హింస

16:59 - June 28, 2018

ఢిల్లీ : స్త్రీ సాధికారత కోసం ఎన్నో చేస్తామని పాలకులు, నేతలు ఎప్పటికప్పుడు గప్పాలు పలుకుతుంటారు. కానీ స్త్రీ సాధికారత కోసం స్త్రీలు పోరాటాలతోనే సాధించుకుంటున్నారు. కానీ రక్షణ విషయంలో మాత్రం భారత సమాజం మహిళలపై హింస కొనసాగుతునే వుంది. రోజు రోజుకీ చులకన భావం,హింస,అణచివేత, ఆంక్షలు పెరుగుతున్నాయి.

భారత మహిళల కన్నీటి వెతలకు అంతం లేదా?
భారతదేశంలో చాలామంది మహిళలను కదిలిస్తే వారి కన్నీటిగాధలు, వెతలు, వేదనలు ఎన్నో, ఎన్నెన్నో. కటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం అహోరాత్రులు కష్టపడే మహిళల స్థితిగతులు భారత్ లో వున్న పరిస్థితులు తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్న హింసా భారతాలు లెక్కలేనన్నిగా వుంటాయి. ఉబికి వస్తున్న కన్నీంటి సముద్రాలను కనురెప్ప దాటనీయకుండా లోలోపలే అణిచివేసుకుంటు ముందుకు సాగేందుకు మహిళలు పోరాడుతునే వున్నారు. తమ శక్తిని, యుక్తిని నిరూపించుకుంటు, హింసలను తట్టుకుంటు..అవమానాలను అనుభవాలుగా తీర్చిదిద్దుకుంటు సాధికారత కోసం కొట్లాడుతున్నారు. తమతో తామే ధైర్యాన్ని కూడగట్టుకుని ఎదరవుతున్న పరిస్థితులను తట్టుకుని జారిపోతున్న గుండె ధైర్యాన్ని ఆత్మస్థైర్యంగా చేసుకుని ఆత్మవిశ్వాసన ఆయుధంతో హింసా భారతంలో తమ శక్తి యుక్తులకు పదును పెట్టుకుంటు..నిరూపించుకుంటు ముందుకు విజయదరహాసంతో సాగిపోతున్న మహిళా శక్తికి ఈ భారతదేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు.
థామన్స్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వే..
భారతదేశంలో ప్రస్తుతం మహిళల రక్షణ అంశం తీవ్ర భయాందోళనను రేకిత్తిస్తుంది. థామన్స్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వేలో మహిళా రక్షణ విషయంలో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన దేశంగా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2007-2016 మధ్య కాలంలో దేశంలో మహిళలపై హింస 80 శాతం పెరిగింది. కానీ అనధికారిక లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఫిర్యాదు చేసేందుకు కూడా బైటకు రాని హింసలకు లెక్కేలేదు. ఇంచుమించు ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు హింసల బారిన పడుతునే వున్నారు. అది కుటుంబ హింస కావచ్చు. సామాజిక హింస కావచ్చు. అది మానసికంగా కావచ్చు. శారీరకంగా కావచ్చు. హింస అనేది మాత్రం మహిళ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

మహిళకు రక్షణ లేని దేశరాజధాని ఢిల్లీ
ఢిల్లీలోని ఓ యువతి ముఖానికి స్కార్ప్, మొబైల్ ఫోన్‌లో సేఫ్టీ యాప్స్, హ్యాండ్ బ్యాగులో పెప్పర్ స్ప్రే ఇవి లేనిదే ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టదు. ఇటువంటి ఎంతోమంది విద్యార్థినుల, యువతుల, మహిళల దుస్థితి నేడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో. దేశం మొత్తం మీద ఇంచుమించుగా ఇటువంటి స్థితిగతులే నెలకొన్నాయి. ఇది అత్యంత సిగ్గుపడాల్సిన పరిస్థితి.
గంటకు మహిళలపై 40 నేరాలు..
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మహిళలపై హింస వివిధ రూపాల్లో ప్రతి గంటకు 40 నేరాలు నమోదు అవుతున్నాయి. వీధుల్లో నడిచేటప్పుడు, బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణించేటప్పుడు ఎదుర్కొనే లైంగిక వేధింపులను తట్టుకుని ఆఫీసులకు చేరుకుంటే అక్కడా సహ ఉద్యోగులతోనూ, బాస్‌లతోనూ ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేసే జోహ్రీ అనే 28 సంవత్సరాల మహిళ తన ఎదుర్కొన్న భయంకర అనుభవాలను పంచుకుంది. వీటన్నింటితో విసిగి వేసారి తట్టుకోలేక చివరికి ఆమె ఉద్యోగం మానేసింది.

యుద్ధదేశాల్లో దిగజారిన స్థితిగతులు..
యుద్ధాలతో చితికిపోయిన దేశాల్లో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రపంచంలోనే మహిళలకు అపాయకరమైన దేశంగా రెండవస్థానంలో ఆప్ఘనిస్థాన్ నిలిచింది. ఏడేండ్లుగా అంతర్యుద్ధంలో నలుగుతున్న సిరియా కూడా ఈ జాబితాలో మూడోదేశంగా నిలిచింది. ఇక రెండు దశాబ్దాలుగా యుద్ధానికి ఛిన్నాభిన్నమైన సోమాలియా మహిళలకు సురక్షితంకాని దేశాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో ఇటీవలికాలంలో మంచి పురోగామిచర్యలు కనిపిస్తున్నాయి.

టాప్ 10లో కొన్ని దేశాలు..
యెమెన్, నైజీరియా, పాకిస్థాన్ దేశాలు కూడా టాప్-10 జాబితాలో ఉన్నాయి. మహిళలకు సురక్షితం కాని టాప్-10 దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది.మీటూ ఉద్యమం కారణంగా మహిళలు స్వచ్ఛందంగా తమపై జరిగిన లైంగిక వేధింపులను వెల్లడించడంతో అమెరికా ఈ జాబితాలో చేరినట్లు నిపుణులు చెబుతున్నారు.

బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది..
ఇంటినుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ఢిల్లీకి చెందిన కనిక జోహ్రా చెప్పారు. అత్యాచారాల రాజధానిగా మారిన ఢిల్లీలో.. ముఖానికి స్కార్ఫ్, బ్యాగులో పెప్పర్ స్ప్రే, మొబైల్‌లో సేఫ్టీ యాప్స్‌తో ఇంటినుంచి బయల్దేరుతుంది. సగటున ప్రతీ గంటకు మహిళలపై 40 నేరాలు రికార్డవుతున్న దేశంలో ఇవన్నీ తప్పనిసరి అంటున్నారు 28 ఏండ్ల జోహ్రి. మార్కెటింగ్ ఉద్యోగిగా పనిచేసే ఆమె సర్వే నిర్వహించిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్‌తో తన అనుభవాలను, ఆవేదనను పంచుకున్నారు. మీరు సిటీ బస్సులో వెళ్తుంటే ఎవరో వెనకనుంచి తోస్తారు. పక్కనుంచి మరొకరు పైపైకి వస్తారు. మీరేమైనా అంటే, అక్కడున్నవారంతా మిమ్మల్నే దోషిగా చూస్తారు. అకస్మాత్తుగా ఓ చేయి మీ భుజం మీదో, తొడమీదో పడుతుంది. ఏడేండ్లలో అలా కన్నీళ్లు కార్చిన రోజులెన్నో ఉన్నాయి అని ఆమె తెలిపారు.
హింసలేని మహిళా భారతం కోసం..
ప్రపంచ దేశాలలో భారత మహిళలు ఎగురవేస్తున్న విజయబావుటాలను చూసైనా ఈ భారతం మహిళలపై వున్న దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవుసరం వుంది. ఆరోజులు త్వరలో రావాలని కోరుకుందాం..భారతదేశం అంటే మహిళలపై హింస సాగిస్తున్న భారతం అనే మాటను తుడిపెట్టి మహిళా విజయభారతి అని చాటిచెప్పే నవయుగ భారతం రావాలని కోరుకుందాం!!

14:29 - June 16, 2018

విజయవాడ : దళిత యువకులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు దళిత యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. బందరు బీచ్ ఫెస్టివల్ కు వెళ్లిన ముగ్గురు దళిత యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంధువులకు ఏమాత్రం సమాచారం తెలియకుండా నాలుగు రోజులపాటు నిర్భంధించి అజ్నాతంలోనే వుంచి చిత్రహింసలకు పాల్పడ్డారు. దీంతో వారు అపస్మార పరిస్థితికి వెళ్లటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బైటకు చెబితే కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. యువకుల బంధువులు సర్చ్ వారెంట్ తేవటంతో ముగ్గురు యువకులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా అదుపులోకి తీసుకున్న యువుకుల్లో ఒక యువకుడు జార్ఖండ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ విషయాన్ని సదరు యువకుడు పోలీసులకు తెలిపినా ఏమాత్రం పట్టించుకోకుండా వారందరిని అజ్నాతంలో వుంచి నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై అటు దళిత సంఘాలు, ఇటు వామపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

06:57 - June 5, 2018

మేఘాలయ : షిల్లాంగ్‌లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస ఇంకా చల్లారకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు 11 కంపెనీల పారా మిలటరీ దళాలను షిల్లాంగ్‌కు పంపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఖాసీ హిల్స్‌ ప్రాంతంలో సెల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఆదివారం రాత్రి ఆందోళనకారులు షిల్లాంగ్‌లోని సిఆర్‌పిఎఫ్‌ క్యాంపుపై దాడి చేశారు. గత నాలుగు రోజులుగా షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్‌ ప్రాంతంలో గిరిజనులకు...పంజాబీలకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ పోలీస్‌ అధికారితో పాటు10 మంది గాయపడ్డారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. 2 వందల ఏళ్ల క్రితమే షిల్లాంగ్‌కు వచ్చామని, తమని స్థానికులుగానే గుర్తించాలని, సెటిలర్స్‌ అని పిలవకూడదని పంజాబీలు అంటున్నారు. ఇవి స్పాన్సార్డ్‌ అల్లర్లని... కొందరు డబ్బులిచ్చి ఆందోళన చేయిస్తున్నారని మేఘాలయ సిఎం కాన్రాడ్‌ సంగ్మా అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

21:41 - May 14, 2018

పశ్చిమ బెంగాల్‌ : జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారు. టిఎంసి కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఇద్దరు సిపిఎం కార్యకర్తలను సజీవ దహనం చేశారు. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం విమర్శించింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న తృణమూల్‌ చర్యలను తీవ్రంగా ఖండించింది.

పంచాయితీ ఎన్నికల్లో హింస
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లింది. నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఇంట్లోనే సజీవ దహనమైన దేబుదాస్‌, ఉషాదాస్‌ దంపతులు
సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాలో.. సీపీఎం మద్దతుదారుల ఇల్లును గత రాత్రి తృణమూల్‌ గూండాలు తగలబెట్టారు. సీపీఎం కార్యకర్తలైన దేబుదాస్‌, ఉషాదాస్‌ అనే భార్యాభర్తలపై దాడి చేసి ఇంట్లోనే సజీవ దహనం చేశారు. ఈ ఘటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం విమర్శించింది. తృణమూల్‌ చర్యలను ఖండించింది. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్‌ వరకు హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించింది.నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బాగ్డాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలోకి కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి బాలెట్‌ పత్రాలపై స్టాంపులు వేయడానికి ప్రయత్నించారు. జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద బాంబు పేలడంతో 20 మంది గాయపడ్డారు. కూచ్‌ బిహార్‌లో బిజెపి కార్యకర్తపై ఓ మంత్రి చేయి చేసుకున్నాడు. శికర్‌పూర్‌ గ్రామంలో బ్యాలెట్‌ బాక్స్‌ను తగుల బెట్టారు.

మీడియా వాహనాన్ని ధ్వంసం
భాంగర్‌ జిల్లాలో ఓ మీడియా వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. టిఎంసి కార్యకర్తలు పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించేందుకు యత్నించారు. కొన్ని చోట్ల ప్రజలను ఓటు వేయకుండా వారు అడ్డుకున్నారు. అల్లరిమూకలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 58, 639 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు
గత నెల 2న పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీల అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 58, 639 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సుమారు 20వేల స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. 

బెంగాల్ హింసపై వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు..
పశ్చిమ బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ దాడులను ఏపీ సీపీఎం తీవ్రంగా ఖండించింది. దాడులను నిరసిస్తూ విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని అన్సారీ పార్క్‌ సెంటర్‌లో పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వైవీ హాజరయ్యారు. బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస అక్కడ పాలనా విధానాలను బయట పెట్టిందని మధు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు.. బెంగాల్లో మాత్రం ప్రభుత్వ నిర్భందపూరిత వాతావరణంలో జరిగాయన్నారు. టీఎంసీ అప్రజాస్వామికంగా వ్యవహిరించిందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ కలగజేసుకుని తిరిగి పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బెంగాల్‌ దౌర్జన్యఖాండను నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మధు తెలిపారు. 

16:26 - May 14, 2018

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లోని పంచాయితీ ఎన్నికల్లో జరిగిన హింసపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కమిషన్ పట్టించుకోవటంలేదని ఏచూరి ఆవేదనతో విమర్శించారు. బెంగాల్ లో జరుగున్న హింసకు వ్యతిరేకంగా పోరాడతామని ఏచూరి తెలిపారు. కాగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీ గూండాలు రెచ్చిపోతున్నాయి. విచక్షణారహితంగా దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తు దాడులకు పాల్పడుతున్నారు. బెంగాల్ లో 58,639 పంచాయతీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 20 వేల స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయ్యింది. ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లను బెదిరించి వెనక్కి పంపించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 24నార్త్ పరగణాస్, బుర్ద్వాన్, కుచ్ మెహర్, సౌత్ 24 పరగణాస్ జిల్లాలో హింస చోటు చేసుకుంది. సీపీఎం కార్యకర్తలైన దేబుదాస్, ఉషాదాస్ దంపతులను ఇంట్లోనే టీఎంసీ గూండాలు సజీవ దహనం చేయడం కలకలం సృష్టించింది. మొత్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందారు.

07:16 - April 26, 2018

విజయవాడ : దేశంలో స్త్రీలపై సాగుతున్న అకృత్యాలను అరికట్టాల్సిన బీజేపీ ప్రభుత్వం.. అరాచకశక్తులకు మద్దతిచ్చేలా వ్యవహరించడం సరైంది కాదంటూ ధ్వజమెత్తారు ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడటాన్ని నిరసిస్తూ... విజయవాడలోని ఎంబీవీకే భవన్‌లో మహిళా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మహిళలు, మహిళా సంఘాల నాయకులు, ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు. స్త్రీలపై ఆకృత్యాలను అరికట్టకుంటే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.  

20:24 - April 21, 2018

హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ శక్తులు కేరళలో హింస రగిలిస్తున్నాయని కేరళ రాష్ట్ర సీపీఎం నేత బాలకృష్ణన్ పేర్కొన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. ఈ సభల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన బాలకృష్ణన్ తో టెన్ టివి ముచ్చటించింది. ఆర్ఎస్ఎస్ మతోన్మాదంతో దేశంలో లౌకిక, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కేరళలో ఆర్ఎస్ఎస్ శక్తులు హింసను రగిలిస్తున్నాయని, ప్రజల మద్దతుతో ఆర్ఎస్ఎస్ గూండాయిజాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తులుండవని తేల్చిచెప్పారు.

 

20:07 - April 12, 2018

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ , ఆయన సోదరుడు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ తో పాటు సోదరుడు అతుల్ సెంగార్ ను కూడా సోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై ప్రభుత్వం సిట్ దర్యాప్తు కు ఆదేశించింది. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపలేరని ఉన్నావ్ లైంగిక దాడి కేసులో సిబీఐతో విచారణ జరిపించాలని సుంప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న నేరాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిథి ఇందిరా శోభన్, పీవోడబ్ల్యు సంధ్య పాల్గొన్నారు.

15:04 - March 31, 2018

వివాహం విశ్వజనీన సామాజిక - సాంస్కృతిక విధానం. దీని ద్వారా స్త్రీ, పురుషులిద్దరూ కుటుంబ జీవితానికి నాంది పలుకుతారు. కుటుంబ వ్యవస్థకు ఆధారం వివాహమే. ఇది సమాజ అనుమతితో స్థిరమైన లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకునే ఓప్రక్రియ. సమాజం నిరంతరం కొనసాగడానికి మూలాధారానికి ఇదే ఆరంభం. మరణాల ద్వారా ఏర్పడే లోటును జననాల ద్వారా భర్తీ చేయడానికి వివాహమే ఆధారం. వివాహం అన్ని సమాజాల్లోనూ ఉంది. కానీ, దీని నియమాలు వివిధ సమాజాల్లో విభిన్న రీతుల్లో ఉన్నాయి. దాంట్లో భారతీయ వివాహ వ్యవస్థపై ఎంతోమంది ఎంతో గొప్పగా చెబుతుంటారు. ఇద్దరు వ్యక్తులను, ఇరు కుటుంబాలను కలిపే వారధిగా వివాహ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ప్రారంభించే కొత్త జీవితం ఎలా వుండాలి? వారు ఎలా మసలుకోవాలి? ఒక అభిప్రాయాలను మరొకరు ఎలా గౌరవించుకోవాలి? కష్టసుఖాలలో ఒకరికొకరు ఎలా చేదోడు వాదోడుగా వుండాలి? అని విషయాలపట్ల పూర్తి అవగాహన వుంటేనే ఆ సంసారం పూలనావలా సాగిపోతుంది. కానీ భర్త భార్యను బానిసగా భావిస్తే..భార్యను తన స్వంతఆస్తి అన్నట్లుగా ప్రవర్తిస్తే..తను చెప్పిందే చేయాలి..తన మాటే నెగ్గాలి అనే అహానికి భర్త వ్యవహరిస్తే..భార్యను లైంగిక బానిసగా భావిస్తే..ఆమెపై హక్కు, అధికారంగా వ్యవహరిస్తే?..అటువంటి నేపథ్యంలో భారతీయ వివాహ వ్యవస్థకు బీటలువారే ప్రమాదం వుంది. ఈ క్రమంలో దేశంలో ఎంతోమంది భార్యలు వివాహ అత్యాచారాలకు గురవుతున్నారు. భర్త సాగించే లైంగిక హింసాకాండపై కేసులుండటం లేదంటున్న సర్వే.. ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేస్తే కేసు పెట్టవచ్చు...కానీ భార్యకు ఇష్టం లేకుండానే భర్త సాగించే లైంగిక హింసాకాండపై వివాహం మాటున నిందితులైన భర్తలపై కేసులుండటం లేదని ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. భర్తల లైంగిక దాష్టీకానికి ఎందరో భార్యలు బాధలు పడుతున్నా వారి కన్నీళ్లు తుడిచే వారు కరవయ్యారు. భర్త పెట్టే లైంగిక హింసాకాండను పంటి బిగువన భరించుకుంటు మౌనంగా 'పరువు' కోసం దుర్భర జీవనం సాగిస్తు భార్యలు ఎందో ఈ భారతదేశంలో. భర్త పెట్టే లైంగిక హింసలకు అధిక రక్తస్రావాలకు గురయిన భార్యలు కొందరు వైద్యులను సంప్రదిస్తే మరికొందరు పలు రకాల ఆరోగ్య సమస్యలకు లోనయి ప్రాణాలు కోల్పోన సందర్భాలు కూడా లేకపోలేదు. వారి మృతి ఏదో తెలియని జబ్బు చేసిన చనిపోయిందనే మాటలతో వాస్తవాలన్నీ సమాధి అయిపోతుంటాయి. మరికొందరు మహిళలపై రుతుస్రావం సమయంలోనూ భర్తలు సాగించే అత్యాచారకాండతో భరించలేదని బాధతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. భర్త అత్యాచారంచేస్తున్నాడంటున్న ఓ అభాగ్యురాలి ఆవేదన.. ప్రతీరోజూ భర్త తనపై బలవంతంగా అత్యాచారం చేస్తున్నా సామాజిక పెళ్లి బంధనాల మధ్య ఉన్న తాను పెదవి విప్పలేక పోతున్నానంటూ 42 ఏళ్ల వివాహిత ఆవేదనగా చెప్పింది. ‘‘నా భర్త జంతువులాగా ప్రతీ రాత్రి తనను లైంగికంగా హింసిస్తుండటం వల్ల గర్భస్రావం కూడా అయింది’’ అంటూ మరో బాధిత వివాహిత ఆందోళన వ్యక్తం చేసింది. గృహ హింసే కాదు లైంగిక హింసకు గురవుతున్న ఎందరో అభాగినులు.. గృహ హింసే కాదు లైంగిక హింసకు గురవుతున్న ఎందరో అభాగినులు తమ పడకగదుల్లో భర్తల బాగోతాలను బట్టబయలు చేసేందుకు ముందుకు రావడం లేదని సామాజికవేత్త మధుగార్గ్ పేర్కొన్నారు. కొందరు భర్తలు సాగిస్తున్న అసహజ లైంగికకాండపై భార్యలు పెదవి విప్పేందుకు నిరాకరిస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. మైనర్ బాలికలను పెళ్లాడిన యువకులు పెళ్లి ముసుగులో వారిని లైంగికంగా వేధిస్తున్నా బాలల హక్కులు, చట్టాలు పనిచేయడం లేదని సాచిసింగ్ అనే స్వచ్ఛంద సేవకుడు చెప్పారు. భార్యపైనా బలవంతంగా సాగించే అత్యాచారం మన దేశంలో నేరంగా గుర్తించడం లేదని రేణు మిశ్రా అనే న్యాయవాది ఆరోపించారు. ఎందరో బాధిత భార్యల ఆక్రందనలపై ఇకనైనా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సేవకులు కోరుతున్నారు.

11:17 - March 6, 2018

ఢిల్లీ : గత 25 ఏళ్లుగా సీపీఎం పాలన ఎలా ఉంటుందో...కాషాయ దళ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా ఉంటుందో రెండు రోజుల్లోనే ప్రపంచానికి తెలిసిపోయింది. కొన్ని సంవత్సరాలుగా త్రిపురలో ఉన్న ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా చెడిపోయింది. ఎక్కడ చూసినా ఘర్షణలు..దాడులు జరుగుతున్నాయి. సీపీఎం కార్యాకర్తలు..సీపీఎం కార్యాలయాలను కాషాయ దళం టార్గెట్ చేస్తోంది. కార్యాలయాలకు నిప్పు పెట్టడం..కార్యకర్తలపై భౌతికంగా దాడులకు దిగుతోంది. మొత్తంగా త్రిపురలో హింస ప్రజరిల్లుతుండడంపై ఆందోళనలు నెలకొంటున్నాయి.

త్రిపురలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సీపీఎం పరాజయం చెందినా ఓట్ల శాతంలో అగ్రస్థానంలో ఉంది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాషాయ దళం హింసకు తెరలేపింది. ఏకంగా బుల్ డౌజర్ లను తెచ్చి లెనిన్ విగ్రహం తొలగించడం పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీపీఎం కార్యాలయాలపైకి దాడి చేసి ఫర్నీచర్ లను ధ్వంసం చేసి నిప్పు పెడుతున్నారు. కార్యకర్తలపై దాడులకు దిగారు. దీనితో భయానక పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్లలేకపోతున్నారు. 240 మంది గాయపడగా 500 చోట్ల ఇళ్లను తగులబెట్టారు.

ఈ ఘటనను సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. 25 ఏళ్లుగా లేని హింస అధికారంలోకి వచ్చిన గంటల్లోనే హింస చెలరేగిపోయిందని విమర్శించింది. గిరిజనులు..గిరిజనేతరులను ఐక్యంగా ఉంచుతూ..సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని సీపీఎం నేతలు గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్..బీజేపీ నేతలకు రాజ్యసభ గవర్నర్ మద్దతు పలకడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పేర్కొంది.

ఇదిలా ఉంటే ఎన్నికల అనంతరం త్రిపుర ప్రజలు ఇలాంటి వాతావరణం కోరుకోలేదని, బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి కలిసి దాడులకు పాల్పడుతోందని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. సీపీఎంను బలపరిచిన 45 శాతం మంది ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, లక్షలాది మంది సీపీఎం కార్యకర్తలు ఇళ్లకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - హింస