హైదరాబాద్

08:03 - April 30, 2017

హైదరాబాద్ : భూసేకరణ చట్ట సవరణల కోసం.. తెలంగాణ శాసనసభ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. గతంలో తెలంగాణ భూసేకరణ చట్టం బిల్లును.. తమ సవరణలను బేఖాతరు చేస్తూ ఆమోదింపచేసుకున్న కేసీఆర్‌ సర్కారును.. ఈసారి తీవ్రంగా ఎండగట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని విపక్షాలు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది. భూ సేకరణ బిల్లుకు ఉమ్మడి సభల ఆమోదం పొందాక.. బిల్లు ప్రతిని ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. గతంలో కేంద్రానికి పంపిన బిల్లుకు కేంద్ర న్యాయశాఖ కొన్ని సవరణలను సూచించింది. కలెక్టర్లకు అధికారం ఇచ్చినా ...ఫెయిర్ కాంపెన్జేషన్‌ ఇస్తామన్న పదం జోడించాలని,నిర్ధారించేందుకు అనే పదాన్ని రీ విజిట్ అన్న పదంతో మార్పు చేయాలని, (3,10) క్లాజ్‌లను తొలగించాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. ఈమేరకు కేసీఆర్‌ సర్కారు, సిఎస్ , ఇరిగేషన్ , రెవిన్యూ, న్యాయ శాఖల అధికారులతో సమావేశమై.. కేంద్ర సూచనల మేరకే సవరణలు చేసింది.

వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధం
ఆదివారం నాటి సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. గత సమావేశంలో 2013 భూసేకరణ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని విపక్షాలన్ని పట్టుపట్టినా.. అధికార పార్టీ సంఖ్యా బలంతో బిల్లును పాస్ చేయించి కేంద్రానికి పంపింది. అది కేంద్రం నుంచి తిరుగుటపాలో రావడంతో, దీన్ని అస్త్రంగా మలచుకుని కేసీఆర్‌ సర్కారును నిలదీయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సేకరణ చట్టం 2013నే అమలు చేయాలని సీపీఎం పట్టుబడుతోంది.

బీఏసీ భేటీకి, టీడీపీ, బీజేపీల అందని ఆహ్వానం
ఇక సభలో విపక్షాలకు ఛాన్స్‌ ఇవ్వరాదని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. శనివారం జరిగిన బిఏసీ భేటీకి, టీడీపీ, బీజేపీలను ఆహ్వానించక పోవడం కూడా వ్యూహాత్మకమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్‌ టాపిక్‌గా ఉన్న మిర్చి రైతు సమస్యలపై చర్చకూ... బీఏసీలో కాంగ్రెస్‌ పట్టుబట్టింది. అయితే, భూసేకరణ చట్టం సవరణలకు మాత్రమే సభ పరిమితమని కేసీఆర్‌ సీఎల్పీ నాయకులకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం నాటి అసెంబ్లీ భేటీ.. ఎలా సాగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 

07:55 - April 30, 2017

హైదరాబాద్ : రాష్ట్రాభివృద్దికి కీలకమైన భూసేకరణ బిల్లులో సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లులో కేంద్రం సవరణలు కోరింది. భూసేకరణ బిల్లులో విపక్షాలు అనేక సూచనలు చేసినా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సభలో తమ సంఖ్యాబలంతో బిల్లును పాస్‌ చేయించుకుని విపక్షాల సూచనలను తుంగలో తొక్కింది. ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీసుకొచ్చిన ఈ బిల్లుకు కేంద్రం ప్రభుత్వం సవరణలు కోరింది. దీంతో భూసేకరణ బిల్లులో సవరణలు చేయడానికి ఇవాళ శాసనసభా సమావేశం నిర్వహిస్తోంది.

2013కు లోబడే తమకంటూ ప్రత్యేక చట్టం ఉండాలని
భూసేకరణ చట్టం -2013కు లోబడే తమకంటూ ప్రత్యేక చట్టం ఉండాలని విపక్షాలు, నిపుణులు , ప్రజాసంఘాలు ముందునుండి వాదిస్తున్నాయి. అయితే ఈ మాటలను ప్రభుత్వం మాత్రం పెడచెవినే పెట్టింది. అంతేకాదు విపక్షాలు చేసిన సూచనలను సైతం పట్టించుకోకుండా తనకున్న సంఖ్యాబలంతో అసెంబ్లీలో బిల్లును పాస్‌ చేయించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఈ బిల్లును పరిశీలించిన కేంద్రం పలు సవరణలు చేయాలంటూ వెనక్కి పంపింది. ప్రధానంగా మూడు అంశాలకు కేంద్రం సవరణలను కోరింది. భూసేకరణ చట్టం జనవరి 2014 నుంచి అమల్లోకి వస్తుందని ఒకచోట, గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి అమలవుతుందని మరోచోట పేర్కొన్నారు. ఇదే అంశాన్ని కేంద్ర న్యాయశాఖ లేవనెత్తింది. ఒకేచట్టం అమలుకు రెండు తేదీలు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. దాన్ని మార్చకుంటే న్యాయపరంగా చిక్కులు తలెత్తుతాయని సూచించింది. దీంతో కేంద్ర భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్ర చట్టం కూడా అమల్లోకి వస్తుందనే సవరణను చట్టంలో చేర్చనున్నారు.

పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్రం తప్పుపట్టింది
చట్టంలో తెలంగాణ సర్కార్‌ పేర్కొన్న మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్రం తప్పుపట్టింది. భూసేకరణ సమయంలో స్థానిక మార్కెట్‌ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. దీనిని తప్పుపట్టిన కేంద్రం.... పాత మార్కెట్‌ విలువ కాకుండా భూసేకరణ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించేలా సవరణ చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగానే సేకరణకు ముందు ఆయా నిర్దిష్ట ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువను సవరించి ఈసారి చట్టంలో పొందుపర్చనున్నారు. కేంద్ర చట్టంకంటే మెరుగైన పరిహారం ఇచ్చేదానిపైనా కేంద్రం సవరణ చేయాలని సూచించింది. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడురెట్లు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో నాలుగురెట్ల పరిహారం ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టంలో ఉంది. అంతకంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్రప్రభుత్వం చట్టంలో పేర్కొంది. ఐతే ఇందుకు సంబంధించిన పదజాలంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. ఆ మేరకు సవరణలు చేసి బిల్లులో పొందుపర్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బిల్లును రూపొందించింది. ఈసారి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా రాష్ట్రపతి ఆమోదం పొందాలన్న ఆలోచనలో ఉంది. ముసాయిదా కాపీపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటోంది. విపక్షాలు మాత్రం రైతులకు మేలు చేసే భూసేకరణ చట్టం 2013నే అమలు చేయాలని కోరుతున్నాయి. మొత్తానికి భూసేకరణ చట్టం బిల్లుపై అసెంబ్లీ మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్దమైంది. ఈసారైనా ప్రభుత్వం విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి సర్కార్‌ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

22:00 - April 29, 2017

హైదరాబాద్ : నీళ్ల నిపుణుడు విద్యాసాగరరావు కన్నుమూశారు. జలవనరుల ఇంజనీర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యాసాగర్ రావు మృతికి ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు విద్యాసాగరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారుగా విద్యాసాగర్ రావు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 
విద్యాసాగర్‌ రావు మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
మారుమూల కుగ్రామంలో జన్మించి.. సమున్నత స్థాయికి ఎదిగిన జలవనరుల ఇంజనీర్‌ ఆర్‌.విద్యాసాగరరావు.. శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్‌ రావు మృతి పట్ల.. ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
విద్యాసాగర్‌ భౌతిక కాయాన్ని కేసీఆర్‌ సందర్శించిన సీఎం 
విద్యాసాగర్‌ భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించి.. తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. హబ్సిగూడ లోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి విద్యాసాగరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. విద్యాసాగరరావు లేని లోటు భర్తీ చేయలేనిదన్న కేసీఆర్‌, ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నీటి పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బలంగా వినిపించారన్న కేసీఆర్‌, నీళ్లు - నిజాలు రచన ద్వారా, సాగునీటి రంగంపై అందరికీ అవగాహన కల్పించారన్నారు. విద్యాసాగరరావు స్మృతి చిహ్నంగా.. ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు ఆయన పేరును పెట్టాలని అధికారులను ఆదేశించారు. 
విద్యాసాగరరావు మృతికి మంత్రి హరీశ్‌రావు సంతాపం 
విద్యాసాగరరావు మృతికి మంత్రి హరీశ్‌రావు కూడా సంతాపం తెలిపారు. కుడి భుజం పోయినంత పనైందని హరీశ్‌, ప్రాజెక్టుల రీడిజైన్లలో విద్యాసాగర్‌రావు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. బండారు దత్తాత్రేయ, ప్రొఫెసర్ కోదండరాం, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు విద్యాసాగర్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  

 

21:46 - April 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఓవైపు ఎండలు హీటెక్కిస్తుంటే.. రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఈరోజు జరిగిన బిఏసీ సమావేశం మొత్తం హాట్ హాట్ గా సాగింది. తెలంగాణలో భూసేకరణ సవరణ బిల్లుపై చర్చ కోసం రేపు జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ భేటీ కోసం బీఏసీ జరిగింది. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. మరోవైపు తమను సమావేశానికి ఆహ్వానించలేదని బిజేపీ ఫైరైంది.
అజెండా ఖరారు కోసం బీఏసీ సమావేశం 
ఆదివారం జరగనున్న అసెంబ్లీ సమావేశంలో అజెండా ఖరారు కోసం బీఏసీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ పక్షాన సీఎల్పీ నేత జానారెడ్డి, చిన్నారెడ్డి, ఎంఐఎం నుండి పాషాఖాద్రి ఈ సమావేశానికి హాజరయ్యారు. గత సెషన్ లో సస్పెండ్ అయినందున... ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీలను ఆహ్వానించలేదని ప్రభుత్వం తెలిపింది.
ఖమ్మం ఘటనపై హాట్ హాట్ చర్చ
స‌మావేశం  జరిగింది 15 నిముషాలైనా ఆద్యంతం వాడివేడిగా సాగింది. స‌మావేశంలో జానారెడ్డి, చిన్నారెడ్డి ప్రభుత్వంపై వ‌ర్షం కురించారు. రాష్ట్రంలో మద్దతు ధ‌ర అంద‌క‌, పంట‌ను కొనేవారు లేక రైతులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని.. దీనిపై మొద‌ట అసెంబ్లీలో చ‌ర్చించి త‌ర్వాత .. భూ సేక‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని  బీఏసీలో ప‌ట్టుప‌ట్టారు. అందుకు కేసీఆర్ ససేమిరా అన్నారు. భూసేకరణ బిల్లుకు సవరణల కోసమే సమావేశం పరిమితమని తేల్చిచెప్పారు. అంతేకాదు రైతుల ఆందోళనల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని సీఎం అనడంతో కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. సీఎం సమాధానాలపై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ నేతలు రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుంటే సభను అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారు. 
బీజేపీ, టీడీపీలను ఆహ్వానించని ప్రభుత్వం
మరోవైపు ఈ సమావేశాలకు బిజేపి, టిడిపిల‌కు ఆహ్వానం అందకపోవడంతో ఆ పార్టీలు గరం గరంగా ఉన్నాయి. మొత్తానికి భూసేకరణ బిల్లుకు సవరణలు చేసేందుకు సమావేశం కానున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం హాట్ హాట్ గా సాగనుందని తెలుస్తోంది.  

 

21:40 - April 29, 2017

ఘాటు మీదికొచ్చిన మిర్చి చేటు పంచాది... ఖమ్మం పట్నంల పోలీసు సెక్షన్లు విధింపు, కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఎనుకేసున్నడు... మళ్లోపంచాది ముంగటేసుకున్న కోమటిరెడ్డి, చంద్రన్న కుప్పంల కుప్పల కొద్ది అవినీతి.. ఇంట్ల ఓడి రచ్చ గెలుస్తున్న చంద్రాలు, వరంగల్ సభకు ప్లాప్ కు పోలీసోల్లే కారణం... క్యాడర్ రానియ్యలేదని కారు బాస్ కన్నెర్ర, కామారెడ్డి కాడా స్మశాన వాటిక కబ్జా.... 55 ఎకరాలకు రియల్ ఎస్టేట్ పూజ, తప్పైందని చెంపలేసుకుంటున్న కేజ్రీవాల్...ఢిల్లీల ఓటమితర్వాతైన జ్ఞానోదయం.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:46 - April 29, 2017

హ్యాపీడేస్ హీరో టైసన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటాపురం మూవీ విశేషాలు తెలిపారు. 
తన సినీ కెరీర్ వివరించారు. మరిన్ని విరాలను ఆయన మాటల్లోనే...'నా ఫేవరెట్ హీరోయిన్ శృతిహాసన్. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుంది'. అని అన్నారు. నటుడు అజయ్ ఘోష్ ఫ్రాంక్ కాల్ చేశాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

20:27 - April 29, 2017

హైదరాబాద్ : ప్రతిపక్షాలపై విమర్శలు మాని.. మిర్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలకు పిచ్చి పట్టాయని మంత్రి తుమ్మల అనడం దారుణమన్నారు. రైతులకు మద్దతు తెలిపిన నాయకులను అరెస్ట్‌ చేయడం దారుణమని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. వెంటనే మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని తెలిపారు. 

19:55 - April 29, 2017
19:54 - April 29, 2017
19:31 - April 29, 2017

హైదరాబాద్‌ : సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మిర్చి దండలు మేడలో వేసుకుని నిరసన తెలిపారు. రైతులు మిర్చిని తగలబెట్టొద్దని.. ప్రభుత్వంపై తిరగబడాలని ఐద్వా సీనియర్‌ నేత మల్లు స్వరాజ్యం పిలుపునిచ్చారు. కుట్రలు చేస్తున్నది విపక్షాలు కాదని..ప్రభుత్వమే రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. ఖమ్మం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులపై కేసులు ఎత్తివేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - హైదరాబాద్