హైదరాబాద్‌

21:26 - March 24, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఆయుధాల లభ్యం కలకలం రేపుతోంది. హబీబ్ నగర్‌లో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐసిస్ సానుభూతిపరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో భారీ హింసకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హబీబ్ నగర్, రాజేంద్రనగర్‌లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

08:16 - March 22, 2017

హైదరాబాద్‌ : నగరంలోని హుమాయున్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మైరాజ్‌ అనే ఓ ప్రైవేటు డాక్టర్‌ను తన సొంత బావమరిది కత్తితో నరికి చంపారు. మైరాజ్‌ మెడికల్‌ అండ్‌ కాడియో క్లినిక్‌లో విధులు  నిర్వహిస్తున్న డాక్టర్‌ మైరాజ్‌పై సొంత బామ్మర్ధి అజీజ్‌తో పాటు మరికొంతమంది దుండగులు ఆసుపత్రిలోకి చొరబడి డాక్టర్‌పై కత్తులతో దాడిచేశారు. దీంతో కత్తిపోట్లకు తీవ్రగాయాలైన డాక్టర్‌ మైరాజ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే డాక్టర్‌పై దాడిచేసిన అనంతరం నేరుగా హుమాయున్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. అయితే సొంతబామరిది అజీజే ఈ ఘాతుకానికి పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మైరాజ్‌ మూడో వివాహం చేసుకున్నాడన్న  కోపంతో అతతినిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. 

 

18:52 - March 21, 2017

హైదరాబాద్‌: వెస్ట్‌ మారేడ్‌పల్లి టీఐటీ కాలనీలో నయీం అనే వ్యక్తి ఇంట్లో నిప్పు పెట్టి దుండగులు పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో చుట్టుపక్కల వారి ఇళ్లకు బయటి నుంచి గొల్లాలు వేసి నయీం అనే వ్యక్తి ఇంట్లో నిప్పు పెట్టారు దుండగులు. ఇది గమనించిన స్థానికులు 100 కు ఫోన్‌ చేశారు. ఇటు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుని.. నయీం ఇంట్లోని మంటలను ఆర్పివేశారు. ఇంట్లో విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. బాధితుడు నయీం భార్య డెలివరీ కోసం 20 రోజుల క్రితం ఊరికి వెళ్లడంతో... మారేడ్‌ పల్లిలోని తన తల్లివద్ద ఉంటున్నాడు నయీం. ఇది దొంగలు చేశారా.? లేక ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

07:27 - March 19, 2017

హైదరాబాద్‌ : ఐదు నెలలు.. 4 వేల కిలోమీటర్లు. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 153 రోజులపాటు అవిశ్రాంతగా కొనసాగిన మహాజన పాదయాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. చరిత్రలోనే అత్యధిక దూరం కొనసాగిన పాదయాత్రగా చరిత్ర పుటలకు ఎక్కింది.
అక్టోబర్‌ 17న పాదయాత్ర ప్రారంభం
అక్టోబర్‌ 17న ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 1600 గ్రామాలు, 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. 153వ రోజు పాదయాత్ర మేడ్చల్‌ జిల్లా మీదుగా కొనసాగి హైదరాబాద్‌కు చేరుకుంది. నగర శివారు ప్రాంతాల్లో పాదయాత్ర బృందానికి సీపీఎం కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సామాజిక ఎజెండానే లక్ష్యంగా కొనసాగుతున్న పాదయాత్రకు ఇతర పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. నగరంలోకి ప్రవేశించిన మహాజన పాదయాత్రకు ప్రత్యేకంగా డప్పు బృందాలు ప్రత్యేకంగా స్వాగతం పలికాయి. 
సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణ అభివృద్ధి : తమ్మినేని 
ఎప్పుడూ స్కైవేలు, విశ్వనగరి, ఐటీహబ్‌ల గురించి మాట్లాడే కేసీఆర్‌ను... సామాజిక వర్గాలపై దృష్టిపెట్టేలా మహాజన పాదయాత్ర చేయగలిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తమ్మినేని ఉద్ఘాటించారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. సామాజిక ఎజెండాతో చేసిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన లభించిందని.. ఇందుకోసం కలిసివచ్చే అన్ని పార్టీలతో భవిష్యత్‌లో భారీ మహాసభను ఏర్పాటు చేస్తామన్నారు తమ్మినేని.
సభకు భారీ ఏర్పాట్లు
153 రోజులుగా పల్లెపల్లెన కొనసాగిన మహాజన పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ఈ సమర సమ్మేళనానికి సీపీఎం నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరై విజయన్‌తో పాటు 40 మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఆదివారం జరిగే సమర సమ్మేళానాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

 

12:30 - March 18, 2017

హైదరాబాద్‌ : నగరంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌కు ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేస్తామన్నారు.ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరువు వచ్చినా హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ తాగునీటి కోసం శివారుల్లో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు.

 

06:51 - March 18, 2017

హైదరాబాద్: ఐదు నెలలకు పైగా.. నాలుగు వేల కిలోమీటర్లు దాటి సాగుతోన్న సీపీఎం మహాజన పాదయాత్ర ఈనెల 19న ముగుస్తుంది. పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని బృందం.. అలుపెరుగకుండా, అవిశ్రాంతంగా.. తెలంగాణలోని ప్రతి పల్లెనూ పలుకరిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాగుతోంది. దేశ చరిత్రలోనే.. అత్యధిక దూరం సాగిన పాదయాత్రగా మహాజన పాదయాత్ర రికార్డు సృష్టించింది. ఈనెల 19న యాత్ర ముగింపు సభను హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ అవుట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముగింపు సభకు పూర్తయిన ఏర్పాట్లు....

ఈనెల 19న ఆదివారం నాడు జరిగే మహాజన పాదయాత్ర ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌ తదితర వామపక్ష, సామాజిక, ప్రజాసంఘాల నేతలు ఈ సభలో పాల్గొంటారు. అంతకుముందు.. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ముగింపు పాదయాత్ర సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమవుతుంది. మరో యాత్ర వనస్థలిపురం స్పెన్సర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఎం అనుబంధ సంఘాలు.. తమ విభాగాల శ్రేణులను, ప్రజలను కోరాయి.

చరిత్రలో నిలిచిపోయే విధంగా ముగింపు కార్యక్రమం...

పాదయాత్రల చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని... చరిత్రలో నిలిచిపోయే విధంగా, లక్షిత వర్గాల వారందరికీ పాదయాత్ర ఫలాలు చేరాలన్న లక్ష్యంతో రూపొందిస్తున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మహాసభ ప్రారంభమవుతుంది.

16:45 - March 13, 2017

హైదరాబాద్: కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి ఇద్దరు మహిళా కూలీలు చనిపోయారు. మరో ఇద్దరు కూలీలు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి భవన యాజమాన్యం.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఇదిలాఉండగా భవన సెల్లార్‌ కూలిన ప్రదేశాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదం దురదృష్టకరమన్న మేయర్‌ కారకులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ ఇన్సూరెన్స్‌ కింద ఆరు లక్షలు, జీహెచ్ఎంసీ తరపున 2 లక్షలు, భవన యాజమాన్యం నుంచి దాదాపు 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు.

15:41 - March 9, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ మేరకు అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:53 - March 4, 2017

హైదరాబాద్‌ : నగర వాసులకు ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా నీటిని తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తుండటంతో సిటీకి కష్టకాలం వచ్చేలా ఉంది. దీంతో గతేడాది కంటే రెండు నెలల ముందే ఎమర్జెన్సీ పంపింగ్‌కు జలమండలి సిద్ధమవుతోంది. 
పెరుగుతున్న నీటి కష్టాలు 
గ్రేటర్‌ వాసుల్లో రోజు రోజుకు నీటి కష్టాలు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాల్లో నీటి వత్తిడిని తగ్గించి సరఫరా చేస్తున్నారు. గతంతో పోలిస్తే నగరానికి అయ్యే సరఫరా నీటి శాతం పెరిగినప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చెయ్యలేకపోతుంది జలమండలి. శివారు ప్రాంతాల్లో గతంలోని పరిస్థితులే ఇంకా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన పైపులైన్‌ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా నీటి కష్టాలు తీరలేదు. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు పూర్తి కాకపోవడంతో గతంలోని సమస్యలు పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
సిటీకి ఇబ్బందులు..?
ఇక ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగర్ నుంచి ఇప్పటి వరకు నీటిని జలమండలి వాడలేదు. సింగూర్‌, మంజీరా జలాశయాల నుంచి 125 ఎంజీడీలు రావాల్సి ఉండగా 48 ఎంజీడీలను మాత్రమే సేకరిస్తున్నారు. అయితే కృష్ణా, గోదావరి నుంచి 356 మిలియన్ గ్యాలన్ల నీరు ప్రస్తుతం సిటికి సరఫరా అవుతుంది. వీటిలో 242 ఎంజీడిల నీరు కృష్ణా నది అక్కంపల్లి నుంచి తీసుకుంటున్నారు. అక్కంపల్లి వద్ద ప్రస్తుతం 511.4 మీటర్ల నీటి మట్టం ఉంది. సిటికి తాగు నీటిని అందించాలంటే రిజర్వాయర్‌లో 510 మీటర్ల నీటి మట్టం మెయింటేన్ చెయ్యాలి. కానీ నాగార్జున సాగర్‌లో కనీస నీటి మట్టానికి తగ్గించి నీటిని వాడుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించడంతో సిటీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
అక్కంపల్లి బ్యారేజీలోనూ తగ్గిపోతున్న నీటిమట్టం 
ఇక నాగార్జునసాగర్‌లో నీటి మట్టం తగ్గించకపోతే అక్కంపల్లి బ్యారేజీలోనూ నీటిమట్టం తగ్గిపోతుంది. అయితే 506 మీటర్ల కంటే నీటిమట్టం తగ్గిపోతే గ్రావిటీ ద్వారా వచ్చే నీరు రాదు. దీంతో పంపింగ్ ద్వారానే కృష్ణా నది నుంచి నీటిని సేకరించాల్సి ఉంటుంది. అయితే మరో నాలుగు వారాల్లోపే ఇలాంటి పరిస్థితులు రానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ నీటి పంపింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రావీటి ద్వారా వచ్చే దాదాపు 250 ఎంజీడీల నీటిని ప్రతి రోజు పంపింగ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం 7 కోట్ల రూపాయలతో భారీ మోటర్లను ఫిక్స్ చెయ్యనుంది జలమండలి.
తాగు నీటి సరఫరాపై పెద్ద ప్రభావం 
ప్రస్తుతం సిటీకి వస్తున్న నీటిలో సింహా భాగం కృష్ణానది నుంచే వస్తోంది. సాగర్‌లో నీటి మట్టం తగ్గితే అదే స్థాయిలో సిటికి తాగు నీటి కష్టాలు వస్తాయి. గతేడాది జూన్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించగా ఈ సారి రెండు నెలల ముందే ప్రారంభించే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ఇది గ్రేటర్ పరిధిలోని తాగు నీటి సరఫరాపై పెద్ద ప్రభావం చూపనుంది.

 

17:29 - March 4, 2017

హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ పోలీసులు శాఖ నెంబర్‌ 1గా ఉందని... మంత్రి నాయిని ప్రశంసించారు. ముఖ్యంగా షీ టీమ్‌ల పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాలు మన షీ టీమ్స్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో షీటీమ్స్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ పీపుల్స్ ప్లాజాలో ఉమెన్‌ ఎక్స్‌పోను నాయిని ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్‌ శర్మ, సీపీ మహేందర్‌ రెడ్డి, స్వాతి లక్రా హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా.. ఉమెన్‌ ఎక్స్‌పోతోపాటు.. ఆదివారం ఉదయం 5కే రన్‌ నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని పోలీసులు కోరారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - హైదరాబాద్‌