10tv telugu news channel

16:50 - April 25, 2017

ముంబై : మాలేగావ్‌ పేలుళ్లు కేసులో 5 లక్షల పూచికత్తుపై సాధ్వి ప్రగ్యసింగ్‌ ఠాకూర్‌కు ముంబై హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నగదుకు ఇద్దరు హామీగా ఉండాలని...ప్రగ్య పాస్‌పోర్టును ఎన్‌ఐఏకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ట్రయల్‌ కోర్టులో విచారణకు ప్రగ్య హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంతకుముందు సరైన సాక్షాధారాలు లేవన్న కారణంతో దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సాధ్వికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కాగా... ట్రయల్‌ కోర్టు ఆమెకు బెయిల్‌ నిరాకరించింది. ఈ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌కు మాత్రం బెయిల్‌ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. 2008లో మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. మోటార్‌ సైకిళ్లలో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు సాధ్వి ప్రగ్యతో పాటు 11 మందిని అరెస్ట్‌ చేశారు. తర్వాత ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు.

 

16:43 - April 25, 2017

విజయవాడ : నగంలో భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి అలంకార్‌ ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 'చలో విజయవాడ' కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించమని గత మూడేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని భవన నిర్మాణ కార్మికులంటున్నారు. రాబోయే అన్ని సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

16:39 - April 25, 2017

హైదరాబాద్ : సేవ్‌ ధర్నాచౌక్‌ పేరుతో సీపీఐ ఆందోళన ఉద్ధృతమవుతోంది. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ మహిళా సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకొనే వేదిక ధర్నా చౌక్‌ అని దానిని ఎత్తివేయడం అప్రజాస్వామికమని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. మే 14 వరకు రిలే దీక్షలు కొనసాగుతాయని.. మే 15న చలో ఇందిరాపార్క్‌ నిర్వహిస్తామని చెప్పారు. 

16:34 - April 25, 2017

సిరిసిల్ల : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్‌ బట్టల చెరువు భూ నిర్వాసితులను కలుసుకున్నారు. చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అవకతవకలను తెలుసుకున్నారు. 70, 80 సంవత్సరాల నుంచి ఈ భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. కొంతమంది బినామీలు పరిహారం పొందారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

 

16:28 - April 25, 2017

హైదరాబాద్‌ :నగంలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ సలహాదారు ఆర్‌. విద్యాసాగర్‌ రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్య చికిత్సకు విద్యాసాగర్‌ రావు బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం వెంటిలేషన్‌ లేకుండా శ్వాస తీసుకోగలిగారని వైద్యులు సీఎంకు తెలిపారు. 

16:16 - April 25, 2017

సూర్యపేట : జిల్లాలోని హూజుర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గ పోరు మొదలైయింది. వరంగల్ బహిరంగ సభ సన్నాహక కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.శంకరమ్మ మండల స్థాయి నాయకులకు సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. పరిశీలకునిగా వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే ఇరువర్గాలు గొడవకు దిగారు.దీంతో ఆయన ఇరువర్గాలను సముదాయించే ప్రయత్న చేశారు. అయితే శంకరమ్మ స్థానిక నేత కాకపోవడంతో మొదటి నుంచి అక్కడి నేతలు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. 

21:22 - April 24, 2017

హన్మకొండ : అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణా కేంద్రంలో అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఆలస్యంగా వచ్చారంటూ వాజేడి అంగన్‌వాడీ కార్యకర్తలను అధికారులు శిక్షణకు అనుమతించలేదు. దీంతో శిక్షణా కేంద్రం ముందు 40 మంది కార్యకర్తలు ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు. వీరిలో కొందరు గర్భిణీ స్త్రీలు కావడం, మరి కొందరికి చిన్న పిల్లలు ఉండటంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. అంగన్ వాడీలు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం వివాదాస్పదమైంది.

21:17 - April 24, 2017

హైదరాబాద్ : ఢిల్లీలో కేసీఆర్‌ బిజీ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన కేసీఆర్‌ ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమస్యలను వివరించారు. వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని.. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు నష్టం కలగకుండా చూడాలని ప్రధానిని కోరారు. అలాగే.. హైకోర్టు విభజన, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు, రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యి హైకోర్టు విభజన, 2013 భూసేకరణ చట్టం అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చినట్లే వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.

గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు..
జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని ప్రధానిని కోరారు. అలాగే గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచామన్నారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశామని.. దానికి కేంద్ర ఆమోదం కావాలని కోరారు. అలాగే రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థల్లో, నియామకాల్లో ఎవరికెంత రిజర్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు. ఎస్సీ వర్గీకరణలో న్యాయం ఉందన్న కేసీఆర్‌.. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనట్లు తెలంగాణలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన 1400 కోట్ల కాంపా నిధులను విడుదల చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే.. సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విన్నవించారు. కేసీఆర్‌ లేవనెత్తిన పలు అంశాలకు ప్రధాని సానుకూలంగా స్పందించారు.

మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ..
ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్‌ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని రవిశంకర్ ప్రసాద్‌ను కేసీఆర్ కోరారు. ఈ చట్టం వల్ల భూ నిర్వాసితులకు తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగవంతమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. దీనికి రవిశంకర్‌ప్రసాద్‌ సానుకూలంగా స్పందించారని టీఆర్ఎస్‌ నాయకులు తెలిపారు. అలాగే ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలన్న వినతికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిని కేంద్రం ఎంతవరకు అమలు చేస్తుందో చూడాలి.

20:41 - April 24, 2017

భిన్న సంస్కృతులు, భాషలున్న దేశంలో ఒకే భాషకు పట్టంకట్టడం సాధ్యమా? కేంద్రం ఆ ప్రయత్నాల్లో ఉందా? హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారా?

మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ సంకేతాలిస్తున్నాయి? అనుసంధాన భాషగా ఎదగాల్సిన హిందీ పట్ల సర్కారు అత్యుత్సాహం వ్యతిరేకతను పెంచుతోందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం.. భాష ఒక గుండె చప్పుడుని మరో గుండెకు అర్ధమయ్యేలా శబ్దమై పలుకుతుంది.. అంతిమంగా మనిషికి మనిషికి మధ్య అనుసంధానకర్తగా మారుతుంది. అది తెలుగు తమిళ్ మలయాళం, హిందీ, ఇంగ్లీషు... భాష ఏదైనా ప్రయోజనం సమాచార ప్రసారమే. మాతృభాష , మార్కెట్ భాష అంటూ రెండు భాషలు కాకుండా మిగిలిన ఏ భాషైనా ప్రజలకు సమాన దూరమే.. ఈ అంశాన్ని కేంద్రం మరచిపోతోందా? హిందీ గో బ్యాక్ అంటున్నాడు.. పవన్ కల్యాణ్..హిందీని రుద్దితే సమించమంటున్నారు సౌతిండియన్లు...హిందీ కంపల్సరీ చేస్తామంటోంది కేంద్రం...

మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చాయి..?
ఈ భాషా విభేదాలు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చాయి..? ఒకప్పటి గందరగోళం మళ్లీ మొదలవుతుందా? భిన్న సంస్కృతులు, భాషలు ఉన్న దేశం భారత్. ఇలాంటి చోట.. మాతృభాష కాకుంగా ఏ ఇతరభాషనైనా సహృదయతతో ఆదరించాలంటే.. సామరస్యంగా పరిచయం చేయాలి తప్ప... రుద్దటం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. హిందీ వస్తే.. దేశంలో మెజారిటీ జనాభాతో కలిసిమెసలే అవకాశం పెరుగుతుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. భాష ప్రాధాన్యం గురించి కొత్తగా చెప్పుకునేదేం లేదు. కానీ, మాతృభాష, మార్కెట్ భాషగా రెండు స్థానాలు నిర్దారణ అయిన తర్వాత.. మరో కొత్త భాష అనేది వ్యక్తుల ఛాయిస్ గా ఉండాలి తప్ప సర్కారీ రుద్దుడు సరికాదనే వాదనలున్నాయి. అదే సమయంలో సామరస్యంగా పరిచయం చేస్తే అనుసంధాన భాషగా హిందీ ఎదిగే అవకాశం ఉంది.. లేదంటే అరవైల నాటి పోరాటాలు మళ్లీ పరిస్థితిని గందరగోళ పరిచే అవకాశాలున్నాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

18:31 - April 24, 2017

విజయవాడ : అగ్రిగోల్డ్‌ ఆస్తులపై మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ నేతల కన్ను పడిందని అందుకే సమస్యను పరిష్కరించడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. అగ్రిగోల్డ్‌లో 32లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాయని.. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వారికి ఇచ్చే మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నాయని.. వాటిని అమ్మితే సమస్య త్వరగా పరిష్కారమవుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అంబటి డిమాండ్‌ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - 10tv telugu news channel