హిమాచల్‌ ప్రదేశ్‌

09:57 - July 19, 2018

హిమాచల్‌ ప్రదేశ్‌ : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కూలిపోయింది. పంజాబ్‌లోని పటాన్‌కోట్‌ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్‌ డివిజన్‌ పట్టా జతియన్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ మృతి చెందినట్లు కాంగ్రా జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భారత వాయుసేన యుద్ధవిమానం కూలిన ఘటన ఇది మూడవది కావడం గమనార్హం. గత నెలలో గుజరాత్‌, మహారాష్ట్రలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.

22:16 - November 7, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్‌ 9న పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌, బిజెపి మొత్తం 68 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. సిపిఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187 అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌-బిజెపి పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ ప్రధాని మోది ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో నోట్లరద్దు, జిఎస్‌టిలపై కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ ఫెయిల్‌ అయిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌నే కాంగ్రెస్‌ నమ్ముకుంది. ఎన్నికలకు వారం రోజుల ముందు బిజెపి సిఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ పేరును ప్రకటించింది. 

 

21:51 - October 12, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 49 లక్షల మంది ఓటర్లున్న హిమాచల్‌లో మొత్తం 7521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈవీఎంలతో పాటు వీవీపాట్‌ యంత్రాలు ఉపయోగిస్తామని సీఈసీ అచల్‌ కుమార్‌ జ్యోతి చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో  నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అభ్యర్థులు భారీ స్ధాయిలో ఓటర్లకు పంపే ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లనూ  ఎన్నికల ప్రచార వ్యయం కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణం వల్ల గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ పెండింగ్‌లో పెట్టింది. ఆ రాష్ట్రంలో డిసెంబర్‌ 18లోపు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

 

16:11 - October 18, 2016

హిమాచల్‌ ప్రదేశ్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోది హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు జలవిద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించారు. మండి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొల్డామ్‌, పార్వతీ రెండో దశ ప్రాజెక్టు, రాంపూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక పురాతత్వ విభాగపు పనులు చేయాల్సి వస్తోందని, పెండింగ్‌ ప్రాజెక్టుల ఫైళ్లని తిరగ దోడుతున్నట్లు ప్రధాని చెప్పారు. 1981లో ప్రారంభించిన ఓ రైల్వే ప్రాజెక్ట్‌ను ఇంతవరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో 34 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టు ఇపుడది 2 వేల వంద కోట్లకు చేరుకుందని, ఫలితంగా ప్రభుత్వంపై భారం పడుతోందని మోది అన్నారు. భారతీయ ఆర్మీ శక్తిపై తమకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మన ఆర్మీపై చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా మోది తెలిపారు. ప్రధానిగా మోది తొలిసారిగా హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. 

10:26 - May 8, 2016

హైదరాబాద్ : హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది దుర్మరణం పాలయ్యారు. సిమ్లాకు 250కిలోమీటర్ల దూరంలో... జోగిందర్ నగర్ వద్ద రాత్రి ఈ ప్రమాదం జరిగింది. 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్‌.. బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో 9మంది చనిపోగా... 39మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో... మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 

Don't Miss

Subscribe to RSS - హిమాచల్‌ ప్రదేశ్‌