింతకుంట్ల రాంబాబు సహా 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు నిందితులున్నారని పోలీసులు తెలిపారు. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయని, నిబంధనల కారణంగానే శ్రీనివాస్‌కు గన్‌మ్యాన్‌ కల్పించలేదని ఎస్పీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు.  హత్యలో రాజకీయ నేతల ప్రమేయం లేదని ఎస్పీ తేల్చిచెప్పారు.
ఎస్పీపై శ్రీను భార్య లక్ష్మీ ఆగ్రహం 
బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో రాజకీయకోణం లేదన్న ఎస్పీపై శ్రీను భార్య లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే తన భర్త హత్యకేసులో బజ్జీలబండి నాటకమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ చెప్పిన విషయాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. నిజానిజాలు తేలాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని.. లేకుంటే తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు 
పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు. ఫోన్‌ చేసి పిలిచిన వ్యక్తి అక్కడ లేకపోవడాన్ని పోలీసులు ఎందుకు అనుమానించడం లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సరికొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు. శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి బెదిరించారని ఆరోపించారు. వేముల వీరేశం గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయం జరగకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మొత్తానికి పోలీసులు కేసును ఛేదించిన విధానమంతా ఓ కట్టుకథని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి జగదీష్‌రెడ్డిని విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి కాంగ్రెస్‌ ఆరోపణలపై  ఇటు పోలీసులు, అటు గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - హత్య కేసు